యిర్మీయా 22:1-30
22 యెహోవా ఇలా అంటున్నాడు: “నువ్వు యూదా రాజు రాజభవనానికి వెళ్లి, ఈ సందేశాన్ని ప్రకటించు.
2 నువ్వు ఇలా చెప్పాలి: ‘దావీదు సింహాసనం మీద కూర్చునే యూదా రాజా, నువ్వూ ఈ ద్వారాల గుండా ప్రవేశించే నీ సేవకులూ నీ ప్రజలూ యెహోవా చెప్తున్న మాట వినండి.
3 యెహోవా ఏమంటున్నాడంటే, “న్యాయాన్ని, నీతిని సమర్థించండి. మోసం చేసేవాడి చేతి నుండి దోచుకోబడుతున్న వాళ్లను కాపాడండి. పరదేశితో చెడుగా వ్యవహరించకండి, అనాథకు* గానీ, విధవరాలికి గానీ హాని చేయకండి.+ ఈ స్థలంలో నిర్దోషి రక్తం చిందించకండి.+
4 మీరు ఈ మాటల్ని జాగ్రత్తగా పాటిస్తే, దావీదు సింహాసనం మీద కూర్చునే రాజులు+ రథాల మీద, గుర్రాల మీద తమ సేవకులతో పాటు, ప్రజలతో పాటు ఈ రాజభవన ద్వారాల గుండా ప్రవేశిస్తారు.” ’+
5 “ ‘అయితే మీరు ఈ మాటలకు లోబడకపోతే ఈ రాజభవనం నాశనమైపోతుంది,+ నా తోడని ప్రమాణం చేస్తున్నాను’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.
6 “యూదా రాజు రాజభవనం గురించి యెహోవా ఇలా అంటున్నాడు:‘నువ్వు నాకు గిలాదులా,లెబానోను శిఖరంలా ఉన్నావు.
కానీ నేను నిన్ను ఎడారిలా చేస్తాను;నీ నగరాల్లో ఎవ్వరూ నివసించరు.+
7 నేను నీమీద నాశకుల్ని నియమిస్తాను.*వాళ్లు ఆయుధాలతో వస్తారు.+
వాళ్లు నీ శ్రేష్ఠమైన దేవదారు చెట్లను నరికేసివాటిని మంటల్లో పడేస్తారు.+
8 “ ‘చాలా దేశాల ప్రజలు ఈ నగరం పక్కగా వెళ్తూ, “యెహోవా ఈ గొప్ప నగరానికి ఎందుకిలా చేశాడు?” అని అడుగుతారు.+
9 వాళ్లు ఇలా అంటారు: “ఎందుకంటే వాళ్లు తమ దేవుడైన యెహోవా ఒప్పందాన్ని విడిచిపెట్టి వేరే దేవుళ్లకు వంగి నమస్కారం చేశారు, వాటిని పూజించారు.” ’+
10 చనిపోయిన వ్యక్తి కోసం ఏడ్వకండి,అతని కోసం దుఃఖించకండి.
బదులుగా, చెరలోకి వెళ్తున్న వ్యక్తి కోసం వెక్కివెక్కి ఏడ్వండి;ఎందుకంటే తాను పుట్టిన దేశాన్ని చూడడానికి అతను ఇక తిరిగిరాడు.
11 “తన తండ్రైన యోషీయాకు బదులు పరిపాలిస్తూ ఈ స్థలం నుండి వెళ్లిపోయిన యూదా రాజూ, యోషీయా+ కుమారుడూ అయిన షల్లూము*+ గురించి యెహోవా ఏమంటున్నాడంటే: ‘అతను ఇక్కడికి ఇక తిరిగిరాడు.
12 వాళ్లు అతన్ని బందీగా తీసుకెళ్లిన చోటే అతను చనిపోతాడు, మళ్లీ ఈ దేశాన్ని చూడడు.’+
13 నీతి లేకుండా తన ఇంటిని,న్యాయం లేకుండా తన పైగదుల్ని కట్టించుకునే వాడికి శ్రమ!తన తోటివానితో ఊరికే సేవ చేయించుకుంటూకూలి ఇవ్వడానికి నిరాకరించే వాడికి శ్రమ!+
14 ‘నేను విశాలమైన పైగదులతో పెద్ద ఇల్లు కట్టించుకుంటాను,దానికి కిటికీలు చేయిస్తాను,
దేవదారు పలకలు అమర్చి, ఎర్ర రంగు వేయిస్తాను’ అని అనుకునే వాడికి శ్రమ!
15 దేవదారు కలపను ఉపయోగించే విషయంలో అందర్నీ మించిపోయావు కాబట్టి నువ్వు పరిపాలిస్తూనే ఉంటావా?
నీ తండ్రి కూడా తిన్నాడు, తాగాడు,కానీ అతను నీతిని, న్యాయాన్ని సమర్థించాడు,+అతనికి మంచి జరిగింది.
16 అతను బాధించబడినవాళ్ల తరఫున, పేదవాళ్ల తరఫున వాదించాడు,దానివల్ల అతనికి మంచి జరిగింది.
‘నన్ను తెలుసుకోవడం అంటే అదే కదా?’ అని యెహోవా అంటున్నాడు.
17 ‘కానీ నీ దృష్టి, ధ్యాస అంతా అక్రమ సంపాదన మీద,నిర్దోషుల రక్తం చిందించడం మీద,మోసం చేయడం మీద, లాక్కోవడం మీదే ఉంది.’
18 “కాబట్టి యోషీయా కుమారుడూ యూదా రాజూ అయిన యెహోయాకీము+ గురించి యెహోవా ఇలా చెప్తున్నాడు:‘వాళ్లు, “అయ్యో, నా సహోదరుడా! అయ్యో, నా తోబుట్టువా!”* అంటూ అతని కోసం ఏడ్వరు.
“అయ్యో, నా యజమానీ! అయ్యో, అతని ఘనత!” అంటూ అతని కోసం దుఃఖించరు.
19 అతన్ని యెరూషలేము ద్వారాల బయటికి ఈడ్చుకెళ్లి, పారేస్తారు.+గాడిదను పాతిపెట్టినట్టు పాతిపెడతారు.’+
20 లెబానోనుకు వెళ్లి కేకలు వేయి,
బాషానులో బిగ్గరగా అరువు,అబారీము+ నుండి కేకలు వేయి,ఎందుకంటే నీ ప్రియులంతా నలగ్గొట్టబడ్డారు.+
21 నువ్వు సురక్షితంగా ఉన్నప్పుడు నేను నీతో మాట్లాడాను.
కానీ నువ్వు, ‘నేను లోబడను’ అన్నావు.+
చిన్నప్పటి నుండి నువ్వు అలానే ప్రవర్తించావు,నువ్వు నా మాట వినలేదు.+
22 నీ కాపరులంతా గాలికి కొట్టుకుపోతారు,+నీ ప్రియులంతా బందీలుగా వెళ్తారు.
అప్పుడు నీ విపత్తు అంతటిని బట్టి నువ్వు సిగ్గుపడతావు, అవమానాలపాలు అవుతావు.
23 లెబానోనులో+ దేవదారు చెట్ల మధ్య సురక్షితంగా నివసించేవాడా,+నీకు పురిటినొప్పులు వచ్చినప్పుడు,ప్రసవించే స్త్రీ వేదనలాంటి వేదన నీకు కలిగినప్పుడు నువ్వు ఎంతగా మూలుగుతావో కదా!”+
24 “యెహోవా ఇలా అంటున్నాడు: ‘నా జీవం తోడు, యెహోయాకీము+ కుమారుడూ యూదా రాజూ అయిన కొన్యా,*+ నువ్వు నా కుడిచేతికి ముద్ర ఉంగరంలా ఉన్నాసరే, నేను నిన్ను అక్కడి నుండి తీసేస్తాను!
25 నీ ప్రాణాన్ని తీయాలని చూస్తున్నవాళ్ల చేతికి, నువ్వు భయపడేవాళ్ల చేతికి, బబులోను రాజు నెబుకద్నెజరు* చేతికి, కల్దీయుల చేతికి నిన్ను అప్పగిస్తాను.+
26 నిన్నూ, నిన్ను కన్న నీ తల్లినీ మీరు పుట్టని వేరే దేశంలోకి విసిరేస్తాను, మీరు అక్కడే చనిపోతారు.
27 వాళ్లు ఎంతో కోరుకునే దేశానికి వాళ్లు ఇక తిరిగిరారు.+
28 కొన్యా అనే ఇతను పగిలిపోయి తిరస్కరించబడిన కుండ మాత్రమేనా?ఎవరికీ అవసరం లేని పాత్రనా?
ఇతను, ఇతని వంశస్థులు ఎందుకు విసిరేయబడ్డారు?తమకు తెలియని దేశంలోకి ఎందుకు పడేయబడ్డారు?’+
29 దేశమా,* దేశమా, దేశమా, యెహోవా మాట విను.
30 యెహోవా ఇలా అంటున్నాడు:
‘ఇతను పిల్లలు లేనివాడు అని,తన జీవితకాలంలో ఎలాంటి విజయమూ సాధించలేనివాడు అని రాయండి,ఎందుకంటే, ఇతని వంశస్థుల్లో ఎవ్వరూ దావీదు సింహాసనం మీద కూర్చుని మళ్లీ యూదాను పరిపాలించరు.’ ”+
అధస్సూచీలు
^ లేదా “తండ్రిలేని పిల్లవాడికి.”
^ అక్ష., “ప్రతిష్ఠిస్తాను.”
^ యెహోయాహాజు అని కూడా పిలవబడ్డాడు.
^ అక్ష., “నా సహోదరీ!”
^ యెహోయాకీను, యెకొన్యా అని కూడా పిలవబడ్డాడు.
^ అక్ష., “నెబుకద్రెజరు.”
^ అక్ష., “భూమీ.”