నెహెమ్యా 5:1-19

  • నెహెమ్యా అన్యాయాన్ని అడ్డుకున్నాడు (1-13)

  • నెహెమ్యా నిస్వార్థ స్ఫూర్తి (14-19)

5  అయితే కొంతమంది పురుషులు, వాళ్ల భార్యలు యూదులైన తమ సహోదరుల మీద గట్టిగా ఫిర్యాదు చేశారు.+  కొంతమంది, “మా కుమారులు, కూతుళ్లతో కలిపి మేము చాలామందిమి ఉన్నాం. మేము బ్రతికుండాలంటే, తినడానికి మాకు ధాన్యం కావాలి” అన్నారు.  ఇంకొంతమంది, “కరువు సమయంలో ధాన్యం కోసం మేము మా పొలాల్ని, ద్రాక్షతోటల్ని, మా ఇళ్లను తాకట్టు పెడుతున్నాం” అన్నారు.  మరికొంతమందేమో ఇలా అన్నారు: “రాజుకు కప్పం కట్టడానికి మా పొలాల్ని, ద్రాక్షతోటల్ని తాకట్టు పెట్టి డబ్బు అప్పుతెచ్చుకున్నాం.+  మేమూ మా సహోదరుల లాంటివాళ్లమే. మా పిల్లలు కూడా వాళ్ల పిల్లల లాంటివాళ్లే; అయినా మేము మా కుమారుల్ని, కూతుళ్లను బానిసత్వానికి అప్పగించాల్సి వచ్చింది. మా కూతుళ్లలో కొంతమంది ఇప్పటికే బానిసలుగా ఉన్నారు.+ కానీ ఈ విషయంలో మేము ఏమీ చేయలేకపోతున్నాం. ఎందుకంటే మా పొలాలు, మా ద్రాక్షతోటలు వేరేవాళ్ల చేతుల్లో ఉన్నాయి.”  వాళ్ల ఫిర్యాదుల్ని, వాళ్ల మాటల్ని విన్నప్పుడు నాకు చాలా కోపం వచ్చింది.  నేను సమస్య గురించి జాగ్రత్తగా ఆలోచించాను; ఈ సమస్య గురించి ప్రముఖులతో, ఉప పాలకులతో మాట్లాడి, “మీలో ప్రతీ ఒక్కరు మీ సొంత సహోదరుని దగ్గర వడ్డీ* వసూలు చేస్తున్నారు”+ అని మందలించాను. అంతేకాదు, వాళ్ల గురించి నేను ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశాను.  నేను వాళ్లతో, “దేశాలకు అమ్మేయబడిన మన సొంత యూదా సహోదరుల్ని మేము సాధ్యమైనంత వరకు విడిపించాం. అలాంటిది ఇప్పుడు మీరు మీ సొంత సహోదరుల్ని అమ్మేస్తారా?+ మేము వాళ్లను మళ్లీ కొనాలా?” అన్నాను. దాంతో వాళ్ల నోటి వెంట మాట రాలేదు, వాళ్లు మౌనంగా ఉండిపోయారు.  తర్వాత నేను ఇలా అన్నాను: “మీరు చేసే పని మంచిదికాదు. మీరు మన దేవునికి భయపడి+ నడుచుకోవాలి కదా, అప్పుడే కదా మన శత్రుదేశాల వాళ్లు మనల్ని నిందించకుండా ఉంటారు. 10  అంతేకాదు నేనూ, నా సహోదరులూ, నా సహాయకులూ వాళ్లకు డబ్బును, ధాన్యాన్ని అప్పుగా ఇస్తున్నాం. దయచేసి మనం వడ్డీకి ఇవ్వడం ఆపేద్దాం.+ 11  దయచేసి ఈ రోజే వాళ్ల పొలాల్ని, వాళ్ల ద్రాక్షతోటల్ని, వాళ్ల ఒలీవ తోటల్ని, వాళ్ల ఇళ్లను అలాగే డబ్బులో, ధాన్యంలో, కొత్త ద్రాక్షారసంలో, నూనెలో వాళ్ల దగ్గర వడ్డీగా వసూలు చేస్తున్న వందో వంతును* మీరు వాళ్లకు తిరిగిచ్చేయండి.”+ 12  దానికి వాళ్లు, “అవన్నీ మేము వాళ్లకు తిరిగిచ్చేస్తాం. వాళ్లను ఇంకేమీ అడగం. సరిగ్గా నువ్వు చెప్పినట్టే చేస్తాం” అన్నారు. అప్పుడు నేను యాజకుల్ని పిలిపించి, తప్పుచేసినవాళ్లతో ఒట్టు వేయించాను. 13  అంతేకాదు, నేను నా వస్త్రపు మడతల్ని దులిపి ఇలా అన్నాను: “ఈ వాగ్దానం నిలబెట్టుకోని ప్రతీ వ్యక్తిని సత్యదేవుడు అతని ఇంటి నుండి, అతని ఆస్తి నుండి ఈ విధంగా దులిపేయాలి. అతను ఈ విధంగా దులిపేయబడాలి, అతని దగ్గర ఏమీ మిగలకూడదు.” దానికి సమాజమంతా “ఆమేన్‌!”* అన్నారు. వాళ్లు యెహోవాను స్తుతించారు. ప్రజలు తాము ఒట్టేసినట్టే చేశారు. 14  అంతేకాదు, రాజు నన్ను యూదా ప్రాంతంలో వాళ్ల అధిపతిగా+ నియమించిన రోజు నుండి, అంటే అర్తహషస్త రాజు పరిపాలన+ 20వ సంవత్సరం+ నుండి 32వ సంవత్సరం+ వరకు, 12 సంవత్సరాల పాటు నేను గానీ, నా సహోదరులు గానీ అధిపతి ఆహార ఖర్చుల్ని తీసుకోలేదు.+ 15  కానీ నాకు ముందున్న అధిపతులు ప్రజల మీద భారం మోపారు; వాళ్లు రొట్టె, ద్రాక్షారసం కోసం ప్రతీరోజు 40 షెకెల్‌ల* వెండిని ప్రజల దగ్గర వసూలు చేసేవాళ్లు. అంతేకాదు, వాళ్ల సహాయకులు ప్రజల్ని అణచివేశారు. కానీ నేను దేవునికి భయపడి+ అలా చేయలేదు.+ 16  అంతేకాదు, నేను ప్రాకారాన్ని కట్టే పనిలో కూడా సహాయం చేశాను, మేము ఒక్క పొలం కూడా సంపాదించుకోలేదు;+ నా సహాయకులంతా పని చేయడానికి అక్కడ సమకూడారు. 17  నాతోపాటు 150 మంది యూదులు, ఉప పాలకులు, ఇంకా ఆయా దేశాల నుండి మా దగ్గరికి వచ్చినవాళ్లు భోజనం చేసేవాళ్లు. 18  ప్రతీరోజు ఒక ఎద్దు, ఆరు మంచి గొర్రెలు, కొన్ని పక్షులు నాకోసం* సిద్ధం చేయబడేవి. ప్రతీ పది రోజులకు ఒకసారి అన్నిరకాల ద్రాక్షారసం మాకు పుష్కలంగా ఉండేది. అయినా అధిపతి ఆహార ఖర్చులు నేను అడగలేదు. ఎందుకంటే ప్రజలు అప్పటికే రాజు సేవలో భారాన్ని మోస్తున్నారు. 19  నా దేవా, ఈ ప్రజల తరఫున నేను చేసినదానంతటిని బట్టి నన్ను గుర్తుపెట్టుకొని ఆశీర్వదించు.+

అధస్సూచీలు

లేదా “అక్రమ వడ్డీ.”
లేదా “ఒక శాతాన్ని,” అంటే, నెలసరి వడ్డీని.
లేదా “అలాగే జరగాలి!”
అప్పట్లో ఒక షెకెల్‌ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.
లేదా “నా ఖర్చుతో.”