న్యాయాధిపతులు 3:1-31

  • యెహోవా ఇశ్రాయేలీయుల్ని పరీక్షించాడు (1-6)

  • ఒత్నీయేలు మొదటి న్యాయాధిపతి (7-11)

  • న్యాయాధిపతి ఏహూదు లావుగా ఉండే ఎగ్లోను రాజును చంపడం (12-30)

  • న్యాయాధిపతి షమ్గరు (31)

3  కనానుతో యుద్ధం చేయని ఇశ్రాయేలీయులందర్నీ పరీక్షించడానికి యెహోవా ఉండనిచ్చిన దేశాలవాళ్లు వీళ్లే+  (అంతకు​ముందు యుద్ధం చూడని ఇశ్రాయేలు తరాలవాళ్లు అనుభవం సంపాదించుకుని, యుద్ధం చేసేలా శిక్షణ పొందడానికే ఆయన వాళ్లను ​ఉండనిచ్చాడు):  ఫిలిష్తీయుల ఐదుగురు పాలకులు, కనానీయులందరూ, సీదోనీయులు,+ బయల్హెర్మోను పర్వతం నుండి లెబో-హమాతు*+ వరకు లెబానోను పర్వత ప్రాంతంలో+ నివసి​స్తున్న హివ్వీయులు.  యెహోవా మోషే ద్వారా వాళ్ల తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞల్ని ఇశ్రాయేలీయులు పాటిస్తారో లేదో వాళ్లను పరీక్షించి తెలుసుకోవడానికి ఆ దేశాలు ఉపయోగపడ్డాయి.+  కాబట్టి ఇశ్రాయేలీయులు కనానీయుల, హిత్తీయుల, అమోరీయుల, పెరిజ్జీయుల, హివ్వీయుల, యెబూసీయుల మధ్య నివసించారు.+  ఇశ్రాయేలీయులు వాళ్ల కూతుళ్లను పెళ్లిచేసుకున్నారు, తమ కూతుళ్లను వాళ్ల కుమారులకు ఇచ్చారు; వాళ్ల దేవుళ్లను ​సేవించడం మొదలుపెట్టారు.+  అలా ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించారు; వాళ్లు తమ దేవుడైన యెహోవాను మర్చిపోయి బయలు దేవుళ్లను, పూజా కర్రల్ని*+ సేవిస్తూ వచ్చారు.+  దాంతో యెహోవా కోపం ఇశ్రాయేలీయుల మీద రగులుకుంది, ఆయన వాళ్లను మెసొపొతమియ* రాజైన కూషన్‌-రిషాతాయిము చేతికి అప్పగించాడు.* ఇశ్రాయేలీయులు ఎనిమిది సంవత్సరాలు కూషన్‌-రిషాతాయిముకు సేవ చేశారు.  ఇశ్రాయేలీయులు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టినప్పుడు,+ యెహోవా వాళ్లను రక్షించడానికి ఒత్నీయేలును+ రక్షకుడిగా ఇచ్చాడు;+ అతను కాలేబు తమ్ముడైన కనజు కుమారుడు. 10  యెహోవా పవిత్రశక్తి అతని మీదికి వచ్చింది,+ అతను ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయ్యాడు. అతను యుద్ధానికి వెళ్లినప్పుడు యెహోవా అతని చేతికి మెసొపొతమియ* రాజైన కూషన్‌-రిషాతాయిమును అప్పగించాడు, అతను కూషన్‌-రిషాతాయిమును ఓడించాడు. 11  ఆ తర్వాత దేశం 40 సంవత్సరాల పాటు ప్రశాంతంగా ఉంది. తర్వాత కనజు కుమారుడైన ఒత్నీయేలు చనిపోయాడు. 12  ఇశ్రాయేలీయులు మళ్లీ యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించడం మొదలుపెట్టారు.+ కాబట్టి మోయాబు+ రాజైన ఎగ్లోను ఇశ్రాయేలీయుల కన్నా బలంగా తయార​య్యేలా యెహోవా అనుమతించాడు, ఎందుకంటే వాళ్లు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించారు. 13  అంతేకాదు, ఆయన వాళ్ల మీదికి అమ్మోనీయుల్ని,+ అమాలేకీయుల్ని+ రప్పించాడు. వాళ్లు ఇశ్రాయేలు మీద దాడిచేసి ఖర్జూర చెట్ల నగరాన్ని+ స్వాధీనం చేసుకు​న్నారు. 14  ఇశ్రాయేలీయులు 18 సంవత్సరాల పాటు మోయాబు రాజైన ఎగ్లోనుకు సేవ చేశారు.+ 15  అప్పుడు ఇశ్రాయేలీయులు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు.+ కాబట్టి యెహోవా బెన్యామీనీయుడూ+ గెరా కుమారుడూ అయిన ఏహూదును+ రక్షకునిగా ఇచ్చాడు.+ అతను ఎడమచేతి వాటం గలవాడు.+ కొంతకాలం తర్వాత ఇశ్రాయేలీయులు అతని ద్వారా మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పం ​పంపించారు. 16  ఈలోగా ఏహూదు రెండువైపులా పదునున్న ఒక మూర* పొడవు కత్తిని తయారుచేసుకున్నాడు, అతను దాన్ని తన బట్టల లోపల తన కుడికాలి తొడకు కట్టుకున్నాడు. 17  తర్వాత, అతను మోయాబు రాజైన ఎగ్లోను దగ్గరికి వెళ్లి కప్పం ఇచ్చాడు. ఎగ్లోను చాలా లావుగా ఉంటాడు. 18  ఏహూదు కప్పం ఇచ్చిన తర్వాత దాన్ని మోసుకొచ్చిన మనుషులతోపాటు వెళ్లిపోయాడు. 19  అయితే వాళ్లు గిల్గాలులోని+ చెక్కుడు విగ్రహాల* దగ్గరికి చేరుకున్నాక, ఏహూదు ఒక్కడే వెనక్కి వచ్చి, “రాజా, నీకో రహస్యం చెప్పాలి” అన్నాడు. అప్పుడు రాజు, “నిశ్శబ్దం!” అన్నాడు. దాంతో అతని సేవకులందరూ బయటికి వెళ్లిపోయారు. 20  రాజు చల్లని తన మేడగదిలో ఒంటరిగా కూర్చొని ఉన్నాడు, అప్పుడు ఏహూదు అతని ​దగ్గరికి వచ్చి, “నేను దేవుని దగ్గర నుండి నీకో సందేశం తీసుకొచ్చాను” అన్నాడు. దాంతో అతను తన సింహాసనం* మీద నుండి లేచి నిలబడ్డాడు. 21  అప్పుడు ఏహూదు తన ఎడమచేతితో కుడికాలి తొడకు ఉన్న కత్తిని తీసి ఆ రాజు కడుపులో పొడిచాడు. 22  కత్తితోపాటు పిడి కూడా లోపలికి దిగిపోయింది, ఏహూదు కత్తిని అతని కడుపులో నుండి బయటికి తీయలేదు, దాంతో కొవ్వు కత్తిని కప్పేసింది; అంతేకాక మలం కూడా బయటికి వచ్చింది. 23  ఏహూదు తలుపుల్ని మూసి వాటికి తాళం వేసి వరండా* గుండా బయటికి వెళ్లిపోయాడు. 24  అతను వెళ్లిపోయిన తర్వాత రాజు సేవకులు తిరిగొచ్చి మేడగదికి తాళం వేసివుండడం చూశారు. వాళ్లు, “అతను చల్లని మేడగదిలో కాలకృత్యాలు తీర్చుకుంటున్నాడేమో”* అని అనుకున్నారు. 25  ఎంతసేపు ఎదురుచూసినా రాజు తలుపులు తీయకపోయే సరికి వాళ్లు కంగారుపడ్డారు; వాళ్లు తాళంచెవితో తలుపులు తీసి చూసినప్పుడు, వాళ్ల ప్రభువు చనిపోయి నేలమీద పడివున్నాడు! 26  వాళ్లు తచ్చాడుతుండగా ఏహూదు పారిపోయాడు, అతను చెక్కుడు విగ్రహాల్ని*+ దాటి క్షేమంగా శెయీరాకు చేరుకున్నాడు. 27  అతను వచ్చి, ఎఫ్రాయిము పర్వత ప్రాంతంలో+ బూర* ఊదాడు;+ అప్పుడు ఇశ్రాయేలీయులు అతనితోపాటు పర్వత ప్రాంతం నుండి కిందికి వచ్చారు, ఏహూదు వాళ్ల ముందు నడిచాడు. 28  అప్పుడు ఏహూదు వాళ్లతో, “మీ శత్రువులైన మోయాబీయుల్ని యెహోవా మీ చేతికి అప్పగించాడు కాబట్టి నా వెంట రండి” అన్నాడు. దాంతో వాళ్లు అతని వెంట వెళ్లి, మోయాబీయులు తప్పించుకునే అవకాశం లేకుండా యొర్దాను రేవుల్ని* స్వాధీనం చేసుకున్నారు. వాళ్లు ఎవ్వర్నీ ఆ రేవుల్ని దాటనివ్వలేదు. 29  ఆ సమయంలో వాళ్లు దాదాపు 10,000 మంది మోయాబీయుల్ని చంపారు.+ వాళ్లందరూ బలవంతులు, శూరులు; వాళ్లలో ఒక్కరు కూడా తప్పించుకోలేదు.+ 30  అలా ఆ రోజు మోయాబు ఇశ్రాయేలు చేతిలో ఓడిపోయింది; తర్వాత దేశం 80 సంవత్సరాల పాటు ప్రశాంతంగా ఉంది.+ 31  ఏహూదు తర్వాత, అనాతు కుమారుడైన షమ్గరు+ ఇశ్రాయేలును రక్షించాడు. అతను పశువుల ముల్లుకర్రతో*+ 600 మంది ఫిలిష్తీయుల్ని చంపాడు.+

అధస్సూచీలు

లేదా “హమాతు ప్రవేశ ద్వారం.”
పదకోశం చూడండి.
అక్ష., “అరామ్నహరాయిము.”
అక్ష., “అమ్మేశాడు.”
అక్ష., “అరాము.”
బహుశా 38 సెంటీమీటర్ల (15 అంగుళాల) పొడవుండే చిన్న మూర కావచ్చు. అనుబంధం B14 చూడండి.
లేదా “రాతిగుట్టల” అయ్యుంటుంది.
లేదా “ఆసనం.”
లేదా “కిటికీ” అయ్యుంటుంది.
అక్ష., “పాదాల్ని కప్పుకుంటున్నాడేమో.”
లేదా “రాతిగుట్టల్ని” అయ్యుంటుంది.
అక్ష., “కొమ్ము.”
అంటే, నదిని నడుస్తూ దాటగలిగేలా లోతు తక్కువ ఉన్న ప్రదేశం.
పదకోశం చూడండి.