ద్వితీయోపదేశకాండం 19:1-21

  • రక్తాపరాధం, ఆశ్రయపురాలు (1-13)

  • సరిహద్దు రాళ్లను జరపకూడదు (14)

  • న్యాయస్థానంలో సాక్షులు (15-21)

    • ఇద్దరుముగ్గురు సాక్షులు ఉండాలి (15)

19  “నీ దేవుడైన యెహోవా ఎవరి దేశాన్నైతే నీకు ఇస్తున్నాడో ఆ జనాల్ని నీ దేవుడైన యెహోవా నాశనం చేసిన తర్వాత, నువ్వు వాళ్లను స్వాధీనం చేసుకొని వాళ్ల నగరాల్లో, వాళ్ల ఇళ్లలో స్థిరపడినప్పుడు,+  నువ్వు స్వాధీనం చేసుకోవడానికి నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న దేశంలో నువ్వు మూడు నగరాల్ని వేరు చేయాలి.+  నువ్వు స్వాధీనం చేసుకోవడానికి నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశాన్ని నువ్వు మూడు ప్రాంతాలుగా విభజించాలి; అలాగే, హత్య చేసిన ఏ వ్యక్తయినా ఆ నగరాల్లో ఒకదానికి పారిపోగలిగేలా దారుల్ని ఏర్పాటు చేయాలి.  “ప్రాణాలు కాపాడుకోవడానికి అందులోకి పారిపోయే హంతకుని విషయంలో ఇలా జరగాలి: అతను అనుకోకుండా తన తోటివాణ్ణి చంపితే, అంతకుముందు ఆ వ్యక్తి మీద అతనికి ఎలాంటి ద్వేషం లేకపోతే;+  ఉదాహరణకు, అతను తన తోటివానితో కలిసి కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్లి, గొడ్డలితో చెట్టును నరకడానికి తన చెయ్యి లేపినప్పుడు, కర్ర నుండి గొడ్డలి విడిపోయి ఎగిరివెళ్లి తోటివానికి తగిలి ఆ వ్యక్తి చనిపోతే, ఆ హంతకుడు ప్రాణాలతో ఉండడానికి ఈ నగరాల్లో ఒకదానికి పారిపోవాలి.+  లేదంటే, ఆ నగరం చాలా దూరంలో ఉన్నందువల్ల, ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి*+ కోపావేశంలో* హంతకుణ్ణి వెంటాడి, అతన్ని పట్టుకొని చంపేస్తాడు. నిజానికి, ఆ హంతకుడికి తన తోటివాని మీద అంతకుముందు ఎలాంటి ద్వేషం లేదు కాబట్టి అతను మరణశిక్షకు అర్హుడు కాడు.+  అందుకే, ‘మూడు నగరాల్ని వేరు చేయాలి’ అని నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను.  “నీ దేవుడైన యెహోవా నీ పూర్వీకులకు ప్రమాణం చేసినట్టే నీ దేశపు సరిహద్దుల్ని విశాలపర్చి,+ నీ పూర్వీకులకు ఇస్తానని తాను వాగ్దానం చేసిన దేశమంతటినీ+ నీకు ఇచ్చినప్పుడు,  నువ్వు ఆ మూడు నగరాలకు ఇంకో మూడు నగరాలు కలపాలి.+ అయితే నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలని, ఎల్లప్పుడూ ఆయన మార్గాల్లో నడవాలని నేడు నేను నీకు ఇస్తున్న ఆజ్ఞలన్నిటినీ నువ్వు నమ్మకంగా పాటిస్తేనే+ ఆయన ఆ దేశమంతటినీ నీకు ఇస్తాడు.⁠ 10  అలా, నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇస్తున్న నీ దేశంలో ఏ నిర్దోషి రక్తమూ చిందించబడకుండా ఉంటుంది,+ నీ మీదికి ఎలాంటి రక్తాపరాధమూ రాకుండా ఉంటుంది.+ 11  “కానీ ఒక వ్యక్తి తన తోటివాణ్ణి ద్వేషించి,+ అతని మీద దాడి చేయడానికి కాపుకాసి, అతన్ని తీవ్రంగా గాయపర్చినందువల్ల అతను చనిపోయాడనుకోండి. ఒకవేళ ఆ హంతకుడు ఈ నగరాల్లో ఒకదానికి పారిపోతే, 12  అతని నగర పెద్దలు అతన్ని అక్కడి నుండి పిలిపించి, ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి చేతికి అతన్ని అప్పగించాలి, అతను చంపబడాలి.+ 13  నువ్వు* అతని మీద జాలి పడకూడదు, ఒక నిర్దోషి రక్తం చిందించబడడం వల్ల కలిగిన అపరాధాన్ని నువ్వు ఇశ్రాయేలులో నుండి తీసేయాలి,+ అప్పుడే నీకు మంచి జరుగుతుంది. 14  “నువ్వు స్వాధీనం చేసుకోవడానికి నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇస్తున్న దేశాన్ని నువ్వు పొందినప్పుడు, పూర్వీకులు ఏర్పర్చిన నీ పొరుగువాని సరిహద్దు రాయిని నువ్వు జరపకూడదు. 15  “ఏదైనా తప్పు విషయంలో గానీ, పాపం విషయంలో గానీ ఒకే ఒక్కరు ఇచ్చే సాక్ష్యం ఆధారంగా ఒక వ్యక్తికి శిక్ష విధించకూడదు.*+ ఇద్దరి లేదా ముగ్గురి సాక్ష్యం ఆధారంగా* ఆ విషయం నిర్ధారించబడాలి.+ 16  ఎదుటి వ్యక్తికి హాని తలపెట్టాలనే ఉద్దేశంతో ఎవరైనా అబద్ధసాక్ష్యం చెప్పి, అతని మీద తప్పు మోపితే,+ 17  వివాదం ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు యెహోవా ముందు, ఆ సమయంలో సేవ చేస్తున్న యాజకుల ముందు, న్యాయమూర్తుల ముందు నిలబడాలి.+ 18  ఆ న్యాయమూర్తులు దాని గురించి పూర్తిగా దర్యాప్తు చేయాలి;+ ఆ తర్వాత, సాక్ష్యం చెప్పిన వ్యక్తి అబద్ధ సాక్షి అనీ, అతను తన సహోదరుని మీద తప్పుడు నేరం మోపాడనీ తేలితే, 19  అతను కుట్రపన్ని తన సహోదరునికి తలపెట్టాలనుకున్న హానిని మీరు అతనికి చేయాలి,+ అలా నువ్వు నీ మధ్య నుండి చెడుతనాన్ని నిర్మూలించాలి.+ 20  మిగతా ప్రజలు దాని గురించి విని భయపడతారు, ఇంకెప్పుడూ అలాంటి చెడ్డపనేదీ నీ మధ్య చేయరు.+ 21  నువ్వు* అతని మీద జాలి పడకూడదు:+ ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు చెల్లించాలి.+

అధస్సూచీలు

అక్ష., “రక్తం విషయంలో ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి.”
అక్ష., “మండుతున్న హృదయంతో.”
అక్ష., “నీ కన్ను.”
అక్ష., “ఒకే ఒక్క సాక్షి అతని మీదికి లేవకూడదు.”
అక్ష., “నోట.”
అక్ష., “నీ కన్ను.”