నిర్గమకాండం 14:1-31
14 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు:
2 “ఇశ్రాయేలీయులు వెనక్కి తిరిగి పీహహీరోతు ముందు, అంటే మిగ్దోలుకూ సముద్రానికీ మధ్య, బయల్సెఫోను ఎదురుగా డేరాలు వేసుకోవాలని వాళ్లకు చెప్పు.+ మీరు సముద్రం* దగ్గర బయల్సెఫోను ఎదురుగా డేరాలు వేసుకోవాలి.
3 అప్పుడు ఫరో ఇశ్రాయేలీయుల గురించి, ‘వాళ్లు దేశంలో దారి తప్పిపోయి తిరుగుతున్నారు. ఎడారిలో చిక్కుకుపోయారు’ అని అనుకుంటాడు.
4 నేను ఫరో హృదయాన్ని కఠినం అవ్వనిస్తాను.+ అతను వాళ్లను వెంటాడతాడు. అప్పుడు నేను ఫరోను, అతని సైన్యమంతటినీ ఓడించి నన్ను నేను మహిమపర్చుకుంటాను;+ నేను యెహోవానని ఐగుప్తీయులు ఖచ్చితంగా తెలుసుకుంటారు.”+ కాబట్టి ఇశ్రాయేలీయులు అలాగే చేశారు.
5 తర్వాత, ఆ ప్రజలు పారిపోయారని ఐగుప్తు రాజుకు వార్త అందింది. వెంటనే ఆ ప్రజల విషయంలో ఫరో మనసు, అతని సేవకుల మనసు మారిపోయింది.+ కాబట్టి వాళ్లు, “మనమెందుకు ఇలా చేశాం? మనకు బానిసలుగా సేవచేయకుండా ఇశ్రాయేలీయుల్ని ఎందుకు వదిలేశాం?” అని అనుకున్నారు.
6 దాంతో అతను తన యుద్ధ రథాల్ని సిద్ధం చేయించి, యోధుల్ని కూడా తనతోపాటు తీసుకెళ్లాడు.+
7 అతను శ్రేష్ఠమైన 600 రథాల్ని, ఐగుప్తులోని మిగతా రథాలన్నిటినీ తీసుకెళ్లాడు. వాటిలో ప్రతీదాని మీద యోధుల్ని తీసుకెళ్లాడు.
8 అలా యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయాన్ని కఠినం అవ్వనిచ్చాడు, దాంతో అతను ఇశ్రాయేలీయుల్ని వెంటాడాడు. మరోవైపున ఇశ్రాయేలీయులు ధైర్యంగా ముందుకు సాగిపోతూ ఉన్నారు.+
9 ఐగుప్తీయులు వాళ్లను వెంటాడారు.+ ఇశ్రాయేలీయులు సముద్రం పక్కన, బయల్సెఫోను ఎదుట పీహహీరోతు దగ్గర తమ డేరాలు వేసుకుంటుండగా ఫరో రథాలు, అతని అశ్వదళం, అతని సైన్యం వాళ్లకు దగ్గరగా రాసాగాయి.
10 ఫరో కాస్త దగ్గరగా వచ్చినప్పుడు, ఇశ్రాయేలీయులు తమ తలలెత్తి ఐగుప్తీయులు తమను వెంటాడుతున్నారని గమనించారు. దాంతో ఇశ్రాయేలీయులు భయపడిపోయి యెహోవాకు మొరపెట్టడం మొదలుపెట్టారు.+
11 వాళ్లు మోషేతో ఇలా అన్నారు: “ఐగుప్తులో సమాధులు లేవని ఈ ఎడారిలో చనిపోవడానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా?+ నువ్వు మాకు ఎందుకిలా చేశావు? మమ్మల్ని ఎందుకు ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చావు?
12 ‘మమ్మల్ని ఇలా వదిలేయి. మేము ఐగుప్తీయులకు సేవచేసుకుంటాం’ అని ఐగుప్తులో మేము నీతో చెప్పలేదా? మేము ఈ ఎడారిలో చనిపోవడం కన్నా ఐగుప్తీయులకు సేవచేయడమే మంచిది.”+
13 తర్వాత మోషే ప్రజలతో ఇలా అన్నాడు: “భయపడకండి.+ స్థిరంగా నిలబడి, ఈ రోజు యెహోవా మిమ్మల్ని ఎలా రక్షిస్తాడో చూడండి.+ ఎందుకంటే ఈ రోజు మీరు చూస్తున్న ఈ ఐగుప్తీయుల్ని మీరు మళ్లీ ఇంకెప్పుడూ చూడరు.+
14 యెహోవాయే మీ తరఫున పోరాడతాడు,+ మీరు మౌనంగా నిలబడి చూస్తారు.”
15 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వెందుకు నాకు మొరపెడుతూ ఉన్నావు? నువ్వు ఇశ్రాయేలీయులతో తమ డేరాలు తీసేసి ముందుకు సాగిపోవాలని చెప్పు.
16 నువ్వైతే నీ కర్ర పైకెత్తి, సముద్రం మీద నీ చెయ్యి చాపి దాన్ని రెండు పాయలుగా చేయి. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్య ఆరిన నేలమీద నడిచివెళ్తారు.
17 నేనైతే ఐగుప్తీయుల హృదయాల్ని కఠినం అవ్వనిస్తున్నాను, కాబట్టి వాళ్లు ఇశ్రాయేలీయుల్ని వెంటాడుతూ సముద్రంలోకి వస్తారు; అప్పుడు నేను ఫరోను, అతని సైన్యమంతటినీ, అతని యుద్ధ రథాల్ని, అతని అశ్వదళాన్ని ఓడించి నన్ను నేను మహిమపర్చుకుంటాను.+
18 నేను ఫరోను, అతని యుద్ధ రథాల్ని, అతని అశ్వదళాన్ని ఓడించి నన్ను నేను మహిమపర్చుకున్నప్పుడు, నేను యెహోవానని ఐగుప్తీయులు ఖచ్చితంగా తెలుసుకుంటారు.”+
19 అప్పుడు ఇశ్రాయేలీయుల ముందు వెళ్తున్న సత్యదేవుని దూత+ వాళ్ల వెనక్కి వెళ్లాడు, వాళ్ల ముందున్న మేఘస్తంభం కూడా వెనక్కి వెళ్లి వాళ్ల వెనక నిలిచింది.+
20 అది ఆ ఐగుప్తీయులకు, ఇశ్రాయేలీయులకు మధ్య నిలిచింది. అది ఒకవైపేమో చీకటిని కలిగిస్తోంది, ఇంకోవైపేమో రాత్రిపూట వెలుగును ఇస్తోంది. దానివల్ల ఐగుప్తీయులు రాత్రంతా ఇశ్రాయేలీయుల దగ్గరికి రాలేదు.
21 తర్వాత మోషే తన చేతిని సముద్రం మీద చాపాడు;+ అప్పుడు యెహోవా ఆ రాత్రంతా బలమైన తూర్పు గాలితో ఆ సముద్రంలోని నీళ్లను వెనక్కి పంపించి, సముద్రం అడుగుభాగాన్ని ఆరిన నేలగా మార్చాడు.+ నీళ్లు రెండు పాయలుగా విడిపోయాయి.+
22 కాబట్టి ఇశ్రాయేలీయులు సముద్రం గుండా ఆరిన నేలమీద నడిచివెళ్లారు;+ వాళ్ల కుడిచేతి వైపు, ఎడమచేతి వైపు నీళ్లు గోడల్లా నిలిచాయి.+
23 ఐగుప్తీయులు వాళ్లను వెంటాడారు. ఫరో గుర్రాలు, అతని యుద్ధ రథాలు, అతని అశ్వదళం వాళ్ల వెంటే సముద్రం మధ్యలోకి వెళ్లడం మొదలుపెట్టాయి.+
24 వేకువ జామున* యెహోవా అగ్ని-మేఘ స్తంభంలో+ నుండి ఐగుప్తీయుల వైపు చూసి, వాళ్లను అయోమయంలో పడేశాడు.
25 ఆయన వాళ్ల రథాలకున్న చక్రాలు ఊడిపోయేలా చేస్తూ ఉన్నాడు, దాంతో వాళ్లకు రథాల్ని తోలడం కష్టమైపోయింది. అప్పుడు ఆ ఐగుప్తీయులు, “మనం ఇశ్రాయేలీయుల దగ్గర నుండి పారిపోదాం పదండి, యెహోవా వాళ్ల తరఫున ఐగుప్తీయులమైన మనతో యుద్ధం చేస్తున్నాడు” అని చెప్పుకున్నారు.+
26 తర్వాత యెహోవా మోషేతో, “ఆ ఐగుప్తీయుల మీదికి, వాళ్ల యుద్ధ రథాల మీదికి, వాళ్ల అశ్వదళం మీదికి నీళ్లు తిరిగి వచ్చేలా నీ చేతిని సముద్రం మీద చాపు” అన్నాడు.
27 వెంటనే మోషే సముద్రం మీద చెయ్యి చాపాడు. తెల్లవారుతుండగా సముద్రం మళ్లీ మామూలు స్థితికి వచ్చింది. ఐగుప్తీయులు దాని దగ్గర నుండి పారిపోతున్నప్పుడు, యెహోవా వాళ్లను కుదిపేసి సముద్రం మధ్యలో పడేశాడు.+
28 తిరిగొస్తున్న నీళ్లు యుద్ధ రథాల్ని, అశ్వదళాన్ని, ఇశ్రాయేలీయుల వెంట సముద్రంలోకి వెళ్లిన ఫరో సైన్యమంతటినీ ముంచేశాయి.+ వాళ్లలో ఒక్కరు కూడా బ్రతికి బయటపడలేదు.+
29 అయితే ఇశ్రాయేలీయులు సముద్రం మధ్య ఆరిన నేల మీద నడిచివెళ్లారు;+ వాళ్ల కుడిచేతి వైపు, ఎడమచేతి వైపు నీళ్లు గోడల్లా నిలిచాయి.+
30 అలా యెహోవా ఆ రోజు ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయుల్ని రక్షించాడు.+ ఆ ఐగుప్తీయులు చనిపోయి సముద్రం ఒడ్డున పడివుండడం ఇశ్రాయేలీయులు చూశారు.
31 యెహోవా ఐగుప్తీయులకు వ్యతిరేకంగా ప్రయోగించిన గొప్ప శక్తిని* కూడా ఇశ్రాయేలీయులు చూశారు. దాంతో వాళ్లు యెహోవాకు భయపడడం, యెహోవా మీద, ఆయన సేవకుడైన మోషే మీద విశ్వాసముంచడం మొదలుపెట్టారు.+
అధస్సూచీలు
^ ఇది ఎర్రసముద్రం అని స్పష్టమౌతోంది.
^ అంటే, దాదాపు రాత్రి 2 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు.
^ అక్ష., “చేతిని.”