యిర్మీయా 12:1-17
12 యెహోవా, నువ్వు నీతిమంతుడివి.+నేను నీకు ఫిర్యాదు చేసినప్పుడు,
న్యాయం గురించిన విషయాలు నీతో మాట్లాడినప్పుడునువ్వు న్యాయంగా వ్యవహరిస్తావు.
కానీ దుష్టులు ఎందుకు వర్ధిల్లుతున్నారు?+
మోసగాళ్లు ఎందుకు చీకూచింతా లేకుండా ఉంటున్నారు?
2 నువ్వు వాళ్లను నాటావు, వాళ్లు వేళ్లూనుకున్నారు.
ఎదిగి కాయలు కాస్తున్నారు.
వాళ్లు తరచూ నీ గురించి మాట్లాడతారు,
కానీ వాళ్ల అంతరంగం* నీకు చాలా దూరంగా ఉంది.+
3 కానీ యెహోవా, నేను నీకు బాగా తెలుసు,+ నువ్వు నన్ను చూస్తున్నావు;నా హృదయాన్ని పరిశీలించి, అది నీతో ఐక్యంగా ఉందని తెలుసుకున్నావు.+
వధ కోసం గొర్రెల్ని వేరుచేసినట్టు వాళ్లను వేరుచేయి,వధించే రోజు కోసం వాళ్లను ప్రత్యేకంగా ఉంచు.
4 ఇంకా ఎంతకాలం దేశం ఎండిపోవాలి,మైదానాల్లోని పచ్చిక వాడిపోవాలి?+
దానిలోని నివాసుల చెడుతనాన్ని బట్టిజంతువులు, పక్షులు తుడిచిపెట్టుకుపోయాయి.
వాళ్లు ఇలా అన్నారు: “మనకు ఏం జరగబోతుందో ఆయన చూడడు.”
5 మనుషులతో పరుగెత్తినప్పుడే నువ్వు అలసిపోతే,గుర్రాలతో ఎలా పరుగెత్తగలవు?+
శాంతికరమైన దేశంలో సురక్షితంగా ఉండడానికి అలవాటుపడ్డావు,మరి యొర్దాను వెంబడి దట్టమైన పొదల్లో ఉన్నప్పుడు నువ్వు ఏమి చేస్తావు?
6 ఎందుకంటే నీ సొంత అన్నదమ్ములే, నీ తండ్రి ఇంటివాళ్లేనీతో మోసపూరితంగా ప్రవర్తించారు.+
నీమీద గట్టిగా అరిచారు.
వాళ్లు నీతో మంచిగా మాట్లాడినా వాళ్లను నమ్మకు.
7 “నేను నా మందిరాన్ని విడిచిపెట్టేశాను;+ నా స్వాస్థ్యాన్ని వదిలేశాను.+
నాకెంతో ప్రియమైనదాన్ని ఆమె శత్రువుల చేతికి అప్పగించాను.+
8 నా స్వాస్థ్యం నాకు అడవిలోని సింహంలా తయారైంది.
ఆమె నామీద గర్జించింది.
అందుకే నేను ఆమెను అసహ్యించుకోవడం మొదలుపెట్టాను.
9 నా స్వాస్థ్యం నాకు రంగురంగుల* వేటాడే పక్షిలా ఉంది;వేటాడే ఇతర పక్షులు దాన్ని చుట్టుముట్టి, దానిమీద దాడిచేస్తున్నాయి.+
జంతువులారా, తినడానికి మీరంతా కలిసి రండి.+
10 చాలామంది కాపరులు నా ద్రాక్షతోటను నాశనం చేశారు;+నా భూభాగాన్ని తొక్కేశారు.+
నా ప్రియమైన భూభాగాన్ని పాడుబడ్డ ఎడారిలా చేశారు.
11 అది పనికిరాని భూమిలా తయారైంది.
ఎండిపోయింది;*నా ముందు నిర్మానుష్యంగా పడివుంది.+
దేశమంతా పాడైపోయింది,కానీ ఎవ్వరూ దాని గురించి ఆలోచించట్లేదు.+
12 నాశనం చేసేవాళ్లు ఎడారిలోని అన్ని దారుల* గుండా వచ్చారు,ఎందుకంటే, యెహోవా ఖడ్గం దేశ ప్రజలందర్నీ మింగేస్తోంది.+
ఎవ్వరికీ శాంతి లేదు.
13 వాళ్లు గోధుమల్ని విత్తారు, కానీ ముళ్లను కోశారు.+
చాలా కష్టపడ్డారు, కానీ ఫలితం లేదు.
తమ పంటను చూసి వాళ్లు సిగ్గుపడతారు,ఎందుకంటే యెహోవా కోపాగ్ని వాళ్లమీద రగులుకుంది.”
14 యెహోవా ఇలా అంటున్నాడు: “దుష్టులైన నా పొరుగువాళ్ల విషయానికొస్తే, అంటే నేను నా ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని స్వాధీనం చేసుకోనిచ్చిన స్వాస్థ్యాన్ని ముట్టుకుంటున్న వాళ్ల విషయానికొస్తే,+ నేను వాళ్ల దేశంలో నుండి వాళ్లను పెల్లగిస్తాను,+ వాళ్ల మధ్య నుండి యూదా ఇంటివాళ్లను పెల్లగిస్తాను.
15 కానీ వాళ్లను పెల్లగించిన తర్వాత, మళ్లీ వాళ్లమీద కరుణ చూపిస్తాను, వాళ్లలో ప్రతీ ఒక్కర్ని తన స్వాస్థ్యానికి, తన దేశానికి తిరిగి తీసుకొస్తాను.”
16 “వాళ్లు నా ప్రజల మార్గాల్ని నేర్చుకుని, గతంలో నా ప్రజలకు బయలును బట్టి ప్రమాణం చేయడం నేర్పించినట్టే, ‘యెహోవా జీవం తోడు!’ అని నా పేరున ప్రమాణం చేయడం నేర్చుకుంటే, వాళ్లు నా ప్రజల మధ్య వర్ధిల్లుతారు.
17 కానీ వాళ్లు లోబడడానికి ఇష్టపడకపోతే, నేను ఆ దేశాన్ని కూడా పెల్లగిస్తాను, నాశనం చేస్తాను” అని యెహోవా అంటున్నాడు.+
అధస్సూచీలు
^ లేదా “లోతైన భావోద్వేగాలు.” అక్ష., “మూత్రపిండాలు.”
^ లేదా “మచ్చలు గల.”
^ లేదా “దుఃఖిస్తోంది” అయ్యుంటుంది.
^ లేదా “అరిగిపోయిన దారుల.”