నిర్గమకాండం 36:1-38

  • కావల్సినదాని కన్నా ఎక్కువ కానుకలు వచ్చాయి (1-7)

  • గుడార నిర్మాణం (8-38)

36  “బెసలేలు అహోలీయాబుతో, అలాగే యెహోవా ఆజ్ఞాపించినట్టే పవిత్రసేవకు సంబంధించిన పనంతా ఎలా చేయాలో తెలిసేలా యెహోవా ఎవరికైతే తెలివిని, అవగాహనను ఇచ్చాడో ఆ నైపుణ్యంగల ప్రతీ ఒక్కరితో కలిసి పనిచేస్తాడు.”+ 2  మోషే బెసలేలును, అహోలీయాబును, అలాగే యెహోవా ఎవరి హృదయంలోనైతే తెలివిని నింపాడో,+ స్వచ్ఛందంగా ఆ పనిచేసేలా ఎవరి హృదయమైతే వాళ్లను కదిలించిందో ఆ నైపుణ్యంగల ప్రతీ ఒక్కర్ని పిలిపించాడు.+ 3  వాళ్లు పవిత్రసేవకు సంబంధించిన పని కోసం ఇశ్రాయేలీయులు తీసుకొచ్చిన కానుకలన్నిటినీ+ మోషే దగ్గర నుండి తీసుకున్నారు. అయితే ప్రజలు ప్రతీ ఉదయం స్వేచ్ఛార్పణలు తెస్తూనే ఉన్నారు. 4  వాళ్లు పవిత్రమైన పని మొదలుపెట్టిన తర్వాత నైపుణ్యం ఉన్న పనివాళ్లందరూ ఒకరి తర్వాత ఒకరు వస్తూ, 5  మోషేతో ఇలా అంటూ ఉన్నారు: “యెహోవా ఆజ్ఞాపించిన పని చేయడానికి అవసరమైన దానికన్నా ప్రజలు చాలా ఎక్కువ తీసుకొస్తున్నారు.” 6  కాబట్టి మోషే పాలెం అంతటా ఇలా చాటింపు చేయమని ఆజ్ఞాపించాడు: “పురుషులారా, స్త్రీలారా, పవిత్రమైన కానుకగా మీరు ఇక ఏ వస్తువుల్నీ తీసుకురావద్దు.” దాంతో ప్రజలు ఇంకేమీ తీసుకురాలేదు. 7  అప్పటికే పనంతటికీ సరిపడా వస్తువులు వచ్చాయి, నిజానికి అంతకన్నా ఎక్కువే వచ్చాయి. 8  కాబట్టి నైపుణ్యంగల పనివాళ్లందరూ+ పేనిన సన్నని నారతో, నీలంరంగు దారంతో, ఊదారంగు ఉన్నితో, ముదురు ఎరుపు దారంతో తయారైన పది తెరలు ఉపయోగించి గుడారాన్ని తయారుచేశారు;+ అతను* వాటిమీద కెరూబుల రూపాల్ని బుట్టాపనిగా* చేశాడు.+ 9  ఒక్కో తెర 28 మూరల* పొడవు, 4 మూరల వెడల్పు ఉంది. తెరలన్నీ ఒకే కొలతలో ఉన్నాయి. 10  తర్వాత అతను ఐదు తెరల్ని ఒకదానికొకటి జతచేశాడు, అలాగే మిగతా ఐదు తెరల్ని కూడా ఒకదానికొకటి జతచేశాడు. 11  తర్వాత అతను ఒక తెరల వరుస చివర్లో, దాన్ని జతచేసే వైపు నీలంరంగు దారంతో ఉంగరాలు చేశాడు. అలాగే రెండో తెరల వరుస చివర్లో కూడా దాన్ని జతచేసే వైపు అదే చోట ఉంగరాలు చేశాడు. 12  అతను ఒక తెరల వరుసకు 50 ఉంగరాలు; ఇంకో తెరల వరుస చివర్లో, దాన్ని జతచేసే చోట 50 ఉంగరాలు చేశాడు. ఆ ఉంగరాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండేలా వాటిని చేశాడు. 13  చివరిగా అతను 50 బంగారు కొక్కేలు చేసి, గుడారమంతా ఒక్కటి అయ్యేలా ఆ తెరల వరుసల్ని కొక్కేలతో జతచేశాడు. 14  తర్వాత అతను గుడారం మీద కప్పడానికి మేక వెంట్రుకలతో తెరలు చేశాడు. అతను మొత్తం 11 తెరలు చేశాడు.+ 15  ఒక్కో తెర 30 మూరల పొడవు, 4 మూరల వెడల్పు ఉంది. 11 తెరలూ ఒకే కొలతలో ఉన్నాయి. 16  అతను ఐదు తెరల్ని ఒకటిగా జతచేశాడు, అలాగే మిగతా ఆరు తెరల్ని కూడా ఒకటిగా జతచేశాడు. 17  తర్వాత అతను ఒక తెరల వరుస చివర్లో ఉన్న తెర అంచున, అంటే దాన్ని జతచేసే చోట, 50 ఉంగరాలు చేశాడు; అలాగే దానికి జతచేయాల్సిన ఇంకో తెరల వరుస చివర్లో కూడా 50 ఉంగరాలు చేశాడు. 18  తర్వాత అతను 50 రాగి కొక్కేలు చేసి, ఆ రెండు తెరల వరుసల్ని జతచేశాడు. అప్పుడు అదంతా కలిపి గుడారానికి ఒక్కటే కప్పు అయింది. 19  అలాగే అతను, ఎర్రరంగు అద్దిన పొట్టేలు తోళ్లతో గుడారం కోసం ఒక కప్పును చేశాడు, దానిమీద కప్పడానికి సముద్రవత్సల* తోళ్లతో ఇంకో కప్పును చేశాడు.+ 20  తర్వాత అతను గుడారం కోసం తుమ్మ చెక్కతో+ నిటారుగా ఉండే చట్రాలు* చేశాడు.+ 21  ప్రతీ చట్రం పొడవు పది మూరలు, వెడల్పు ఒకటిన్నర మూరలు. 22  ప్రతీ చట్రానికి రెండు కుసులు ఉన్నాయి, అవి ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి. గుడారం చట్రాలన్నిటినీ అతను అలాగే చేశాడు. 23  గుడారం దక్షిణం వైపు కోసం అతను 20 చట్రాలు చేశాడు. 24  తర్వాత అతను ఆ 20 చట్రాల కింద ఉంచడానికి 40 వెండి దిమ్మలు చేశాడు; ఒక చట్రానికి ఉండే రెండు కుసుల కోసం రెండు దిమ్మలు, దాని తర్వాత వచ్చే ప్రతీ చట్రానికి ఉండే రెండు కుసుల కోసం రెండు దిమ్మలు చేశాడు.+ 25  గుడారం ఇంకో వైపు కోసం, అంటే దాని ఉత్తరం వైపు కోసం 20 చట్రాలు చేశాడు. 26  అలాగే ఆ చట్రాల కోసం 40 వెండి దిమ్మలు కూడా చేశాడు. ఒక చట్రం కోసం రెండు దిమ్మలు, మిగతా చట్రాల్లో ప్రతీదాని కోసం రెండు దిమ్మలు చేశాడు. 27  గుడారం వెనక భాగం కోసం, అంటే పడమటి వైపు కోసం అతను ఆరు చట్రాలు చేశాడు.+ 28  అలాగే, గుడారం వెనక భాగం రెండు మూలల్లో నిలబెట్టడానికి అతను రెండు చట్రాలు చేశాడు. 29  ఈ చట్రాలకు ఉండే రెండు చెక్కలు కింది నుండి పైవరకు, అంటే పైన మొదటి ఉంగరంతో జతచేయబడే వరకు ఉన్నాయి. మూలల్లో ఉండే రెండు చట్రాల్ని కూడా అతను ఇలాగే చేశాడు. 30  అలా అతను ఎనిమిది చట్రాల్ని, అలాగే ఒక్కో చట్రం కింద రెండు దిమ్మల చొప్పున 16 వెండి దిమ్మల్ని చేశాడు. 31  అలాగే అతను తుమ్మ చెక్కతో అడ్డకర్రలు చేశాడు. గుడారం ఒకవైపున ఉన్న చట్రాల కోసం ఐదు అడ్డకర్రలు,+ 32  గుడారం ఇంకోవైపున ఉన్న చట్రాల కోసం ఐదు అడ్డకర్రలు, అలాగే గుడారం పడమటి వైపున ఉన్న చట్రాల కోసం, అంటే గుడారం వెనక భాగం కోసం ఐదు అడ్డకర్రలు చేశాడు. 33  అతను చట్రాల మధ్య భాగం మీదుగా వెళ్లే అడ్డకర్రను ఒక చివరి నుండి ఇంకో చివరి వరకు ఉండేలా చేశాడు. 34  అతను ఆ చట్రాలకు బంగారు రేకు తొడిగాడు. అడ్డకర్రలు పెట్టడానికి వాటికి బంగారంతో ఉంగరాలు చేశాడు. ఆ అడ్డకర్రలకు కూడా బంగారు రేకు తొడిగాడు.+ 35  తర్వాత అతను నీలంరంగు దారంతో, ఊదారంగు ఉన్నితో, ముదురు ఎరుపు దారంతో, పేనిన సన్నని నారతో ఒక తెరను+ చేశాడు. దానిమీద కెరూబుల్ని+ బుట్టాపనిగా చేశాడు.+ 36  తర్వాత అతను ఆ తెరను వేలాడదీయడం కోసం తుమ్మ చెక్కతో నాలుగు స్తంభాల్ని చేసి, వాటికి బంగారు రేకు తొడిగాడు; వాటి కోసం బంగారు కొక్కేల్ని చేశాడు; అలాగే ఆ స్తంభాల కోసం నాలుగు వెండి దిమ్మల్ని పోతపోశాడు. 37  ఆ తర్వాత గుడారపు ప్రవేశ ద్వారం కోసం నీలంరంగు దారం, ఊదారంగు ఉన్ని, ముదురు ఎరుపు దారం, పేనిన సన్నని నార ఉపయోగించి ఒక తెరను అల్లాడు.+ 38  ఆ తెరను వేలాడదీయడం కోసం ఐదు స్తంభాల్ని, వాటి కొక్కేల్ని చేశాడు. వాటి పైభాగాలకు, అలాగే వాటిని కలిపే ఉంగరాలకు అతను బంగారు రేకు తొడిగాడు. అయితే వాటి ఐదు దిమ్మల్ని మాత్రం రాగితో చేశాడు.

అధస్సూచీలు

బెసలేలును సూచిస్తుందని స్పష్టమౌతోంది.
అంటే, ఎంబ్రాయిడరీ.
అప్పట్లో ఒక మూర 44.5 సెంటీమీటర్లతో (17.5 అంగుళాలతో) సమానం. అనుబంధం B14 చూడండి.
అంటే, సీల్‌ అనే సముద్ర జీవి.
లేదా “ఫ్రేములు.”