ద్వితీయోపదేశకాండం 25:1-19

  • ఎన్ని దెబ్బలు కొట్టవచ్చు (1-3)

  • నూర్చే ఎద్దు మూతికి చిక్కం వేయకూడదు (4)

  • మరిది ధర్మం (5-10)

  • పోట్లాడుతున్నప్పుడు పట్టుకోకూడనివి (11, 12)

  • న్యాయమైన తూకంరాళ్లు, కొలతలు (13-16)

  • అమాలేకీయుల్ని నాశనం చేయాలి (17-19)

25  “ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం తలెత్తినప్పుడు, వాళ్లు న్యాయమూర్తుల ముందుకు రావాలి.+ ఆ న్యాయమూర్తులు వాళ్లకు తీర్పు తీర్చి నీతిమంతుణ్ణి నిర్దోషిగా, దుష్టుణ్ణి అపరాధిగా ప్రకటిస్తారు.+  ఒకవేళ ఆ దుష్టుణ్ణి కొట్టాలని నిర్ణయిస్తే,+ న్యాయమూర్తి అతన్ని బోర్లా పడుకోబెట్టించి, తన సమక్షంలో అతన్ని కొట్టిస్తాడు. అతను చేసిన చెడ్డపనికి తగినన్ని దెబ్బలే అతనికి పడాలి.  అతన్ని 40 దెబ్బల వరకు కొట్టవచ్చు,+ అంతకన్నా ఎక్కువ కొట్టకూడదు. ఒకవేళ ఇంకా ఎక్కువ దెబ్బలు కొడితే నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడిగా కనిపిస్తాడు.  “నూర్చే ఎద్దు మూతికి చిక్కం వేయకూడదు.+  “ఒక కుటుంబంలో సహోదరులు కలిసి జీవిస్తున్నప్పుడు, వాళ్లలో ఒక వ్యక్తి కుమారులు లేకుండానే చనిపోతే, చనిపోయిన వ్యక్తి భార్య ఆ కుటుంబానికి చెందని బయటి వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదు. ఆమె భర్త సహోదరుడే ఆమె దగ్గరికి వెళ్లి ఆమెను పెళ్లి చేసుకోవాలి; అలా అతను తన బాధ్యతను* నిర్వర్తించాలి.+  ఆమె కనే మొదటి కుమారుడు, చనిపోయిన వ్యక్తి పేరు ఇశ్రాయేలులో నుండి తుడిచిపెట్టబడకుండా ఉండేలా+ అతని పేరును నిలబెడతాడు.+  “కానీ విధవరాలైన తన సహోదరుని భార్యను పెళ్లిచేసుకోవడం అతనికి ఇష్టంలేకపోతే, ఆమె నగర ద్వారం దగ్గరున్న పెద్దల దగ్గరికి వెళ్లి, ఇలా చెప్పాలి: ‘నా భర్త సహోదరుడు ఇశ్రాయేలులో తన సహోదరుని పేరును నిలబెట్టడానికి నిరాకరించాడు. నన్ను పెళ్లి చేసుకొని తన బాధ్యతను నిర్వర్తించడానికి అతను ఒప్పుకోలేదు.’  అప్పుడు ఆ నగర పెద్దలు అతన్ని పిలిపించి, అతనితో మాట్లాడాలి. అయినాసరే అతను, ‘ఆమెను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టంలేదు’ అని అదేపనిగా అంటుంటే,  విధవరాలైన అతని సహోదరుని భార్య ఆ పెద్దల ఎదుట అతని దగ్గరికి వెళ్లి, అతని కాలికి ఉన్న చెప్పు తీసి,+ అతని ముఖం మీద ఉమ్మివేసి, ‘తన సహోదరుని వంశాన్ని నిలబెట్టని వ్యక్తికి ఇలా చేయాలి’ అని అనాలి. 10  ఆ తర్వాత ఇశ్రాయేలులో అతని వంశం,* ‘చెప్పు ఊడదీయబడినవాడి వంశం’ అని పిలవబడుతుంది. 11  “ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటున్నప్పుడు, వాళ్లలో ఒకతని భార్య తన భర్తను కొడుతున్న వ్యక్తి నుండి తన భర్తను కాపాడుకోవడానికి చెయ్యి చాపి ఆ వ్యక్తి మర్మాంగాల్ని పట్టుకుంటే, 12  ఆమె చేతిని నరికేయాలి. నువ్వు* ఆమె మీద జాలిపడకూడదు. 13  “నీ సంచిలో రెండు రకాల తూకంరాళ్లను అంటే పెద్దది ఒకటి, చిన్నది ఒకటి ఉంచుకోకూడదు.+ 14  నీ ఇంట్లో రెండు రకాల కొలత పాత్రల్ని,* అంటే పెద్దది ఒకటి, చిన్నది ఒకటి ఉంచుకోకూడదు.+ 15  నువ్వు ఖచ్చితమైన, న్యాయమైన తూకంరాళ్లను; ఖచ్చితమైన, న్యాయమైన కొలతల్ని నీ దగ్గర ఉంచుకోవాలి. అప్పుడే నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న దేశంలో నువ్వు చాలాకాలం బ్రతుకుతావు.+ 16  ఇలాంటి విషయాల్లో అన్యాయంగా నడుచుకునే ప్రతీ వ్యక్తిని నీ దేవుడైన యెహోవా అసహ్యించుకుంటాడు.+ 17  “మీరు ఐగుప్తు నుండి బయటికి వస్తున్నప్పుడు దారిలో అమాలేకు నీకు ఏమి చేశాడో గుర్తుచేసుకో.+ 18  త్రోవలో అతను నీకు ఎదురుపడి, నువ్వు అలసిపోయి నీరసంగా ఉన్నప్పుడు, వెనక నడుస్తున్న వాళ్లందరి మీద దాడి చేశాడు. అతను దేవునికి భయపడలేదు. 19  నువ్వు స్వాధీనం చేసుకోవడానికి నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇస్తున్న దేశంలో నీ చుట్టుపక్కల ఉన్న నీ శత్రువులందరి నుండి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతిని ఇచ్చినప్పుడు,+ అమాలేకు పేరు ఆకాశం కింద వినబడకుండా తుడిచిపెట్టేయాలి.+ నువ్వు ఈ విషయాన్ని మర్చిపోకూడదు.

అధస్సూచీలు

పదకోశంలో “మరిది ధర్మం” చూడండి.
లేదా “అతని ఇంటి పేరు.” అక్ష., “అతని పేరు.”
అక్ష., “నీ కన్ను.”
లేదా “రెండు రకాల ఈఫా కొలతల్ని.” అనుబంధం B14 చూడండి.