న్యాయాధిపతులు 9:1-57

  • అబీమెలెకు షెకెములో రాజవ్వడం (1-6)

  • యోతాము చెప్పిన ఉదాహరణ (7-21)

  • అబీమెలెకు హింసాత్మక పాలన (22-33)

  • అబీమెలెకు షెకెము మీద దాడి చేయడం (34-49)

  • అబీమెలెకును ఒక స్త్రీ గాయపర్చడం, అతను చనిపోవడం (50-57)

9  కొంతకాలం తర్వాత, యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు+ షెకెములోని తన తల్లి సహోదరుల దగ్గరికి వెళ్లి, వాళ్లతో అలాగే తన తాత ఇంటివాళ్లందరితో ఇలా అన్నాడు:  “షెకెము నాయకులందర్నీ* దయచేసి ఇలా అడగండి, ‘మీకు ఏది మంచిది? యెరుబ్బయలు 70 మంది కుమారులందరూ+ మిమ్మల్ని పరిపాలించడమా? లేదా ఒక్క మనిషి మిమ్మల్ని పరిపాలించడమా? నేను మీ రక్తసంబంధినని* గుర్తుపెట్టుకోండి.’ ”  అతని తల్లి సహోదరులు అతని తరఫున షెకెము నాయకులందరితో ఆ మాట చెప్పారు. దాంతో వాళ్లు* అబీమెలెకును అనుసరించడానికి మొగ్గు చూపారు; “అతను మన సొంత సహోదరుడే కదా” అని వాళ్లు అన్నారు.  అప్పుడు వాళ్లు బయల్బెరీతు+ గుడిలో నుండి 70 వెండి రూకలు అతనికి ఇచ్చారు. అబీమెలెకు ఆ డబ్బుతో పనీపాటాలేని కొంతమంది పొగరు​బోతు మనుషుల్ని తన వెంట ఉండడానికి కూలికి పెట్టుకున్నాడు.  తర్వాత అతను ఒఫ్రాలోని+ తన తండ్రి ఇంటికి వెళ్లి తన సహోద​రుల్ని, అంటే యెరుబ్బయలు 70 మంది కుమారుల్ని ఒకే రాయి మీద చంపాడు.+ యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము దాక్కున్నాడు కాబట్టి, అతను ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు.  అప్పుడు షెకెము నాయకులందరూ, బేత్‌మిల్లో వాళ్లందరూ ఒకచోట సమావేశమై, షెకెములోని పెద్ద చెట్టు దగ్గరున్న స్తంభం పక్కన అబీమె​లెకును రాజును చేశారు.+  యోతాముకు ఆ విషయం తెలిసినప్పుడు, అతను వెంటనే వెళ్లి గెరిజీము పర్వత+ శిఖరం మీద నిలబడి, బిగ్గరగా వాళ్లతో ఇలా అన్నాడు: “షెకెము నాయకులారా, నేను చెప్పేది వినండి, అప్పుడు దేవుడు మీరు చెప్పేది వింటాడు.  “ఒకసారి చెట్లు, తమ మీద ఒక రాజుని అభిషేకించడానికి బయల్దేరాయి. అవి ఒలీవ చెట్టును, ‘మమ్మల్ని పరిపాలించు’ అని అడిగాయి.+  కానీ ఒలీవ చెట్టు వాటితో, ‘దేవుణ్ణి, మనుషుల్ని ఘనపర్చే నా నూనెను ఇవ్వడం మానేసి, నేను వెళ్లి మిగతా చెట్లను పరిపాలించాలా?’* అంది. 10  తర్వాత అవి అంజూర చెట్టుతో, ‘వచ్చి మమ్మల్ని పరిపాలించు’ అన్నాయి. 11  కానీ అంజూర చెట్టు వాటితో, ‘నా తియ్యదనాన్ని, నా మంచి పళ్లను ఇవ్వడం మానేసి, నేను వెళ్లి మిగతా చెట్లను పరిపాలించాలా?’* అని అంది. 12  తర్వాత అవి ద్రాక్ష​చెట్టుతో, ‘వచ్చి మమ్మల్ని పరిపాలించు’ అన్నాయి. 13  ద్రాక్షచెట్టు వాటితో, ‘దేవుణ్ణి, మనుషుల్ని సంతోషపెట్టే నా కొత్త ద్రాక్షారసాన్ని ఇవ్వడం మానేసి, నేను వెళ్లి మిగతా చెట్లను పరిపాలించాలా?’* అంది. 14  చివరిగా చెట్లన్నీ ముళ్లచెట్టుతో, ‘వచ్చి మమ్మల్ని పరిపాలించు’ అన్నాయి.+ 15  అందుకు ముళ్లచెట్టు వాటితో, ‘మీరు నిజంగా నన్ను రాజుగా అభిషేకించాలని అనుకుంటే, వచ్చి నా నీడలో ఆశ్రయం పొందండి. లేకపోతే, నాలో నుండి అగ్ని బయల్దేరి లెబానోనులోని దేవదారు చెట్లను కాల్చేస్తుంది’ అంది. 16  “మీరు ఇప్పుడు అబీమెలెకును రాజుగా చేసి+ నిజాయితీగా, గౌరవంగా ప్రవర్తించారా? మీరు యెరుబ్బయలు మీద, అతని ఇంటివాళ్ల మీద మంచితనం చూపించారా? మీరు అతనికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారా? 17  నా తండ్రి మీ కోసం పోరాడినప్పుడు,+ మిద్యాను చేతిలో నుండి మిమ్మల్ని రక్షించడానికి తన ప్రాణాలకు తెగించాడు.+ 18  కానీ ఈ రోజు మీరు నా తండ్రి ఇంటివాళ్లకు వ్యతిరేకంగా లేచి, ఒకే రాయి మీద అతని 70 మంది కుమారుల్ని చంపారు.+ తర్వాత మీరు అతని దాసి కుమారుడైన అబీమెలెకును+ షెకెము నాయకుల మీద రాజును చేశారు, అతను మీ సహోదరుడనే ఒకే ఒక్క కారణంతో మీరలా చేశారు. 19  మీరు ఈ రోజు యెరుబ్బయలుతో, అతని ఇంటివాళ్లతో నిజాయితీగా, ​గౌరవంగా ప్రవర్తిస్తుంటే, మీరు అబీమెలెకు విషయంలో సంతోషించాలి; అబీమెలెకు కూడా మీ విషయంలో సంతోషించాలి. 20  లేకపోతే, అబీమెలెకు నుండి అగ్ని వచ్చి షెకెము, ​బేత్‌మిల్లో నాయకుల్ని కాల్చేయాలి;+ అలాగే షెకెము, ​బేత్‌మిల్లో నాయకుల నుండి అగ్ని వచ్చి అబీమెలెకును కాల్చేయాలి.”+ 21  తర్వాత యోతాము+ పారిపోయి బెయేరుకు వెళ్లాడు, అతను తన సహోదరుడైన అబీమెలెకుకు భయపడి అక్కడ నివసించాడు. 22  అబీమెలెకు ఇశ్రాయేలు మీద మూడు సంవత్సరాలు పరిపాలించాడు. 23  అప్పుడు దేవుడు అబీమెలెకుకు, షెకెము నాయకులకు మధ్య శత్రుత్వం కలిగేలా చేశాడు, వాళ్లు అబీమెలెకుతో మోసపూరితంగా ​ప్రవర్తించారు. 24  యెరుబ్బయలు 70 మంది కుమారుల్ని క్రూరంగా హత్య చేసినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి అలా జరిగింది; వాళ్లను చంపినందుకు వాళ్ల రక్తం విషయంలో వాళ్ల సహోదరు​డైన అబీమెలెకును, అలాగే తన సహో​దరుల్ని చంపడానికి అబీమెలెకుకు సహాయం చేసినందుకు షెకెము నాయకుల్ని బాధ్యుల్ని చేయడానికి దేవుడు అలా చేశాడు.+ 25  షెకెము నాయకులు అబీమెలెకు కోసం మాటు వేయడానికి కొండల శిఖరాల మీద కొంతమందిని ఉంచారు, వాళ్లు దారినపోయే ప్రతీ ఒక్కర్ని దోచుకునేవాళ్లు. కొంతకాలానికి ఈ విషయం అబీమెలెకుకు తెలిసింది. 26  తర్వాత ఎబెదు కుమారుడైన గాలు, అతని సహోదరులు షెకెములోకి+ వచ్చారు; షెకెము నాయకులు అతనిమీద నమ్మకం ఉంచారు. 27  షెకెము ప్రజలు పొలంలోకి వెళ్లి తమ ద్రాక్షతోటల్లోని ద్రాక్షల్ని పోగుచేసి, వాటిని తొక్కి ఒక పండుగ చేసుకున్నారు; తర్వాత తమ దేవుడి+ గుడిలోకి వెళ్లి తిని, తాగి అబీమెలెకును తిట్టారు. 28  అప్పుడు ఎబెదు కుమారుడైన గాలు ఇలా అన్నాడు: “మనం అతనికి సేవ చేయడానికి అబీమెలెకు ఎవడు? షెకెము* ఎవడు? అబీమెలెకు యెరుబ్బయలు+ కుమారుడే కదా? జెబులు అతని అధికారే కదా? షెకెము తండ్రైన హమోరు కుమారులకు సేవ చేయండి! అబీమె​లెకుకు మనం ఎందుకు సేవ చేయాలి? 29  ఈ ప్రజలే గనుక నా అధికారం కింద ఉంటే, నేను ​అబీమెలెకును పడగొడతాను.” తర్వాత అతను అబీమెలెకుతో, “నీ సైన్యాన్ని పెంచుకుని నాతో యుద్ధానికి రా” అన్నాడు. 30  ఎబెదు కుమారుడైన గాలు అన్న మాటల్ని ఆ నగర అధిపతైన జెబులు విన్నప్పుడు కోపంతో మండిపడ్డాడు. 31  అతను సందేశకుల ద్వారా రహస్యంగా* అబీమెలెకుకు ఈ వార్త పంపించాడు: “చూడు! ఎబెదు కుమారుడైన గాలు, అతని సహోదరులు ఇప్పుడు షెకెములో ఉన్నారు, వాళ్లు ఇక్కడ నగర ప్రజల్ని నీకు వ్యతిరేకంగా ఉసిగొల్పుతున్నారు. 32  కాబట్టి నువ్వు, నీ మనుషులు రాత్రిపూట వచ్చి పొలంలో కాపు కాయండి. 33  పొద్దున సూర్యుడు ఉదయించగానే నువ్వు త్వరగా లేచి నగరం మీద దాడి చేయాలి; గాలు, అతని మనుషులు నీ మీదికి వచ్చినప్పుడు, అతన్ని ఓడించడానికి ఏం చేయ​గలవో చేయి.” 34  కాబట్టి అబీమెలెకు, అతనితో ఉన్న ప్రజలందరూ రాత్రిపూట లేచి, నాలుగు గుంపులుగా ఏర్పడి షెకెము బయట కాపు కాశారు. 35  ఎబెదు కుమారుడైన గాలు బయటికి వెళ్లి నగర ద్వారం దగ్గర నిలబడి ఉన్నప్పుడు అబీమెలెకు, అతనితో ఉన్న ప్రజలు మాటేసివున్న చోటు నుండి లేచారు. 36  ప్రజలు రావడం చూసిన గాలు జెబులుతో, “చూడు! అక్కడ కొండల శిఖరాల మీద నుండి ప్రజలు కిందికి వస్తున్నారు” అన్నాడు. కానీ జెబులు అతనితో, “కొండల నీడలు నీకు మనుషుల్లా కనిపిస్తున్నాయి” అన్నాడు. 37  తర్వాత గాలు, “చూడు! దేశం మధ్యలో నుండి మనుషులు దిగి వస్తున్నారు, ఒక గుంపువాళ్లు మోననీములోని పెద్ద చెట్టు ఉన్న దారిలో వస్తున్నారు” అన్నాడు. 38  జెబులు అతనితో, “‘మనం అబీమెలెకుకు సేవ చేయడానికి అతను ఎవడు?’ అన్న నీ ప్రగల్భాలు ఏమైపోయాయి?+ నువ్వు తిరస్కరించింది వీళ్లనే కదా? వెళ్లు, వాళ్లతో యుద్ధం చేయి” అన్నాడు. 39  అప్పుడు గాలు, షెకెము నాయకులకు ముందు వెళ్లి అబీమెలెకుతో యుద్ధం చేశాడు. 40  అబీమెలెకు గాలును తరిమాడు, అతను అబీమెలెకు ఎదుట నుండి పారిపోయాడు; నగర ద్వారం దాకా చాలామంది ప్రజలు చచ్చిపడివున్నారు. 41  అబీమెలెకు అరూమాలో నివసించాడు; జెబులు+ గాలును, అతని సహోదరుల్ని షెకెము నుండి వెళ్లగొట్టాడు. 42  తర్వాతి రోజు ప్రజలు నగరం నుండి బయటికి రావడం మొదలుపెట్టారు, ఆ విషయం అబీమెలెకుకు ​తెలిసింది. 43  దాంతో అతను మనుషుల్ని తీసుకెళ్లి వాళ్లను మూడు గుంపులుగా చేసి నగరం బయట మాటువేశాడు. ప్రజలు నగరం నుండి బయ​టికి రావడం చూసినప్పుడు అతను వాళ్లమీద దాడిచేసి వాళ్లను చంపేశాడు. 44  అబీమెలెకు, ​అతనితో ఉన్న గుంపులు దాడిచేస్తూ ముందుకు వెళ్లి నగర ద్వారం దగ్గర నిలబడ్డారు, అదే ​సమయంలో రెండు గుంపులవాళ్లు నగరం బయట ఉన్న ​వాళ్లందరి మీద దాడిచేసి వాళ్లను చంపేశారు. 45  అబీమెలెకు ఆ రోజంతా నగరం మీద యుద్ధం చేసి, దాన్ని ఆక్రమించుకున్నాడు. అతను దానిలోని ప్రజల్ని చంపేశాడు; తర్వాత ఆ నగరాన్ని పడగొట్టి+ ఆ స్థలం మీద ఉప్పు చల్లాడు. 46  షెకెము బురుజులో నివసించే నాయకులందరూ ఈ విషయం గురించి విన్నప్పుడు వాళ్లు వెంటనే ఏల్‌బెరీతు+ గుడి లోపలి గదిలోకి వెళ్లి దాక్కున్నారు. 47  షెకెము బురుజులో నివసించే నాయకులందరూ ఒకచోట చేరారని అబీ​మెలెకుకు తెలిసిన వెంటనే 48  అతను, అతనితోపాటు ఉన్న వాళ్లందరూ సల్మోను కొండ ఎక్కారు. అబీమెలెకు గొడ్డలిని చేతితో పట్టుకుని ఒక చెట్టు కొమ్మను నరికి, ఎత్తి భుజం మీద ​పెట్టుకుని తనతో ఉన్నవాళ్లతో ఇలా అన్నాడు: “నేను ఏం చేయడం మీరు చూశారో, మీరూ త్వరగా అలాగే చేయండి!” 49  కాబట్టి ప్రజలందరు కూడా కొమ్మల్ని నరికి అబీమెలెకు వెంట వెళ్లారు. వాళ్లు ఆ కొమ్మల్ని ఆ లోపలి గది చుట్టూ పెట్టి దానికి నిప్పు అంటించారు. దాంతో షెకెము బురుజులో నివసించే వాళ్లందరూ, అంటే దాదాపు 1,000 మంది స్త్రీపురుషులు చనిపోయారు. 50  తర్వాత అబీమెలెకు తేబేసుకు వెళ్లి, దాన్ని ముట్టడించి, ఆక్రమించుకున్నాడు. 51  ఆ నగరం మధ్యలో బలమైన ఒక గోపురం ఉంది; స్త్రీపురుషులందరూ, నగర నాయకులందరూ అందులోకి పారిపోయారు. వాళ్లు తలుపులు మూసుకుని, ఆ గోపురం పైకప్పు మీదికి ఎక్కారు. 52  అబీమెలెకు ఆ గోపురం దగ్గరికి వెళ్లి దానిమీద దాడి చేశాడు. అతను ఆ గోపురానికి నిప్పు అంటించడానికి దాని ద్వారం దగ్గరికి వెళ్లాడు. 53  అప్పుడు ఒక స్త్రీ అబీమెలెకు తలమీద ఒక తిరుగలి రాయి పడేసింది, దాంతో అతని తల* పగిలింది.+ 54  అతను వెంటనే తన ఆయుధాలు మోసే సేవకుణ్ణి పిలిచి, “నేను ఒక స్త్రీ చేతిలో చనిపోయానని వాళ్లు నా గురించి చెప్పుకోకుండా నీ కత్తి దూసి నన్ను చంపు” అన్నాడు. దాంతో ఆ సేవకుడు అబీమెలెకును పొడవడంతో అతను చనిపోయాడు. 55  అబీమెలెకు చనిపోవడం చూసినప్పుడు ఇశ్రాయేలీయులందరూ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. 56  అబీమెలెకు తన 70 మంది సహోదరుల్ని చంపి తన తండ్రికి కీడు చేసినందుకు దేవుడు ఆ విధంగా అతని మీద ప్రతీకారం తీర్చుకున్నాడు.+ 57  అలాగే, షెకెమువాళ్లు చేసిన కీడంతా వాళ్ల తలల మీదికే వచ్చేలా దేవుడు చేశాడు. అలా యెరుబ్బయలు+ ​కుమారుడైన యోతాము శాపం+ వాళ్ల మీదికి వచ్చింది.

అధస్సూచీలు

లేదా “జమీందారులందర్నీ” అయ్యుంటుంది.
అక్ష., “ఎముకనూ మాంసాన్నని.”
అక్ష., “వాళ్ల హృదయాలు.”
అక్ష., “చెట్ల మీద ఊగాలా?”
అక్ష., “చెట్ల మీద ఊగాలా?”
అక్ష., “చెట్ల మీద ఊగాలా?”
బహుశా షెకెము అధికారైన జెబులును సూచిస్తుండవచ్చు.
లేదా “కుయుక్తితో.”
లేదా “కపాలం.”