యిర్మీయా 26:1-24

  • చంపుతామని యిర్మీయాను బెదిరించడం (1-15)

  • యిర్మీయా తప్పించబడడం (16-19)

    • మీకా ప్రవచనాన్ని ఎత్తిచెప్పడం (18)

  • ఊరియా ప్రవక్త (20-24)

26  యోషీయా కుమారుడూ, యూదా రాజూ అయిన యెహోయాకీము+ పరిపాలన ఆరంభంలో యెహోవా వాక్యం ఇలా చెప్పింది:  “యెహోవా ఇలా అంటున్నాడు, ‘నువ్వు యెహోవా మందిర ప్రాంగణంలో నిలబడి, యెహోవా మందిరంలో ఆరాధించడానికి* లోపలికి వస్తున్న యూదా నగరాల ప్రజలందరి గురించి* ప్రకటించు. నేను నీకు ఆజ్ఞాపించేదంతా వాళ్లకు చెప్పు; ఒక్కమాట కూడా విడిచిపెట్టకు.  బహుశా వాళ్లు విని, ప్రతీ ఒక్కరు తమ చెడ్డ మార్గం నుండి పక్కకు మళ్లుతారేమో. అప్పుడు నేను, వాళ్ల చెడ్డపనుల్ని బట్టి వాళ్లమీదికి తీసుకురావాలనుకున్న విపత్తు విషయంలో నా మనసు మార్చుకుంటాను.*+  వాళ్లకు ఇలా చెప్పు: “యెహోవా ఇలా అంటున్నాడు, ‘మీరు నా మాట వినకపోతే, అంటే నేను మీ ముందు ఉంచిన నా ధర్మశాస్త్రాన్ని* పాటించకుండా,  నేను మీ దగ్గరికి పదేపదే* పంపిస్తున్న నా సేవకులైన ప్రవక్తల మాటల్ని ఇప్పటిలాగే వినకుండా ఉంటే,+  నేను ఈ మందిరాన్ని షిలోహులా+ చేస్తాను, ఈ నగరాన్ని భూమ్మీదున్న దేశాలన్నీ శపించేలా చేస్తాను.’ ” ’ ”+  యిర్మీయా యెహోవా మందిరంలో ఈ మాటలు చెప్పడం యాజకులు, ప్రవక్తలు, ప్రజలందరు విన్నారు.+  యిర్మీయా యెహోవా ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ ప్రజలకు చెప్పడం పూర్తయిన తర్వాత, యాజకులు, ప్రవక్తలు, ప్రజలందరు అతన్ని పట్టుకుని ఇలా అన్నారు: “నువ్వు ఖచ్చితంగా చస్తావు.  నువ్వు, ‘ఈ మందిరం షిలోహులా అవుతుంది, ఈ నగరం నాశనమైపోతుంది, దీనిలో ఎవ్వరూ నివసించరు’ అంటూ యెహోవా పేరున ఎందుకు ప్రవచించావు?” అప్పుడు ప్రజలందరూ యెహోవా మందిరంలో యిర్మీయా చుట్టూ గుమికూడారు. 10  యూదా అధిపతులు ఈ విషయం గురించి విన్నప్పుడు, వాళ్లు యూదా రాజు రాజభవనం నుండి యెహోవా మందిరానికి వచ్చి, యెహోవా మందిర కొత్త ద్వారం ప్రవేశం దగ్గర+ కూర్చున్నారు. 11  అప్పుడు యాజకులు, ప్రవక్తలు అధిపతులతో, ప్రజలందరితో ఇలా అన్నారు: “ఈ మనిషి మరణశిక్షకు అర్హుడు.+ ఎందుకంటే, ఇతను ఈ నగరానికి వ్యతిరేకంగా ప్రవచించాడు. ఆ మాటలు మీరే చెవులారా విన్నారు.”+ 12  అప్పుడు యిర్మీయా అధిపతులందరితో, ప్రజలందరితో ఇలా అన్నాడు: “మీరు విన్న మాటల్ని, అంటే ఈ మందిరానికి, ఈ నగరానికి వ్యతిరేకంగా నేను మాట్లాడిన మాటలన్నిటినీ ప్రవచించడానికి యెహోవాయే నన్ను పంపాడు.+ 13  కాబట్టి, ఇప్పుడు మీరు మీ మార్గాల్ని, మీ ప్రవర్తనను మార్చుకుని మీ దేవుడైన యెహోవా స్వరానికి లోబడండి. అప్పుడు యెహోవా మీకు వ్యతిరేకంగా చెప్పిన విపత్తు విషయంలో తన మనసు మార్చుకుంటాడు.*+ 14  ఇక నా విషయానికొస్తే, నేను మీ చేతుల్లో ఉన్నాను. మీకు ఏది మంచిదనిపిస్తే, ఏది సరైనదనిపిస్తే అది నాకు చేయండి. 15  అయితే ఒక్క విషయం తెలుసుకోండి: మీరు నన్ను చంపితే, ఒక నిర్దోషి రక్తాపరాధం మీ మీదికి, ఈ నగరం మీదికి, దాని నివాసుల మీదికి వస్తుంది. ఎందుకంటే, మీరు వింటుండగా ఈ మాటలన్నిటినీ చెప్పడానికి యెహోవాయే మీ దగ్గరికి నన్ను పంపించాడు, ఇది వాస్తవం.” 16  అప్పుడు అధిపతులు, ప్రజలందరు యాజకులతో, ప్రవక్తలతో ఇలా అన్నారు: “ఇతను మరణశిక్షకు తగినవాడు కాదు, ఎందుకంటే ఇతను మన దేవుడైన యెహోవా పేరున మనతో మాట్లాడాడు.” 17  అంతేకాదు, దేశంలోని పెద్దల్లో కొందరు లేచి, ప్రజలందరితో ఇలా అన్నారు: 18  “యూదా రాజైన హిజ్కియా+ రోజుల్లో మోరష్తీకి చెందిన మీకా+ ప్రవచించాడు, అతను యూదా ప్రజలందరితో ఇలా అన్నాడు, ‘సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: “సీయోను ఒక పొలంలా దున్నబడుతుంది, యెరూషలేము శిథిలాల కుప్పల్లా మారుతుంది,+మందిర* పర్వతం అడవిలోని ఎత్తైన స్థలాల్లా అవుతుంది.” ’+ 19  “అప్పుడు యూదా రాజైన హిజ్కియా, యూదా ప్రజలందరూ అతన్ని చంపేశారా? అతను యెహోవాకు భయపడి, యెహోవా అనుగ్రహం కోసం వేడుకోలేదా? అప్పుడు యెహోవా వాళ్లకు వ్యతిరేకంగా చెప్పిన విపత్తు విషయంలో తన మనసు మార్చుకోలేదా?*+ కాబట్టి మనం మనమీదికి గొప్ప విపత్తును తెచ్చుకోబోతున్నాం. 20  “ఇంకో వ్యక్తి కూడా యెహోవా పేరున ప్రవచించాడు, అతను కిర్యత్యారీముకు+ చెందిన షెమయా కుమారుడైన ఊరియా. అతను కూడా యిర్మీయా లాంటి మాటలే అంటూ ఈ నగరానికి, ఈ దేశానికి వ్యతిరేకంగా ప్రవచించాడు. 21  అతని మాటల్ని యెహోయాకీము+ రాజు, అతని శూరులందరూ, అధిపతులందరూ విన్నారు; రాజు అతన్ని చంపాలని చూశాడు.+ ఊరియా దాని గురించి విన్నప్పుడు భయపడి ఐగుప్తుకు పారిపోయాడు. 22  అప్పుడు యెహోయాకీము రాజు అక్బోరు కుమారుడైన ఎల్నాతానును,+ అతనితో పాటు ఇంకొంతమందిని ఐగుప్తుకు పంపాడు. 23  వాళ్లు ఊరియాను ఐగుప్తు నుండి యెహోయాకీము రాజు దగ్గరికి తీసుకొచ్చారు. అప్పుడతను ఊరియాను కత్తితో చంపి,+ అతని శవాన్ని సామాన్యుల సమాధి స్థలంలో పడేశాడు.” 24  అయితే షాఫాను+ కుమారుడైన అహీకాము+ యిర్మీయాకు సహాయం చేశాడు, కాబట్టి వాళ్లు అతన్ని చంపడానికి ప్రజలకు అప్పగించలేదు.+

అధస్సూచీలు

లేదా “వంగి నమస్కరించడానికి.”
లేదా “ప్రజలందరికి.”
లేదా “విచారపడతాను.”
లేదా “ఉపదేశాన్ని.”
అక్ష., “పెందలకడే లేచి.”
లేదా “విచారపడతాడు.”
లేదా “ఆలయ.”
లేదా “విచారపడలేదా?”