యిర్మీయా 44:1-30

  • ఐగుప్తులోని యూదులకు విపత్తు వస్తుందని చెప్పడం (1-14)

  • ప్రజలు దేవుని హెచ్చరికను పట్టించుకో​కపోవడం (15-30)

    • ‘ఆకాశరాణిని’ పూజించడం (17-19)

44  ఐగుప్తు దేశంలో నివసిస్తున్న యూదులందరి కోసం,+ అంటే మిగ్దోలులో,+ తహపనేసులో,+ నోఫులో,*+ అలాగే పత్రోసు ప్రాంతంలో+ నివసిస్తున్న యూదులందరి కోసం యిర్మీయా దగ్గరికి వచ్చిన వాక్యం:  “ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఏమంటున్నాడంటే, ‘యెరూషలేము మీదికి, యూదా నగరాలన్నిటి మీదికి నేను తీసుకొచ్చిన విపత్తును మీరు చూశారు,+ ఈ రోజు అవి నివాసులు లేకుండా శిథిలాలుగా ఉన్నాయి.+  వాళ్లు తమకు తెలియని వేరే దేవుళ్ల దగ్గరికి, అంటే మీకు గానీ మీ పూర్వీకులకు గానీ తెలియని వేరే దేవుళ్ల దగ్గరికి వెళ్లి, బలులు అర్పించి, వాటిని పూజించి+ నాకు కోపం తెప్పించేలా చెడ్డపనులు చేసినందువల్లే అలా జరిగింది.+  నేను నా సేవకులైన ప్రవక్తలందర్నీ పదేపదే* మీ దగ్గరికి పంపిస్తూ, “దయచేసి, నేను అసహ్యించుకునే ఈ నీచమైన పని చేయకండి” అని చెప్తూ వచ్చాను.+  కానీ వాళ్లు వినలేదు, పట్టించుకోలేదు, మారకుండా వేరే దేవుళ్లకు బలులు అర్పిస్తూ చెడ్డగా ప్రవర్తించారు.+  కాబట్టి నా ఆగ్రహం, కోపం కుమ్మరించబడి యూదా నగరాల్లో, యెరూషలేము వీధుల్లో రగులుకున్నాయి. దాంతో అవి ఈ రోజు ఉన్నట్టు శిథిలాలుగా, పాడుబడ్డ భూమిగా తయారయ్యాయి.’+  “ఇశ్రాయేలు దేవుడూ సైన్యాల దేవుడూ అయిన యెహోవా ఏమంటున్నాడంటే, ‘మీలో ఇంకెవ్వరూ మిగలకుండా పురుషులు, స్త్రీలు, పిల్లలు, పసికందులు అందరూ యూదా నుండి తుడిచిపెట్టుకుపోయేలా మీరు మీ మీదికి ఎందుకు గొప్ప విపత్తును తెచ్చుకుంటున్నారు?  మీరు నివసించడానికి వెళ్లిన ఐగుప్తు దేశంలో వేరే దేవుళ్లకు బలులు అర్పిస్తూ మీ చేతుల పనులతో నాకు కోపం తెప్పించడం ఎందుకు? మీరు నశించిపోతారు, భూమ్మీది దేశాలన్నిటి మధ్య శాపానికి, నిందకు గురౌతారు.+  యూదా దేశంలో, యెరూషలేము వీధుల్లో మీ పూర్వీకులు, యూదా రాజులు,+ వాళ్ల భార్యలు చేసిన చెడ్డపనుల్ని,+ మీరు చేసిన చెడ్డపనుల్ని, మీ భార్యలు చేసిన చెడ్డపనుల్ని+ మీరు మర్చిపోయారా? 10  ఈ రోజు వరకు వాళ్లు తమను తాము తగ్గించుకోలేదు, నాకు భయపడలేదు,+ మీకూ మీ పూర్వీకులకూ నేనిచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం, శాసనాల ప్రకారం నడుచుకోలేదు.’+ 11  “కాబట్టి ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఇదిగో యూదా అంతటినీ నాశనం చేయడానికి నేను మీ మీదికి విపత్తును తీసుకురావాలని నిశ్చయించుకున్నాను. 12  ఐగుప్తు దేశానికి వెళ్లి అక్కడ నివసించాలని తీర్మానించుకున్న మిగిలిన యూదా ప్రజల్ని నేను పట్టుకుంటాను, వాళ్లంతా ఐగుప్తు దేశంలో నశించిపోతారు. వాళ్లు ఖడ్గం వల్ల చనిపోతారు, కరువు వల్ల నశించిపోతారు;+ సామాన్యుల నుండి గొప్పవాళ్ల వరకు వాళ్లు ఖడ్గం వల్ల, కరువు వల్ల చనిపోతారు. వాళ్లు శాపానికి గురౌతారు, ప్రజలు వాళ్లను చూసి భయపడతారు, వాళ్లు అవమానానికి, నిందకు గురౌతారు.+ 13  నేను యెరూషలేమును శిక్షించినట్టే ఖడ్గంతో, కరువుతో, తెగులుతో ఐగుప్తు దేశంలో నివసిస్తున్న వాళ్లను శిక్షిస్తాను.+ 14  ఐగుప్తు దేశంలో నివసించడానికి అక్కడికి వెళ్లిన మిగిలిన యూదా ప్రజలు యూదా దేశానికి తిరిగిరావడానికి తప్పించుకోలేరు, ప్రాణాలతో బయటపడరు. వాళ్లు యూదా దేశానికి తిరిగిరావాలని, అక్కడ నివసించాలని ఎంతో కోరుకుంటారు కానీ వాళ్లు తిరిగిరారు. చాలా కొద్దిమంది మాత్రమే తప్పించుకుని తిరిగొస్తారు.’ ” 15  తమ భార్యలు వేరే దేవుళ్లకు బలులు అర్పిస్తున్నారని తెలిసిన పురుషులందరూ, అక్కడ నిలబడిన వాళ్ల భార్యలందరూ ఒక పెద్ద గుంపుగా ఏర్పడ్డారు. వాళ్లూ, ఐగుప్తు దేశంలో,+ పత్రోసులో నివసిస్తున్న ప్రజలందరూ+ యిర్మీయాతో ఇలా అన్నారు: 16  “యెహోవా పేరున నువ్వు మాతో మాట్లాడిన మాటను మేము వినం. 17  బదులుగా ఆకాశరాణికి* బలులు, పానీయార్పణలు అర్పిస్తామని+ మా నోటితో చెప్పిన ప్రతీమాటను మేము నెరవేరుస్తాం; మేము, మా పూర్వీకులు, మా రాజులు, మా అధిపతులు యూదా నగరాల్లో, యెరూషలేము వీధుల్లో చేసినట్టే చేస్తాం; అప్పుడు మాకు కడుపునిండా ఆహారం ఉండేది, మాకు ఏదీ తక్కువ కాలేదు, మేము ఏ విపత్తునూ చూడలేదు. 18  మేము ఆకాశరాణికి* బలులు, పానీయార్పణలు అర్పించడం మానేసినప్పటి నుండి మాకు ప్రతీది తక్కువైంది; ఖడ్గం వల్ల, కరువు వల్ల మేము నశించిపోయాం.” 19  అప్పుడు స్త్రీలు ఇలా అన్నారు: “మేము ఆకాశరాణికి* బలులు, పానీయార్పణలు అర్పించినప్పుడు మా భర్తల అనుమతి లేకుండానే ఆమె రూపంలో రొట్టెలు చేసి ఆమెకు బలులు అర్పించామా? వాళ్ల అనుమతి లేకుండానే ఆమెకు పానీయార్పణలు అర్పించామా?” 20  అప్పుడు యిర్మీయా ప్రజలందరితో, అంటే ఆ పురుషులతో, వాళ్ల భార్యలతో, తనతో మాట్లాడుతున్న ప్రజలందరితో ఇలా అన్నాడు: 21  “మీరు, మీ పూర్వీకులు, మీ రాజులు, మీ అధిపతులు, దేశ ప్రజలు యూదా నగరాల్లో, యెరూషలేము వీధుల్లో అర్పించిన బలుల్ని+ యెహోవా జ్ఞాపకం చేసుకున్నాడు, అవి ఆయనకు గుర్తుకొచ్చాయి! 22  మీ చెడ్డపనుల్ని, మీ అసహ్యమైన కార్యాల్ని యెహోవా ఇక సహించలేకపోయాడు, దాంతో ఈ రోజు ఉన్నట్టుగా మీ దేశం ఎవరూ నివసించని పాడుబడ్డ భూమిగా, భయంకరమైన, శపించబడిన నేలగా తయారైంది.+ 23  మీరు ఈ బలుల్ని అర్పించినందువల్లే, యెహోవా స్వరానికి లోబడకుండా ఆయన ధర్మశాస్త్రాన్ని, శాసనాల్ని, జ్ఞాపికల్ని పాటించకుండా యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసినందువల్లే ఈ రోజు ఉన్నట్టుగా ఈ విపత్తు మీ మీదికి వచ్చింది.”+ 24  ఆ ప్రజలందరితో, స్త్రీలందరితో యిర్మీయా ఇంకా ఇలా అన్నాడు: “ఐగుప్తు దేశంలో ఉన్న యూదా ప్రజలారా, మీరంతా యెహోవా చెప్పే మాట వినండి. 25  ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: ‘మీరూ మీ భార్యలూ, “మేము ఆకాశరాణికి* బలులు, పానీయార్పణలు అర్పిస్తామని చేసుకున్న మొక్కుబళ్లను తప్పకుండా చెల్లిస్తాం” అని అన్నారు. మీ నోటితో అన్న మాటల్ని చేతులతో నెరవేర్చారు.+ స్త్రీలారా, మీరు ఖచ్చితంగా మీ మొక్కుబళ్లను చెల్లిస్తారు, మీరు మొక్కుకున్నట్టే చేస్తారు.’ 26  “కాబట్టి ఐగుప్తు దేశంలో నివసిస్తున్న యూదా ప్రజలారా, మీరంతా యెహోవా చెప్పే మాట వినండి: ‘యెహోవా ఇలా అంటున్నాడు: “నేను నా గొప్ప పేరును బట్టి ప్రమాణం చేస్తున్నాను, ఐగుప్తు దేశమంతట్లో ఉన్న యూదుల్లో ఏ ఒక్కరూ ఇక ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా జీవం తోడు!’+ అంటూ నా పేరున ఒట్టేయరు.+ 27  నేను ఇప్పుడు వాళ్లను కనిపెట్టుకొని ఉన్నాను అయితే మంచి చేయడానికి కాదు, వాళ్లమీదికి విపత్తు తీసుకురావడానికే;+ ఐగుప్తు దేశంలో ఉన్న యూదా ప్రజలందరూ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే వరకు ఖడ్గం వల్ల, కరువు వల్ల నశించిపోతారు.+ 28  చాలా కొద్దిమంది మాత్రమే ఖడ్గాన్ని తప్పించుకుని ఐగుప్తు దేశం నుండి యూదా దేశానికి తిరిగెళ్తారు.+ అప్పుడు ఐగుప్తు దేశంలో నివసించడానికి వచ్చిన మిగిలిన యూదా ప్రజలందరికీ నా మాట నెరవేరిందో, వాళ్ల మాట నెరవేరిందో తెలుస్తుంది!” ’ ” 29  “యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: ‘మీ మీదికి విపత్తు వస్తుందని నేను చెప్పిన మాట తప్పకుండా నెరవేరుతుందని మీరు తెలుసుకునేలా, నేను ఈ స్థలంలో మిమ్మల్ని శిక్షిస్తాను అనడానికి ఇదే మీకు సూచన: 30  యెహోవా ఇలా అంటున్నాడు, “ఇదిగో నేను యూదా రాజైన సిద్కియాను అతని ప్రాణం తీయాలని చూసిన అతని శత్రువైన బబులోను రాజు నెబుకద్నెజరు* చేతికి అప్పగించినట్టే, ఐగుప్తు రాజైన ఫరో హొఫ్రను అతని శత్రువుల చేతికి, అతని ప్రాణం తీయాలని చూస్తున్నవాళ్ల చేతికి అప్పగిస్తున్నాను.” ’ ”+

అధస్సూచీలు

లేదా “మెంఫిస్‌లో.”
అక్ష., “పెందలకడే లేచి.”
మతభ్రష్టులైన ఇశ్రాయేలీయులు పూజించిన ఒక దేవత బిరుదు; సంతాన సాఫల్య దేవత కావచ్చు.
మతభ్రష్టులైన ఇశ్రాయేలీయులు పూజించిన ఒక దేవత బిరుదు; సంతాన సాఫల్య దేవత కావచ్చు.
మతభ్రష్టులైన ఇశ్రాయేలీయులు పూజించిన ఒక దేవత బిరుదు; సంతాన సాఫల్య దేవత కావచ్చు.
మతభ్రష్టులైన ఇశ్రాయేలీయులు పూజించిన ఒక దేవత బిరుదు; సంతాన సాఫల్య దేవత కావచ్చు.
అక్ష., “నెబుకద్రెజరు.”