నెహెమ్యా 9:1-38

  • ప్రజలు పాపాల్ని ఒప్పుకున్నారు (1-38)

    • యెహోవా క్షమించే దేవుడు (17)

9  ఆ నెల 24వ రోజున ఇశ్రాయేలీయులు సమావేశమయ్యారు; వాళ్లు గోనెపట్ట కట్టుకొని, తలమీద బూడిద పోసుకొని ఉపవాసం ఉన్నారు.+  అప్పుడు ఇశ్రాయేలు వంశాలవాళ్లు వేరే దేశాల వాళ్లందరి నుండి తమను తాము ప్రత్యేకపర్చుకున్నారు,+ వాళ్లు నిలబడి తమ పాపాలు, తమ తండ్రుల పాపాలు ఒప్పుకున్నారు.+  తర్వాత తాము ఉన్న చోట నిలబడి దాదాపు మూడు గంటలపాటు తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని బిగ్గ​రగా చదివారు;+ మరో మూడు గంటలపాటు పాపాలు ఒప్పుకుంటూ తమ దేవుడైన యెహోవాకు ​సాష్టాంగపడుతూ ఉన్నారు.  యేషూవ, బానీ, కద్మీయేలు, షెబన్యా, బున్నీ, షేరేబ్యా,+ బానీ, కెనానీ లేవీయుల పీఠం మీద నిలబడి+ తమ దేవుడైన యెహోవాకు గట్టిగా మొరపెట్టారు.  లేవీయులైన యేషూవ, కద్మీయేలు, బానీ, హషబ్నెయా, షేరేబ్యా, హోదీయా, షెబన్యా, పెతహయా ఇలా అన్నారు: “నిలబడి, మీ దేవుడైన యెహోవాను శాశ్వతకాలం* స్తుతించండి.+ దేవా, సమస్తమైన దీవెనకు, స్తుతికి మించిన నీ మహిమగల పేరును వాళ్లు స్తుతించాలి.  “నువ్వు మాత్రమే యెహోవావు;+ నువ్వు ఆకాశ మహాకాశాల్ని, వాటి సైన్యమంతటినీ సృష్టించావు; భూమినీ దానిమీద ఉన్న సమస్తాన్నీ, సముద్రాలనూ వాటిలో ఉన్న సమస్తాన్నీ సృష్టించావు. నువ్వే వాటన్నిటినీ సజీవంగా ఉంచుతున్నావు, ఆకాశ సైన్యం నీకు వంగి నమస్కారం చేస్తోంది.  అబ్రామును ఎంచుకొని,+ అతన్ని కల్దీయుల ప్రాంతమైన ఊరు నుండి తీసుకొచ్చి+ అతనికి అబ్రాహాము అని పేరు పెట్టిన+ సత్యదేవుడైన యెహోవావు నువ్వే.  అతని హృదయం నీకు నమ్మకంగా ఉందని నువ్వు చూశావు.+ అందుకే నువ్వు కనానీయుల, హిత్తీయుల, అమోరీయుల, పెరిజ్జీయుల, యెబూసీయుల, గిర్గాషీయుల దేశాన్ని అతనికీ, అతని సంతానానికీ* ఇస్తానని అతనితో ఒప్పందం చేశావు;+ నువ్వు నీతిమంతుడివి కాబట్టి నీ వాగ్దానాల్ని నిలబెట్టుకున్నావు.  “ఐగుప్తులో* మా పూర్వీకుల బాధల్ని నువ్వు చూశావు,+ ఎర్రసముద్రం దగ్గర వాళ్ల మొర విన్నావు. 10  ఫరో, అతని సేవకులంతా, అతని దేశంలోని ప్రజలంతా నీ ప్రజల పట్ల గర్వంగా ప్రవర్తించారని+ నీకు తెలుసు. అందుకే నువ్వు వాళ్లకు వ్యతిరేకంగా సూచనలు, అద్భుతాలు చేశావు;+ ఈ రోజు వరకు నిలిచివుండే గొప్ప పేరు తెచ్చుకున్నావు.+ 11  వాళ్లు సముద్రం గుండా పొడి నేల మీద దాటి వెళ్లేలా వాళ్ల ముందు సముద్రాన్ని విడగొట్టావు.+ అల్లకల్లోలంగా ఉన్న నీళ్లలోకి రాయిని విసిరేసినట్టు వాళ్లను తరిమేవాళ్లను అగాధ జలా​ల్లోకి విసిరేశావు.+ 12  పగలు ​మేఘస్తంభంతో, రాత్రుళ్లు వాళ్లు వెళ్లాల్సిన దారిలో వెలుగు ఇవ్వడానికి అగ్నిస్తంభంతో వాళ్లను నడిపించావు.+ 13  నువ్వు సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చి,+ పరలోకం నుండి వాళ్లతో మాట్లాడావు.+ వాళ్లకు సరైన న్యాయనిర్ణయాల్ని, సత్యమైన* నియమాల్ని, మంచి విధుల్ని, ఆజ్ఞల్ని ఇచ్చావు.+ 14  పవిత్రమైన నీ విశ్రాంతి రోజు*+ గురించి నువ్వు వాళ్లకు తెలియజేశావు. నీ సేవకుడైన మోషే ద్వారా ఆజ్ఞల్ని, నియమాల్ని, ధర్మశాస్త్రాన్ని వాళ్లకు ఇచ్చావు. 15  వాళ్లు ఆకలితో ఉన్నప్పుడు నువ్వు ఆకాశం నుండి వాళ్లకు ఆహారం ఇచ్చావు,+ వాళ్లకు దాహమేసినప్పుడు బండ నుండి నీళ్లు రప్పించావు;+ నువ్వు వాళ్లకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలోకి ప్రవేశించమని, దాన్ని స్వాధీనం చేసుకోమని వాళ్లకు చెప్పావు. 16  “కానీ వాళ్లు, అంటే మా పూర్వీకులు అహంకారంగా ప్రవర్తించారు,+ మొండిగా తయారయ్యారు,+ వాళ్లు నీ ఆజ్ఞలకు ​లోబడేవాళ్లు కాదు. 17  వాళ్లు వినడానికి ఇష్టపడలేదు,+ వాళ్ల మధ్య నువ్వు చేసిన అసాధారణ కార్యాల్ని వాళ్లు గుర్తుంచుకోలేదు; వాళ్లు మొండిగా తయారై, ఐగుప్తు బానిసత్వంలోకి తిరిగెళ్లడానికి తమ మీద ఒక నాయకుణ్ణి నియమించుకు​న్నారు.+ కానీ నువ్వు క్షమించడానికి సిద్ధంగా ఉండే దేవుడివి, కనికరం,* కరుణ, ఓర్పు గలవాడివి,* ఎంతో విశ్వసనీయ ప్రేమను* చూపించేవాడివి;+ అందుకే నువ్వు వాళ్లను విడిచిపెట్టలేదు.+ 18  వాళ్లు తమకోసం పోతపోసిన ఒక దూడ ​విగ్రహాన్ని చేసుకుని, ‘ఐగుప్తు నుండి మనల్ని బయటికి తీసుకొచ్చిన మన దేవుడు ఇదే’ అని అన్నారు,+ వాళ్లు తమ పనులతో నిన్ను ఘోరంగా అవ​మానించారు. 19  అప్పుడు కూడా నువ్వు గొప్ప కరుణ చూపించావు, వాళ్లను ఎడారిలో* ​విడిచిపెట్టలేదు.+ పగలు వాళ్లను నడిపించిన మేఘస్తంభం గానీ, రాత్రుళ్లు వాళ్లు వెళ్లాల్సిన దారిలో వెలుగిచ్చిన అగ్నిస్తంభం గానీ వాళ్ల మీద నుండి వెళ్లిపోలేదు.+ 20  వాళ్లు లోతైన అవగాహనతో నడుచుకునేలా నువ్వు వాళ్లకు నీ పవిత్రశక్తిని* ఇచ్చావు,+ వాళ్లకు మన్నా ఇవ్వడం ఆపలేదు.+ వాళ్లు దాహంతో ఉన్నప్పుడు నీళ్లు ఇచ్చావు.+ 21  40 సంవత్సరాలు ఎడారిలో వాళ్లకు ఆహారం పెట్టావు.+ వాళ్లకు ఏదీ తక్కువ కాలేదు. వాళ్ల బట్టలు పాతబడి చిరిగిపోలేదు,+ వాళ్ల కాళ్లకు వాపు రాలేదు. 22  “రాజ్యాల్ని, జనాల్ని వాళ్లకు అప్పగించి, దేశాన్ని కొంచెంకొంచెంగా వాళ్లకు పంచి ఇచ్చావు.+ అప్పుడు వాళ్లు హెష్బోను రాజైన సీహోను ప్రాంతాన్ని, బాషాను రాజైన ఓగు ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. 23  వాళ్ల పిల్లలు ఆకాశ నక్షత్రాలంతమంది అయ్యేలా చేశావు.+ తర్వాత నువ్వు, ఈ దేశంలోకి ప్రవే​శించి దీన్ని స్వాధీనం చేసుకోమని వాళ్ల పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలోకి వాళ్లను ​తీసుకొచ్చావు.+ 24  కాబట్టి వాళ్ల పిల్లలు ఆ దేశంలోకి ప్రవేశించి, దాన్ని స్వాధీనం చేసుకున్నారు.+ నువ్వు ఆ దేశంలో నివసిస్తున్న కనా​నీయుల్ని వాళ్ల ముందు ఓడించి, వాళ్లకు నచ్చినట్టు చేసుకోవడానికి ఆ దేశ రాజుల్ని, జనాల్ని వాళ్ల చేతికి అప్పగించావు. 25  వాళ్లు ప్రాకారాలుగల నగరాల్ని,+ సారవంతమైన* దేశాన్ని+ స్వాధీనం ​చేసుకున్నారు. వాళ్లు అన్నిరకాల మంచి వస్తువులు ఉన్న ఇళ్లను, అప్పటికే తవ్వి ఉన్న బావుల్ని, ద్రాక్షతోటల్ని, ఒలీవ తోటల్ని, విస్తారంగా ఉన్న పండ్ల చెట్లను స్వాధీనం ​చేసుకున్నారు. కాబట్టి వాళ్లు తిని, తృప్తిపడి, ​పుష్టినొంది, నీ గొప్ప మంచితనాన్ని బట్టి ఎంతో సంతోషించారు. 26  “అయితే తర్వాత వాళ్లు అవిధేయులై, నీ మీద తిరుగుబాటు చేశారు,+ నీ ధర్మశాస్త్రాన్ని తిరస్కరించారు. వాళ్లను నీ దగ్గరికి తిరిగి తీసు​కురావడానికి హెచ్చరించిన నీ ప్రవక్తల్ని చంపారు, వాళ్లు నిన్ను ఘోరంగా అవమానించారు.+ 27  అందుకే నువ్వు వాళ్లను వాళ్ల ​శత్రువుల చేతికి అప్పగించావు.+ ఆ శత్రువులు వాళ్లను బాధపెడుతూ వచ్చారు.+ కానీ కష్టాల్లో వాళ్లు నీకు ​మొరపెట్టినప్పుడల్లా నువ్వు పర​లోకం నుండి వినేవాడివి; నీ గొప్ప కరుణ వల్ల, వాళ్ల శత్రువుల చేతిలో నుండి వాళ్లను రక్షించడానికి రక్షకుల్ని ఇచ్చేవాడివి.+ 28  “కానీ వాళ్లు ఉపశమనం పొందగానే మళ్లీ నీ దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాళ్లు,+ నువ్వు వాళ్లను వాళ్ల శత్రువుల చేతికి అప్పగించేవాడివి. ఆ శత్రువులు వాళ్ల మీద అధికారం చెలాయించేవాళ్లు.*+ తర్వాత వాళ్లు మళ్లీ తిరిగొచ్చి నీ సహాయం అర్థించేవాళ్లు;+ నువ్వు పరలోకం నుండి విని, నీ గొప్ప కరుణను బట్టి పదేపదే వాళ్లను కాపాడుతూ వచ్చావు.+ 29  వాళ్లు నీ దగ్గరికి తిరిగొచ్చి నీ ధర్మశాస్త్రాన్ని పాటించాలని నువ్వు వాళ్లను హెచ్చరించినా, వాళ్లు గర్వంగా ప్రవర్తించి నీ ఆజ్ఞల్ని వినడానికి ఇష్టపడలేదు;+ వాళ్లు నీ విధులకు వ్యతిరేకంగా పాపం చేశారు, నిజానికి వాటిని పాటించేవాళ్లకు అవి జీవాన్ని ఇస్తాయి.+ కానీ వాళ్లు మొండిగా తిరస్కరించారు, తలబిరుసుగా తయారయ్యారు. వాళ్లు వినడా​నికి ఇష్టపడలేదు. 30  ఎన్నో సంవత్సరాల పాటు నువ్వు వాళ్ల ​విషయంలో ఓర్పు చూపించావు.+ నీ పవిత్రశక్తి ద్వారా నీ ప్రవక్తల చేత వాళ్లను హెచ్చరిస్తూ వచ్చావు కానీ వాళ్లు వినడానికి ఇష్టపడలేదు. చివరికి నువ్వు వాళ్లను చుట్టుపక్కల దేశాలవాళ్లకు అప్పగించావు.+ 31  నీ గొప్ప కరుణ వల్ల నువ్వు వాళ్లను పూర్తిగా నాశనం చేయలేదు,+ విడిచిపెట్టలేదు. ఎందు​కంటే నువ్వు కనికరం,* కరుణ గల దేవుడివి.+ 32  “అయితే ఇప్పుడు, మా దేవా, గొప్ప దేవా, బలమైన దేవా, సంభ్రమాశ్చర్యాలు పుట్టించే దేవా, నీ ఒప్పందాన్ని నిలబెట్టుకొని ​విశ్వసనీయ ప్రేమ చూపించిన దేవా,+ అష్షూరు రాజుల+ కాలం నుండి ఈ రోజు వరకు మా మీదికి, మా రాజుల మీదికి, మా అధిపతుల మీదికి, మా యాజకుల+ మీదికి, మా ప్రవక్తల+ మీదికి, మా పూర్వీకుల మీదికి, నీ ప్రజలందరి మీదికి వచ్చిన కష్టాలన్నిటినీ మర్చిపోకు. 33  ఇవన్నీ మా మీదికి వచ్చినా సరే నువ్వు మాత్రం నీతిమంతుడివే; ఎందుకంటే నువ్వు నమ్మకంగా ప్రవర్తించావు, మేమే చెడ్డగా ప్రవర్తించాం.+ 34  మా రాజులు, అధిపతులు, యాజకులు, పూర్వీకులు నీ ధర్మశాస్త్రాన్ని పాటించలేదు; నీ ఆజ్ఞల్ని గానీ, నువ్వు హెచ్చరించడానికి ఇచ్చిన జ్ఞాపికల్ని* గానీ వాళ్లు పట్టించుకోలేదు. 35  వాళ్లు తమ రాజ్యంలో ఉండి, నువ్వు వాళ్లకు దయచేసిన విస్తారమైన మంచితనాన్ని ఆనందిస్తూ, నువ్వు వాళ్లకు ఇచ్చిన విశాలమైన, సారవంతమైన* దేశంలో నివసించినప్పుడు కూడా వాళ్లు నిన్ను సేవించలేదు,+ తమ చెడు ప్రవర్తన నుండి పక్కకు మళ్లలేదు. 36  అందుకే ఇప్పుడు మేము దాసులుగా ఉన్నాం;+ ఆ దేశ ఫలాల్ని, దాని మంచి పదార్థాల్ని తినమని నువ్వు మా పూర్వీకులకు ఇచ్చిన దేశంలో మేము దాసులుగా ఉన్నాం. 37  మా పాపాల వల్ల, ఈ దేశంలోని విస్తారమైన పంట నువ్వు మా మీద ఉంచిన రాజులకే వెళ్తోంది.+ వాళ్లు మా మీద, మా పశువుల మీద ఇష్టమొచ్చినట్టు ఏలుతున్నారు. మేము పెద్ద కష్టంలో ఉన్నాం. 38  “అందుకే దీనంతటినీ దృష్టిలో పెట్టుకొని, మేము రాతపూర్వకంగా ఒక స్థిరమైన ఒప్పందం చేస్తున్నాం;+ మా అధిపతులు, లేవీయులు, ​యాజకులు దానిమీద ముద్ర వేసి ​ధృవీకరించారు.”+

అధస్సూచీలు

లేదా “శాశ్వతకాలం నుండి శాశ్వతకాలం వరకు.”
అక్ష., “విత్తనానికీ.”
లేదా “ఈజి​ప్టులో.”
లేదా “నమ్మదగిన.”
లేదా “సబ్బాతు.”
లేదా “దయ.”
లేదా “కోప్పడే విషయంలో నిదానించేవాడివి.”
లేదా “ప్రేమపూర్వక దయను.”
పదకోశం చూడండి.
అక్ష., “మంచి పవిత్రశక్తి.”
లేదా “సమృద్ధిగల.”
లేదా “వాళ్లను నలగ్గొట్టేవాళ్లు.”
లేదా “దయ.”
లేదా “హెచ్చరికల్ని.”
లేదా “సమృద్ధిగల.”