నిర్గమకాండం 39:1-43

  • యాజక వస్త్రాలు తయారుచేయడం (1)

  • ఏఫోదు (2-7)

  • వక్షపతకం (8-21)

  • చేతుల్లేని నిలువుటంగీ (22-26)

  • ఇతర యాజక వస్త్రాలు (27-29)

  • బంగారు రేకు (30, 31)

  • మోషే గుడారాన్ని తనిఖీ చేస్తాడు (32-43)

39  వాళ్లు పవిత్ర స్థలంలో సేవచేసే వాళ్లకోసం నీలంరంగు దారాన్ని, ఊదారంగు ఉన్నిని, ముదురు ఎరుపు దారాన్ని+ నేర్పుగా అల్లి వస్త్రాలు తయారుచేశారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే వాళ్లు అహరోను కోసం పవిత్ర వస్త్రాల్ని తయారుచేశారు.+ 2  అతను బంగారం, నీలంరంగు దారం, ఊదారంగు ఉన్ని, ముదురు ఎరుపు దారం, పేనిన సన్నని నార ఉపయోగించి ఏఫోదును చేశాడు.+ 3  వాళ్లు బంగారు పలకల్ని పల్చని రేకులుగా సాగగొట్టారు. అతను వాటిని తీగలుగా కత్తిరించాడు. ఆ తీగల్ని, నీలంరంగు దారాన్ని, ఊదారంగు ఉన్నిని, ముదురు ఎరుపు దారాన్ని, పేనిన సన్నని నారను ఉపయోగించి ఏఫోదును బుట్టాపనిగా* చేశారు. 4  వాళ్లు దానికి అతికించి ఉండే భుజం ముక్కల్ని తయారుచేశారు, అవి ఏఫోదు రెండు పై అంచులకు జతచేయబడ్డాయి. 5  ఏఫోదును దాని స్థానంలో కదలకుండా పట్టివుంచడం కోసం, దానికి జతచేసిన దట్టీని*+ కూడా బంగారం, నీలంరంగు దారం, ఊదారంగు ఉన్ని, ముదురు ఎరుపు దారం, పేనిన సన్నని నార ఉపయోగించి అల్లారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే వాళ్లు చేశారు. 6  తర్వాత వాళ్లు సులిమాని రాళ్లను బంగారు జవల్లో పొదిగి, వాటిమీద ఇశ్రాయేలు కుమారుల పేర్లను ముద్రమీద చెక్కినట్టు చెక్కారు.+ 7  అవి ఇశ్రాయేలు కుమారులకు జ్ఞాపకార్థ రాళ్లుగా ఉండేలా, అతను వాటిని ఏఫోదు పైనున్న రెండు భుజం ముక్కల మీద పెట్టాడు.+ యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే అతను చేశాడు. 8  తర్వాత అతను ఏఫోదును చేసినట్టే వక్షపతకాన్ని+ కూడా బంగారం, నీలంరంగు దారం, ఊదారంగు ఉన్ని, ముదురు ఎరుపు దారం, పేనిన సన్నని నార ఉపయోగించి బుట్టాపనిగా చేశాడు.+ 9  దాన్ని అడ్డంగా మడతపెట్టినప్పుడు అది చతురస్ర ఆకారంలో ఉంది. అలా మడతపెట్టినప్పుడు అది జేనడు* పొడవు, జేనడు వెడల్పు ఉండేలా వాళ్లు దాన్ని తయారుచేశారు. 10  వాళ్లు దానిలో నాలుగు వరుసల్లో రంగురాళ్లను పొదిగారు. మొదటి వరుసలో మాణిక్యం, పుష్యరాగం, మరకతం ఉన్నాయి. 11  రెండో వరుసలో లేత నీలం రాయి, నీలం రాయి, సూర్యకాంతపు రాయి ఉన్నాయి. 12  మూడో వరుసలో లెషెము రాయి,* మలచబడిన రాయి,* ఊదారంగు రాయి ఉన్నాయి. 13  నాలుగో వరుసలో లేతపచ్చ రాయి, సులిమాని రాయి, పచ్చ రాయి ఉన్నాయి. వాటిని బంగారు జవల్లో పొదిగారు. 14  ఇశ్రాయేలు 12 మంది కుమారుల్లో ఒక్కొక్కరి పేరుకు ఒక్కో రాయి; ప్రతీ రాయి పైన ముద్రమీద చెక్కినట్టు ఒక పేరును చెక్కారు, ఒక్కో పేరు 12 గోత్రాల్లో ఒకదాన్ని సూచిస్తుంది. 15  తర్వాత వాళ్లు వక్షపతకం పైన స్వచ్ఛమైన బంగారంతో చేసిన తాళ్లలాంటి గొలుసుల్ని పేనారు.+ 16  అలాగే వాళ్లు రెండు బంగారు జవల్ని, రెండు బంగారు ఉంగరాల్ని చేసి, ఆ రెండు ఉంగరాల్ని వక్షపతకం రెండు మూలల్లో అంటించారు. 17  తర్వాత వాళ్లు ఆ రెండు బంగారు తాళ్లను వక్షపతకం మూలల్లో ఉన్న రెండు ఉంగరాల గుండా దూర్చారు. 18  ఆ రెండు తాళ్ల రెండు చివర్లను రెండు జవల గుండా దూర్చి, వాటిని ఏఫోదు ముందుభాగంలో భుజం ముక్కలకు అంటించారు. 19  తర్వాత వాళ్లు రెండు బంగారు ఉంగరాలు చేసి, వాటిని వక్షపతకం లోపలి అంచు రెండు చివర్లలో ఏఫోదుకు ఎదురుగా తగిలించారు.+ 20  తర్వాత వాళ్లు ఇంకో రెండు బంగారు ఉంగరాలు చేసి, ఏఫోదు ముందుభాగంలో రెండు భుజం ముక్కల కింద, దాన్ని జతచేసిన చోటుకు దగ్గర్లో, ఏఫోదు దట్టీకి పైన వాటిని తగిలించారు. 21  చివరిగా వాళ్లు, ఒక నీలంరంగు తాడుతో వక్షపతకం ఉంగరాలను ఏఫోదు ఉంగరాలకు కట్టారు. వక్షపతకం ఏఫోదు మీద, దట్టీ పైన దాని స్థానంలో కదలకుండా ఉండాలని అలా చేశారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే వాళ్లు చేశారు. 22  తర్వాత అతను మగ్గం పనివాడు నీలంరంగు దారంతో నేసిన వస్త్రాన్ని తీసుకొని, ఏఫోదు లోపల వేసుకునే చేతుల్లేని నిలువుటంగీని చేశాడు.+ 23  తలను దూర్చడం కోసం దాని మధ్యలో కవచానికి ఉన్నట్టు ఒక రంధ్రం ఉంది. అది చిరిగిపోకుండా ఉండేలా ఆ రంధ్రం చుట్టూ ఒక అంచు ఉంది. 24  తర్వాత వాళ్లు చేతుల్లేని నిలువుటంగీ అంచున నీలంరంగు దారంతో, ఊదారంగు ఉన్నితో, ముదురు ఎరుపు దారంతో దానిమ్మ పండ్లను అల్లారు. 25  అలాగే వాళ్లు స్వచ్ఛమైన బంగారంతో గంటలు చేసి, వాటిని చేతుల్లేని నిలువుటంగీ అంచు చుట్టూ ఆ దానిమ్మ పండ్ల మధ్యలో పెట్టారు. 26  సేవ చేయడానికి ఉపయోగించే ఆ చేతుల్లేని నిలువుటంగీ అంచు చుట్టూ ఒక గంట, ఒక దానిమ్మ పండు; ఒక గంట, ఒక దానిమ్మ పండు వచ్చేలా చేశారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే వాళ్లు చేశారు. 27  తర్వాత వాళ్లు మగ్గం పనివాడు సన్నని నారతో నేసిన వస్త్రంతో అహరోను కోసం, అతని కుమారుల కోసం చొక్కాల్ని చేశారు;+ 28  సన్నని నారతో తలపాగాను,+ అలంకార తలపాగాను;+ పేనిన సన్నని నారతో నార లాగుల్ని* చేశారు;+ 29  అలాగే పేనిన సన్నని నారతో, నీలంరంగు దారంతో, ఊదారంగు ఉన్నితో, ముదురు ఎరుపు దారంతో దట్టీని అల్లారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే వాళ్లు చేశారు. 30  చివరిగా వాళ్లు స్వచ్ఛమైన బంగారంతో మెరిసే రేకును, అంటే సమర్పణకు గుర్తుగా ఉన్న పవిత్రమైన రేకును* చేసి, ముద్రమీద చెక్కినట్టు దానిపైన “పవిత్రత యెహోవాకు చెందుతుంది” అనే మాటల్ని చెక్కారు.+ 31  దాన్ని తలపాగా మీద పెట్టడం కోసం నీలంరంగు దారంతో చేసిన ఒక తాడును దానికి కట్టారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే వాళ్లు చేశారు. 32  అలా గుడారానికి, అంటే ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన పనంతా పూర్తయింది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రతీది ఇశ్రాయేలీయులు చేశారు.+ వాళ్లు సరిగ్గా అలాగే చేశారు. 33  తర్వాత వాళ్లు ఆ గుడారాన్ని,+ దాని ఉపకరణాలన్నిటినీ మోషే దగ్గరికి తీసుకొచ్చారు. అవేమిటంటే: దాని కొక్కేలు,+ చట్రాలు,*+ అడ్డకర్రలు,+ స్తంభాలు, దిమ్మలు;+ 34  ఎర్రరంగు అద్దిన పొట్టేలు తోళ్లతో చేసిన కప్పు,+ సముద్రవత్సల* తోళ్లతో చేసిన కప్పు, మందసం ఎదురుగా ఉన్న తెర;+ 35  సాక్ష్యపు మందసం, దాని కర్రలు,+ దాని మూత;+ 36  బల్ల, దాని పాత్రలన్నీ,+ సముఖపు రొట్టెలు;* 37  స్వచ్ఛమైన బంగారంతో చేసిన దీపస్తంభం, దాని దీపాలు,+ దీపాల వరుస, దాని పాత్రలన్నీ,+ దీపాల్ని వెలిగించడానికి నూనె;+ 38  బంగారు వేదిక,*+ అభిషేక తైలం,+ పరిమళ ధూపద్రవ్యం,+ గుడారపు ప్రవేశ ద్వారం కోసం తెర;+ 39  రాగి బలిపీఠం,+ దాని రాగి జల్లెడ, దాని కర్రలు,+ దాని పాత్రలన్నీ,+ గంగాళం, దాని పీఠం;+ 40  ప్రాంగణం కోసం వేలాడే తెరలు, దాని స్తంభాలు, వాటి దిమ్మలు,+ ప్రాంగణ ప్రవేశ ద్వారం కోసం తెర,+ దాని తాళ్లు, దాని మేకులు,+ అలాగే గుడార సేవ కోసం, అంటే ప్రత్యక్ష గుడార సేవ కోసం కావాల్సిన పాత్రలన్నీ; 41  పవిత్రమైన స్థలంలో సేవ చేయడానికి నేర్పుగా అల్లిన వస్త్రాలు, యాజకుడైన అహరోను కోసం పవిత్ర వస్త్రాలు, యాజకులుగా సేవచేసేలా అతని కుమారుల కోసం వస్త్రాలు. 42  యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటి ప్రకారమే ఇశ్రాయేలీయులు ఆ పనంతా చేశారు.+ 43  మోషే వాళ్లు చేసిన పనంతటినీ తనిఖీ చేసినప్పుడు, వాళ్లు ఆ పనంతా యెహోవా ఆజ్ఞాపించినట్టే చేశారని గమనించాడు; దాంతో మోషే వాళ్లను దీవించాడు.

అధస్సూచీలు

అంటే, ఎంబ్రాయిడరీ.
లేదా “అల్లిన దట్టీని.”
దాదాపు 22.2 సెంటీమీటర్లు (8.75 అంగుళాలు). అనుబంధం B14 చూడండి.
ఇది గుర్తుతెలియని ఒక మణి.
లేదా “అగేటు.”
లేదా “లోదుస్తుల్ని.”
లేదా “పవిత్రమైన కిరీటాన్ని.”
లేదా “ఫ్రేములు.”
అంటే, సీల్‌ అనే సముద్ర జీవి.
లేదా “సన్నిధి రొట్టెలు.”
అంటే, ధూపవేదిక.