న్యాయాధిపతులు 19:1-30

  • గిబియాలో బెన్యామీనీయుల లైంగిక నేరం (1-30)

19  ఇశ్రాయేలీయులకు రాజు లేని ఆ రోజుల్లో,+ ఎఫ్రాయిము పర్వత ప్రాంతంలోని+ మారుమూల ప్రదేశంలో ఒక లేవీయుడు ఉండేవాడు; అతను యూదాలోని బేత్లెహేముకు+ చెందిన ఒక స్త్రీని ఉపపత్నిగా తెచ్చుకున్నాడు.  అయితే ఆమె అతనికి నమ్మకద్రోహం చేసింది; అతన్ని వదిలేసి యూదాలోని బేత్లెహేములో ఉన్న తన తండ్రి ఇంటికి వెళ్లిపోయింది. ఆమె నాలుగు నెలలు అక్కడే ఉంది.  తర్వాత ఆమె భర్త, ఆమెను ఒప్పించి తిరిగి తీసుకురావడానికి ఆమె దగ్గరికి వెళ్లాడు; అతనితోపాటు అతని సేవకుడు ఉన్నాడు, రెండు గాడిదలు ఉన్నాయి. ఆమె తన భర్తను తన తండ్రి ఇంటి లోపలికి తీసుకొచ్చింది, అతన్ని చూసి ఆమె తండ్రి సంతోషించాడు.  ఆ యువతి తండ్రి, అంటే అతని మామ అతన్ని మూడు రోజులు తన దగ్గరే ఉండేలా ఒప్పించాడు; వాళ్లు తింటూ తాగుతూ ఉన్నారు, అతను రాత్రులు అక్కడే గడిపాడు.  నాలుగో రోజు, వాళ్లు బయల్దేరడానికి పొద్దున్నే లేచినప్పుడు అతని మామ అతనితో, “ఏమైనా తిను, నీకు శక్తి వస్తుంది; తర్వాత వెళ్దువుగానీ” అన్నాడు.  కాబట్టి వాళ్లిద్దరూ కూర్చుని కలిసి తిన్నారు, తాగారు. తర్వాత అతని మామ అతనితో, “దయచేసి ఈ రాత్రి ఇక్కడే ఉండి సంతోషంగా గడుపు”* అన్నాడు.  అతను లేచి బయల్దేరబోతుండగా, అతని మామ అతన్ని బ్రతిమాలుతూ ఉన్నాడు. దాంతో అతను ఆ రాత్రి కూడా అక్కడే ఉండిపోయాడు.  ఐదో రోజు, అతను బయల్దేరడానికి పొద్దున్నే లేచినప్పుడు, అతని మామ, “దయచేసి ఏమైనా తిను, నీకు శక్తి వస్తుంది” అన్నాడు. సాయంకాలం వరకు వాళ్లు సమయం వెళ్లబుచ్చారు, వాళ్లిద్దరు భోంచేస్తూ ఉన్నారు.  అతను లేచి తన ఉపపత్నిని, తన సేవకుణ్ణి తీసుకుని వెళ్లబోతుండగా అతని మామ, అంటే ఆ యువతి తండ్రి అతనితో ఇలా అన్నాడు: “చూడు! సాయంత్రం కావస్తోంది. దయచేసి ఈ రాత్రి ఇక్కడే ఉండిపో. కాసేపట్లో చీకటి పడుతుంది. ఈ రాత్రి ఇక్కడే ఉండి సంతోషంగా గడుపు. ఉదయాన్నే లేచి మీ ఇంటికి* బయల్దేరవచ్చు.” 10  కానీ అతను ఇంకో రాత్రి అక్కడ గడపాలనుకోలేదు, కాబట్టి అతను లేచి ప్రయాణించి యెబూసు దాకా, అంటే యెరూషలేము+ దాకా వచ్చాడు. అతనితోపాటు, జీను* వేసిన రెండు గాడిదలు ఉన్నాయి, అలాగే అతని ఉపపత్ని, ​సేవకుడు కూడా ఉన్నారు. 11  వాళ్లు యెబూసుకు దగ్గర్లో ఉన్నప్పుడు వెలుతురు దాదాపు తగ్గిపోయింది. దాంతో అతని సేవకుడు అతన్ని, “మనం ఈ రాత్రి యెబూసీయుల నగరంలోనే ఆగి, ఇక్కడే ఉందామా?” అని అడిగాడు. 12  కానీ అతని యజమాని అతనితో, “మనం ఇశ్రాయేలీయులుకాని వాళ్ల నగరంలో ఆగకూడదు. మనం గిబియా+ దాకా వెళ్దాం” అన్నాడు. 13  తర్వాత అతను తన సేవకుడితో ఇలా అన్నాడు: “పద, మనం గిబియాకు గానీ రామాకు+ గానీ చేరుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ రాత్రి వాటిలో ఒకదానిలో ఉందాం.” 14  కాబట్టి వాళ్లు ప్రయాణం కొన​సాగించారు; వాళ్లు బెన్యామీనుకు చెందిన గిబియాకు దగ్గర్లో ఉన్నప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు. 15  కాబట్టి వాళ్లు అక్కడ ఆగి, ఆ రాత్రి ఉండడానికి గిబియా లోపలికి వెళ్లారు. వాళ్లు లోపలికి వెళ్లి నగర వీధిలో కూర్చున్నారు, కానీ ఆ రాత్రి వాళ్లను తమ ఇంట్లో ఉంచుకోవడానికి ఎవ్వరూ ముందుకురాలేదు.+ 16  చివరికి ఆ సాయంకాలం, ఒక వృద్ధుడు పొలం పని నుండి తిరిగొస్తున్నాడు. అతను ఎఫ్రాయిము పర్వత ప్రాంతానికి+ చెందినవాడు, కొంతకాలంగా గిబియాలో ఉంటున్నాడు. కానీ ఆ నగర నివాసులు మాత్రం బెన్యామీనీయులు.+ 17  ఆ వృద్ధుడు తల ఎత్తి, నగర వీధిలో ఉన్న ఆ ప్రయాణికుణ్ణి చూసినప్పుడు, “నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడి నుండి వచ్చావు?” అని అడిగాడు. 18  అందుకు అతను ఇలా చెప్పాడు: “మేము యూదాలోని బేత్లెహేము నుండి ఎఫ్రాయిము పర్వత ప్రాంతంలోని ఒక మారుమూల ప్రదేశానికి వెళ్తున్నాం, నేను అక్కడివాణ్ణే. నేను యూదాలోని బేత్లెహేముకు+ వెళ్లాను, ఇప్పుడు నేను యెహోవా మందిరానికి వెళ్తున్నాను,* కానీ నన్ను ఎవ్వరూ తమ ఇంట్లోకి ఆహ్వానించట్లేదు. 19  మా దగ్గర గాడిదలకు సరిపడా గడ్డి, మేత ఉన్నాయి;+ అలాగే నాకు, నా భార్యకు, నా సేవకుడికి కావాల్సిన రొట్టె,+ ద్రాక్షారసం ఉన్నాయి. మాకు కావాల్సినవన్నీ మా దగ్గర ఉన్నాయి.” 20  అయితే ఆ వృద్ధుడు, “నువ్వు క్షేమంగా ఉండాలి! నీకేమైనా కావాల్సివస్తే నేను చూసు​కుంటాను. కానీ నగర వీధిలో మాత్రం రాత్రి గడపవద్దు” అన్నాడు. 21  కాబట్టి ఆ వృద్ధుడు అతన్ని తన ఇంట్లోకి తీసుకెళ్లాడు, గాడిదలకు మేత పెట్టాడు. తర్వాత వాళ్లు కాళ్లు కడుక్కొని తిన్నారు, తాగారు. 22  వాళ్లు సంతోషంగా గడుపుతుండగా, ఆ నగరంలోని కొంతమంది పనికిమాలినవాళ్లు ఇంటిని చుట్టుముట్టి తలుపులు బాదడం మొదలుపెట్టారు. వాళ్లు ఆ ఇంటి యజమానియైన వృద్ధునితో, “నీ ఇంటికి వచ్చిన ఆ మనిషిని బయటికి తీసుకురా, మేము అతనితో సంభోగించాలి” అని అంటూ ఉన్నారు.+ 23  అప్పుడు ఆ ఇంటి యజమాని బయటికి వచ్చి వాళ్లతో ఇలా అన్నాడు: “నా సహోదరులారా, వద్దు, దయచేసి దుర్మార్గంగా ప్రవర్తించకండి. ఆ మనిషి నా ఇంటికి వచ్చిన అతిథి. ఈ నీచమైన పనికి ఒడిగట్టకండి. 24  ఇక్కడ కన్యయైన నా కూతురు, అతని ఉపపత్ని ఉన్నారు. నేను వాళ్లను బయటికి తెస్తాను, కావాలనుకుంటే మీరు వాళ్లను అవమానించవచ్చు.+ కానీ అతని విషయంలో మీరు ఈ నీచమైన పనికి ఒడిగట్టకూడదు.” 25  అయితే ఆ మనుషులు అతని మాట ​వినలేదు, కాబట్టి ఆ లేవీయుడు తన ఉపప​త్నిని+ పట్టుకుని బయట ఉన్న వాళ్ల దగ్గరికి ​తీసుకొచ్చాడు. వాళ్లు ఆమెమీద అత్యాచారం చేసి తెల్లారేదాకా రాత్రంతా ఆమెను అవమానిస్తూ ఉన్నారు. తెల్లవారుజామున వాళ్లు ఆమెను పంపించేశారు. 26  తెల్లవారుజామున ఆ స్త్రీ, తన భర్త* ఉన్న వృద్ధుని ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి, అక్కడ పడిపోయింది. వెలుగు వచ్చే వరకు ఆమె అక్కడే పడి ఉంది. 27  ఉదయం ఆమె భర్త లేచి, ప్రయాణం కొనసాగించడానికి ఇంటి తలుపులు తెరిచినప్పుడు ఆ స్త్రీ, అంటే అతని ఉపపత్ని ఇంటి గుమ్మం దగ్గర పడి ఉండడం చూశాడు. ఆమె చేతులు గడప మీద ఉన్నాయి. 28  అతను ఆమెతో, “లే, మనం వెళ్దాం” అని అన్నాడు. కానీ ఆమెలో ఉలుకూ పలుకూ లేదు. అప్పుడు అతను ఆమెను ఒక గాడిద మీద పెట్టి, తన ఇంటికి బయల్దేరాడు. 29  అతను ఇంటికి చేరుకున్నాక, వధించే కత్తిని తీసుకుని తన ఉపపత్ని శవాన్ని 12 ​ముక్కలుగా కోసి, ఇశ్రాయేలులోని ఒక్కో ​ప్రాంతానికి ఒక్కో ముక్కను పంపించాడు. 30  అది చూసిన ప్రతీ ఒక్కరు, “ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు, ఎవరూ చూడలేదు. మీరు దీని గురించి ఆలోచించి, చర్చించుకొని,+ ఏం చేయాలో చెప్పండి” అన్నారు.

అధస్సూచీలు

లేదా “నీ హృదయాన్ని ఉల్లాసంగా ఉంచుకో.”
అక్ష., “డేరాకు.”
ఇది జంతువు మీద కూర్చోవడానికి దాని వీపు మీద వేసేది.
లేదా “నేను యెహోవా మందిరంలో సేవ చేస్తాను” అయ్యుంటుంది.
అక్ష., “యజమాని.”