యోహానుకు ఇచ్చిన ప్రకటన 9:1-21
9 ఐదో దేవదూత తన బాకా ఊదాడు.+ అప్పుడు ఆకాశం నుండి ఒక నక్షత్రం భూమ్మీదికి రాలడం చూశాను; అగాధపు తాళంచెవి+ ఆయనకు ఇవ్వబడింది.
2 ఆయన అగాధాన్ని తెరిచాడు. అప్పుడు పెద్ద కొలిమిలో నుండి పొగ లేచినట్టు దానిలో నుండి పొగ పైకి లేచింది. ఆ పొగ వల్ల సూర్యుడు, గాలి చీకటిమయం అయ్యాయి.+
3 ఆ పొగలో నుండి మిడతలు బయల్దేరాయి, అవి భూమ్మీదికి వచ్చాయి.+ భూమ్మీది తేళ్లకు ఉన్న శక్తినే దేవుడు వాటికి ఇచ్చాడు.
4 నొసళ్ల మీద దేవుని ముద్రలేని ప్రజలకు తప్ప పచ్చగడ్డికి గానీ, మొక్కకు గానీ, చెట్టుకు గానీ హాని చేయవద్దని వాటికి చెప్పబడింది.+
5 ఐదు నెలలపాటు వాళ్లను హింసించే అధికారం ఆ మిడతలకు ఇవ్వబడింది కానీ చంపే అధికారం ఇవ్వబడలేదు. వాటివల్ల కలిగిన బాధ, తేలు+ కుట్టినప్పుడు కలిగే బాధలా ఉంది.
6 ఆ రోజుల్లో ప్రజలు చావు కోసం వెతుకుతారు కానీ అది వాళ్లకు అస్సలు దొరకదు. వాళ్లు చనిపోవాలని ఎంతో కోరుకుంటారు కానీ చావు వాళ్ల నుండి పారిపోతుంది.
7 ఆ మిడతలు చూడడానికి యుద్ధానికి సిద్ధంగా ఉన్న గుర్రాల్లా ఉన్నాయి.+ వాటి తలల మీద బంగారు కిరీటాల లాంటివి ఉన్నాయి. వాటి ముఖాలు మనుషుల ముఖాల్లా ఉన్నాయి.
8 కానీ వాటి వెంట్రుకలు స్త్రీల తలవెంట్రుకల్లా ఉన్నాయి. వాటి పళ్లు సింహపు కోరల్లా ఉన్నాయి.+
9 వాటికి ఇనుప కవచాల* లాంటి ఛాతి కవచాలు ఉన్నాయి. వాటి రెక్కల శబ్దం యుద్ధానికి పరుగులు తీస్తున్న గుర్రపురథాల శబ్దంలా ఉంది.+
10 అంతేకాదు, వాటికి తోకలు ఉన్నాయి. ఆ తోకలకు తేలు కొండి లాంటి కొండ్లు ఉన్నాయి. ఐదు నెలలపాటు ప్రజల్ని బాధించే శక్తి వాటి తోకల్లోనే ఉంది.+
11 అగాధపు దూత+ వాటికి రాజు. హీబ్రూ భాషలో ఆయన పేరు అబద్దోను.* అయితే, గ్రీకు భాషలో ఆయన పేరు అపొల్లుయోను.*
12 ఒక కష్టం పోయింది. ఇదిగో! ఇంకో రెండు కష్టాలు+ వస్తున్నాయి.
13 ఆరో దేవదూత+ తన బాకా ఊదాడు.+ అప్పుడు, దేవుని ముందున్న బంగారు బలిపీఠం+ కొమ్ముల నుండి ఒక స్వరం నాకు వినిపించింది.
14 బాకా పట్టుకొని ఉన్న ఆరో దూతతో ఆ స్వరం ఇలా చెప్పింది: “యూఫ్రటీసు మహానది+ దగ్గర బంధించబడివున్న నలుగురు దేవదూతల్ని విడిపించు.”
15 అప్పుడు ఆ గంట కోసం, ఆ రోజు కోసం, ఆ నెల కోసం, ఆ సంవత్సరం కోసం సిద్ధం చేయబడిన ఆ నలుగురు దేవదూతలు విడిపించబడ్డారు. ప్రజల్లో మూడోభాగాన్ని చంపడానికి వాళ్లు అలా విడిపించబడ్డారు.
16 గుర్రపు దండ్లలోని రౌతుల సంఖ్య 20 కోట్లు అని నేను విన్నాను.
17 దర్శనంలోని గుర్రాలు, వాటిమీద కూర్చున్న రౌతులు నాకు ఇలా కనిపించారు: వాళ్లకు నిప్పు లాంటి ఎర్రని రంగులో, ముదురు నీలం రంగులో, పసుపుపచ్చ రంగులో ఉన్న ఛాతి కవచాలు ఉన్నాయి. ఆ గుర్రాల తలలు సింహాల తలల్లా ఉన్నాయి.+ వాటి నోళ్లలో నుండి అగ్ని, పొగ, గంధకం బయటికి వచ్చాయి.
18 ఈ మూడు తెగుళ్ల వల్ల, అంటే వాటి నోళ్లలో నుండి బయటికి వచ్చిన అగ్ని వల్ల, పొగ వల్ల, గంధకం వల్ల ప్రజల్లో మూడోభాగం చంపబడ్డారు.
19 ఎందుకంటే ఆ గుర్రాల శక్తి వాటి నోళ్లలో, వాటి తోకల్లో ఉంది. వాటి తోకలు పాముల్లా ఉన్నాయి, వాటికి తలలు ఉన్నాయి. ఆ తోకలతో అవి హాని చేస్తాయి.
20 అయితే ఈ తెగుళ్ల వల్ల చనిపోని మిగతా ప్రజలు తమ చేతులతో చేసిన పనుల విషయంలో పశ్చాత్తాపపడలేదు. వాళ్లు చెడ్డదూతల్ని,* విగ్రహాల్ని పూజించడం మానలేదు. బంగారంతో, వెండితో, రాగితో, రాయితో, చెక్కతో చేసిన ఆ విగ్రహాలు చూడలేవు, వినలేవు, నడవలేవు.+
21 అంతేకాదు, ఆ ప్రజలు తాము చేసిన హత్యల విషయంలో గానీ, మంత్రతంత్రాల విషయంలో గానీ, లైంగిక పాపం* విషయంలో గానీ, దొంగతనాల విషయంలో గానీ పశ్చాత్తాపపడలేదు.