యిర్మీయా 49:1-39

  • అమ్మోనుకు వ్యతిరేకంగా ప్రవచనం (1-6)

  • ఎదోముకు వ్యతిరేకంగా ప్రవచనం (7-22)

    • ఎదోము ఇక దేశంగా ఉండదు (17, 18)

  • దమస్కుకు వ్యతిరేకంగా ప్రవచనం (23-27)

  • కేదారు, హాసోరులకు వ్యతిరేకంగా ప్రవచనం (28-33)

  • ఏలాముకు వ్యతిరేకంగా ప్రవచనం (34-39)

49  అమ్మోనీయుల+ గురించిన సందేశం. యెహోవా ఇలా అంటున్నాడు: “ఇశ్రాయేలుకు కుమారులు లేరా? అతనికి వారసుడు లేడా? మరి మల్కాము+ గాదును ఎందుకు స్వాధీనం చేసుకున్నాడు?+ అతని ప్రజలు ఇశ్రాయేలు నగరాల్లో ఎందుకు నివసిస్తున్నారు?”   “ ‘కాబట్టి ఇదిగో! నేను అమ్మోనీయుల రబ్బాకు+ వ్యతిరేకంగా యుద్ధ ఘంటికను* వినిపించే రోజులు రాబోతున్నాయి’+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.‘అది మట్టిదిబ్బ అవుతుంది, దాని చుట్టుపక్కల పట్టణాలు అగ్నితో కాల్చేయబడతాయి.’‘ఇశ్రాయేలు, తన దేశాన్ని స్వాధీనం చేసుకున్నవాళ్ల దేశాన్ని స్వాధీనం చేసుకుంటాడు’+ అని యెహోవా అంటున్నాడు.   ‘హెష్బోనూ, ఏడ్వు, హాయి నాశనం చేయబడింది! రబ్బా చుట్టుపక్కల పట్టణాల్లారా, కేకలు వేయండి. గోనెపట్ట కట్టుకోండి.ఏడుస్తూ, రాతి దొడ్ల* మధ్య అటూఇటూ తిరగండి,మల్కాము తన యాజకులతో పాటు, అధిపతులతో పాటు చెరలోకి వెళ్తాడు.+   నీ సంపదల్ని నమ్ముకుంటూ,“నా మీదికి ఎవరొస్తారు?” అని అనుకుంటున్న నమ్మకద్రోహివైన కూతురా,నీ లోయల గురించి, నీ సారవంతమైన మైదానాల గురించిఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నావు?’ ”   “సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు:‘ఇదిగో, నేను నలుమూలల నుండి నీ మీదికి భయాన్ని రప్పిస్తున్నాను, నువ్వు అన్నివైపులా చెదరగొట్టబడతావు,పారిపోయినవాళ్లను ఎవ్వరూ సమకూర్చరు.’ ”   “ ‘కానీ ఆ తర్వాత నేను చెరలోకి వెళ్లిన అమ్మోనీయుల్ని సమకూరుస్తాను’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”  ఎదోము గురించిన సందేశం. సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: “తేమానులో ఇక తెలివి లేదా?+ అవగాహన గలవాళ్ల దగ్గర మంచి సలహానే లేదా? వాళ్ల తెలివి వ్యర్థమైపోయిందా?   దెదాను+ నివాసులారా, వెనక్కి తిరిగి పారిపోండి! వెళ్లి, లోతైన స్థలాల్లో దాక్కోండి! ఎందుకంటే ఏశావు మీదికి దృష్టి మళ్లించే సమయం వచ్చినప్పుడునేను అతని మీదికి ఆపద తీసుకొస్తాను.   ద్రాక్షలు సమకూర్చేవాళ్లు నీ దగ్గరికి వస్తే,వాళ్లు కొంత పరిగె విడిచిపెడతారు కదా? రాత్రివేళ దొంగలు వస్తే,వాళ్లు తమకు కావాల్సినంత మాత్రమే దోచుకుంటారు.+ 10  కానీ నేను ఏశావును పూర్తిగా దోచుకుంటాను. దాక్కునే వీలు లేకుండా అతని చాటైన స్థలాల్ని బట్టబయలు చేస్తాను.అతని పిల్లలు, సహోదరులు, పొరుగువాళ్లు అందరూ నాశనమౌతారు,+ అతను ఇక ఉండడు.+ 11  తండ్రిలేని నీ పిల్లల్ని నాకు విడిచిపెట్టు,నేను వాళ్లను కాపాడతాను,నీ విధవరాళ్లు నామీద నమ్మకం పెట్టుకుంటారు.” 12  ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నాడు: “ఇదిగో! గిన్నెలోది తాగడానికి నిర్ణయించబడనివాళ్లే దాన్ని తాగాల్సి వస్తే, నువ్వు పూర్తిగా శిక్ష తప్పించుకుంటావా? నువ్వు శిక్ష తప్పించుకోలేవు, నువ్వు తప్పకుండా దాన్ని తాగాలి.”+ 13  “నా తోడు, బొస్రా భయంకరంగా, నిందగా, నిర్జనంగా, శాపంగా తయారౌతుంది;+ దాని నగరాలన్నీ ఎప్పటికీ శిథిలాలుగా ఉండిపోతాయి”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు. 14  నేను యెహోవా నుండి ఒక వార్త విన్నాను,“మీరంతా సమకూడి, దానిమీదికి రండి; యుద్ధానికి సిద్ధంకండి” అని చెప్పడానికిదేశాల మధ్యకు ఒక రాయబారి పంపబడ్డాడు.+ 15  “ఎందుకంటే ఇదిగో! నేను దేశాల మధ్య నిన్ను తక్కువవాడిగా చేశాను,మనుషుల మధ్య నీచుడిగా చేశాను.+ 16  బండ సందుల్లో,కొండ శిఖరాల మీద నివసించేవాడా,నువ్వు పుట్టించిన భయం,నీ అహంకార హృదయం నిన్ను మోసం చేశాయి. నువ్వు గద్దలా ఎత్తైన స్థలంలో గూడు కట్టుకున్నాఅక్కడి నుండి నేను నిన్ను కిందికి పడేస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నాడు. 17  “ఎదోము భయంకరంగా తయారవ్వాలి.+ ఆ దారిన వెళ్లే ప్రతీ ఒక్కరు దాన్ని ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతారు, దాని తెగుళ్లన్నిటినీ చూసి ఈల వేస్తారు. 18  సొదొమ గొమొర్రాలు, వాటి చుట్టుపక్కల పట్టణాలు నాశనమైనప్పుడు జరిగినట్టే,+ అక్కడ ఎవ్వరూ నివసించరు, ఎవ్వరూ స్థిరపడరు”+ అని యెహోవా అంటున్నాడు. 19  “ఇదిగో! యొర్దాను పక్కనున్న దట్టమైన పొదల్లో నుండి సింహం వచ్చినట్టు,+ సురక్షితమైన పచ్చికబయళ్ల మీదికి ఒకవ్యక్తి వస్తాడు, అయితే నేను ఒక్క క్షణంలో అతన్ని దాని దగ్గర నుండి వెళ్లగొడతాను. ఎంచుకోబడిన వ్యక్తిని దానిమీద నియమిస్తాను. ఎందుకంటే, నాలాంటివాళ్లు ఎవరున్నారు? నన్ను సవాలు చేసేదెవరు? నా ముందు ఏ కాపరి నిలబడగలడు?+ 20  కాబట్టి మనుషులారా, ఎదోముకు వ్యతిరేకంగా యెహోవా తీసుకున్న నిర్ణయాన్ని,* తేమాను నివాసులకు వ్యతిరేకంగా ఆయన చేసిన ఆలోచనను వినండి:+ ఖచ్చితంగా మందలోని గొర్రెపిల్లలు ఈడ్చుకెళ్లబడతాయి. వాళ్లను బట్టి వాటి నివాస స్థలం నిర్జనంగా మారుతుంది.+ 21  వాళ్లు పడిపోయినప్పుడు ఆ శబ్దానికి భూమి కంపించింది. ఆర్తనాదాలు వినిపించాయి! ఆ శబ్దం ఎర్రసముద్రం+ దాకా వినిపించింది. 22  ఇదిగో! అతను గద్దలా లేచి దూసుకొస్తాడు,+బొస్రా మీద తన రెక్కలు చాపుతాడు.+ ఆ రోజు ఎదోము యోధుల గుండెలుప్రసవించే స్త్రీ గుండెలా ఉంటాయి.” 23  దమస్కు గురించిన సందేశం:+ “హమాతు,+ అర్పాదు అవమానాలపాలు అయ్యాయి,ఎందుకంటే అవి చెడ్డ వార్త విన్నాయి. అవి భయంతో నీరుగారిపోయాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది, అది నిమ్మళించట్లేదు. 24  దమస్కు ధైర్యం కోల్పోయింది. అది పారిపోవడానికి వెనక్కి తిరిగింది, కానీ దానికి భయం పట్టుకుంది. ప్రసవిస్తున్న స్త్రీలావేదన, నొప్పి దాన్ని పట్టుకున్నాయి. 25  మహిమాన్విత నగరం,సంతోషం కలిగించే పట్టణం విడవబడలేదేంటి? 26  దాని యువకులు దాని సంతవీధుల్లో పడిపోతారు,ఆ రోజు సైనికులందరూ నశించిపోతారు” అని సైన్యాలకు అధిపతైన యెహోవా ప్రకటిస్తున్నాడు. 27  “నేను దమస్కు ప్రాకారాల్ని అగ్నితో కాల్చేస్తాను,అది బెన్హదదు పటిష్ఠమైన బురుజుల్ని దహించేస్తుంది.”+ 28  బబులోను రాజు నెబుకద్నెజరు* పడగొట్టిన కేదారు,+ హాసోరు రాజ్యాల గురించిన సందేశం. యెహోవా ఇలా అంటున్నాడు: “లెండి, కేదారు మీదికి వెళ్లండి,తూర్పు దేశ ప్రజల్ని నాశనం చేయండి. 29  శత్రువులు వాళ్ల డేరాల్ని, మందల్ని,డేరా తెరల్ని, వాళ్ల సామానంతటినీ తీసుకెళ్తారు. వాళ్ల ఒంటెల్ని ఎత్తుకెళ్తారు,ప్రజలు, ‘చుట్టూ భయం అలుముకుంది!’ అని కేకలు వేస్తారు.” 30  “హాసోరు నివాసులారా, పారిపోండి, దూరంగా వెళ్లండి! వెళ్లి లోతైన స్థలాల్లో దాక్కోండి” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.“ఎందుకంటే బబులోను రాజు నెబుకద్నెజరు* మీకు వ్యతిరేకంగా ఒక వ్యూహం రచించాడు, పథకం పన్నాడు.” 31  “లెండి, ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్న దేశం మీదికి వెళ్లండి!” అనియెహోవా ప్రకటిస్తున్నాడు. “దానికి తలుపులు గానీ అడ్డగడియలు గానీ లేవు; వాళ్లు ఒంటరిగా నివసిస్తున్నారు. 32  వాళ్ల ఒంటెలు దోచుకోబడతాయి,విస్తారమైన వాళ్ల పశుసంపద కొల్లగొట్టబడుతుంది. తమ కణతల పక్క వెంట్రుకల్ని గొరిగించుకునే వాళ్లను+నేను అన్నివైపులకు* చెదరగొడతాను,అన్నివైపుల నుండి వాళ్లమీదికి ఆపద తీసుకొస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నాడు. 33  “హాసోరు నక్కలకు విశ్రాంతి స్థలం అవుతుంది,అది ఎప్పటికీ నిర్జనంగా ఉండిపోతుంది. అక్కడ ఎవ్వరూ నివసించరు, ఎవ్వరూ స్థిరపడరు.” 34  యూదా రాజైన సిద్కియా+ పరిపాలన ఆరంభంలో, ఏలాము గురించి+ యిర్మీయా ప్రవక్త దగ్గరికి వచ్చిన యెహోవా వాక్యం: 35  “సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు, ‘ఇదిగో నేను ఏలాము విల్లును,+ వాళ్ల బలానికి మూలమైన దాన్ని* విరగ్గొడుతున్నాను. 36  నేను ఏలాము మీదికి ఆకాశం నలుమూలల నుండి నాలుగు గాలుల్ని రప్పించి, ఆ నాలుగు దిక్కులకు వాళ్లను చెదరగొడతాను. చెదిరిపోయిన ఏలాము ప్రజలు వెళ్లని దేశమంటూ ఏదీ ఉండదు.’ ” 37  “నేను ఏలామీయుల్ని వాళ్ల శత్రువుల ముందు, వాళ్ల ప్రాణం తీయాలని చూస్తున్నవాళ్ల ముందు బెదిరిపోయేలా చేస్తాను; నేను వాళ్లమీదికి విపత్తును, నా కోపాగ్నిని రప్పిస్తాను; వాళ్లను పూర్తిగా తుడిచిపెట్టే వరకు వాళ్ల వెనక ఖడ్గాన్ని పంపిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నాడు. 38  “నేను ఏలాములో+ నా సింహాసనం వేసుకుని వాళ్ల రాజును, అధిపతుల్ని నాశనం చేస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నాడు. 39  “అయితే నేను చివరి రోజుల్లో చెరలోకి వెళ్లిన ఏలాము ప్రజల్ని సమకూరుస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

అధస్సూచీలు

లేదా “యుద్ధకేక” అయ్యుంటుంది.
లేదా “గొర్రెల దొడ్ల.”
లేదా “ఆలోచనను.”
అక్ష., “నెబుకద్రెజరు.”
అక్ష., “నెబుకద్రెజరు.”
అక్ష., “ప్రతీ గాలికి.”
అక్ష., “ఆరంభాన్ని.”