యిర్మీయా 8:1-22

  • ప్రజలు అందరూ నడిచే దారిలో వెళ్లారు (1-7)

  • యెహోవా వాక్యం లేని తెలివి ఏపాటిది? (8-17)

  • యూదా పతనాన్ని బట్టి యిర్మీయా విలపించడం (18-22)

    • “గిలాదులో సాంబ్రాణి లేదా?” (22)

8  యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “ఆ సమయంలో యూదా రాజుల ఎముకలు, దాని అధిపతుల ఎముకలు, యాజకుల ఎముకలు, ప్రవక్తల ఎముకలు, యెరూషలేము నివాసుల ఎముకలు వాళ్ల సమాధుల్లో నుండి బయటికి తీయబడతాయి.  వాళ్లు ప్రేమిస్తూ, సేవిస్తూ, అనుసరిస్తూ, సంప్రదిస్తూ, వంగి నమస్కారం చేస్తూ వచ్చిన సూర్యచంద్ర నక్షత్రాల* ముందు అవి పరచబడతాయి.+ వాటిని ఎవ్వరూ పోగుచేయరు, పాతిపెట్టరు. అవి నేలమీద ఎరువు అవుతాయి.”+  “నేను వాళ్లను చెదరగొట్టే స్థలాలన్నిటిలో, ఈ దుష్ట కుటుంబంలో మిగిలినవాళ్లు తాము బ్రతికుండడం కన్నా చనిపోవడమే నయం అనుకుంటారు” అని సైన్యాలకు అధిపతైన యెహోవా అంటున్నాడు.  “నువ్వు వాళ్లతో ఏం చెప్పాలంటే, ‘యెహోవా ఇలా అంటున్నాడు: “ఎవరైనా పడిపోతే మళ్లీ లేవరా? ఒక వ్యక్తి వెనక్కి తిరిగితే, ఇంకో వ్యక్తి కూడా వెనక్కి తిరగడా?   మరి యెరూషలేము ప్రజలు ఎందుకని మారకుండా నాకు నమ్మకద్రోహం చేస్తున్నారు? వాళ్లు మోసాన్ని అంటిపెట్టుకొని ఉంటున్నారు;వెనక్కి తిరగడానికి ఇష్టపడట్లేదు.+   నేను శ్రద్ధగా వింటూ ఉన్నాను, కానీ వాళ్లు మాట్లాడిన పద్ధతి సరిగ్గా లేదు. ‘నేను చేసిందేంటి?’ అని అంటూ తన దుష్టత్వాన్ని బట్టి పశ్చాత్తాపపడే వ్యక్తి ఒక్కడు కూడా లేడు.+ గుర్రం యుద్ధానికి దౌడు తీసినట్టు, ప్రతీ ఒక్కరు అందరూ నడిచే దారిలోకి వెళ్తున్నారు.   ఆకాశంలో ఎగిరే సంకుబుడి కొంగకు కూడా దాని నియమిత సమయాలు తెలుసు;గువ్వ, మంగలకత్తి పిట్ట, మైనా పిట్ట* సరైన సమయంలో వలస వెళ్తాయి. కానీ నా సొంత ప్రజలకు యెహోవా తీర్పు అర్థం కావట్లేదు.” ’+   ‘ “మేము తెలివిగలవాళ్లం, మా దగ్గర యెహోవా ధర్మశాస్త్రం* ఉంది” అని మీరెలా అనగలరు? నిజానికి, లేఖికుల* అబద్ధ కలం+ అబద్ధాలు రాయడానికే ఉపయోగించబడింది.   తెలివిగలవాళ్లు అవమానపర్చబడ్డారు.+ వాళ్లు బెదిరిపోతారు, పట్టబడతారు. వాళ్లు యెహోవా వాక్యాన్ని తిరస్కరించారు,వాళ్ల తెలివి ఏపాటిది? 10  కాబట్టి నేను వాళ్ల భార్యల్ని వేరేవాళ్లకు ఇచ్చేస్తాను,వాళ్ల పొలాల్ని ఇతరులకు అప్పగిస్తాను;+ఎందుకంటే సామాన్యుల నుండి గొప్పవాళ్ల వరకు అందరూ అక్రమంగా సంపాదిస్తున్నారు;+ప్రవక్తల నుండి యాజకుల వరకు అందరూ మోసం చేస్తున్నారు.+ 11  శాంతి లేకపోయినా “శాంతి ఉంది! శాంతి ఉంది!”+ అని చెప్తూవాళ్లు నా ప్రజల కూతురి గాయాన్ని పైపైనే నయం చేస్తున్నారు. 12  వాళ్లు తమ అసహ్యమైన పనుల్ని బట్టి సిగ్గుపడుతున్నారా? ఏమాత్రం సిగ్గుపడట్లేదు! సిగ్గుపడడం అంటే ఏమిటో కూడా వాళ్లకు తెలీదు!+ కాబట్టి కూలిపోయినవాళ్లతో పాటు వాళ్లూ కూలిపోతారు. నేను వాళ్లను శిక్షించినప్పుడు వాళ్లు పడిపోతారు’+ అని యెహోవా అంటున్నాడు. 13  ‘నేను వాళ్లను సమకూర్చినప్పుడు, వాళ్లను అంతం చేస్తాను’ అని యెహోవా అంటున్నాడు. ‘ద్రాక్షచెట్టు మీద ఒక్క ద్రాక్ష కూడా ఉండదు, అంజూర చెట్టు మీద ఒక్క అంజూర పండు కూడా ఉండదు, ఆకులు వాడిపోతాయి. నేను వాళ్లకు ఇచ్చినవి వాళ్లవి కాకుండాపోతాయి.’ ” 14  “మనం ఎందుకు ఇక్కడ కూర్చుని ఉన్నాం? పదండి, అందరం కలిసి ప్రాకారాలుగల నగరాల్లోకి వెళ్లి+ అక్కడ చచ్చిపోదాం. ఎందుకంటే, మన దేవుడైన యెహోవా మనల్ని చంపేస్తాడు,ఆయన మనకు విషం కలిపిన నీళ్లు ఇస్తాడు,+ఎందుకంటే, మనం యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాం. 15  మనం శాంతి కోసం ఎదురుచూశాం, కానీ ఏ మంచీ జరగలేదు,బాగౌతుందని ఎదురుచూశాం, కానీ భయం అలుముకుంది!+ 16  దాను నుండి శత్రువుల గుర్రాల సకిలింపు వినిపిస్తోంది. మగ గుర్రాల సకిలింపుకు దేశమంతా కంపిస్తోంది.వాళ్లు వచ్చి దేశాన్ని, దానిలో ఉన్న సమస్తాన్ని, నగరాన్ని, దాని నివాసుల్ని మింగేస్తారు.” 17  “నేను మీ మధ్యకు పాముల్ని,పాము మంత్రానికి లొంగని విషసర్పాల్ని పంపిస్తున్నాను,అవి ఖచ్చితంగా మిమ్మల్ని కాటేస్తాయి” అని యెహోవా అంటున్నాడు. 18  నా దుఃఖానికి మందు లేదు;నా గుండె బలహీనపడింది. 19  దూరదేశం నుండి నా ప్రజల కూతురు,“సీయోనులో యెహోవా లేడా? ఆమె రాజు అందులో లేడా?” అంటూ మొరపెడుతోంది. “వాళ్లు తమ చెక్కుడు విగ్రహాలతో, వేరే దేశాల వ్యర్థమైన దేవుళ్లతోఎందుకు నాకు కోపం తెప్పించారు?” 20  “కోతకాలం ముగిసింది, వేసవికాలం వెళ్లిపోయింది,కానీ మనం మాత్రం కాపాడబడలేదు!” 21  నా ప్రజల కూతురి పతనాన్ని బట్టి నాకు చాలా దుఃఖం కలుగుతోంది;+నేను కృంగిపోయాను. నాకు భయం పట్టుకుంది. 22  గిలాదులో సాంబ్రాణి* లేదా?+ అక్కడ వైద్యుడే లేడా?+ మరి నా ప్రజల కూతురి ఆరోగ్యం ఎందుకు బాగవ్వలేదు?+

అధస్సూచీలు

అక్ష., “ఆకాశ సైన్యమంతటి.”
లేదా “కొంగ” అయ్యుంటుంది.
లేదా “ఉపదేశం.”
లేదా “కార్యదర్శుల.”
లేదా “ఉపశమనాన్ని ఇచ్చే లేపనం.”