యిర్మీయా 43:1-13

  • ప్రజలు వినకుండా ఐగుప్తుకు వెళ్లడం (1-7)

  • ఐగుప్తులో యిర్మీయాకు యెహోవా వాక్యం (8-13)

43  యిర్మీయా ఆ ప్రజలందరితో వాళ్ల దేవుడైన యెహోవా నుండి వచ్చిన ఈ మాటలన్నీ, అంటే వాళ్లతో ఏ మాటలైతే చెప్పమని వాళ్ల దేవుడైన యెహోవా తనను పంపించాడో ఆ మాటలన్నీ చెప్పిన తర్వాత,  హోషయా కుమారుడైన అజర్యా, కారేహ కుమారుడైన యోహానాను,+ అహంకారులైన మనుషులంతా యిర్మీయాతో ఇలా అన్నారు: “నువ్వు చెప్పేది అబద్ధం! మా దేవుడైన యెహోవా, ‘ఐగుప్తులో నివసించడానికి అక్కడికి వెళ్లకండి’ అని చెప్పమని నిన్ను పంపలేదు.  మమ్మల్ని కల్దీయుల చేతికి అప్పగించి చంపించాలనో, బబులోనుకు బందీలుగా పంపించాలనో నేరీయా కుమారుడైన బారూకు+ నిన్ను మాకు వ్యతిరేకంగా ప్రేరేపిస్తున్నాడు.”+  కాబట్టి కారేహ కుమారుడైన యోహానాను, సైన్యాధిపతులందరూ, ప్రజలందరూ యూదా దేశంలో ఉండిపొమ్మని చెప్పిన యెహోవా స్వరానికి లోబడలేదు.  బదులుగా కారేహ కుమారుడైన యోహానాను, సైన్యాధిపతులందరూ యూదా ప్రజల్లో మిగిలినవాళ్లందర్నీ, అంటే తాము చెదిరిపోయిన దేశాలన్నిటి నుండి యూదా దేశంలో నివసించడానికి తిరిగొచ్చిన వాళ్లందర్నీ తమ వెంట తీసుకెళ్లారు.+  వాళ్లు పురుషుల్ని, స్త్రీలను, పిల్లల్ని, రాజు కూతుళ్లను, ప్రతీ ఒక్కర్ని, అంటే రాజ సంరక్షకుల అధిపతైన నెబూజరదాను+ ఎవరినైతే షాఫాను+ మనవడూ అహీకాము+ కుమారుడూ అయిన గెదల్యా+ కింద ఉంచాడో వాళ్లందర్నీ, అలాగే యిర్మీయా ప్రవక్తను, నేరీయా కుమారుడైన బారూకును తీసుకెళ్లారు.  వాళ్లు యెహోవా స్వరానికి లోబడకుండా ఐగుప్తు దేశంలోకి ప్రవేశించి, తహపనేసు+ వరకు వెళ్లారు.  అప్పుడు తహపనేసులో యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చి ఇలా అంది:  “నువ్వు ఆ యూదులు చూస్తుండగా నీ చేతిలో పెద్దరాళ్లు తీసుకుని, తహపనేసులో ఫరో ఇంటి ప్రవేశం దగ్గర ఇటుకలతో కట్టిన బాటలో పాతిపెట్టి, సున్నంతో కప్పేయి. 10  తర్వాత వాళ్లకు ఇలా చెప్పు: ‘ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు, “ఇదిగో నేను నా సేవకుడైన బబులోను రాజు నెబుకద్నెజరును* పిలిపిస్తున్నాను,+ నేను పాతిపెట్టిన ఈ రాళ్లమీద అతని సింహాసనాన్ని ఉంచుతాను, అతను తన రాచ తివాచీని వాటిమీద పరుస్తాడు.+ 11  అతను వచ్చి, ఐగుప్తు దేశం మీద దాడిచేస్తాడు.+ ప్రాణాంతకమైన తెగులుకు నిర్ణయించబడినవాళ్లు ప్రాణాంతకమైన తెగులు వల్ల చనిపోతారు, బందీలుగా ఉండడానికి నిర్ణయించబడినవాళ్లు బందీలుగా వెళ్తారు, ఖడ్గానికి నిర్ణయించబడినవాళ్లు ఖడ్గం వల్ల చనిపోతారు.+ 12  నేను ఐగుప్తు దేవుళ్ల గుళ్లకు నిప్పు అంటిస్తాను,+ అతను వాటిని కాల్చేసి, వాళ్లను బందీలుగా తీసుకెళ్తాడు. కాపరి తన వస్త్రాన్ని చుట్టుకున్నట్టు, అతను ఐగుప్తు దేశాన్ని చుట్టుకుని ప్రశాంతంగా* వెళ్లిపోతాడు. 13  అతను ఐగుప్తు దేశంలోని బేత్షెమెషు* స్తంభాల్ని* ముక్కలుముక్కలు చేస్తాడు, ఐగుప్తు దేవుళ్ల గుళ్లను అగ్నితో కాల్చేస్తాడు.” ’ ”

అధస్సూచీలు

అక్ష., “నెబుకద్రెజరును.”
లేదా “సురక్షితంగా.”
లేదా “సూర్య దేవాలయం,” అంటే హీలియోపొలిస్‌.
లేదా “స్తూపాల్ని.”