యోహానుకు ఇచ్చిన ప్రకటన 13:1-18
13 అది* సముద్రపు ఇసుక మీద కదలకుండా నిలబడింది.
అప్పుడు పది కొమ్ములు, ఏడు తలలు ఉన్న ఒక క్రూరమృగం సముద్రంలో+ నుండి పైకి రావడం నేను చూశాను. దాని కొమ్ముల మీద పది కిరీటాలు ఉన్నాయి. దాని తలల మీద దేవుణ్ణి దూషించే పేర్లు ఉన్నాయి.
2 నేను చూసిన ఆ క్రూరమృగం చిరుతపులిలా ఉంది. దాని పాదాలు మాత్రం ఎలుగుబంటి పాదాల్లా ఉన్నాయి. దాని నోరు సింహం నోరులా ఉంది. ఆ క్రూరమృగం తన శక్తిని, సింహాసనాన్ని, గొప్ప అధికారాన్ని ఆ మహాసర్పం+ నుండి పొందింది.+
3 దాని తలల్లో ఒకదానికి చావుదెబ్బ తగిలి ఉండడం నేను చూశాను, కానీ ఆ దెబ్బ మానిపోయింది.+ దాంతో భూమ్మీదున్న ప్రజలందరూ ఆశ్చర్యపోయి ఆ క్రూరమృగాన్ని పొగుడుతూ దాన్ని అనుసరించారు.
4 అంతేకాదు, క్రూరమృగానికి అధికారం ఇచ్చినందుకు వాళ్లు ఆ మహాసర్పాన్ని పూజించారు. అలాగే వాళ్లు ఆ క్రూరమృగాన్ని కూడా పూజిస్తూ, “ఈ క్రూరమృగానికి సాటి ఎవరు? దీనితో ఎవరు యుద్ధం చేయగలరు?” అన్నారు.
5 గర్వపు మాటలు, దేవుణ్ణి దూషించే మాటలు మాట్లాడేలా దానికి ఒక నోరు ఇవ్వబడింది. అలాగే 42 నెలలపాటు+ తనకు నచ్చినట్టు చేసే అధికారం కూడా దానికి ఇవ్వబడింది.
6 అది దేవుణ్ణి దూషించడానికి+ అంటే ఆయన పేరును, ఆయన నివాస స్థలాన్ని, చివరికి పరలోకంలో నివసించేవాళ్లను+ కూడా దూషించడానికి తన నోరు తెరిచింది.
7 పవిత్రులతో యుద్ధం చేసి, వాళ్లను జయించేందుకు ఆ క్రూరమృగానికి అనుమతి ఇవ్వబడింది.+ అంతేకాదు ప్రతీ తెగ, జాతి, భాష, దేశం మీద దానికి అధికారం ఇవ్వబడింది.
8 భూమ్మీద నివసించే వాళ్లందరూ దాన్ని పూజిస్తారు. ప్రపంచం పుట్టిన* దగ్గర నుండి వాళ్లలో ఏ ఒక్కరి పేరూ జీవగ్రంథంలో రాయబడలేదు.+ ఆ గ్రంథం వధించబడిన గొర్రెపిల్లది.+
9 ఎవరికైనా చెవులు ఉంటే, వాళ్లు వినాలి.
10 ఎవరైనా చెరలోకి వెళ్లాల్సి ఉంటే అతను చెరలోకి వెళ్తాడు. ఎవరైనా ఖడ్గంతో చంపితే,* అతను ఖడ్గంతో చంపబడాలి.+ అందుకే పవిత్రులకు+ సహనం,+ విశ్వాసం+ అవసరం.
11 తర్వాత ఇంకో క్రూరమృగం భూమిలో నుండి పైకి రావడం చూశాను. దానికి గొర్రెపిల్ల కొమ్ముల లాంటి రెండు కొమ్ములు ఉన్నాయి. అయితే అది ఒక మహాసర్పంలా మాట్లాడడం మొదలుపెట్టింది.
12 అది మొదటి క్రూరమృగం+ అధికారమంతటినీ దాని ముందే చెలాయిస్తోంది; భూమి, దానిలో నివసించేవాళ్లు చావుదెబ్బ తగిలి బాగుపడిన మొదటి క్రూరమృగాన్ని పూజించేలా అది చేస్తోంది.
13 అది గొప్ప ఆశ్చర్యకార్యాలు చేస్తోంది. మనుషులు చూస్తుండగా, ఆకాశం నుండి భూమ్మీదికి అగ్ని దిగివచ్చేలా కూడా చేస్తోంది.
14 మొదటి క్రూరమృగం ముందు ఏ ఆశ్చర్యకార్యాలు చేయడానికి అది అనుమతి పొందిందో వాటితో అది భూమ్మీద నివసించేవాళ్లను మోసం చేస్తోంది. అదే సమయంలో, కత్తి దెబ్బ తిని కోలుకున్న+ మొదటి క్రూరమృగపు ప్రతిమను+ చేయమని అది భూమ్మీద నివసించేవాళ్లకు చెప్తోంది.
15 అంతేకాదు, ఆ మొదటి క్రూరమృగపు ప్రతిమకు ఊపిరి* పోసేందుకు ఈ రెండో క్రూరమృగానికి అనుమతి ఇవ్వబడింది. ఆ క్రూరమృగపు ప్రతిమ మాట్లాడేలా, దాన్ని పూజించని వాళ్లందర్నీ చంపించేలా దానికి ఆ అనుమతి ఇవ్వబడింది.
16 సామాన్యులు-గొప్పవాళ్లు, ధనవంతులు-పేదవాళ్లు, స్వతంత్రులు-దాసులు అందరూ తమ కుడిచేతి మీద గానీ నొసటి మీద గానీ గుర్తు వేయించుకోవాలని+ అది ప్రజలందర్నీ బలవంతం చేస్తోంది.
17 ఎవరికైనా ఆ గుర్తు లేకపోతే, అంటే ఆ క్రూరమృగం పేరుగానీ+ దాని పేరుకు సంబంధించిన సంఖ్యగానీ+ లేకపోతే వాళ్లు కొనలేరు, అమ్మలేరు.
18 లోతైన అవగాహన ఉన్న వ్యక్తి క్రూరమృగం సంఖ్యను లెక్కించాలి. అది ఒక మనిషి సంఖ్య,* ఆ సంఖ్య 666.+ తెలివి ఉన్నవాళ్లు మాత్రమే దీన్ని అర్థం చేసుకుంటారు.
అధస్సూచీలు
^ అంటే, మహాసర్పం.
^ అక్ష., “(విత్తనం) పడిన,” అంటే ఆదాముహవ్వలకు పిల్లలు పుట్టిన.
^ లేదా “ఎవరైనా ఖడ్గంతో చంపబడాల్సి ఉంటే” అయ్యుంటుంది.
^ పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.
^ లేదా “మానవ సంఖ్య.”