నిర్గమకాండం 17:1-16

  • హోరేబు దగ్గర నీళ్లు లేవని ఫిర్యాదు (1-4)

  • బండలో నుండి నీళ్లు (5-7)

  • అమాలేకీయులు యుద్ధం చేస్తారు, ఓడిపోతారు (8-16)

17  ఇశ్రాయేలీయులందరూ సీను ఎడారి నుండి బయల్దేరి+ యెహోవా ఆదేశం ప్రకారం ఒకచోటి నుండి ఇంకోచోటికి మారుతూ+ చివరికి రెఫీదీములో తమ డేరాలు వేసుకున్నారు.+ అయితే ప్రజలు తాగడానికి అక్కడ నీళ్లు లేవు.  కాబట్టి ప్రజలు, “తాగడానికి మాకు నీళ్లు ఇవ్వు” అంటూ మోషేతో గొడవపడడం మొద​లుపెట్టారు.+ అయితే మోషే వాళ్లతో, “మీరెందుకు నాతో గొడవపడుతున్నారు? ఎందుకు యెహోవాను పరీక్షిస్తూ ఉన్నారు?”+ అన్నాడు.  అయితే అక్కడ ప్రజలకు చాలా దాహం వేసింది, దాంతో వాళ్లు మోషే మీద సణుగుతూ,+ “మమ్మల్ని, మా కుమారుల్ని, మా పశువుల్ని దాహంతో చంపడానికి మమ్మల్ని ఐగుప్తు నుండి ఎందుకు బయటికి తీసుకొచ్చావు?” అని అంటూ ఉన్నారు.  చివరికి మోషే యెహోవాకు ఇలా మొరపెట్టాడు: “ఈ ప్రజలతో నేనేం చేయాలి? ఇంకాసేపైతే వాళ్లు నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారు!”  అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు నైలు నదిని కొట్టిన నీ కర్రను+ తీసుకొని, ఇశ్రాయేలు పెద్దల్లో కొంతమందిని వెంటబెట్టుకొని ప్రజలకు ముందుగా వెళ్లు. నువ్వు ఆ కర్రను చేతిలో పట్టుకొని నడుస్తూ ఉండు.  ఇదిగో! నేను అక్కడ హోరేబులో బండ మీద నీ ముందు నిలబడి ఉంటాను. నువ్వు ఆ బండను కొట్టాలి, అప్పుడు దానిలో నుండి నీళ్లు వస్తాయి, ప్రజలు వాటిని తాగుతారు.”+ మోషే ఇశ్రాయేలు పెద్దల ముందు అలాగే చేశాడు.  ఇశ్రాయేలీయులు గొడవపడినందువల్ల, వాళ్లు “యెహోవా అసలు మన మధ్య ఉన్నాడా, లేడా?” అని అంటూ యెహోవాను పరీక్షించినందువల్ల+ అతను ఆ చోటికి మస్సా*+ అనీ మెరీబా*+ అనీ పేరు పెట్టాడు.  తర్వాత అమాలేకీయులు+ వచ్చి రెఫీదీ​ములో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు.+  అప్పుడు మోషే యెహోషువతో+ ఇలా అన్నాడు: “మన తరఫున కొంతమంది పురుషుల్ని ఎంచుకొని వెళ్లి అమాలేకీయులతో యుద్ధం చేయి. రేపు నేను సత్యదేవుని కర్రను నా చేతిలో పట్టుకొని కొండ పైన నిలబడతాను.” 10  అప్పుడు యెహోషువ సరిగ్గా మోషే చెప్పినట్టే చేసి,+ అమాలేకీయులతో యుద్ధం చేశాడు. మోషే, అహరోను, హూరు+ ఆ కొండ మీదికి ఎక్కివెళ్లారు. 11  మోషే తన చేతుల్ని ఎత్తి ఉంచినంతసేపు ఇశ్రాయేలీయులు గెలవసాగారు, కానీ అతను చేతులు దించగానే అమాలేకీయులు గెలవసాగారు. 12  మోషే చేతులు బరువెక్కినప్పుడు వాళ్లు ఒక రాయిని తీసుకొచ్చారు, అతను దానిమీద కూర్చున్నాడు. అప్పుడు అహరోను, హూరు అతనికి చెరో వైపున ఉండి అతని చేతుల్ని ఎత్తి పట్టుకున్నారు. దానివల్ల సూర్యాస్తమయం వరకు అతని చేతులు కదలకుండ అలాగే ఉన్నాయి. 13  అలా యెహోషువ అమాలేకీయుల్ని, వాళ్లతో ఉన్నవాళ్లను కత్తితో ఓడించాడు.+ 14  అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు ఈ మాటను జ్ఞాపకా​ర్థంగా* గ్రంథంలో రాసి, యెహోషువకు కూడా ఇలా చెప్పు: ‘నేను ఆకాశం కింద నుండి అమాలేకీయుల్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తాను, వాళ్లను ఇక ఎప్పటికీ ఎవరూ గుర్తుచేసుకోరు.’ ”+ 15  తర్వాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా-నిస్సీ* అని పేరు పెట్టి, 16  “అమాలేకు చెయ్యి యెహోవా* సింహాసనానికి విరోధంగా ఉంది+ కాబట్టి, యెహోవాకు తరతరాలపాటు అమాలేకుతో యుద్ధం ఉంటుంది”+ అన్నాడు.

అధస్సూచీలు

“గొడవపడడం” అని అర్థం.
“పరీక్షించడం; పరీక్ష” అని అర్థం.
లేదా “జ్ఞాపికగా.”
“యెహో​వాయే నా ధ్వజస్తంభం” అని అర్థం.
అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.