ద్వితీయోపదేశకాండం 21:1-23

  • హంతకుడు ఎవరో తెలియని ఘటనలు (1-9)

  • చెరపట్టిన స్త్రీలను పెళ్లి చేసుకోవడం (10-14)

  • పెద్ద కుమారుడికి ఉండే హక్కు (15-17)

  • మొండివాడైన కుమారుడు (18-21)

  • కొయ్యకు వేలాడదీయబడిన వ్యక్తి శాపగ్రస్తుడు (22, 23)

21  “నువ్వు స్వాధీనం చేసుకోవడానికి నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న దేశంలోని ఒక పొలంలో, హత్యకు గురైన ఒక వ్యక్తి శవం కనబడితే, ఆ హత్య ఎవరు చేశారో తెలియకపోతే,  నీ పెద్దలు, న్యాయమూర్తులు+ అక్కడికి వెళ్లి ఆ శవం దగ్గర నుండి చుట్టుపక్కల నగరాలకున్న దూరాన్ని కొలవాలి.  తర్వాత ఆ శవానికి దగ్గర్లో ఉన్న నగరానికి చెందిన పెద్దలు మందలో నుండి ఎన్నడూ పనిలో పెట్టని, ఎన్నడూ కాడి మోయని ఒక పెయ్యను తీసుకోవాలి.  తర్వాత ఆ నగర పెద్దలు ఆ పెయ్యను ఎన్నడూ దున్నని, విత్తనాలు విత్తని, నీళ్లు పారుతున్న లోయలోకి* తోలుకెళ్లి, అక్కడ దాని మెడ విరగ్గొట్టాలి.+  “లేవీయులైన యాజకులు అక్కడికి వస్తారు. ఎందుకంటే తనకు పరిచారం చేయడానికి, యెహోవా పేరున దీవెనలు ప్రకటించడానికి+ నీ దేవుడైన యెహోవా వాళ్లను ఎంచుకున్నాడు.+ హింసకు సంబంధించిన ప్రతీ వివాదాన్ని ఎలా పరిష్కరించాలో వాళ్లు చెప్తారు.+  ఆ శవానికి దగ్గర్లో ఉన్న నగరానికి చెందిన పెద్దలందరూ, లోయలో మెడ విరగ్గొట్టబడిన పెయ్య మీద తమ చేతులు కడుక్కొని,+  ఇలా ప్రకటించాలి: ‘మా చేతులు ఈ రక్తాన్ని చిందించలేదు, ఈ రక్తం చిందించబడడాన్ని మా కళ్లు చూడలేదు.  యెహోవా, నువ్వు విమోచించిన నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద+ ఈ నేరం మోపకు, నిర్దోషి రక్తం చిందించబడడం వల్ల కలిగిన అపరాధాన్ని నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద ఉండనివ్వకు.’+ అప్పుడు, ఆ రక్తాపరాధం వాళ్ల మీద మోపబడదు.  అలా నువ్వు యెహోవా దృష్టిలో సరైనది చేసి, నిర్దోషి రక్తం చిందించబడడం వల్ల కలిగిన అపరాధాన్ని నీ మధ్య నుండి తీసేస్తావు. 10  “నువ్వు నీ శత్రువుల మీదికి యుద్ధానికి వెళ్లినప్పుడు, నీ దేవుడైన యెహోవా నీకోసం వాళ్లను ఓడించాక, నువ్వు వాళ్లను చెరపట్టావనుకో,+ 11  అప్పుడు ఆ బందీల్లో నీకు ఒక అందమైన స్త్రీ కనిపించి, నీకు ఆమె బాగా నచ్చి, నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటే, 12  ఆమెను నీ ఇంటికి తెచ్చుకోవచ్చు. తర్వాత ఆమె గుండు చేసుకోవాలి, గోళ్లు కత్తిరించుకోవాలి, 13  బందీగా వచ్చినప్పుడు ఆమె వేసుకొనివున్న వస్త్రాలు మార్చుకొని నీ ఇంట్లో నివసించాలి. ఆమె ఒక నెలంతా తన తల్లిదండ్రుల గురించి ఏడుస్తుంది.+ ఆ తర్వాత నువ్వు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోవచ్చు; అప్పుడు నువ్వు ఆమెకు భర్తవు అవుతావు, ఆమె నీకు భార్య అవుతుంది. 14  కానీ ఆ తర్వాత ఆమె నీకు నచ్చకపోతే, ఆమె ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్లనివ్వాలి.+ అయితే నువ్వు ఆమెను డబ్బులకు అమ్మకూడదు, ఆమెతో కఠినంగా వ్యవహరించకూడదు, ఎందుకంటే నువ్వు ఆమెను అవమానపర్చావు. 15  “ఒకతనికి ఇద్దరు భార్యలు ఉన్నారనుకోండి, అతను ఒకామెను ఇంకొకామె కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు;* ఆ ఇద్దరికీ కుమారులు పుట్టారు. అయితే వాళ్లలో పెద్దవాడు, అతను తక్కువగా ప్రేమించే భార్య కుమారుడు.+ 16  అతను తన కుమారులకు స్వాస్థ్యాన్ని ఇచ్చే రోజున, తాను తక్కువగా ప్రేమించే భార్యకు పుట్టిన పెద్ద కుమారుణ్ణి కాదని, ఎక్కువగా ప్రేమించే భార్యకు పుట్టినవాణ్ణి పెద్ద కుమారుడిగా పరిగణించకూడదు. 17  అతను తనకు ఉన్నదానంతట్లో రెండు పాళ్లను తాను తక్కువగా ప్రేమించే భార్య కుమారుడికి ఇవ్వడం ద్వారా అతన్ని పెద్ద కుమారుడిగా గుర్తించాలి. ఎందుకంటే ఆ కుమారుడే అతని శక్తికి* ప్రథమఫలం. పెద్ద కుమారుడి స్థానాన్ని పొందే హక్కు ఆ కుమారుడికే చెందుతుంది.+ 18  “ఒకవేళ ఒక వ్యక్తికి తిరుగుబాటు చేసే, మొండివాడైన కుమారుడు ఉన్నాడనుకోండి. అతను వాళ్ల నాన్నకు గానీ, అమ్మకు గానీ లోబడట్లేదు;+ వాళ్లు అతన్ని సరిదిద్దడానికి ప్రయత్నించినా, అతను వాళ్ల మాట వినట్లేదు.+ 19  అలాంటప్పుడు అతని అమ్మానాన్నలు అతన్ని పట్టుకొని, నగర ద్వారం దగ్గరున్న పెద్దల దగ్గరికి తీసుకొచ్చి, 20  ఆ నగర పెద్దలతో, ‘వీడు మా అబ్బాయి. వీడు చాలా మొండివాడు, తిరుగుబాటుదారుడు; మా మాట అస్సలు వినట్లేదు. వీడు తిండిబోతు,+ తాగుబోతు’+ అని చెప్పాలి. 21  అప్పుడు ఆ నగరంలోని పురుషులందరూ అతన్ని రాళ్లతో కొట్టి చంపాలి. అలా నువ్వు నీ మధ్య నుండి చెడుతనాన్ని నిర్మూలించాలి. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ దాని గురించి విని భయపడతారు.+ 22  “ఒకతను మరణశిక్షకు తగిన పాపం చేసి, చంపబడి,+ కొయ్యకు వేలాడదీయబడ్డాడు అనుకోండి.+ 23  అలాంటప్పుడు అతని శవం రాత్రంతా కొయ్య మీద ఉండకూడదు.+ బదులుగా, నువ్వు అతన్ని అదే రోజున పాతిపెట్టేలా చూసుకోవాలి. ఎందుకంటే కొయ్య మీద వేలాడదీయబడిన వ్యక్తి దేవుని శాపానికి గురైనవాడు.+ నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇస్తున్న దేశాన్ని నువ్వు అపవిత్రం చేయకూడదు.+

అధస్సూచీలు

లేదా “వాగు దగ్గరికి.”
లేదా “ఒకామెను ప్రేమిస్తున్నాడు, ఇంకొకామెను ద్వేషిస్తున్నాడు.”
లేదా “పిల్లల్ని కనే శక్తికి.”