యిర్మీయా 19:1-15
19 యెహోవా ఇలా అన్నాడు: “నువ్వు వెళ్లి, కుమ్మరి దగ్గర ఒక మట్టి కూజా కొను.+ ప్రజల పెద్దల్లో, యాజకుల పెద్దల్లో కొందర్ని తీసుకొని
2 కుమ్మరి ద్వారం దగ్గరున్న బెన్‌హిన్నోము* లోయకు+ వెళ్లు. అక్కడ నేను నీకు చెప్పే మాటలు ప్రకటించు.
3 నువ్విలా చెప్పాలి: ‘యూదా రాజులారా, యెరూషలేము నివాసులారా, యెహోవా మాట వినండి. ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు:
“ ‘ “నేను ఈ స్థలం మీదికి ఒక విపత్తు తీసుకురాబోతున్నాను, దాని గురించి వినేవాళ్ల చెవులు గింగురుమంటాయి.
4 ఎందుకంటే, వాళ్లు నన్ను విడిచిపెట్టారు,+ ఈ స్థలాన్ని గుర్తుపట్టకుండా చేశారు.+ తమకు గానీ, తమ పూర్వీకులకు గానీ, యూదా రాజులకు గానీ తెలియని వేరే దేవుళ్లకు ఈ స్థలంలో బలులు అర్పిస్తున్నారు. వాళ్లు ఈ స్థలాన్ని అమాయకుల రక్తంతో నింపేశారు.+
5 వాళ్లు ఉన్నత స్థలాలు కట్టి తమ కుమారుల్ని అగ్నిలో కాల్చి బయలుకు సంపూర్ణ దహనబలులుగా అర్పించారు.+ అలా చేయమని నేను ఆజ్ఞాపించలేదు, చెప్పలేదు, కనీసం ఆ ఆలోచన కూడా ఎప్పుడూ నా హృదయంలో రాలేదు.” ’+
6 “ ‘ “కాబట్టి ఇదిగో! అది ఇక తోఫెతు అని గానీ, బెన్‌హిన్నోము* లోయ అని గానీ కాకుండా వధ లోయ అని పిలవబడే రోజులు వస్తున్నాయి” అని యెహోవా అంటున్నాడు.+
7 “నేను ఈ స్థలంలో యూదా, యెరూషలేముల ఆలోచనలు వ్యర్థమైపోయేలా చేస్తాను. వాళ్లు తమ ప్రాణాల్ని తీయాలని చూస్తున్న శత్రువుల ఖడ్గానికి చిక్కి చనిపోయేలా చేస్తాను. వాళ్ల శవాల్ని ఆకాశపక్షులకు, భూమ్మీది జంతువులకు ఆహారంగా ఇస్తాను.+
8 నేను ఈ నగరాన్ని భయంకరంగా మారుస్తాను, ప్రజలు దాన్ని చూసి ఈల వేసేలా చేస్తాను. ఆ దారిన వెళ్లే ప్రతీ వ్యక్తి ఆశ్చర్యంతో దాన్ని చూస్తూ ఉండిపోతాడు, దాని తెగుళ్లన్నిటినీ చూసి ఈలవేస్తాడు.+
9 వాళ్లు తమ కుమారుల, కూతుళ్ల మాంసాన్ని తినేలా చేస్తాను; వాళ్ల శత్రువులు, వాళ్ల ప్రాణాలు తీయాలని చూసేవాళ్లు చుట్టూ ముట్టడి వేసినప్పుడు ఆ ముట్టడిని బట్టి, దానివల్ల కలిగిన ఇబ్బందిని బట్టి వాళ్లలో ప్రతీ ఒక్కరు తమ తోటివాడి మాంసం తింటారు.” ’+
10 “తర్వాత నువ్వు, నీతోపాటు వచ్చినవాళ్ల కళ్లముందు ఆ కూజాను పగలగొట్టి
11 వాళ్లకు ఇలా చెప్పు: ‘సైన్యాలకు అధిపతైన యెహోవా ఏమంటున్నాడంటే: “ఒక వ్యక్తి, తిరిగి బాగుచేయలేనంతగా మట్టి పాత్రను పగలగొట్టినట్టే నేను ఈ ప్రజల్ని, ఈ నగరాన్ని పగలగొడతాను; తోఫెతులో ఇక స్థలం లేకుండా పోయేవరకు శవాల్ని పాతిపెడుతూ ఉంటారు.” ’+
12 “ ‘ఈ నగరాన్ని తోఫెతులా మార్చడానికి నేను ఈ స్థలానికీ, దాని నివాసులకూ అలానే చేస్తాను’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.
13 ‘యెరూషలేములోని ఇళ్లు, యూదా రాజుల ఇళ్లు, అవును ఏయే ఇళ్లమీద వాళ్లు ఆకాశ సైన్యమంతటికీ బలులు అర్పించారో,+ ఇతర దేవుళ్లకు పానీయార్పణలు అర్పించారో+ ఆ ఇళ్లన్నీ ఈ తోఫెతులాగే అపవిత్రమౌతాయి.’ ”+
14 యిర్మీయా తోఫెతు నుండి, అంటే ప్రవచించమని యెహోవా తనను పంపించిన స్థలం నుండి తిరిగొచ్చిన తర్వాత, అతను యెహోవా మందిర ప్రాంగణంలో నిలబడి ప్రజలందరికీ ఇలా చెప్పాడు:
15 “ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఈ నగరం మీదికి, దాని పట్టణాలన్నిటి మీదికి నేను చెప్పిన విపత్తు అంతటినీ రప్పిస్తున్నాను. ఎందుకంటే, వాళ్లు మొండిగా నా మాటలు వినడానికి ఇష్టపడలేదు.’ ”+