ద్వితీయోపదేశకాండం 2:1-37

  • ఎడారిలో 38 ఏళ్లు సంచరించడం (1-23)

  • హెష్బోను రాజైన సీహోనుపై విజయం (24-37)

2  “తర్వాత యెహోవా నాకు చెప్పినట్టే మనం వెనక్కి తిరిగి, ఎర్రసముద్ర మార్గంలో ఎడారికి ప్రయాణించాం.+ మనం చాలా రోజుల పాటు శేయీరు కొండ చుట్టూ తిరిగాం.  చివరికి యెహోవా నాతో ఇలా అన్నాడు:  ‘మీరు ఇన్ని రోజుల పాటు ఈ కొండ చుట్టూ తిరిగింది చాలు. ఇప్పుడు ఉత్తరం వైపు తిరగండి.  నువ్వు ప్రజలకు ఇలా ఆజ్ఞాపించు: “మీరు శేయీరులో నివసిస్తున్న+ మీ సహోదరులైన ఏశావు వంశస్థుల+ సరిహద్దు మీదుగా వెళ్తారు. వాళ్లు మిమ్మల్ని చూసి భయపడతారు.+ కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.  మీరు వాళ్లతో శత్రుత్వం పెట్టుకోకండి.* నేను వాళ్ల దేశంలోని ఏ కాస్త భూమినీ, కనీసం ఒక్క పాదం పట్టేంత భూమిని కూడా మీకు ఇవ్వను. ఎందుకంటే నేను శేయీరు కొండను ఏశావుకు సొత్తుగా ఇచ్చాను.+  మీరు అక్కడ తినే ఆహారానికి, తాగే నీళ్లకు వాళ్లకు డబ్బులు చెల్లించాలి.+  ఎందుకంటే మీరు చేసిన ప్రతీ పనిలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని దీవిస్తూ వచ్చాడు. ఈ మహా ఎడారిలో మీరు సాగించిన నడక గురించి కూడా ఆయనకు పూర్తిగా తెలుసు. ఈ 40 సంవత్సరాలు యెహోవా మీకు తోడుగా ఉన్నాడు, మీకు ఏమీ తక్కువ కాలేదు.” ’+  కాబట్టి మనం శేయీరులో నివసిస్తున్న మన సహోదరులైన ఏశావు వంశస్థుల సరిహద్దు మీదుగా వెళ్లాం.+ అరాబా మార్గానికి, ఏలతుకు, ఎసోన్గెబెరుకు+ వెళ్లకుండా చూసుకున్నాం. “తర్వాత మనం పక్కకు తిరిగి మోయాబు ఎడారి మార్గం గుండా ప్రయాణించాం.+  అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు: ‘మోయాబీయులతో శత్రుత్వం పెట్టుకోకండి, వాళ్లతో యుద్ధం చేయకండి; వాళ్ల దేశంలోని ఏ కాస్త భూమినీ నేను మీకు సొత్తుగా ఇవ్వను. ఎందుకంటే నేను ఆరు ప్రాంతాన్ని లోతు వంశస్థులకు+ సొత్తుగా ఇచ్చాను. 10  (ఇంతకుముందు అక్కడ ఏమీయులు+ నివసించేవాళ్లు. వాళ్లు అనాకీయుల్లాగే పొడుగ్గా, బలంగా ఉండేవాళ్లు; వాళ్ల సంఖ్య చాలా పెద్దది. 11  రెఫాయీయులు+ కూడా అనాకీయుల్లాగే+ ఉండేవాళ్లు, మోయాబీయులు వాళ్లను ఏమీయులని పిలిచేవాళ్లు. 12  అంతకుముందు శేయీరులో హోరీయులు+ ఉండేవాళ్లు. కానీ ఏశావు వంశస్థులు వాళ్లను ఓడించి, సమూలంగా నాశనం చేసి వాళ్ల ప్రాంతంలో స్థిరపడ్డారు.+ యెహోవా ఖచ్చితంగా తమకు సొత్తుగా ఇవ్వబోతున్న దేశం విషయంలో ఇశ్రాయేలీయులు కూడా అలాగే చేస్తారు.) 13  ఇప్పుడు మీరు బయల్దేరి జెరెదు లోయ* దాటండి.’ కాబట్టి మనం జెరెదు లోయ*+ దాటాం. 14  కాదేషు-బర్నేయ నుండి నడుచుకుంటూ జెరెదు లోయ* దాటే వరకు మనకు 38 సంవత్సరాలు పట్టింది. యెహోవా వాళ్లతో ప్రమాణం చేసినట్టే ఆ సైనికుల తరమంతా సమాజంలో లేకుండా నశించిపోయేవరకు మనం ప్రయాణిస్తూ ఉన్నాం.+ 15  వాళ్లు నశించిపోయే వరకు, వాళ్లను సమాజంలో లేకుండా చేయడానికి యెహోవా చెయ్యి వాళ్లకు వ్యతిరేకంగా ఉంది.+ 16  “ఆ సైనికులందరూ చనిపోయిన వెంటనే,+ 17  యెహోవా మళ్లీ నాతో మాట్లాడి ఇలా అన్నాడు: 18  ‘ఈ రోజు మీరు మోయాబు ప్రాంతమైన ఆరును దాటివెళ్లాలి. 19  మీరు అమ్మోనీయుల ప్రాంతం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్లను వేధించకండి, రెచ్చగొట్టకండి; నేను అమ్మోనీయుల దేశంలోని ఏ కాస్త భూమినీ మీకు సొత్తుగా ఇవ్వను. ఎందుకంటే నేను దాన్ని లోతు వంశస్థులకు సొత్తుగా ఇచ్చాను.+ 20  ఇది కూడా ఒకప్పుడు రెఫాయీయుల ప్రాంతంగా+ పరిగణించబడేది. (అప్పట్లో అక్కడ రెఫాయీయులు నివసించేవాళ్లు, అమ్మోనీయులు వాళ్లను జంజుమ్మీయులని పిలిచేవాళ్లు. 21  అనాకీయుల్లాగే వాళ్లు పొడుగ్గా, బలంగా ఉండేవాళ్లు;+ వాళ్ల సంఖ్య చాలా పెద్దది. కానీ యెహోవా వాళ్లను అమ్మోనీయుల ఎదుట సమూలంగా నాశనం చేశాడు. ఈ అమ్మోనీయులు వాళ్లను తరిమేసి వాళ్ల ప్రాంతంలో స్థిరపడ్డారు. 22  ప్రస్తుతం శేయీరులో ఉంటున్న ఏశావు వంశస్థుల+ విషయంలో కూడా ఆయన అలాగే చేశాడు. వాళ్ల ఎదుట హోరీయుల్ని సమూలంగా నాశనం చేశాడు.+ అలా ఏశావు వంశస్థులు హోరీయుల ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని, నేటివరకు అక్కడే నివసిస్తున్నారు. 23  ఆవీయుల విషయానికొస్తే, వాళ్లు గాజా+ పరిసర ప్రాంతంలోని గ్రామాల్లో నివసించేవాళ్లు. ఆ తర్వాత కఫ్తోరు* నుండి వచ్చిన కఫ్తోరీయులు+ వాళ్లను సమూలంగా నాశనం చేసి వాళ్ల ప్రాంతంలో స్థిరపడ్డారు.) 24  “ ‘ఇప్పుడు మీరు లేచి, అర్నోను లోయ*+ దాటండి. ఇదిగో, అమోరీయుడూ హెష్బోను రాజూ అయిన సీహోనును+ నేను మీ చేతికి అప్పగించేశాను. కాబట్టి అతని దేశాన్ని స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టండి, అతనితో యుద్ధం చేయండి. 25  నేడు నేను ఆకాశం కింద మీ గురించిన వార్త వినే ప్రజలందరూ మీరంటే భయపడేలా, బెదిరిపోయేలా చేయడం మొదలుపెడతాను. వాళ్లు మీ గురించి విని కలవరపడతారు, వణికిపోతారు.’+ 26  “అప్పుడు నేను కెదేమోతు+ ఎడారి నుండి హెష్బోను రాజైన సీహోను దగ్గరికి సందేశకుల్ని పంపి, ఈ శాంతికరమైన మాటలు చెప్పమన్నాను:+ 27  ‘దయచేసి నన్ను నీ దేశం గుండా వెళ్లనివ్వు. నేను కుడివైపుకు గానీ ఎడమవైపుకు గానీ తిరగకుండా తిన్నగా రాజమార్గంలో వెళ్లిపోతాను.+ 28  నువ్వు నాకు అమ్మే ఆహారాన్ని మాత్రమే నేను తింటాను, నువ్వు నాకు అమ్మే నీళ్లను మాత్రమే తాగుతాను. నన్ను నీ దేశం గుండా నడుచుకుంటూ వెళ్లనిస్తే చాలు. 29  శేయీరులో నివసిస్తున్న ఏశావు వంశస్థులు, ఆరులో నివసిస్తున్న మోయాబీయులు కూడా నన్ను అలాగే వెళ్లనిచ్చారు. నేను యొర్దాను దాటి మా దేవుడైన యెహోవా మాకు ఇవ్వబోతున్న దేశంలోకి అడుగుపెట్టేవరకు నీ దేశం గుండా వెళ్లనిస్తే చాలు.’ 30  కానీ హెష్బోను రాజైన సీహోను మనల్ని తన ప్రాంతం గుండా వెళ్లనివ్వలేదు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా అతని మనసును* కఠినం అవ్వనిచ్చాడు,+ అతని హృదయాన్ని రాయిలా మారనిచ్చాడు. ఇలా అతన్ని మీ చేతులకు అప్పగించడానికే దేవుడు అలా చేశాడు.+ 31  “తర్వాత యెహోవా నాకు ఇలా చెప్పాడు: ‘ఇదిగో, ఇప్పటికే సీహోనును, అతని దేశాన్ని నీకు ఇవ్వడం మొదలుపెట్టేశాను. అతని దేశాన్ని స్వాధీనం చేసుకోవడం ఆరంభించు.’+ 32  సీహోను తన ప్రజలందరితో కలిసి యాహజు దగ్గర మనతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు,+ 33  మన దేవుడైన యెహోవా అతన్ని మన చేతికి అప్పగించడంతో మనం అతన్ని, అతని కుమారుల్ని, అతని ప్రజలందర్నీ ఓడించాం. 34  ఆ సమయంలో మనం అతని నగరాలన్నిటినీ చెరపట్టి పురుషులు, స్త్రీలు, పిల్లలతో సహా వాటన్నిటినీ పూర్తిగా నాశనం చేశాం. ఒక్కర్ని కూడా బ్రతకనివ్వలేదు.+ 35  కేవలం పశువుల్ని, అలాగే చెరపట్టిన నగరాల్లోని దోపుడుసొమ్మును మాత్రమే మనం దోచుకున్నాం. 36  అర్నోను లోయ* అంచున ఉన్న అరోయేరు మొదలుకొని+ (లోయలో ఉన్న నగరం కూడా కలుపుకొని) గిలాదు వరకు మనం స్వాధీనం చేసుకోలేకపోయిన పట్టణమంటూ ఏదీ లేదు. మన దేవుడైన యెహోవా వాటన్నిటినీ మన చేతికి అప్పగించాడు.+ 37  అయితే అమ్మోనీయుల దేశం జోలికి,+ అంటే యబ్బోకు+ వాగు* ఒడ్డున ఉన్న ప్రాంతమంతటి జోలికి, కొండ ప్రాంతంలోని నగరాల జోలికి, లేదా మన దేవుడైన యెహోవా నిషేధించిన ఏ ప్రాంతం జోలికీ మీరు వెళ్లలేదు.

అధస్సూచీలు

లేదా “వాళ్లను రెచ్చగొట్టకండి.”
లేదా “వాగు.”
లేదా “వాగు.”
లేదా “వాగు.”
అంటే, క్రేతు.
లేదా “అర్నోను వాగు.”
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
లేదా “అర్నోను వాగు.”
అక్ష., “లోయ.”