నిర్గమకాండం 38:1-31

  • బలిపీఠం (1-7)

  • రాగి గంగాళం (8)

  • ప్రాంగణం (9-20)

  • గుడార సామగ్రి జాబితా (21-31)

38  దహనబలులు అర్పించే బలిపీఠాన్ని అతను తుమ్మ చెక్కతో చేశాడు. అది చతురస్ర ఆకారంలో ఉంది; దాని పొడవు ఐదు మూరలు,* వెడల్పు ఐదు మూరలు, ఎత్తు మూడు మూరలు.+  అతను దాని నాలుగు మూలల్లో కొమ్ములు తయారుచేశాడు; ఆ కొమ్ముల్ని బలిపీఠంలో భాగంగా తయారుచేశాడు. తర్వాత ఆ ​బలిపీఠానికి రాగి రేకు తొడిగాడు.+  ఆ తర్వాత అతను బలిపీఠం పాత్రలన్నిటినీ అంటే బాల్చీల్ని, పారల్ని, గిన్నెల్ని, ముళ్ల గరిటల్ని, నిప్పు పాత్రల్ని చేశాడు. అతను వాటన్నిటినీ రాగితో చేశాడు.  అలాగే బలిపీఠం కోసం ఒక రాగి జల్లెడను చేశాడు; అది ​బలిపీఠం అంచు కింద, మధ్యభాగం వరకు ఉండేలా చేశాడు.  బలిపీఠాన్ని మోసే కర్రల్ని పట్టివుంచడానికి అతను నాలుగు ఉంగరాల్ని పోతపోసి, వాటిని బలిపీఠం నాలుగు మూలల్లో రాగి జల్లెడకు దగ్గరగా అంటించాడు.  తర్వాత అతను తుమ్మ చెక్కతో కర్రలు చేసి, వాటికి రాగి రేకు తొడిగాడు.  బలిపీఠాన్ని మోయడం కోసం అతను ఆ కర్రల్ని దాని పక్కలకు ఉన్న ఉంగరాల్లో పెట్టాడు. అతను ఆ బలి​పీఠాన్ని పలకలతో ఖాళీ పెట్టెలా తయారుచేశాడు.  తర్వాత అతను రాగి గంగాళాన్ని,+ దాని రాగి పీఠాన్ని చేశాడు; వాటిని తయారుచేయడానికి, ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర సేవచేసే స్త్రీల అద్దాలను* ఉపయోగించాడు.  తర్వాత అతను ప్రాంగణాన్ని తయారుచేశాడు.+ అతను ప్రాంగణం దక్షిణం వైపు కోసం, పేనిన సన్నని నారతో 100 మూరల పొడవున వేలాడే తెరల్ని చేశాడు.+ 10  వాటి కోసం 20 స్తంభాల్ని, 20 రాగి దిమ్మల్ని చేశాడు; అయితే ఆ స్తంభాల కొక్కేల్ని, వాటిని కలిపే ఉంగరాల్ని వెండితో చేశాడు. 11  ఉత్తరం వైపున కూడా 100 మూరల పొడవున వేలాడే తెరలు ఉన్నాయి. వాటి 20 స్తంభాల్ని, 20 దిమ్మల్ని రాగితో చేశాడు; ఆ స్తంభాల కొక్కేల్ని, వాటిని కలిపే ఉంగరాల్ని వెండితో చేశాడు. 12  అయితే పడమటి వైపున, వేలాడే తెరలు 50 మూరల పొడవున ఉన్నాయి. వాటికి పది స్తంభాలు, పది దిమ్మలు ఉన్నాయి; స్తంభాల కొక్కేలు, వాటిని కలిపే ఉంగరాలు వెండివి. 13  తూర్పు వైపున, అంటే సూర్యుడు ఉదయించే వైపున ప్రాంగణం వెడల్పు 50 మూరలు. 14  ప్రవేశ ద్వారానికి ఒకవైపు 15 మూరల పొడవున వేలాడే తెరలు, మూడు స్తంభాలు, మూడు దిమ్మలు ఉన్నాయి. 15  ప్రవేశ ద్వారానికి ఇంకోవైపు 15 మూరల పొడవున వేలాడే తెరలు, మూడు స్తంభాలు, మూడు దిమ్మలు ఉన్నాయి. 16  ప్రాంగణం చుట్టూ ఉన్న వేలాడే తెరలన్నీ పేనిన సన్నని నారతో చేయబడ్డాయి. 17  ప్రాంగణం స్తంభాల దిమ్మలు రాగివి; స్తంభాల కొక్కేలు, వాటిని కలిపే ఉంగరాలు వెండివి; స్తంభాల పైభాగాలు వెండి రేకుతో తొడగబడ్డాయి. ప్రాంగణం స్తంభాలన్నిటి కట్లు వెండివి.+ 18  ప్రాంగణ ప్రవేశ ద్వారానికి ఉండే తెరను నీలంరంగు దారం, ఊదారంగు ఉన్ని, ముదురు ఎరుపు దారం, పేనిన సన్నని నారతో అల్లారు. దాని పొడవు 20 మూరలు, ఎత్తు 5 మూరలు. ప్రాంగణంలో వేలాడే తెరల ఎత్తు ఎంతో దాని ఎత్తూ అంతే.+ 19  వాటి నాలుగు స్తంభాల్ని, నాలుగు దిమ్మల్ని రాగితో చేశారు. వాటి కొక్కేల్ని, వాటిని కలిపే ఉంగరాల్ని వెండితో చేశారు; ఆ స్తంభాల పైభాగాలకు వెండి రేకు తొడిగారు. 20  గుడారం మేకులన్నీ, అలాగే ప్రాంగణం చుట్టూ ఉన్న మేకులన్నీ రాగివి.+ 21  గుడారాన్ని, అంటే సాక్ష్యపు గుడారాన్ని+ కట్టడానికి ఉపయోగించిన వాటి జాబితా తయారుచేయమని మోషే ఆజ్ఞాపించాడు. యాజకుడైన అహరోను కుమారుడు ఈతామారు ​పర్యవేక్షణలో+ లేవీయులు+ ఆ ​జాబితాను తయారుచేశారు. 22  యూదా గోత్రానికి చెందిన హూరు మనవడూ, ఊరి కుమారుడూ అయిన బెసలేలు+ యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా చేశాడు. 23  దాను గోత్రానికి చెందిన అహీసామాకు కుమారుడైన అహోలీయాబు+ అతనితో కలిసి పనిచేశాడు. ఈ అహోలీయాబు చేతిపనులు చేయడం; బుట్టాపని* చేయడం; నీలం​రంగు దారంతో, ఊదారంగు ఉన్నితో, ముదురు ఎరుపు దారంతో, సన్నని నారతో అల్లడం ​తెలిసినవాడు. 24  పవిత్ర స్థలం పని అంతటి కోసం ఉపయోగించిన మొత్తం బంగారం, అల్లాడించే అర్పణగా తెచ్చిన బంగారంతో సమానం.+ పవిత్ర స్థల షెకెల్‌* కొలమానం ప్రకారం దాని బరువు 29 తలాంతుల* 730 షెకెల్‌లు.* 25  ఇశ్రాయేలీయుల్లో తమ పేర్లు నమోదైన పురుషులు తెచ్చిన వెండి బరువు పవిత్ర స్థల షెకెల్‌* కొలమానం ప్రకారం 100 తలాంతుల 1,775 షెకెల్‌లు. 26  20 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉండి, తన పేరు నమోదైన ప్రతీ పురుషుడు పవిత్ర స్థల షెకెల్‌* కొలమానం ప్రకారం అర షెకెల్‌ తీసుకొచ్చాడు.+ వాళ్ల సంఖ్య 6,03,550.+ 27  పవిత్ర స్థలం కోసం, తెరల కోసం దిమ్మలు పోతపోయడానికి ఉపయోగించిన వెండి మొత్తం 100 తలాంతులు; ఒక్కో దిమ్మకు ఒక తలాంతు చొప్పున, 100 దిమ్మలకు 100 తలాంతులు పట్టింది.+ 28  మిగతా 1,775 షెకెల్‌ల వెండితో అతను స్తంభాల కోసం కొక్కేల్ని చేశాడు, అలాగే స్తంభాల పైభాగాలకు వెండి రేకు తొడిగి వాటిని జతచేశాడు. 29  అర్పణగా* తెచ్చిన రాగి బరువు 70 తలాంతుల 2,400 షెకెల్‌లు. 30  దానితో అతను ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం కోసం దిమ్మల్ని, రాగి బలిపీఠాన్ని, దాని రాగి జల్లెడను, బలిపీఠం పాత్రలన్నిటినీ, 31  ప్రాంగణం చుట్టూ ఉండే దిమ్మల్ని, ప్రాంగణ ప్రవేశ ద్వారం కోసం దిమ్మల్ని, గుడారం మేకులన్నిటినీ, ప్రాంగణం చుట్టూ ఉండే మేకులన్నిటినీ+ చేశాడు.

అధస్సూచీలు

అప్పట్లో ఒక మూర 44.5 సెంటీమీటర్లతో (17.5 అంగుళాలతో) సమానం. అనుబంధం B14 చూడండి.
అంటే, బాగా మెరుగుపెట్టిన లోహపు అద్దాలు.
అంటే, ఎంబ్రాయిడరీ.
లేదా “పవిత్ర షెకెల్‌.”
అప్పట్లో ఒక తలాంతు 34.2 కిలోలతో సమానం. అనుబంధం B14 చూడండి.
అప్పట్లో ఒక షెకెల్‌ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.
లేదా “పవిత్ర షెకెల్‌.”
లేదా “పవిత్ర షెకెల్‌.”
లేదా “అల్లాడించే అర్పణగా.”