ద్వితీయోపదేశకాండం 3:1-29

  • బాషాను రాజైన ఓగుపై విజయం (1-7)

  • యొర్దానుకు తూర్పున ఉన్న ప్రాంతాన్ని పంచి ఇవ్వడం (8-20)

  • భయపడొద్దని యెహోషువకు చెప్పడం (21, 22)

  • మోషే వాగ్దాన దేశంలోకి వెళ్లడు (23-29)

3  “తర్వాత మనం పక్కకు తిరిగి, బాషాను మార్గం గుండా వెళ్లాం. అప్పుడు బాషాను రాజైన ఓగు తన ప్రజలందర్నీ తీసుకొని మనతో యుద్ధం చేయడానికి ఎద్రెయికి వచ్చాడు.+  అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు: ‘అతన్ని చూసి భయపడకు. ఎందుకంటే అతన్ని, అతని ప్రజలందర్నీ, అతని దేశాన్ని నేను నీ చేతికి అప్పగిస్తాను. నువ్వు హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్టే ఇతనికి కూడా చేస్తావు.’  అలా మన దేవుడైన యెహోవా బాషాను రాజైన ఓగును, అతని ప్రజలందర్నీ మన చేతికి అప్పగించాడు. మనం వాళ్లలో ఒక్కరు కూడా మిగలకుండా ఉండేవరకు అందర్నీ చంపుకుంటూ వచ్చాం.  తర్వాత మనం అతని నగరాలన్నిటినీ చెరపట్టాం. మనం వాళ్ల దగ్గర నుండి తీసుకోని పట్టణమంటూ ఏదీ లేదు. బాషానులో ఓగు రాజ్యమైన అర్గోబు ప్రదేశమంతటినీ, అంటే మొత్తం 60 నగరాల్ని మనం స్వాధీనం చేసుకున్నాం.+  ఆ నగరాలన్నిటికీ ఎత్తైన ప్రాకారాలు, ద్వారాలు, అడ్డగడియలు ఉన్నాయి. అంతేకాదు, ఎన్నో చిన్న పట్టణాల్ని కూడా మనం స్వాధీనం చేసుకున్నాం.  మనం హెష్బోను రాజైన సీహోను విషయంలో చేసినట్టే, వాళ్లను పూర్తిగా నాశనం చేశాం.+ వాళ్ల నగరాలన్నిటినీ, వాటిలో ఉన్న పురుషుల్ని, స్త్రీలను, పిల్లల్ని సమూలంగా నాశనం చేశాం.+  అలాగే వాళ్ల పశువులన్నిటినీ, వాళ్ల నగరాల్లోని దోపుడుసొమ్మును తీసుకున్నాం.  “ఆ సమయంలో మనం యొర్దాను ప్రదేశంలో ఉన్న ఇద్దరు అమోరీయుల రాజుల దేశాన్ని+ అంటే అర్నోను లోయ* నుండి హెర్మోను పర్వతం వరకున్న ప్రాంతాల్ని చెరపట్టాం+  (ఈ హెర్మోను పర్వతాన్ని సీదోనీయులు షిర్యోను అనీ, అమోరీయులు శెనీరు అనీ పిలిచేవాళ్లు); 10  పీఠభూమిలోని నగరాలన్నిటినీ, గిలాదు ప్రాంతమంతటినీ, అలాగే బాషానులో ఓగు రాజ్యానికి చెందిన సల్కా, ఎద్రెయి+ నగరాల వరకున్న బాషాను ప్రాంతమంతటినీ మనం చెరపట్టాం. 11  రెఫాయీయుల్లో బాషానుకు చెందిన ఓగు రాజే చివరివాడు. అతని పాడెను* ఇనుముతో* తయారుచేశారు. అది ఇప్పటికీ అమ్మోనీయుల ప్రాంతమైన రబ్బాలో ఉంది. ప్రామాణిక మూర* ప్రకారం ఆ పాడె పొడవు తొమ్మిది మూరలు, వెడల్పు నాలుగు మూరలు. 12  ఆ సమయంలో మనం ఈ ప్రాంతాన్ని, అంటే అర్నోను లోయ* దగ్గరున్న అరోయేరు+ మొదలుకొని గిలాదు కొండ ప్రాంతంలోని సగభాగం వరకున్న ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాం. నేను అక్కడి నగరాల్ని రూబేనీయులకు, గాదీయులకు ఇచ్చాను.+ 13  గిలాదులో మిగిలిన భాగాన్ని, ఓగు రాజ్యంలోని బాషాను అంతటినీ నేను మనష్షే అర్ధగోత్రం వాళ్లకు ఇచ్చాను.+ బాషానుకు చెందిన అర్గోబు ప్రదేశమంతా రెఫాయీయుల ప్రదేశమని పిలవబడేది. 14  “మనష్షే వంశస్థుడైన యాయీరు+ గెషూరీయుల, మాయకాతీయుల+ సరిహద్దు వరకున్న అర్గోబు ప్రదేశమంతటినీ+ తీసుకొని, బాషానులోని ఆ గ్రామాలకు హవోత్‌-యాయీరు* అని తన పేరే పెట్టుకున్నాడు.+ ఇప్పటికీ వాటికి అదే పేరు. 15  గిలాదు ప్రాంతాన్ని నేను మాకీరుకు ఇచ్చాను.+ 16  అలాగే రూబేనీయులకు, గాదీయులకు+ గిలాదు నుండి అర్నోను లోయ* వరకు (ఆ లోయ మధ్యభాగం దాని సరిహద్దు), అమ్మోనీయుల సరిహద్దు అయిన యబ్బోకు లోయ వరకు, 17  అలాగే అరాబా, యొర్దాను నది, దాని ఒడ్డు వరకు, కిన్నెరెతు నుండి అరాబా సముద్రం వరకు అంటే ఉప్పు సముద్రం* వరకు ఇచ్చాను. ఈ సముద్రం, తూర్పు వైపున పిస్గా కొండచరియల దిగువన ఉంది.+ 18  “తర్వాత నేను మీకు ఈ ఆజ్ఞ ఇచ్చాను: ‘మీరు ఈ దేశాన్ని స్వాధీనపర్చుకోవడానికి మీ దేవుడైన యెహోవా దీన్ని మీకు ఇచ్చాడు. మీలో శూరులైన వాళ్లంతా ఆయుధాలు ధరించి, మీ సహోదరులైన ఇశ్రాయేలీయుల ముందు నది దాటాలి. 19  కేవలం మీ భార్యలు, పిల్లలు, మీ పశువులు (మీకు చాలా పశువులు ఉన్నాయని నాకు బాగా తెలుసు) మాత్రమే నేను మీకు ఇచ్చిన నగరాల్లో ఉండవచ్చు. 20  యెహోవా మీకు ఇచ్చినట్టే మీ సహోదరులకు కూడా విశ్రాంతిని ఇచ్చేవరకు, యొర్దాను అవతల మీ దేవుడైన యెహోవా వాళ్లకు ఇవ్వబోయే దేశాన్ని వాళ్లు స్వాధీనం చేసుకునే వరకు మీ కుటుంబాలు, మీ పశువులు ఇక్కడే ఉండవచ్చు. ఆ తర్వాత మీలో ప్రతీ ఒక్కరు నేను మీకు సొత్తుగా ఇచ్చిన ప్రాంతానికి తిరిగొస్తారు.’+ 21  “ఆ సమయంలో నేను యెహోషువకు+ ఈ ఆజ్ఞ ఇచ్చాను: ‘మీ దేవుడైన యెహోవా ఈ ఇద్దరు రాజులకు చేసినదాన్ని నువ్వు కళ్లారా చూశావు. నది దాటి నువ్వు వెళ్లే రాజ్యాలన్నిటి విషయంలో కూడా యెహోవా అదే చేస్తాడు.+ 22  మీరు వాళ్లను చూసి భయపడకూడదు, ఎందుకంటే మీ దేవుడైన యెహోవాయే మీ తరఫున వాళ్లతో పోరాడతాడు.’+ 23  “ఆ సమయంలో నేను యెహోవాను ఇలా వేడుకున్నాను: 24  ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా, నువ్వు నీ గొప్పతనాన్ని, నీ శక్తివంతమైన బాహువును నీ సేవకునికి చూపించడం+ మొదలుపెట్టావు. నువ్వు చేసినలాంటి శక్తివంతమైన కార్యాల్ని పరలోకంలో గానీ, భూమ్మీద గానీ ఉన్న ఏ దేవుడు చేయగలడు?+ 25  దయచేసి నన్ను ఈ నది దాటనివ్వు, యొర్దాను నది అవతల ఉన్న మంచి దేశాన్ని, ఈ అందమైన పర్వత ప్రాంతాన్ని, లెబానోనును చూడనివ్వు.’+ 26  కానీ మీ కారణంగా యెహోవా అప్పటికీ నా మీద కోపంగానే ఉన్నాడు,+ అందుకే ఆయన నా మొర వినలేదు. బదులుగా యెహోవా నాతో ఇలా అన్నాడు: ‘ఇక చాలు! ఈ విషయం గురించి ఇంకెప్పుడూ నాతో మాట్లాడకు! 27  నువ్వు పిస్గా కొండ మీదికి వెళ్లి+ పడమటి వైపు, ఉత్తరం వైపు, దక్షిణం వైపు, తూర్పు వైపు తల ఎత్తి నీ కళ్లారా ఆ దేశాన్ని చూడు. ఎందుకంటే నువ్వు ఈ యొర్దాను నది దాటవు.+ 28  నువ్వు యెహోషువను నాయకుడిగా నియమించి,+ అతన్ని ప్రోత్సహించి, బలపర్చు. ఎందుకంటే, ఈ ప్రజల ముందు నది దాటేది, నువ్వు చూడబోయే దేశాన్ని స్వాధీనం చేసుకునేలా ఈ ప్రజల్ని నడిపించేది అతనే.’ 29  ఇదంతా మనం బేత్పెయోరు ఎదురుగా ఉన్న లోయలో నివసిస్తున్నప్పుడు జరిగింది.+

అధస్సూచీలు

లేదా “అర్నోను వాగు.”
లేదా “శవపేటికను.”
లేదా “నల్లని అగ్గిరాయితో” అయ్యుంటుంది.
అప్పట్లో ఒక మూర 44.5 సెంటీమీటర్లతో (17.5 అంగుళాలతో) సమానం. అనుబంధం B14 చూడండి.
లేదా “అర్నోను వాగు.”
“డేరాలున్న యాయీరు గ్రామాలు” అని అర్థం.
లేదా “అర్నోను వాగు.”
అంటే, మృత సముద్రం.