నిర్గమకాండం 24:1-18

  • ఒప్పందానికి కట్టుబడి ఉండడానికి ప్రజలు ఒప్పుకుంటారు (1-11)

  • సీనాయి పర్వతం మీద మోషే (12-18)

24  తర్వాత ఆయన మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు, అహరోను, నాదాబు, అబీహు,+ అలాగే ఇశ్రాయేలు పెద్దల్లో 70 మంది యెహోవా దగ్గరికి ఎక్కివెళ్లి, కాస్త దూరం నుండి వంగి నమస్కారం చేయండి.  మోషే ఒక్కడే యెహోవా దగ్గరికి వెళ్లాలి; మిగతావాళ్లు దగ్గరికి వెళ్లకూడదు. అలాగే ప్రజలు ​అతనితో పాటు పైకి వెళ్లకూడదు.”+  అప్పుడు మోషే ప్రజల దగ్గరికి వచ్చి యెహోవా చెప్పిన మాటలన్నీ, న్యాయనిర్ణయాలన్నీ వాళ్లకు చెప్పాడు.+ దానికి ప్రజలంతా ముక్తకంఠంతో, “యెహోవా చెప్పిన మాటలన్నీ పాటించడం మాకు ఇష్టమే” అన్నారు.+  కాబట్టి మోషే యెహోవా చెప్పిన మాటలన్నీ రాసిపెట్టాడు.+ తర్వాత అతను ఉదయాన్నే లేచి ఆ పర్వతం అడుగుభాగం దగ్గర ఒక బలిపీఠాన్ని కట్టి, ఇశ్రాయేలు 12 గోత్రాలకు సూచనగా 12 స్తంభాల్ని నిలబెట్టాడు.  తర్వాత అతను ఇశ్రాయేలీయుల్లో నుండి కొందరు యువకుల్ని ఎంచుకున్నాడు; వాళ్లు యెహోవాకు దహన​బలుల్ని అర్పించారు, అలాగే సమాధాన బలులుగా+ ఎద్దుల్ని అర్పించారు.  అప్పుడు మోషే సగం రక్తాన్ని గిన్నెల్లోకి తీసుకొని, ఇంకో సగం రక్తాన్ని బలిపీఠం మీద చిలకరించాడు.  తర్వాత అతను ఒప్పంద పుస్తకాన్ని తీసుకొని దానిలో ఉన్న విషయాల్ని ప్రజలకు బిగ్గరగా చదివి వినిపించాడు.+ అప్పుడు వాళ్లు, “యెహోవా చెప్పిందంతా చేయడం మాకు ఇష్టమే, మేము లోబడి ఉంటాం” అన్నారు.+  కాబట్టి మోషే ఆ రక్తాన్ని తీసుకొని ప్రజలమీద చిలకరించి,+ “ఈ రక్తం, ఈ మాటలన్నిటికీ అనుగుణంగా యెహోవా మీతో చేసిన ఒప్పందాన్ని అమల్లోకి తెస్తుంది” అన్నాడు.+  మోషే, అహరోను, నాదాబు, అబీహు, అలాగే ఇశ్రాయేలు పెద్దల్లో 70 మంది పర్వతం మీదికి ఎక్కివెళ్లి, 10  ఇశ్రాయేలు దేవుణ్ణి చూశారు.+ ఆయన కాళ్లకింద నీలం రాయితో చేసిన గచ్చు లాంటిది ఉంది; అది ఆకాశమంత స్వచ్ఛంగా ఉంది.+ 11  ఆయన ఇశ్రాయేలీయుల్లోని ఆ ప్రముఖ పురుషులకు+ ఏ హానీ చేయలేదు. వాళ్లు తింటూ, తాగుతూ ఉన్నప్పుడు సత్యదేవుని దర్శనం చూశారు. 12  అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు పర్వతం మీదికి ఎక్కి నా దగ్గరికి వచ్చి, అక్కడే ఉండు. వాళ్లకు బోధించడం కోసం నేను రాసే నియమాలు, ఆజ్ఞలు ఉన్న రాతి పలకల్ని నీకు ఇస్తాను.”+ 13  కాబట్టి మోషే తన సేవకుడైన యెహోషువను+ తీసుకొని బయల్దేరాడు, మోషే సత్యదేవుడు ఉన్న పర్వతం మీదికి ఎక్కివెళ్లాడు.+ 14  కానీ ఆ పెద్దలతో అతను ఇలా చెప్పాడు: “మేము మీ దగ్గరికి వచ్చేవరకు మా కోసం ఇక్కడే వేచివుండండి.+ అహరోను, హూరు+ మీతోపాటే ఉన్నారు. కాబట్టి ఎవరి​కైనా వివాదం ఉంటే వాళ్లు ఆ ఇద్దరి దగ్గరికి వెళ్లాలి.”+ 15  తర్వాత మేఘం ఆ పర్వతాన్ని కమ్ముతుండగా+ మోషే ఆ పర్వతం మీదికి ఎక్కాడు. 16  యెహోవా మహిమ+ సీనాయి పర్వతం+ మీద అలాగే నిలిచివుంది, మేఘం ఆరురోజుల పాటు ఆ పర్వతాన్ని కమ్మేసింది. ఆయన ఏడో రోజున మేఘంలో నుండి మోషేను పిలిచాడు. 17  దాన్ని చూస్తున్న ఇశ్రాయేలీయులకు యెహోవా మహిమ పర్వత శిఖరం మీద దహిస్తున్న అగ్నిలా కనిపించింది. 18  తర్వాత మోషే ఆ మేఘంలోకి ప్రవేశించి పర్వతం పైకి ​ఎక్కివెళ్లాడు. మోషే 40 పగళ్లు, 40 రాత్రులు ఆ పర్వతం మీద ఉన్నాడు.+

అధస్సూచీలు