యెషయా 10:1-34

  • ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా దేవుని చెయ్యి (1-4)

  • అష్షూరు—దేవుని కోపాన్ని చూపించే కర్ర (5-11)

  • అష్షూరుకు శిక్ష (12-19)

  • యాకోబు శేషం తిరిగొస్తుంది (20-27)

  • దేవుడు అష్షూరుకు తీర్పుతీరుస్తాడు (28-34)

10  హానికరమైన నియమాల్ని రూపొందించే వాళ్లకు+ శ్రమ,అదేపనిగా అణచివేసే చట్టాల్ని తయారుచేసే వాళ్లకు శ్రమ.   అలా వాళ్లు పేదవాళ్ల వ్యాజ్యాన్ని తృణీకరిస్తారు,నా ప్రజల్లో దీనులకు న్యాయం జరగకుండా చేస్తారు;+వాళ్లు విధవరాళ్లను దోపుడుసొమ్ముగా,తండ్రిలేని పిల్లల్ని* కొల్లసొమ్ముగా చేసుకుంటారు!+   మరైతే లెక్క అప్పజెప్పాల్సిన* రోజున,+ దూరం నుండి నాశనం వచ్చినప్పుడు+ మీరు ఏంచేస్తారు?సహాయం కోసం ఎవరి దగ్గరికి పారిపోతారు?+ మీ సంపదను* ఎక్కడ విడిచివెళ్తారు?   ఖైదీల మధ్య దాక్కోవడం,హతులైనవాళ్ల మధ్య పడిపోవడం తప్ప ఇంకేమీ చేయలేరు. ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు,వాళ్లను శిక్షించడానికి ఆయన చెయ్యి ఇంకా చాపబడే ఉంది.+   “అష్షూరును+ చూడండి!అది నా కోపాన్ని చూపించే కర్ర,+వాళ్ల చేతిలో ఉన్న దండం నా ఉగ్రతను వెళ్లగక్కుతుంది!   మతభ్రష్ట జనం మీదికి,నాకు విపరీతమైన కోపం తెప్పించిన జనం మీదికి నేను అతన్ని పంపిస్తాను;+విస్తారమైన కొల్లసొమ్మును, విస్తారమైన దోపుడుసొమ్మును తీసుకోమని,వీధుల్లో మట్టిని తొక్కినట్టు వాళ్లను తొక్కమని నేను అతనికి ఆజ్ఞాపిస్తాను.+   కానీ అతని ధ్యాస దీనిమీద ఉండదు,అతని హృదయం ఈ విధంగా పన్నాగం పన్నదు;కొన్ని జనాల్ని కాదు అనేక జనాల్ని సమూలంగా నాశనం చేయాలి,వాటిని నిర్మూలించాలి అనే ఆలోచన అతని హృదయంలో ఉంది.   అతను ఇలా అంటున్నాడు:‘నా అధిపతులందరూ రాజులు కాదా?+   కల్నో+ కర్కెమీషు+ లాంటిది కాదా? హమాతు+ అర్పాదు+ లాంటిది కాదా? సమరయ+ దమస్కు+ లాంటిది కాదా? 10  వ్యర్థమైన దేవుళ్లను పూజించే రాజ్యాలు నా చేతికి చిక్కాయి;యెరూషలేములో, సమరయలో కన్నా ఎక్కువ విగ్రహాలు* వాళ్ల దగ్గర ఉన్నాయి!+ 11  నేను సమరయకు, దాని వ్యర్థమైన దేవుళ్లకు చేసినట్టే యెరూషలేముకు, దాని విగ్రహాలకు చేయలేనా?’+ 12  “సీయోను పర్వతం మీద, యెరూషలేములో యెహోవా తన పనంతటినీ పూర్తిచేసినప్పుడు, ఆయన* అష్షూరు రాజును శిక్షిస్తాడు; అతని హృదయ గర్వాన్ని బట్టి, అహంకారంతో నిండిన అతని పొగరుబోతు చూపును బట్టి+ అతన్ని శిక్షిస్తాడు. 13  ఎందుకంటే అతను ఇలా అంటున్నాడు,‘నేను నా చేతి బలంతో దీన్ని చేస్తాను, నేను తెలివిగలవాణ్ణి కాబట్టి నా తెలివితో దీన్ని చేస్తాను.నేను జనాల సరిహద్దుల్ని చెరిపేస్తాను,+వాళ్ల సంపదల్ని కొల్లగొడతాను,+ బలవంతుడిలా వాటి నివాసుల్ని లోబర్చుకుంటాను.+ 14  ఒక వ్యక్తి పక్షి గూటిలో చెయ్యి పెట్టినట్టునేను నా చేతితో జనాల వనరుల్ని పట్టుకుంటాను;వదిలేసిన గుడ్లను పోగుచేసినట్టుభూమంతటినీ పోగుచేస్తాను! ఎవరూ రెక్కలు ఆడించరు, నోరు తెరవరు, కిచకిచలాడరు.’ ” 15  గొడ్డలి, తనతో నరికేవాడి కన్నా తానే గొప్ప అనుకుంటుందా? రంపం, తనతో కోసేవాడి కన్నా తానే గొప్ప అనుకుంటుందా? దండం,+ తనను ఎత్తేవాణ్ణి పైకెత్తగలదా? కర్ర, తనను ఉపయోగించేవాణ్ణి పైకి లేపగలదా? 16  కాబట్టి నిజమైన ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవాఅతని ప్రజల్లో కొవ్వుపట్టినవాళ్లను కృశించిపోయేలా చేస్తాడు,+అతని మహిమ కింద, మండుతూ ఉండే అగ్నిని రగిలిస్తాడు.+ 17  ఇశ్రాయేలు వెలుగు+ అగ్ని అవుతుంది,+పవిత్రుడైన అతని దేవుడు జ్వాల అవుతాడు;అది రగులుకొని, ఒక్కరోజులో అతని పిచ్చిచెట్లను, ముళ్లపొదల్ని దహించేస్తుంది. 18  అతని అడవి శోభను, పండ్లతోట శోభను ఆయన పూర్తిగా తీసేస్తాడు;రోగి క్షీణించిపోయినట్టు అది క్షీణించిపోతుంది.+ 19  అతని అడవిలో మిగిలే చెట్లు ఎంత తక్కువగా ఉంటాయంటే,ఒక పిల్లవాడు వాటి సంఖ్యను రాయగలుగుతాడు. 20  ఆ రోజు ఇశ్రాయేలులో మిగిలినవాళ్లు,యాకోబు ఇంటివాళ్లలో తప్పించుకున్నవాళ్లుఇక తమమీద దాడి చేసినవాని మీద ఆధారపడరు;+కానీ వాళ్లు ఇశ్రాయేలు పవిత్ర దేవుడైన యెహోవా మీదనిజాయితీగా ఆధారపడతారు. 21  శేషం మాత్రమే, అంటే యాకోబు వంశస్థుల్లో మిగిలినవాళ్లు మాత్రమేశక్తిమంతుడైన దేవుని దగ్గరికి తిరిగొస్తారు.+ 22  ఇశ్రాయేలూ, నీ ప్రజలుసముద్రపు ఇసుక రేణువులంత మంది ఉన్నా,వాళ్లలో కొంతమంది మాత్రమే తిరిగొస్తారు.+ సమూలనాశనం జరగాలని నిర్ణయించబడింది,+న్యాయం* వాళ్లను చుట్టుముడుతుంది.+ 23  అవును, సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా నిర్ణయించిన సమూలనాశనందేశమంతటి మీదికి వస్తుంది.+ 24  కాబట్టి సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు: “సీయోనులో నివసిస్తున్న నా ప్రజలారా, మిమ్మల్ని కర్రతో శిక్షించి ఐగుప్తులా+ మీ మీద తన దండం ఎత్తిన అష్షూరును+ చూసి భయపడకండి. 25  ఎందుకంటే అతిత్వరలోనే ఉగ్రత తీరిపోతుంది, వాళ్లను నాశనం చేయడానికి నా కోపం వాళ్లమీదికి మళ్లుతుంది.+ 26  సైన్యాలకు అధిపతైన యెహోవా ఓరేబు బండరాయి దగ్గర మిద్యానును ఓడించినప్పుడు+ చేసినట్టే అతని మీద కొరడా ఝళిపిస్తాడు.+ ఆయన దండం సముద్రం మీద ఉంటుంది, ఆయన ఐగుప్తు విషయంలో చేసినట్టు దాన్ని పైకెత్తుతాడు.+ 27  ఆ రోజు, నీ భుజం మీది నుండి అతని బరువు,+నీ మెడ మీది నుండి అతని కాడి దిగిపోతాయి;తైలం వల్ల కాడి విరగ్గొట్టబడుతుంది.”+ 28  అతను ఆయాతుకు+ వచ్చాడు;మిగ్రోను గుండా వెళ్లాడు;మిక్మషు+ దగ్గర తన సామాన్లు పెడతాడు. 29  వాళ్లు రేవును దాటారు;గెబా+ దగ్గర రాత్రి గడుపుతారు;రామా వణికిపోతుంది, సౌలు నగరమైన గిబియా+ పారిపోయింది. 30  గల్లీము కూతురా, అరువు, కేకలు వేయి! లాయిషా, శ్రద్ధగా విను! అయ్యో అనాతోతు!+ 31  మద్మేనా పారిపోయింది. గెబీము నివాసులు ఆశ్రయం కోసం వెతికారు. 32  ఈ రోజే అతను నోబులో+ ఆగుతాడు. సీయోను కూతురి పర్వతం దగ్గర, యెరూషలేము కొండ దగ్గరఅతను తన పిడికిలి ఆడిస్తూ బెదిరిస్తాడు. 33  ఇదిగో! నిజమైన ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా కొమ్మల్ని భయంకరమైన శబ్దంతో నరికేస్తున్నాడు;+ ఎత్తైన వృక్షాలు నరికేయబడుతున్నాయి, గొప్పగొప్పవి నేలమట్టం చేయబడుతున్నాయి. 34  ఇనుప పనిముట్టుతో* ఆయన అడవిలోని దట్టమైన పొదల్ని నరికేస్తాడు,లెబానోను శక్తిమంతుడి చేతిలో కూలుతుంది.

అధస్సూచీలు

లేదా “అనాథల్ని.”
లేదా “శిక్షించే.”
లేదా “మహిమను.”
లేదా “చెక్కుడు విగ్రహాలు.”
అక్ష., “నేను.”
లేదా “శిక్ష.”
లేదా “గొడ్డలితో.”