యిర్మీయా 40:1-16

  • నెబూజరదాను యిర్మీయాను విడిపించడం (1-6)

  • దేశం మీద గెదల్యాను నియమించడం (7-12)

  • గెదల్యా మీద కుట్ర (13-16)

40  రాజ సంరక్షకుల అధిపతైన నెబూజరదాను+ యిర్మీయాను రామా+ నుండి విడుదల చేసిన తర్వాత, యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చింది. అంతకుముందు అతను యిర్మీయాను సంకెళ్లతో బంధించి అక్కడికి తీసుకొచ్చాడు. అప్పుడు యిర్మీయా యెరూషలేము నుండి, యూదా నుండి బబులోనుకు బందీలుగా తీసుకెళ్లబడుతున్న వాళ్లందరితో పాటు ఉన్నాడు.  అప్పుడు రాజ సంరక్షకుల అధిపతి యిర్మీయాను పక్కకు తీసుకెళ్లి అతనితో ఇలా అన్నాడు: “నీ దేవుడైన యెహోవా ఈ స్థలం మీదికి ఈ విపత్తు వస్తుందని ముందే చెప్పాడు,  యెహోవా తాను చెప్పినట్టే ఆ విపత్తును తీసుకొచ్చాడు, ఎందుకంటే మీరు యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశారు, ఆయన మాట వినలేదు. అందుకే మీకిలా జరిగింది.+  ఇదిగో, ఈ రోజు నేను నీ చేతులకు ఉన్న సంకెళ్లను తీసేసి నిన్ను విడుదల చేస్తున్నాను. నాతోపాటు బబులోనుకు రావడం నీకు మంచిదనిపిస్తే నాతో రా, నేను నీ బాగోగులు చూసుకుంటాను. కానీ నీకు బబులోనుకు రావడం ఇష్టం లేకపోతే, రాకు. ఇదిగో! దేశమంతా నీ ముందు ఉంది. నీకు ఎక్కడికి వెళ్లాలనిపిస్తే అక్కడికి వెళ్లు.”+  యిర్మీయా ఇంకా తిరిగెళ్లాలని నిర్ణయించుకోకముందే నెబూజరదాను ఇలా అన్నాడు: “షాఫాను+ మనవడూ అహీకాము+ కుమారుడూ అయిన గెదల్యా+ దగ్గరికి వెళ్లు. బబులోను రాజు అతన్ని యూదా నగరాల మీద నియమించాడు. నువ్వు అతని దగ్గరికి వెళ్లి, అతనితోపాటు ప్రజల మధ్య నివసించు; లేదా నీకు ఎక్కడికి వెళ్లాలనిపిస్తే అక్కడికి వెళ్లు.” తర్వాత రాజ సంరక్షకుల అధిపతి అతనికి కొంత ఆహారాన్ని, ఒక కానుకను ఇచ్చి పంపించేశాడు.  కాబట్టి యిర్మీయా మిస్పాలో+ ఉన్న అహీకాము కుమారుడైన గెదల్యా దగ్గరికి వెళ్లి, దేశంలో మిగిలిన ప్రజల మధ్య నివసిస్తూ అతనితోపాటే ఉండిపోయాడు.  బబులోను రాజు యూదా దేశం మీద, అంటే బబులోనుకు బందీలుగా తీసుకెళ్లబడని ఆ దేశంలోని నిరుపేద పురుషుల మీద, స్త్రీల మీద, పిల్లల మీద అహీకాము కుమారుడైన గెదల్యాను అధికారిగా నియమించాడని+ కొంతకాలానికి పల్లెటూళ్లలో ఉన్న సైన్యాధిపతులందరికీ, వాళ్లతో పాటు ఉన్న మనుషులకు తెలిసింది.  దాంతో వాళ్లు మిస్పాలో+ ఉన్న గెదల్యా దగ్గరికి వచ్చారు. వాళ్లు ఎవరంటే: నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు;+ కారేహ కుమారులైన యోహానాను,+ యోనాతాను; తన్హుమెతు కుమారుడైన శెరాయా; నెటోపాతీయుడైన ఏపయి కుమారులు; మాయకాతీయుడి కుమారుడైన యెజన్యా;+ వాళ్ల మనుషులు.  షాఫాను మనవడూ అహీకాము కుమారుడూ అయిన గెదల్యా వాళ్లతో, వాళ్ల మనుషులతో ప్రమాణం చేసి ఇలా అన్నాడు: “కల్దీయులకు సేవ చేయడానికి భయపడకండి. ఈ దేశంలో నివసిస్తూ బబులోను రాజుకు సేవ చేయండి, అప్పుడు మీకు మంచి జరుగుతుంది.+ 10  నేనైతే, మన దగ్గరికి వచ్చే కల్దీయుల ముందు మీకు ప్రాతినిధ్యం వహించడానికి మిస్పాలోనే ఉంటాను. అయితే మీరు ద్రాక్షారసాన్ని, వేసవికాల పండ్లను, నూనెను సమకూర్చుకుంటూ, వాటిని పాత్రల్లో నిల్వ చేసుకుంటూ మీరు స్వాధీనం చేసుకున్న నగరాల్లో స్థిరపడండి.”+ 11  బబులోను రాజు యూదా దేశంలో కొంతమందిని ఉండనిచ్చాడని, వాళ్లమీద షాఫాను మనవడూ అహీకాము కుమారుడూ అయిన గెదల్యాను అధికారిగా నియమించాడని మోయాబు, అమ్మోను, ఎదోము దేశాల్లో, అలాగే మిగతా దేశాలన్నిటిలో ఉన్న యూదులందరు విన్నారు. 12  కాబట్టి యూదులందరూ తాము చెదిరిపోయిన ప్రాంతాలన్నిటి నుండి యూదా దేశానికి తిరిగిరావడం మొదలుపెట్టారు, వాళ్లు మిస్పాలో ఉన్న గెదల్యా దగ్గరికి వచ్చారు. వాళ్లు ద్రాక్షారసాన్ని, వేసవికాల పండ్లను చాలా పెద్దమొత్తంలో సమకూర్చారు. 13  కారేహ కుమారుడైన యోహానాను, పల్లెటూళ్లలో ఉన్న సైన్యాధిపతులందరూ మిస్పాలో ఉన్న గెదల్యా దగ్గరికి వచ్చారు. 14  వాళ్లు అతనితో, “అమ్మోనీయుల+ రాజైన బయలీసు నిన్ను చంపడానికి నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును పంపాడని నీకు తెలీదా?”+ అన్నారు. అయితే అహీకాము కుమారుడైన గెదల్యా వాళ్ల మాట నమ్మలేదు. 15  అప్పుడు కారేహ కుమారుడైన యోహానాను మిస్పాలో ఉన్న గెదల్యాతో రహస్యంగా ఇలా అన్నాడు: “నేను వెళ్లి నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును చంపాలనుకుంటున్నాను, ఆ విషయం ఎవ్వరూ కనిపెట్టలేరు. లేదంటే అతను నిన్ను చంపేస్తాడు, నీ దగ్గరికి సమకూడిన యూదా ప్రజలందరు చెదిరిపోతారు, మిగిలిన యూదా ప్రజలు నశించిపోతారు.” 16  కానీ అహీకాము కుమారుడైన గెదల్యా+ కారేహ కుమారుడైన యోహానానుతో ఇలా అన్నాడు: “అలా చేయొద్దు, ఇష్మాయేలు గురించి నువ్వు చెప్పేది అబద్ధం.”

అధస్సూచీలు