న్యాయాధిపతులు 1:1-36

  • యూదా, షిమ్యోను గోత్రాలు ​జయించడం (1-20)

  • యెబూసీయులు యెరూషలేములోనే ​ఉండిపోవడం (21)

  • యోసేపు వంశస్థులు బేతేలును స్వాధీనం ​చేసుకోవడం (22-26)

  • కనానీయుల్ని పూర్తిగా వెళ్లగొట్టలేదు (27-36)

1  యెహోషువ చనిపోయిన తర్వాత+ ఇశ్రాయేలీయులు* యెహోవాను, “కనానీయుల మీద యుద్ధం చేయడానికి ముందుగా మాలో ఎవరు వెళ్తారు?” అని అడిగారు.+  దానికి యెహోవా, “యూదా గోత్రంవాళ్లు వెళ్తారు.+ ఇదిగో! నేను ఈ దేశాన్ని వాళ్ల చేతికి అప్పగిస్తున్నాను”* అని చెప్పాడు.  అప్పుడు యూదా గోత్రంవాళ్లు తమ సహోదరులైన షిమ్యోను గోత్రంవాళ్లతో, “కనానీయుల మీద యుద్ధం చేయడానికి మాతోపాటు మాకు ఇచ్చిన ప్రాంతంలోకి+ రండి. తర్వాత, మేము మీతోపాటు మీకు ఇచ్చిన ప్రాంతంలోకి వస్తాం” అన్నారు. దాంతో షిమ్యోనీయులు యూదావాళ్లతో కలిసి వెళ్లారు.  యూదా గోత్రంవాళ్లు యుద్ధానికి వెళ్లినప్పుడు యెహోవా కనానీయుల్ని, పెరిజ్జీయుల్ని వాళ్ల చేతికి అప్పగించాడు; వాళ్లు బెజెకులో 10,000 మందిని ఓడించారు.  వాళ్లు బెజెకులో అదోనీబెజెకును కనుగొని అక్కడ అతనితో యుద్ధం చేశారు; వాళ్లు కనానీయుల్ని,+ పెరిజ్జీయుల్ని+ ఓడించారు.  అదోనీబెజెకు పారిపోయినప్పుడు వాళ్లు అతన్ని తరిమి పట్టుకుని అతని చేతుల, కాళ్ల బొటనవేళ్లు కోసేశారు.  అప్పుడు అదోనీబెజెకు ఇలా అన్నాడు: “తమ చేతుల, కాళ్ల బొటనవేళ్లు కోయబడిన 70 మంది రాజులు నా బల్ల కింద భోజనం ఏరు​కుంటు​న్నారు. నేను చేసినట్టే దేవుడు నాకు చేశాడు.” తర్వాత వాళ్లు అతన్ని యెరూషలేముకు తీసుకొచ్చారు, అతను అక్కడే చనిపోయాడు.  తర్వాత, యూదావాళ్లు యెరూషలేము మీద యుద్ధం చేసి+ దాన్ని స్వాధీనం చేసుకున్నారు; వాళ్లు అందులోని ప్రజల్ని కత్తితో చంపి ఆ నగరాన్ని తగలబెట్టారు.  దాని తర్వాత, యూదావాళ్లు పర్వత ప్రాంతంలో, నెగెబులో, షెఫేలాలో+ నివసిస్తున్న కనానీయులతో యుద్ధం చేయడానికి వెళ్లారు. 10  వాళ్లు హెబ్రోనులో (హెబ్రోనుకు అంతకుముందు కిర్యతర్బా అనే పేరు ఉండేది) నివసిస్తున్న కనానీయుల మీదికి వెళ్లారు; వాళ్లు షేషయిని, అహీమానును, తల్మయిని నాశనం చేశారు.+ 11  వాళ్లు అక్కడి నుండి దెబీరు (దెబీరుకు అంతకుముందు కిర్యత్సేఫెరు అనే పేరు ఉండేది) నివాసుల మీదికి వెళ్లారు.+ 12  అప్పుడు కాలేబు,+ “కిర్యత్సేఫెరు మీద దాడిచేసి దాన్ని స్వాధీనం చేసుకునే వ్యక్తికి నా కూతురు అక్సాను ఇచ్చి పెళ్లిచేస్తాను”+ అని అన్నాడు. 13  అప్పుడు కాలేబు తమ్ముడైన కనజు కుమారుడు+ ఒత్నీయేలు+ దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కాబట్టి కాలేబు అతనికి తన కూతురు అక్సాను ఇచ్చి పెళ్లిచేశాడు. 14  ఆమె తన భర్త ఇంటికి వెళ్లేటప్పుడు, తన తండ్రిని ఒక పొలం అడగమని భర్తను తొందరపెట్టింది. ఆమె గాడిద మీద నుండి దిగినప్పుడు* కాలేబు, “నీకు ఏమి కావాలి?” అని ఆమెను అడిగాడు. 15  ఆమె అతనితో, “దయచేసి నాకు ఒక దీవెన ఇవ్వు. నువ్వు దక్షిణాన* నాకు ఒక భూమి ఇచ్చావు; గుల్లోతు-మయిము* కూడా ఇవ్వు” అని అంది. అప్పుడు కాలేబు ఆమెకు ఎగువ గుల్లోతును, దిగువ గుల్లోతును ఇచ్చాడు. 16  కేనీయుడైన మోషే మామ+ వంశస్థులు+ యూదావాళ్లతో కలిసి ఖర్జూర చెట్ల నగరం*+ నుండి అరాదుకు+ దక్షిణాన ఉన్న యూదా ఎడారికి* వచ్చారు. వాళ్లు ​అక్కడికి వచ్చి స్థానిక ప్రజల మధ్య స్థిరపడ్డారు.+ 17  ​అయితే యూదా గోత్రంవాళ్లు తమ సహోదరులైన షిమ్యోను ​గోత్రంవాళ్లతో కలిసి, జెఫతు నగరంలో నివసిస్తున్న కనానీయుల మీద దాడిచేసి ఆ నగరాన్ని నాశనం చేశారు.+ కాబట్టి వాళ్లు దానికి హోర్మా*+ అనే పేరు పెట్టారు. 18  తర్వాత యూదావాళ్లు గాజాను,+ దాని ప్రాంతాన్ని, అష్కెలోనును,+ దాని ప్రాంతాన్ని, ఎక్రోనును,+ దాని ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. 19  యెహోవా యూదావాళ్లకు తోడుగా ఉన్నాడు కాబట్టి వాళ్లు పర్వత ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు; కానీ మైదానంలో నివసిస్తున్న ప్రజల్ని వెళ్లగొట్టలేకపోయారు, ఎందుకంటే ఆ ప్రజల దగ్గర చక్రాలకు ఇనుప కత్తులు​గల యుద్ధ రథాలు* ఉన్నాయి.+ 20  మోషే వాగ్దానం చేసినట్టు వాళ్లు హెబ్రోనును కాలేబుకు ఇచ్చారు;+ అతను అనాకు ముగ్గురు కుమారుల్ని+ అక్కడి నుండి వెళ్లగొట్టాడు. 21  అయితే బెన్యామీనీయులు యెరూష​లేములో నివసిస్తున్న యెబూసీయుల్ని వెళ్లగొట్టలేదు, కాబట్టి యెబూసీయులు ఈ రోజు వరకు బెన్యామీనీయులతో కలిసి యెరూషలేములోనే నివసిస్తున్నారు.+ 22  ఈలోగా యోసేపు వంశస్థులు+ బేతేలు మీదికి వెళ్లారు, యెహోవా వాళ్లకు తోడుగా ఉన్నాడు.+ 23  ఆ సమయంలో యోసేపు వంశస్థులు బేతేలును (ఈ నగరానికి అంతకు​ముందు లూజు అనే పేరు ఉండేది)+ వేగు చూస్తున్నారు, 24  ఒకతను నగరం నుండి బయటికి వెళ్లడం ఆ వేగులవాళ్లు చూశారు. వాళ్లు అతనితో, “దయచేసి ఈ నగరంలోకి వెళ్లే దారి మాకు చూపించు, మేము నీ మీద దయ* చూపిస్తాం” అన్నారు. 25  అతను వాళ్లకు నగరంలోకి వెళ్లే దారి చూపించాడు. అప్పుడు వాళ్లు ఆ నగరంలోని ప్రజల్ని కత్తితో చంపారు; కానీ అతన్ని, అతని కుటుంబాన్నంతటినీ వెళ్లిపోనిచ్చారు.+ 26  అతను హిత్తీయుల ప్రాంతానికి వెళ్లి ఒక నగరాన్ని కట్టి దానికి లూజు అని పేరు పెట్టాడు, ఈ రోజు వరకు దానికి అదే పేరు ఉంది. 27  మనష్షే గోత్రంవాళ్లు బేత్షెయానును, దాని చుట్టుపక్కల పట్టణాల్ని; తానాకును,+ దాని చుట్టుపక్కల పట్టణాల్ని; దోరును, దాని చుట్టుపక్కల పట్టణాల్ని; ఇబ్లెయామును, దాని చుట్టుపక్కల పట్టణాల్ని; మెగిద్దోను, దాని చుట్టుపక్కల పట్టణాల్ని స్వాధీనం చేసుకోలేదు.+ కనానీయులు మొండిగా అక్కడే ఉండిపోయారు. 28  ఇశ్రాయేలీయుల బలం పెరిగినప్పుడు వాళ్లు కనానీయుల చేత వెట్టిచాకిరి చేయించుకున్నారు,+ కానీ వాళ్లను పూర్తిగా వెళ్లగొట్టలేదు.+ 29  అలాగే ఎఫ్రాయిమీయులు కూడా గెజెరులో నివసిస్తున్న కనానీయుల్ని వెళ్లగొట్టలేదు. కనానీయులు గెజెరులో వాళ్ల మధ్యే నివసిస్తూ వచ్చారు.+ 30  జెబూలూను గోత్రంవాళ్లు కిత్రోనులో ​నివసిస్తున్నవాళ్లను, అలాగే నహలోలులో నివసిస్తున్నవాళ్లను వెళ్లగొట్టలేదు. కనానీయులు వాళ్ల మధ్యే నివసిస్తూ వచ్చారు; జెబూలూను గోత్రంవాళ్లు వాళ్లచేత వెట్టిచాకిరి చేయించుకున్నారు.+ 31  ఆషేరు గోత్రంవాళ్లు అక్కోలో నివసిస్తు​న్నవాళ్లను, అలాగే సీదోనులో,+ అహ్లాబులో, ​అక్జీబులో, హెల్బాలో, అఫెకులో,+ రెహో​బులో+ నివసిస్తున్నవాళ్లను వెళ్లగొట్టలేదు. 32  కాబట్టి ఆషేరీయులు దేశంలో ఉంటున్న కనానీయుల మధ్యే నివసిస్తూ వచ్చారు, ఎందుకంటే ఆషేరీయులు వాళ్లను వెళ్లగొట్టలేదు. 33  నఫ్తాలి గోత్రంవాళ్లు బేత్షెమెషులో నివసిస్తున్నవాళ్లను, అలాగే బేతనాతులో నివసిస్తున్నవాళ్లను వెళ్లగొట్టలేదు; అయితే వాళ్లు దేశంలో ఉంటున్న కనానీయుల మధ్యే నివసిస్తూ వచ్చారు.+ బేత్షెమెషు, బేతనాతు ప్రజలు వాళ్లకు వెట్టిచాకిరి చేసేవాళ్లయ్యారు. 34  దాను గోత్రంవాళ్లను అమోరీయులు పర్వత ప్రాంతానికే పరిమితం చేశారు, ఎందు​కంటే అమోరీయులు వాళ్లను దిగువనున్న మైదానంలోకి రానివ్వలేదు.+ 35  అమోరీయులు హెరెసు కొండ, అయ్యాలోను,+ షయల్బీము+ ప్రాంతాల్ని విడిచిపెట్టకుండా అక్కడే ఉండిపోయారు. అయితే యోసేపు వంశస్థుల బలం పెరిగినప్పుడు వాళ్లు అమోరీయులతో వెట్టిచాకిరి చేయించుకున్నారు. 36  అక్రబ్బీము పర్వత మార్గం+ నుండి, సెల నుండి పైకి ఉన్నది అమోరీయుల ప్రాంతం.

అధస్సూచీలు

అక్ష., “ఇశ్రాయేలు కుమారులు.”
లేదా “అప్పగించాను.”
లేదా “ఆమె గాడిద మీద ఉండి చప్పట్లు కొట్టినప్పుడు” అయ్యుంటుంది.
లేదా “నెగెబులో.”
“నీటి మడుగులు” అని అర్థం.
అంటే, యెరికో.
పదకోశం చూడండి.
“నాశనం కోసం ప్రతిష్ఠించడం” అని అర్థం.
అక్ష., “ఇనుప రథాలు.”
అక్ష., “విశ్వసనీయ ప్రేమ.”