నిర్గమకాండం 35:1-35
35 తర్వాత మోషే ఇశ్రాయేలీయులందర్నీ సమావేశపర్చి ఇలా అన్నాడు: “మనం పాటించడం కోసం యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు ఇవే:
2 ఆరు రోజులు మీరు పనిచేసుకోవచ్చు, అయితే ఏడో రోజు మీకు పవిత్రమైనదిగా ఉంటుంది; అది యెహోవాకు పూర్తి విశ్రాంతి రోజుగా ఉంటుంది.+ ఆ రోజు పనిచేసే ఏ వ్యక్తికైనా మరణశిక్ష పడుతుంది.+
3 విశ్రాంతి రోజున మీ నివాసాల్లో ఎక్కడా నిప్పు రాజేయకూడదు.”
4 తర్వాత మోషే ఇశ్రాయేలీయులందరితో ఇలా అన్నాడు: “యెహోవా ఏమని ఆజ్ఞాపించాడంటే,
5 ‘మీలో నుండి యెహోవా కోసం కానుకలు పోగుచేయండి.+ కానుక ఇవ్వాలని హృదయపూర్వకంగా కోరుకునే ప్రతీ ఒక్కరు+ యెహోవా కోసం వీటిని తేవాలి: బంగారం, వెండి, రాగి,
6 నీలంరంగు దారం, ఊదారంగు ఉన్ని, ముదురు ఎరుపు దారం, సన్నని నార, మేక వెంట్రుకలు,+
7 ఎర్రరంగు అద్దిన పొట్టేలు తోళ్లు, సముద్రవత్సల* తోళ్లు, తుమ్మ చెక్క,
8 దీపాల కోసం నూనె, అభిషేక తైలంలో అలాగే పరిమళ ధూపద్రవ్యంలో కలపడానికి సాంబ్రాణి,+
9 ఏఫోదులో, వక్షపతకంలో+ పెట్టడానికి సులిమాని రాళ్లు, ఇతర రంగురాళ్లు.+
10 “ ‘మీలో నైపుణ్యం ఉన్నవాళ్లంతా+ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయాలి.
11 అవేమిటంటే: గుడారం, దాని భాగాలన్నీ, దాని పైకప్పు, దాని కొక్కేలు, దాని చట్రాలు,* దాని అడ్డకర్రలు, దాని స్తంభాలు, దాని దిమ్మలు;
12 మందసం,+ దాని కర్రలు,+ దాని మూత,+ మందసం ఎదురుగా వేలాడే తెర;+
13 బల్ల,+ దాని కర్రలు, దాని పాత్రలన్నీ, సముఖపు రొట్టెలు;*+
14 వెలుగు కోసం దీపస్తంభం,+ దాని పాత్రలు, దాని దీపాలు, వాటి కోసం నూనె;+
15 ధూపవేదిక,+ దాని కర్రలు; అభిషేక తైలం, పరిమళ ధూపద్రవ్యం;+ గుడారపు ప్రవేశ ద్వారం కోసం తెర;
16 దహనబలులు అర్పించే బలిపీఠం,+ దాని రాగి జల్లెడ, దాని కర్రలు, దాని పాత్రలన్నీ; గంగాళం, దాని పీఠం;+
17 ప్రాంగణంలో వేలాడే తెరలు,+ దాని స్తంభాలు, దాని దిమ్మలు; ప్రాంగణ ప్రవేశ ద్వారం కోసం తెర;
18 గుడారం మేకులు, ప్రాంగణం మేకులు, వాటి తాళ్లు;+
19 పవిత్రమైన స్థలంలో సేవచేయడానికి నేర్పుగా అల్లిన వస్త్రాలు,+ యాజకుడైన అహరోను కోసం పవిత్ర వస్త్రాలు,+ యాజకులుగా సేవచేసేలా అతని కుమారుల కోసం వస్త్రాలు.’ ”
20 తర్వాత ఇశ్రాయేలీయులందరూ మోషే ముందు నుండి వెళ్లిపోయారు.
21 అప్పుడు ఎవరి హృదయం వాళ్లను ప్రేరేపించిందో,+ ఎవరికైతే కానుక ఇవ్వాలని అనిపించిందో వాళ్లందరూ ప్రత్యక్ష గుడారం కోసం, దాని సేవలన్నిటి కోసం, పవిత్ర వస్త్రాల కోసం యెహోవాకు కానుక తీసుకొచ్చారు.
22 కానుక ఇవ్వాలని హృదయపూర్వకంగా కోరుకున్న పురుషులు, స్త్రీలు అలంకార పిన్నుల్ని, చెవిపోగుల్ని, ఉంగరాల్ని, నగల్ని, అన్నిరకాల బంగారు వస్తువుల్ని తీసుకొస్తూ ఉన్నారు. వాళ్లందరూ తమ బంగారు వస్తువుల్ని యెహోవాకు అర్పణలుగా* అర్పించారు.+
23 నీలంరంగు దారం, ఊదారంగు ఉన్ని, ముదురు ఎరుపు దారం, సన్నని నార, మేక వెంట్రుకలు, ఎర్రరంగు అద్దిన పొట్టేలు తోళ్లు, సముద్రవత్సల తోళ్లు ఉన్నవాళ్లంతా వాటిని తీసుకొచ్చారు.
24 వెండిని, రాగిని ఇవ్వాలనుకున్న వాళ్లంతా వాటిని యెహోవాకు కానుకగా తీసుకొచ్చారు; అలాగే పనిలో దేనికైనా ఉపయోగపడే తుమ్మ చెక్క ఉన్నవాళ్లంతా దాన్ని తీసుకొచ్చారు.
25 పనిలో నైపుణ్యం ఉన్న స్త్రీలందరూ+ తమ చేతులతో వడికి, వాళ్లు వడికిన నీలంరంగు దారాన్ని, ఊదారంగు ఉన్నిని, ముదురు ఎరుపు దారాన్ని, సన్నని నారను తీసుకొచ్చారు.
26 నైపుణ్యం ఉండి, హృదయం ప్రేరేపించిన స్త్రీలందరూ మేక వెంట్రుకల్ని వడికారు.
27 ప్రధానులు ఏఫోదులో, వక్షపతకంలో+ పెట్టడానికి సులిమాని రాళ్లను, ఇతర రంగురాళ్లను తీసుకొచ్చారు;
28 వాళ్లు సాంబ్రాణిని; దీపాలు వెలిగించడం కోసం, అభిషేక తైలం+ కోసం, పరిమళ ధూపద్రవ్యం+ కోసం నూనెను తీసుకొచ్చారు.
29 స్త్రీపురుషుల్లో ఎవరి హృదయాలు వాళ్లను ప్రేరేపించాయో వాళ్లందరూ మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించిన పని కోసం ఏదో ఒకటి తీసుకొచ్చారు; ఇశ్రాయేలీయులు యెహోవాకు స్వేచ్ఛార్పణగా వాటిని తీసుకొచ్చారు.+
30 తర్వాత మోషే ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు: “ఇదిగో, యూదా గోత్రానికి చెందిన హూరు మనవడూ, ఊరి కుమారుడూ అయిన బెసలేలును యెహోవా ఎంచుకున్నాడు.+
31 ఆయన అతన్ని తన పవిత్రశక్తితో నింపి, అతనికి తెలివిని, అవగాహనను, జ్ఞానాన్ని, అన్నిరకాల చేతిపనులు చేసే నైపుణ్యాన్ని ఇచ్చాడు.
32 దానివల్ల అతను కళాత్మక రూపాల్ని చేయగలుగుతాడు; బంగారం పని, వెండి పని, రాగి పని చేయగలుగుతాడు;
33 అలాగే విలువైన రాళ్లను చెక్కి పొదగడం, అన్నిరకాల చెక్క వస్తువులు తయారుచేయడం అతనికి వస్తుంది.
34 దేవుడు అతని హృదయంలో, దాను గోత్రానికి చెందిన అహీసామాకు కుమారుడైన అహోలీయాబు+ హృదయంలో ఇతరులకు నేర్పించే కళను పెట్టాడు.
35 అన్నిరకాల చేతిపనుల్ని; బుట్టాపనిని;* నీలంరంగు దారంతో, ఊదారంగు ఉన్నితో, ముదురు ఎరుపు దారంతో, సన్నని నారతో అల్లే పనిని; మగ్గం పనిని చేసే నేర్పును ఆయన వాళ్ల హృదయాల్లో పెట్టాడు.+ ఈ పురుషులు అన్నిరకాల పనుల్ని, అన్నిరకాల కళాత్మక రూపాల్ని చేస్తారు.
అధస్సూచీలు
^ అంటే, సీల్ అనే సముద్ర జీవి.
^ లేదా “ఫ్రేములు.”
^ లేదా “సన్నిధి రొట్టెలు.”
^ లేదా “అల్లాడించే అర్పణలుగా.”
^ అంటే, ఎంబ్రాయిడరీ.