నిర్గమకాండం 21:1-36
21 “నువ్వు వాళ్లకు అందజేయాల్సిన న్యాయనిర్ణయాలు ఇవే:+
2 “నువ్వు ఒక హెబ్రీయుణ్ణి దాసుడిగా కొంటే,+ అతను ఆరు సంవత్సరాలు నీకు దాసుడిగా సేవ చేస్తాడు. అయితే ఏడో సంవత్సరం అతను ఏమీ చెల్లించకుండానే స్వతంత్రుడౌతాడు.+
3 అతను ఒంటరిగా వచ్చివుంటే ఒంటరిగానే వెళ్లిపోతాడు. కానీ అతనికి భార్య ఉంటే, ఆమె కూడా అతనితోపాటు వెళ్లిపోవాలి.
4 ఒకవేళ అతని యజమానే అతనికి భార్యను ఇచ్చివుంటే, ఆమె అతనికి కుమారుల్ని గానీ కూతుళ్లను గానీ కనివుంటే, ఆ భార్య, ఆమె పిల్లలు ఆమె యజమానికి చెందుతారు, అతను ఒంటరిగా వెళ్లిపోతాడు.+
5 కానీ ఆ దాసుడు, ‘నేను నా యజమానిని, నా భార్యను, నా కుమారుల్ని ప్రేమిస్తున్నాను; నాకు స్వతంత్రుణ్ణి అవ్వాలని లేదు’ అని అంటూ వెళ్లడానికి ఏమాత్రం ఒప్పుకోకపోతే,+
6 అతని యజమాని అతన్ని సత్యదేవుని దగ్గరికి తీసుకురావాలి. తర్వాత యజమాని అతన్ని తలుపు దగ్గరికి గానీ గుమ్మం దగ్గరికి గానీ తీసుకొచ్చి కదురుతో అతని చెవిని గుచ్చుతాడు; అప్పుడు అతను జీవితాంతం ఆ యజమానికి దాసుడౌతాడు.
7 “ఒకవేళ ఒక వ్యక్తి తన కూతుర్ని దాసురాలిగా అమ్మేస్తే, ఒక దాసుడు స్వతంత్రుడయ్యే విధంగా ఆమె స్వతంత్రురాలు అవ్వదు.
8 ఆమె యజమానికి ఆమె నచ్చక, అతను ఆమెను ఉపపత్నిగా చేసుకోకపోతే, వేరే వ్యక్తి ఆమెను కొనుక్కోవడానికి* అతను అనుమతించవచ్చు. అయితే ఆమెను పరదేశులకు అమ్మే హక్కు అతనికి లేదు, ఎందుకంటే అతను ఆమెకు నమ్మకద్రోహం చేశాడు.
9 ఒకవేళ అతను తన కుమారుని కోసం ఆమెను ఎంచుకుంటే, కూతురికి ఉండే హక్కుల్నే ఆమెకూ కల్పించాలి.
10 ఒకవేళ అతను ఇంకొక స్త్రీని పెళ్లిచేసుకుంటే, ఆహారం విషయంలో, వస్త్రాల విషయంలో, వివాహ ధర్మం+ విషయంలో మొదటి భార్యకు ఏమీ తక్కువ చేయకూడదు.
11 అతను ఆమెకు ఈ మూడు అవసరాలు తీర్చకపోతే, ఆమె ఏమీ చెల్లించకుండానే స్వతంత్రురాలు అవుతుంది.
12 “ఒక వ్యక్తి ఎవరినైనా కొట్టినప్పుడు అతను చనిపోతే, ఆ వ్యక్తికి మరణశిక్ష విధించాలి.+
13 కానీ అతను అనుకోకుండా అలాచేస్తే, సత్యదేవుడు అలా జరగనిస్తే, ఆ వ్యక్తి పారిపోవడానికి నేను మీ కోసం ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తాను.+
14 ఒక వ్యక్తి తోటివాడి మీద చాలా కోపంతో కావాలని అతన్ని చంపితే+ ఆ వ్యక్తిని చంపేయాలి. ఆ వ్యక్తి తనను తాను కాపాడుకోవడానికి నా బలిపీఠం దగ్గరికి వచ్చినా, అతన్ని అక్కడి నుండి తీసుకెళ్లి చంపాలి.+
15 అమ్మనైనా, నాన్ననైనా కొట్టే వ్యక్తికి మరణశిక్ష విధించాలి.+
16 “ఒక వ్యక్తి ఎవరినైనా అపహరించి+ అతన్ని అమ్మేస్తే, లేదా అపహరించిన వ్యక్తి దగ్గర అతను దొరికితే,+ అపహరించిన వ్యక్తికి మరణశిక్ష విధించాలి.+
17 “అమ్మనైనా, నాన్ననైనా శపించే వ్యక్తికి మరణశిక్ష విధించాలి.+
18 “మనుషులు గొడవపడుతుండగా, ఒక వ్యక్తి తన తోటివాణ్ణి రాయితో లేదా పిడికిలితో* కొట్టాడనుకోండి, దానివల్ల అతను చనిపోలేదు కానీ మంచం పట్టాడనుకోండి. అప్పుడు ఇలా చేయాలి:
19 అతను లేచి, తన చేతికర్ర సాయంతో బయట తిరగగలిగితే, కొట్టిన వ్యక్తికి శిక్ష వేయకూడదు. అయితే, గాయపడిన వ్యక్తి పూర్తిగా బాగయ్యేవరకు ఎంతకాలం పనిచేయలేకపోయాడో దానికి సరిపడా నష్టపరిహారాన్ని మాత్రం అతను చెల్లించాలి.
20 “ఒక వ్యక్తి తన దాసుణ్ణి గానీ దాసురాలిని గానీ కర్రతో కొట్టినప్పుడు, ఆ దాసుడు లేదా దాసురాలు అతని చేతిలో చనిపోతే, అతనికి తప్పకుండా శిక్ష విధించాలి.+
21 కానీ ఆ దాసుడు ఒకట్రెండు రోజులు బ్రతికితే, యజమానికి శిక్ష వేయకూడదు, ఎందుకంటే ఆ దాసుడు తన యజమాని సొత్తు.
22 “మనుషులు పోట్లాడుకుంటున్నప్పుడు ఒక గర్భిణీ స్త్రీకి దెబ్బ తగిలి, నెలలు నిండకుండానే ఆమె బిడ్డను కన్నది*+ కానీ ప్రాణాపాయం* ఏమీ జరగలేదనుకోండి; అప్పుడు ఆమె భర్త మోపే నష్టపరిహారాన్ని గాయం చేసిన వ్యక్తి చెల్లించాలి. న్యాయమూర్తుల+ ద్వారా అతను దాన్ని చెల్లించాలి.
23 కానీ ప్రాణాపాయం జరిగితే, ప్రాణానికి ప్రాణం చెల్లించాలి.+
24 కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు,+
25 వాతకు వాత, గాయానికి గాయం, దెబ్బకు దెబ్బ చెల్లించాలి.
26 “ఒక వ్యక్తి తన దాసుని కంటిమీద గానీ, దాసురాలి కంటిమీద గానీ కొట్టి దాన్ని పోగొడితే, అందుకు నష్టపరిహారంగా అతను ఆ దాసుణ్ణి లేదా దాసురాలిని స్వతంత్రుల్ని చేయాలి.+
27 అతను తన దాసుడి పంటిని గానీ, దాసురాలి పంటిని గానీ ఊడగొడితే, అందుకు నష్టపరిహారంగా అతను ఆ దాసుణ్ణి లేదా దాసురాలిని స్వతంత్రుల్ని చేయాలి.
28 “ఒక ఎద్దు పురుషుణ్ణి గానీ స్త్రీని గానీ పొడవడం వల్ల అతను లేదా ఆమె చనిపోతే, ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి,+ దాని మాంసం తినకూడదు; అయితే ఆ ఎద్దు యజమానికి శిక్ష పడదు.
29 ఒకవేళ ఆ ఎద్దుకు పొడిచే అలవాటు ఉండి, ఆ విషయం గురించి దాని యజమానిని హెచ్చరించినా అతను దాన్ని అదుపులో ఉంచకపోవడంవల్ల అది ఒక పురుషుణ్ణి గానీ స్త్రీని గానీ చంపితే, ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి; దాని యజమానికి కూడా మరణశిక్ష విధించాలి.
30 అతని మీద ఏదైనా నష్టపరిహారం* మోపబడితే, అతను తన మీద మోపబడినదంతా తన ప్రాణ విమోచన వెలగా చెల్లించాలి.
31 అది ఒక వ్యక్తి కుమారుణ్ణి గానీ కూతుర్ని గానీ పొడిస్తే, అప్పుడు కూడా ఆ ఎద్దు యజమానికి ఈ న్యాయనిర్ణయం ప్రకారమే చేయాలి.
32 ఒకవేళ ఆ ఎద్దు ఒక దాసుడినో, దాసురాలినో పొడిస్తే, అతను వాళ్ల యజమానికి 30షెకెల్‌లు* చెల్లించాలి, ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి.
33 “ఒకవేళ ఒక వ్యక్తి, ఒక గుంట మీదున్న కప్పు తీసి లేదా గుంట తవ్వి దాన్ని మళ్లీ కప్పకపోవడం వల్ల ఒక ఎద్దు గానీ గాడిద గానీ అందులో పడిపోతే,
34 ఆ గుంట యజమాని నష్టపరిహారం చెల్లించాలి.+ అతను ఆ జంతువు యజమానికి దాన్ని చెల్లించాలి, చనిపోయిన జంతువు అతనిది అవుతుంది.
35 ఒక వ్యక్తి ఎద్దు ఇంకో వ్యక్తి ఎద్దును గాయపర్చడం వల్ల అది చనిపోతే, వాళ్లు బ్రతికున్న ఎద్దును అమ్మి, వచ్చిన డబ్బును ఇద్దరూ పంచుకోవాలి; చనిపోయిన జంతువును కూడా ఇద్దరూ పంచుకోవాలి.
36 కానీ ఆ ఎద్దుకు పొడిచే అలవాటు ఉందని తెలిసి కూడా దాని యజమాని దాన్ని అదుపులో ఉంచకపోతే, అతను ఎద్దుకు ఎద్దునిచ్చి నష్టపరిహారం చెల్లించాలి; చనిపోయిన ఎద్దు అతనిది అవుతుంది.

