యెషయా 16:1-14
-
మోయాబు గురించిన సందేశం కొనసాగుతుంది (1-14)
16 దేశ పరిపాలకుడికి ఒక పొట్టేలును పంపండి,సెల నుండి ఎడారి గుండాసీయోను కూతురి పర్వతానికి దాన్ని పంపండి.
2 అర్నోను+ రేవుల దగ్గర మోయాబు కూతుళ్లుతన గూడు నుండి వెళ్లగొట్టబడిన పక్షిలా ఉంటారు.+
3 “సలహా ఇవ్వు, నిర్ణయాన్ని అమలు చేయి.
నీ మిట్టమధ్యాహ్న నీడను రాత్రిలా చేయి.
చెదిరిపోయిన వాళ్లను దాచిపెట్టు, పారిపోతున్న వాళ్లను అప్పగించకు.
4 మోయాబూ, చెదిరిపోయిన నా వాళ్లను నీలో నివసించనివ్వు.
నాశనం చేసేవాడి+ నుండి తప్పించుకునేలా వాళ్లకు దాక్కునే స్థలంగా ఉండు.
అణచివేసే వ్యక్తి అంతమౌతాడు,నాశనం ముగింపుకొస్తుంది,ఇతరుల్ని తొక్కేసేవాళ్లు భూమ్మీద లేకుండా నాశనమౌతారు.
5 అప్పుడు విశ్వసనీయ ప్రేమ వల్ల సింహాసనం దృఢంగా స్థాపించబడుతుంది.
దావీదు ఇంట్లో* దానిమీద కూర్చునే వ్యక్తి నమ్మకమైనవాడై ఉంటాడు;+ఆయన నిష్పక్షపాతంగా న్యాయం తీరుస్తాడు, వేగంగా నీతిని జరిగిస్తాడు.”+
6 మేము మోయాబు గర్వం గురించి విన్నాం, అతను చాలా గర్విష్ఠి;+అతని గర్వం, పొగరు, కోపం+ గురించి మేము విన్నాం;కానీ అతని వ్యర్థమైన మాటలు ఎప్పటికీ నిజమవ్వవు.
7 కాబట్టి మోయాబు తనమీదికి వచ్చిన విపత్తును బట్టి ఏడుస్తుంది;వాళ్లందరూ ఏడుస్తారు.+
కొట్టబడినవాళ్లు కీర్హరెశెతు+ ఎండుద్రాక్ష రొట్టెల కోసం మూల్గుతారు.
8 హెష్బోను+ తోటలు ఎండిపోయాయి,సిబ్మా+ ద్రాక్షతీగ వాడిపోయింది,దేశాల పరిపాలకులు దాని ఎర్రని కొమ్మల్ని* తొక్కేశారు;అవి యాజెరు+ వరకు వ్యాపించాయి;ఎడారిలోకి విస్తరించాయి.
దాని రెమ్మలు వ్యాపించి సముద్రం వరకు చేరుకున్నాయి.
9 అందుకే నేను యాజెరు గురించి ఏడ్చినట్టు సిబ్మా ద్రాక్షతీగ గురించి ఏడుస్తాను.
హెష్బోనూ! ఏలాలే!+ నా కన్నీళ్లతో మిమ్మల్ని తడుపుతాను,ఎందుకంటే మీ వేసవికాల పంటను బట్టి, కోతను బట్టి వేసే కేకలు ఆగిపోయాయి.*
10 పండ్ల తోటలో నుండి సంతోషం, ఆనందం తీసేయబడ్డాయి,ద్రాక్షతోటల్లో సంతోష గానాలు, కేకలు వినిపించడం లేదు.+
ద్రాక్షారసం కోసం ద్రాక్షతొట్లను తొక్కే వ్యక్తి ఇక వాటిని తొక్కడం లేదు;ఎందుకంటే నేను, సంతోషంగా వేసే కేకల్ని ఆగిపోయేలా చేశాను.+
11 అందుకే వీణ* తంతుల్లా,మోయాబు గురించి నేను లోలోపల వణికిపోతున్నాను,+కీర్హరెశెతు+ గురించి నా అంతరంగం వణికిపోతుంది.
12 మోయాబు ఉన్నత స్థలానికి వెళ్లి ఆయాసపడినా, గుడికి వెళ్లి ప్రార్థించినా దానివల్ల ఒరిగేదేమీ ఉండదు.+
13 మోయాబు గురించి యెహోవా అంతకుముందు చెప్పిన మాట అది.
14 ఇప్పుడు యెహోవా ఇలా చెప్తున్నాడు: “కూలివాడి సంవత్సరాల్లా,* మూడు సంవత్సరాల్లో* మోయాబు మహిమ పోయి అవమానం, అన్నిరకాల అల్లర్లు కనిపిస్తాయి; చాలా తక్కువమంది అందులో మిగిలివుంటారు, అది కూడా బలహీనులు.”+
అధస్సూచీలు
^ లేదా “డేరాలో.”
^ లేదా “ఎర్రని ద్రాక్షలతో బరువెక్కిన దాని కొమ్మల్ని.”
^ లేదా “మీ వేసవికాల పంట మీదికి, మీ కోత మీదికి యుద్ధకేక దిగివచ్చింది” అయ్యుంటుంది.
^ ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
^ లేదా “కూలివాడు లెక్కించినంత జాగ్రత్తగా లెక్కిస్తే.”
^ అంటే, సరిగ్గా మూడు సంవత్సరాల్లో.