నిర్గమకాండం 26:1-37

  • ఆలయ గుడారం (1-37)

    • గుడారపు తెరలు (1-14)

    • చట్రాలు, దిమ్మలు (15-30)

    • తెరలు (31-37)

26  “పేనిన సన్నని నారతో, నీలంరంగు దారంతో, ఊదారంగు ఉన్నితో, ముదురు ఎరుపు దారంతో తయారైన పది తెరలు ఉపయోగించి నువ్వు గుడారాన్ని+ తయారు​చేయాలి. వాటిమీద కెరూబుల+ రూపాల్ని బుట్టా​పనిగా* చేయాలి.+  ఒక్కో తెర 28 మూరల* పొడవు, 4 మూరల వెడల్పు ఉండాలి. తెరలన్నీ ఒకే కొలతలో ఉండాలి.+  ఐదు తెరల్ని ఒకదానికొకటి జతచేసి తెరల వరుస తయారుచేయాలి, మిగతా ఐదు తెరల్ని కూడా అలాగే జతచేసి ఇంకో తెరల వరుస తయారుచేయాలి.  ఒక తెరల వరుస చివర్లో నీలంరంగు దారంతో ఉంగరాలు చేయాలి, ఇంకో తెరల వరుస చివర్లో కూడా దాన్ని జతచేసే వైపు అలాగే చేయాలి.  ఒక తెరల వరుసకు 50 ఉంగరాలు, ఇంకో తెరల వరుస చివర్లో 50 ఉంగరాలు చేయాలి; వాటిని జతచేసే చోట అవి ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండేలా చేయాలి.  అలాగే నువ్వు 50 బంగారు కొక్కేలు చేసి, ఆ తెరల వరుసల్ని ఆ కొక్కేలతో జతచేయాలి. అప్పుడు గుడారమంతా ఒక్కటిగా ఉంటుంది.+  “అలాగే గుడారం మీద కప్పడానికి నువ్వు మేక వెంట్రుకలతో తెరలు చేయాలి.+ మొత్తం 11 తెరలు చేయాలి.+  ఒక్కో తెర 30 మూరల పొడవు, 4 మూరల వెడల్పు ఉండాలి. 11 తెరలూ ఒకే కొలతలో ఉండాలి.  నువ్వు ఐదు తెరల్ని ఒకటిగా జతచేయాలి, అలాగే మిగతా ఆరు తెరల్ని ఒకటిగా జతచేయాలి. ఆరో తెరను గుడారం ముందుభాగంలో మడవాలి. 10  ఒక తెరల వరుస చివర్లో ఉన్న తెర అంచున 50 ఉంగరాలు, ఇంకో తెరల వరుస చివర్లో ఉన్న తెర అంచున, అంటే వాటిని జతచేసే చోట 50 ఉంగరాలు చేయాలి. 11  అలాగే నువ్వు 50 రాగి కొక్కేలు చేసి, వాటిని ఆ ఉంగరాల్లో పెట్టి తెరల్ని ఒకటి చేయాలి. అప్పుడు అదంతా కలిపి గుడారానికి ఒక్కటే కప్పు అవుతుంది. 12  తెరల్లో మిగిలిన భాగం గుడారం మీదుగా వేలాడుతుంది. దానిలో సగం, గుడారం వెనక భాగం మీదుగా వేలాడుతుంది. 13  ఆ తెరల పొడవులో మిగిలిన భాగం గుడారం ఈ వైపు ఒక మూర, ఆ వైపు ఒక మూర వేలాడుతూ దాన్ని కప్పుతుంది. 14  “అలాగే, ఎర్రరంగు అద్దిన పొట్టేలు తోళ్లతో నువ్వు గుడారం కోసం ఒక కప్పు చేయాలి. దానిమీద కప్పడానికి సముద్రవత్సల* తోళ్లతో ఇంకొక కప్పు చేయాలి.+ 15  “అంతేకాదు, గుడారం కోసం నువ్వు తుమ్మ చెక్కతో నిటారుగా ఉండే చట్రాలు*+ చేయాలి.+ 16  ప్రతీ చట్రం పొడవు పది మూరలు, వెడల్పు ఒకటిన్నర మూరలు ఉండాలి. 17  ప్రతీ చట్రానికి రెండు కుసులు ఉండాలి, అవి ఒకదానికొకటి సమాంతరంగా ఉండాలి. గుడారం చట్రాలన్నిటినీ నువ్వు ఇలాగే చేయాలి. 18  గుడారం దక్షిణం వైపు కోసం నువ్వు 20 చట్రాలు చేయాలి. 19  “ఆ 20 చట్రాల కింద ఉంచడానికి నువ్వు 40 వెండి దిమ్మలు తయారుచేయాలి.+ ఒక చట్రానికి ఉండే రెండు కుసుల కోసం రెండు దిమ్మలు, దాని తర్వాత వచ్చే ప్రతీ చట్రానికి ఉండే రెండు కుసుల కోసం రెండు దిమ్మలు చేయాలి.+ 20  గుడారం ఇంకో వైపు కోసం, అంటే దాని ఉత్తరం వైపు కోసం 20 చట్రాలు చేయాలి. 21  అలాగే ఆ చట్రాల కోసం 40 వెండి దిమ్మలు కూడా చేయాలి. ఒక చట్రం కోసం రెండు దిమ్మలు, దాని తర్వాత వచ్చే ప్రతీ చట్రం కోసం రెండు దిమ్మలు చేయాలి. 22  గుడారం వెనక భాగం కోసం, అంటే పడమటి వైపు కోసం ఆరు చట్రాలు చేయాలి.+ 23  అలాగే, గుడారం వెనక భాగం రెండు మూలల్లో నిలబెట్టడానికి నువ్వు రెండు చట్రాలు చేయాలి. 24  ఈ చట్రాలకు ఉండే రెండు చెక్కలు కింది నుండి ​పైవరకు, అంటే పైన మొదటి ఉంగరంతో జతచేయబడే వరకు ఉండాలి. రెండో మూలన ఉండే చట్రాన్ని కూడా ఇలాగే చేయాలి. ఈ రెండు చట్రాలు గుడారం రెండు మూలలకు ఆధారంగా ఉంటాయి. 25  నువ్వు ఎనిమిది చట్రాలు, వాటికోసం 16 వెండి దిమ్మలు చేయాలి. ఒక చట్రం కోసం రెండు దిమ్మలు, దాని తర్వాత వచ్చే ప్రతీ చట్రం కోసం రెండు దిమ్మలు చేయాలి. 26  “అలాగే నువ్వు తుమ్మ చెక్కతో అడ్డకర్రలు చేయాలి. గుడారం ఒకవైపున ఉన్న చట్రాల కోసం ఐదు అడ్డకర్రలు,+ 27  గుడారం ఇంకోవైపున ఉన్న చట్రాల కోసం ఐదు అడ్డకర్రలు, అలాగే గుడారం పడమటి వైపున ఉన్న చట్రాల కోసం, అంటే గుడారం వెనక భాగం కోసం ఐదు అడ్డకర్రలు చేయాలి. 28  చట్రాల మధ్య భాగం మీదుగా వెళ్లే అడ్డకర్ర మాత్రం ఒక చివరి నుండి ఇంకో చివరి వరకు ఉండాలి. 29  “నువ్వు ఆ చట్రాలకు బంగారు రేకు ​తొడగాలి.+ అడ్డకర్రలు పెట్టడానికి బంగారంతో వాటికి ఉంగరాలు చేయాలి. అడ్డకర్రలకు కూడా బంగారు రేకు తొడగాలి. 30  పర్వతం మీద నీకు చూపించిన నమూనా ప్రకారం నువ్వు గుడారాన్ని నిలబెట్టాలి.+ 31  “అలాగే నువ్వు నీలంరంగు దారంతో, ఊదారంగు ఉన్నితో, ముదురు ఎరుపు దారంతో, పేనిన సన్నని నారతో ఒక తెరను+ చేయాలి. దానిమీద కెరూబుల్ని బుట్టాపనిగా చేయాలి. 32  తుమ్మ చెక్కతో తయారుచేసి బంగారు రేకు తొడిగిన నాలుగు స్తంభాల మీద ఆ తెరను వేలాడదీయాలి. వాటి కొక్కేల్ని బంగారంతో చేయాలి. ఆ స్తంభాల్ని నాలుగు వెండి దిమ్మల మీద నిలబెట్టాలి. 33  నువ్వు ఆ తెరను కొక్కేల కింద వేలాడదీసి, సాక్ష్యపు మందసాన్ని+ తెర లోపలికి తీసుకురావాలి. ఆ తెర పవిత్ర స్థలాన్ని,+ అతి పవిత్ర స్థలాన్ని వేరుచేస్తుంది.+ 34  అలాగే, అతి పవిత్ర స్థలంలో ఉన్న సాక్ష్యపు మందసం మీద నువ్వు మూత పెట్టాలి. 35  “అంతేకాదు, నువ్వు ఆ తెర బయట బల్లను ఉంచాలి, దాని ఎదురుగా గుడారం దక్షిణం వైపున దీపస్తంభాన్ని+ పెట్టాలి; బల్లను ఉత్తరం వైపున ఉంచాలి. 36  నువ్వు గుడారపు ప్రవేశ ద్వారం కోసం నీలంరంగు దారం, ఊదారంగు ఉన్ని, ముదురు ఎరుపు దారం, పేనిన సన్నని నార ఉపయోగించి ఒక తెరను అల్లాలి.+ 37  అలాగే నువ్వు తెర కోసం తుమ్మ చెక్కతో ఐదు స్తంభాలు చేసి వాటికి బంగారు రేకు తొడగాలి. వాటి కొక్కేల్ని బంగారంతో చేయాలి. ఆ స్తంభాల కోసం ఐదు రాగి దిమ్మల్ని పోత పోయాలి.

అధస్సూచీలు

అంటే, ఎంబ్రాయిడరీ.
అప్పట్లో ఒక మూర 44.5 సెంటీమీటర్లతో (17.5 అంగుళాలతో) సమానం. అనుబంధం B14 చూడండి.
అంటే, సీల్‌ అనే సముద్ర జీవి.
లేదా “ఫ్రేములు.”