న్యాయాధిపతులు 18:1-31

  • దాను గోత్రంవాళ్లు స్థలం కోసం వెదకడం (1-31)

    • మీకాకు చెందిన విగ్రహాల్ని, యాజకుణ్ణి ​పట్టుకెళ్లిపోవడం (14-20)

    • లాయిషు స్వాధీనం, దానికి దాను అని పేరు పెట్టడం (27-29)

    • దానులో విగ్రహపూజ (30, 31)

18  ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులకు రాజు లేడు,+ అప్పట్లో దాను గోత్రంవాళ్లు+ నివసించడానికి స్థలం కోసం చూస్తున్నారు. ​ఎందుకంటే ఇశ్రాయేలు గోత్రాల మధ్య దాను గోత్రంవాళ్లు సరిపడా స్వాస్థ్యం ఇంకా పొందలేదు.+  కాబట్టి దాను వంశస్థులు దేశాన్ని వేగు చూడడానికి, దాన్ని పరిశీలించడానికి తమ గోత్రం నుండి సమర్థులైన ఐదుగురు మనుషుల్ని పంపించారు. వాళ్లు జొర్యాకు, ఎష్తాయోలుకు+ చెందినవాళ్లు. దాను వంశస్థులు వాళ్లతో, “మీరు వెళ్లి, దేశాన్ని పరిశీలించండి” అని చెప్పారు. దాంతో వాళ్లు ఎఫ్రాయిము పర్వత ప్రాంతంలో ఉన్న మీకా ఇంటికి+ వచ్చి, ఆ రాత్రి అక్కడ ఉన్నారు.  వాళ్లు మీకా ఇంటికి దగ్గర్లో ఉన్నప్పుడు, యువకుడైన ఆ లేవీయుడి స్వరాన్ని* గుర్తుపట్టి అతని దగ్గరికి వెళ్లి ఇలా ​అడిగారు: “నిన్ను ఇక్కడికి ఎవరు తీసుకొ​చ్చారు? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ ఎందుకు ఉన్నావు?”  అందుకు ఆ లేవీయుడు మీకా తనకు చేసింది వాళ్లకు చెప్తూ, “అతని కోసం యాజకునిగా సేవ చేయడానికి అతను నన్ను జీతానికి పెట్టుకున్నాడు”+ అని అన్నాడు.  అప్పుడు వాళ్లు, “మేము వెళ్లే పని* సఫలం అవుతుందో లేదో దయచేసి దేవుణ్ణి అడుగు” అని అతనితో అన్నారు.  అందుకు ఆ యాజకుడు, “క్షేమంగా వెళ్లండి. మీ పనిలో* యెహోవా మీతోపాటు ఉన్నాడు” అని వాళ్లకు చెప్పాడు.  ఆ ఐదుగురు మనుషులు ప్రయాణిస్తూ లాయిషుకు+ వచ్చారు. అక్కడి ప్రజలు సీదోనీయుల్లా ఎవరి మీదా ఆధారపడకుండా నివసిస్తుండడం వాళ్లు చూశారు. ఆ ప్రజలు ప్రశాంతంగా, నిర్భయంగా ఉన్నారు.+ దేశంలో వాళ్లను ఇబ్బంది​పెట్టే ఏ క్రూర పాలకుడూ లేడు. వాళ్లు సీదోనీయులకు దూరంగా, ఎవరితోనూ సంబంధాలు లేకుండా నివసిస్తున్నారు.  ఆ ఐదుగురు మనుషులు జొర్యా, ఎష్తాయోలులోని+ తమ సహోదరుల దగ్గరికి తిరిగొచ్చినప్పుడు వాళ్లు, “మీరు వెళ్లిన పని ఏమైంది?” అని అడిగారు.  అందుకు వాళ్లు ఇలా చెప్పారు: “మనం వాళ్ల మీదికి వెళ్దాం. ఆ దేశం చాలా మంచిగా ఉండడం మేము చూశాం. మీరెందుకు సంకోచిస్తున్నారు? ఆలస్యం చేయకుండా వెళ్లి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోండి. 10  మీరు అక్కడికి వెళ్లినప్పుడు, ప్రజలు నిర్భయంగా ఉండడం,+ ఆ దేశం విశాలంగా ఉండడం మీరు గమనిస్తారు. దేవుడు దాన్ని మీ చేతికి ​అప్పగించాడు, ఆ దేశంలో దేనికీ లోటు లేదు.”+ 11  అప్పుడు ఆయుధాలు ధరించిన 600 మంది దాను వంశస్థులు జొర్యా, ఎష్తాయోలు+ నుండి బయల్దేరారు. 12  వాళ్లు వెళ్లి యూదాలోని కిర్యత్యారీము+ దగ్గర మకాం వేశారు. అందుకే ఆ స్థలాన్ని ఈ రోజు వరకు మహనెదాను*+ అని పిలుస్తున్నారు, అది కిర్యత్యారీముకు పడమటి వైపు ఉంది. 13  వాళ్లు అక్కడి నుండి బయల్దేరి, ఎఫ్రాయిము పర్వత ప్రాంతా​నికి చేరుకుని అక్కడ మీకా ఇంటికి వచ్చారు.+ 14  అప్పుడు, లాయిషు ప్రాంతాన్ని వేగు చూడడానికి వెళ్లిన ఆ ఐదుగురు మనుషులు+ తమ సహోదరులతో ఇలా అన్నారు: “మీకు తెలుసా, ఈ ఇళ్లలో ఒక ఏఫోదు, గృహ​దేవతల విగ్రహాలు, ఒక చెక్కుడు విగ్రహం, ఒక పోత* విగ్రహం+ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏమి చేయాలో మీరే ఆలోచించండి.” 15  దాంతో వాళ్లు అక్కడ ఆగి, మీకా ఇంటి దగ్గరున్న యువ​కుడైన లేవీయుని ఇంటికి+ వచ్చి అతని బాగోగులు అడిగారు. 16  అప్పుడు, ఆయుధాలు ధరించివున్న 600 మంది దాను వంశస్థులు+ ప్రవేశ ద్వారం దగ్గర ​నిలబడివున్నారు. 17  దేశాన్ని వేగు చూడడా​నికి వెళ్లిన ఆ ఐదుగురు మనుషులు+ చెక్కుడు విగ్రహాన్ని, ఏఫోదును,+ గృహదేవతల విగ్రహాల్ని,+ పోత విగ్రహాన్ని+ తీసుకోవడానికి లోపలికి వెళ్లారు. (యాజకుడు+ ఆయు​ధాలు ధరించిన 600 మందితోపాటు ప్రవేశ ద్వారం దగ్గర నిలబడివున్నాడు.) 18  వాళ్లు మీకా ఇంట్లోకి వెళ్లి చెక్కుడు విగ్రహాన్ని, ఏఫోదును, గృహదేవతల విగ్రహాల్ని, పోత విగ్రహాన్ని తీసుకున్నారు. అప్పుడు ఆ యాజకుడు వాళ్లతో, “మీరేం చేస్తున్నారు?” అన్నాడు. 19  కానీ వాళ్లు అతనితో ఇలా అన్నారు: “ఊరుకో, ఇంకేం మాట్లాడొద్దు. మాతో వచ్చి మాకు తండ్రిగా,* యాజకునిగా ఉండు. నీకు ఏది మంచిది? ఒక మనిషి ఇంటికి యాజకునిగా ఉండడమా?+ లేదా ఇశ్రాయేలులోని ఒక గోత్రానికి, వంశానికి యాజకునిగా ఉండడమా?”+ 20  ఆ మాటలకు యాజకుడు సంతృప్తిపడి ​ఏఫోదును, ​గృహదేవతల విగ్రహాల్ని, చెక్కుడు ​విగ్రహాన్ని+ తీసుకుని వాళ్లతో పాటు వెళ్లాడు. 21  తర్వాత వాళ్లు పిల్లల్ని, మందల్ని, విలువైన వస్తువుల్ని తమ ముందు ఉంచి ప్రయాణం కొనసాగించారు. 22  వాళ్లు మీకా ఇంటి నుండి కొంత దూరం వెళ్లాక, మీకా చుట్టుపక్కల నివ​సిస్తున్నవాళ్లు ఒకచోట సమకూడారు. వాళ్లు దాను వంశస్థుల్ని వెంబడించి వాళ్లను అందుకున్నారు. 23  వాళ్లు దాను వంశస్థుల్ని కేకవేసి పిలిచినప్పుడు, దాను వంశస్థులు వెనక్కి తిరిగి మీకాను, “ఏంటి విషయం? ఎందుకు గుంపును వెంటబెట్టుకుని వచ్చావు?” అని అడిగారు. 24  అప్పుడు మీకా, “నేను చేసుకున్న నా దేవుళ్లను మీరు తీసుకున్నారు, నా యాజకుణ్ణి కూడా తీసుకెళ్లారు. ఇంకా నాకు ఏమి మిగిలింది? పైగా ‘ఏంటి విషయం’ అని నన్ను ​అడుగుతున్నారా?” అన్నాడు. 25  అప్పుడు దాను వంశస్థులు, “మామీద అరవకు, లేకపోతే కోపంగా ఉన్న మనుషులు నీ మీద దాడి ​చేస్తారేమో; అప్పుడు నీ ప్రాణం, నీ ఇంటివాళ్ల ప్రాణాలు పోతాయి” అన్నారు. 26  ఆ మాట అని దాను వంశస్థులు తమ దారిన వెళ్లిపోయారు; వాళ్లు తనకన్నా బలంగా ఉండడం చూసి మీకా వెనక్కి తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. 27  దాను వంశస్థులు మీకా చేసుకున్న దేవుళ్లను, అతని యాజకుణ్ణి తీసుకున్నాక, లాయిషులో+ ప్రశాంతంగా, నిర్భయంగా నివసిస్తున్న ప్రజల+ దగ్గరికి వెళ్లారు. వాళ్లను కత్తితో చంపి ఆ నగరాన్ని తగలబెట్టారు. 28  ఆ నగరాన్ని రక్షించేవాళ్లు ఎవ్వరూ లేరు, ఎందుకంటే అది సీదోనుకు దూరంగా ఉంది; అంతేకాదు వాళ్లకు ఎవ్వరితోనూ సంబంధాలు లేవు. ఆ నగరం బేత్‌-రెహోబుకు+ చెందిన లోయ మైదానంలో ఉంది. తర్వాత వాళ్లు ఆ నగరాన్ని మళ్లీ కట్టి అందులో స్థిరపడ్డారు. 29  వాళ్లు ఇశ్రాయేలు కుమారుడూ+ తమ తండ్రీ అయిన దాను పేరును ఆ నగరానికి పెట్టారు.+ అయితే దానికి అంతకుముందు లాయిషు అనే పేరు ఉండేది.+ 30  ఆ తర్వాత దాను వంశస్థులు తమ కోసం చెక్కుడు విగ్రహాన్ని+ నిలబెట్టుకున్నారు. ఆ దేశ నివాసులు చెరగా తీసుకెళ్లబడిన రోజు వరకు, మోషే మనవడూ గెర్షోము+ కుమారుడూ అయిన యోనాతాను,+ అతని కుమారులు దాను వంశస్థులకు యాజకులుగా ఉన్నారు. 31  వాళ్లు మీకా చేసిన చెక్కుడు విగ్రహాన్ని అక్కడ నిలబెట్టారు. సత్యదేవుని మందిరం షిలోహులో+ ఉన్నన్ని రోజులు అది అక్కడే ఉంది.

అధస్సూచీలు

లేదా “యాసను.”
లేదా “మా ప్రయాణం.”
లేదా “ప్రయాణంలో.”
“దాను శిబిరం” అని అర్థం.
లేదా “లోహపు.”
లేదా “సలహాదారునిగా.”