దానియేలు 11:1-45

 • పారసీక, గ్రీసు రాజులు (1-4)

 • దక్షిణ రాజు, ఉత్తర రాజు (5-45)

  • పన్ను వసూలు చేసేవాడు లేస్తాడు (20)

  • ఒప్పంద నాయకుడు నాశనం చేయబడతాడు (22)

  • కోటల దేవుణ్ణి మహిమపరుస్తాడు (38)

  • దక్షిణ రాజుకు, ఉత్తర రాజుకు మధ్య పోరాటం (40)

  • తూర్పు నుండి, ఉత్తరం నుండి ఆందోళన కలిగించే నివేదికలు (44)

11  తర్వాత అతను ఇలా అన్నాడు: “నా విషయానికొస్తే, మాదీయుడైన దర్యావేషు పరిపాలనలోని మొదటి సంవత్సరంలో+ నేను ఆయన్ని* బలపర్చడానికి, ఆయనకు మద్దతివ్వడానికి నిలబడ్డాను.  నేను ఇప్పుడు చెప్పేది సత్యం, అదేమిటంటే: “ఇదిగో! పారసీక దేశంలో మరో ముగ్గురు రాజులు లేస్తారు. నాలుగో రాజు మిగతా వాళ్లందరికన్నా ఎక్కువ సంపదల్ని కూడబెడతాడు. అతను తన సంపదల వల్ల బలంగా తయారైనప్పుడు, అందర్నీ గ్రీసు రాజ్యానికి+ వ్యతిరేకంగా పురికొల్పుతాడు.  “తర్వాత, బలవంతుడైన ఒక రాజు నిలబడి, గొప్ప అధికారంతో* పరిపాలిస్తూ+ ఇష్టమొచ్చినట్టు చేస్తాడు.  కానీ అతను ఎంతో శక్తిమంతుడు అయినప్పుడు అతని రాజ్యం ముక్కలై, నాలుగు దిక్కులకు విభజించబడుతుంది;+ అయితే అది అతని వంశస్థులకు వెళ్లదు, అతనికి ఉన్నంత అధికారం వాళ్లకు ఉండదు. ఎందుకంటే అతని రాజ్యం తీసేయబడి వేరే​వాళ్లకు ఇవ్వబడుతుంది.  “దక్షిణ రాజు, అంటే అతని అధిపతుల్లో ఒకతను బలంగా తయారౌతాడు. అయితే మరో వ్యక్తి* అతనికన్నా బలంగా తయారై, అతని​కన్నా గొప్ప అధికారంతో పరిపాలిస్తాడు.  “కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్లు పొత్తు కుదుర్చుకుంటారు; దక్షిణ రాజు కూతురు ఒక ఒప్పందం చేయడానికి ఉత్తర రాజు దగ్గరికి వస్తుంది. కానీ ఆమె తన బాహు​బలాన్ని నిలుపుకోదు; రాజు కూడా తన అధికారాన్ని కోల్పోతాడు; దాంతో ఆమె, అలాగే ఆమెను తెచ్చిన​వాళ్లు, ఆమెను కన్న వ్యక్తి, ఆ సమయంలో ఆమెను శక్తిమంతురాలిని చేస్తున్న వ్యక్తి అప్పగించబడతారు.  ఆమె కుటుంబ సభ్యుల్లో ఒకతను అతని* స్థానంలో నిలబడతాడు; అతను సైన్యం మీదికి, ఉత్తర రాజు కోట మీదికి వచ్చి వాళ్ల మీద పోరాడి వాళ్లను జయిస్తాడు.  అతను వాళ్ల దేవుళ్లను, వాళ్ల పోత* విగ్ర​హాల్ని, వాళ్ల అమూల్యమైన* వెండి​బంగారు ​వస్తువుల్ని, బందీలను తీసుకొని ఐగుప్తుకు వస్తాడు. అతను కొన్ని సంవత్సరాల పాటు ఉత్తర రాజు మీదికి ​వెళ్లకుండా ఉంటాడు.  ఉత్తర రాజు దక్షిణ రాజు రాజ్యం మీదికి వెళ్తాడు, కానీ తర్వాత తన సొంత దేశానికి తిరిగెళ్లిపోతాడు. 10  “అతని* కుమారులు యుద్ధం కోసం ​సిద్ధపడి, విస్తారమైన ఒక గొప్ప సైన్యాన్ని ​సమకూరుస్తారు. వాళ్లలో ఒకతను* ఖచ్చితంగా ముందుకొచ్చి, వరదలా దేశాన్ని ఊడ్చుకొని వెళ్తాడు. అయితే అతను వెనక్కి వెళ్లిపోయి, తన కోటను చేరుకునే వరకు యుద్ధం చేస్తాడు. 11  “అప్పుడు దక్షిణ రాజుకు కోపం వచ్చి, అతనితో అంటే ఉత్తర రాజుతో యుద్ధం చేయడానికి వెళ్తాడు; అతను చాలామంది ప్రజల్ని సమకూ​ర్చుకుంటాడు, కానీ వాళ్లు ఆ రాజు* చేతికి అప్పగించబడతారు. 12  ఆ ప్రజలు తీసుకెళ్లబడతారు. అతను హృదయంలో తనను తాను హెచ్చించుకుంటాడు, అతను వేలమందిని నాశనం చేస్తాడు; కానీ అతను తన బలమైన స్థానాన్ని సద్వినియోగం చేసుకోడు. 13  “అయితే ఉత్తర రాజు తిరిగొస్తాడు, అతను అంతకుముందు కన్నా ​ఎక్కువమందిని సమకూర్చుకుంటాడు; కొంతకాలం గడిచాక, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత, అతను తప్పకుండా ఒక పెద్ద సైన్యంతో, అవసరమైన చాలా సామ​గ్రితో తప్పకుండా వస్తాడు. 14  ఆ కాలాల్లో చాలామంది దక్షిణ రాజుకు వ్యతిరే​కంగా నిలబడతారు. “నీ ప్రజల్లో దౌర్జన్యం చేసేవాళ్లు ఆ దర్శనం నిజమయ్యేలా చేయడానికి ప్రయత్నిస్తారు; కానీ వాళ్లు పడిపోతారు. 15  “ఉత్తర రాజు వచ్చి ముట్టడిదిబ్బ కట్టి, ప్రాకారంగల ఒక నగరాన్ని స్వాధీనం చేసుకుంటాడు. దక్షిణ రాజు సైన్యాలు గానీ, అతని ​శ్రేష్ఠమైన సైనికులు గానీ ఎదురు నిలవలేరు; వాళ్లకు ఎదిరించే శక్తి ఉండదు. 16  దక్షిణ రాజు మీదికి వచ్చే వ్యక్తి తనకు ఇష్టమొచ్చినట్టు చేస్తాడు, ఎవ్వరూ అతని ముందు నిలవరు. అతను సుందరమైన దేశంలో*+ నిలబడతాడు, నాశనం చేసే శక్తి అతనికి ఉంటుంది. 17  అతను తన రాజ్యపు పూర్తి శక్తితో రావాలని నిశ్చయించుకుంటాడు, కానీ అతను ఆ రాజుతో ఒక ఒప్పందం చేసుకుంటాడు; అతను చర్య తీసుకుంటాడు. ఒక కూతురు విషయానికొస్తే, ఆమెను నాశనం ​చేయడానికి అతను అనుమతించబడతాడు. ఆమె ​అతనికి నమ్మకంగా ఉండదు కాబట్టి ఆమె దాన్ని సాధించదు. 18  అతను తీరప్రాంతాల వైపు తన ముఖం తిప్పి, చాలా ప్రాంతాల్ని స్వాధీనం చేసుకుంటాడు. అయితే ఒక సైన్యాధికారి అతని అహంకార స్వభావాన్ని అణచివేస్తాడు. ఆ సైన్యాధికారికి ఇక అవమానం ఎదురవ్వదు, అతను తనను అవమానించిన వ్యక్తి మీదికే అవమానం వచ్చేలా చేస్తాడు. 19  తర్వాత అతను తన దేశంలో ఉన్న కోటలవైపు తన ముఖం తిప్పుతాడు; అప్పుడు అతను తడబడి పడిపోతాడు, అతను కనిపించడు. 20  “అప్పుడు అతని స్థానంలో ఒకతను నిల​బడతాడు, అతను పన్ను వసూలు చేసేవాణ్ణి* వైభవంగల రాజ్యం గుండా పంపిస్తాడు; కానీ కొన్ని రోజుల్లోనే అతను నాశనమౌతాడు, అయితే అతను నాశనం అయ్యేది కోపం వల్లో, యుద్ధం వల్లో కాదు. 21  “అతని స్థానంలో, ఒక ​నీచమైన వ్యక్తి లేస్తాడు, వాళ్లు అతనికి రాజమర్యాదలు చేయరు; సురక్షితంగా ఉన్న సమయంలో* అతను వచ్చి, మోసంతో రాజ్యాన్ని చేజిక్కిం​చుకుంటాడు. 22  అతని కారణంగా వరదలాంటి సైన్యాలు ​తుడిచిపెట్టుకుపోతాయి, వాళ్లు నాశనం ​చేయబడతారు; అలాగే ఒప్పంద+ నాయకుడు+ కూడా నాశనం చేయబడతాడు. 23  కొంతమంది ప్రజలు అతనితో పొత్తు కుదుర్చుకుం​టారు కాబట్టి, అతను మోసపూరితంగా ప్రవ​ర్తిస్తూ, లేచి ఒక చిన్న జనం సహాయంతో శక్తిమంతుడు అవుతాడు. 24  సురక్షితంగా ఉన్న సమయంలో* అతను సంస్థానంలోని శ్రేష్ఠమైన చోట్లకు వచ్చి, తన తండ్రులు, తండ్రుల తండ్రులు ఎన్నడూ చేయని పనిని చేస్తాడు. అతను కొల్లగొట్టిన సొమ్మును, దోపుడుసొమ్మును, వస్తువుల్ని వాళ్లకు పంచిపెడతాడు; అతను ప్రాకారా​లుగల స్థలాల మీద ​పన్నాగాలు పన్నుతాడు, కానీ కొంతకాలం మాత్రమే అలా చేస్తాడు. 25  “అతను దక్షిణ రాజు మీదికి ఒక పెద్ద సైన్యంతో వెళ్లడానికి శక్తిని, ధైర్యాన్ని* కూడగట్టుకుంటాడు; దక్షిణ రాజు ఎంతో విస్తారమైన, బలమైన సైన్యంతో యుద్ధం కోసం సిద్ధపడతాడు. అయితే వాళ్లు అతనికి వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతారు కాబట్టి అతను నిలవడు. 26  అతని రుచికరమైన ఆహార పదార్థాలు తింటున్నవాళ్లు అతని పతనానికి ​కారణమౌతారు. “అతని సైన్యం తుడిచిపెట్టుకుపోతుంది; ​చాలామంది చనిపోతారు. 27  “ఈ ఇద్దరు రాజుల విషయానికొస్తే, వాళ్ల హృదయాలు చెడు చేయడానికి మొగ్గుచూపుతాయి; వాళ్లు ఒకే బల్ల దగ్గర కూర్చుని ఒకరితో ఒకరు అబద్ధాలాడతారు. అయితే వాళ్లు కోరుకున్నట్టు జరగదు, ఎందుకంటే అంతం నియమిత సమయంలో వస్తుంది.+ 28  “అతను* విస్తారమైన వస్తువులతో తన దేశానికి తిరిగెళ్తాడు, అతని హృదయం పవిత్ర ఒప్పందానికి వ్యతిరేకంగా ఉంటుంది. అతను చర్య తీసుకుని, తన దేశానికి తిరిగెళ్తాడు. 29  “నియమిత సమయంలో అతను తిరిగొచ్చి, దక్షిణ దేశం మీదికి వస్తాడు. కానీ ఈసారి అంతకుముందులా ఉండదు, 30  ఎందుకంటే కిత్తీము+ ఓడలు అతని మీదికి వస్తాయి, అతను తగ్గించబడతాడు. “అతను తిరిగెళ్లి, పవిత్ర ఒప్పందానికి వ్యతి​రేకంగా ఆగ్రహం* వెళ్లగక్కి చర్య తీసుకుం​టాడు;+ అతను తిరిగెళ్లి, పవిత్ర ​ఒప్పందాన్ని విడిచిపెట్టే వాళ్లమీద దృష్టి పెడతాడు. 31  అప్పుడు అతని సైన్యాలు నిలబడతాయి. వాళ్లు కోటను అంటే పవిత్రమైన స్థలాన్ని అప​విత్రపర్చి,+ రోజువారీ బలుల్ని నిలిపేస్తారు.+ “వాళ్లు నాశనాన్ని కలగజేసే అసహ్యమైన వస్తువును నిలబెడతారు.+ 32  “చెడ్డగా ప్రవర్తిస్తూ, ఒప్పందాన్ని తిరస్కరించే వాళ్లను అతను మోసపు మాటలతో మతభ్రష్టత్వానికి నడిపిస్తాడు. కానీ తమ దేవుణ్ణి తెలుసుకున్న ప్రజలు విజయం సాధిస్తారు, చర్య తీసుకుంటారు. 33  ప్రజల్లో వివేచన* ఉన్నవాళ్లు+ చాలామందికి అవగాహన కల్పిస్తారు. వాళ్లు కత్తి ద్వారా, అగ్ని ద్వారా, బంధించబడడం ద్వారా, దోచుకోబడడం ద్వారా కొన్ని ​రోజులపాటు పడిపోతారు. 34  అయితే వాళ్లు పడిపోయినప్పుడు, వాళ్లకు కొంచెం సహాయం ఇవ్వబడుతుంది; చాలామంది మోసపు మాటలు మాట్లాడుతూ వాళ్లతో కలుస్తారు. 35  వివేచన* ఉన్నవాళ్లలో కొంతమంది పడిపోతారు. వాళ్ల కారణంగా శుద్ధీకరించే పని, అలాగే ​అంత్యకాలం వరకు ప్రజల్ని శుభ్రం చేసి తెల్లగా చేసే పని జరగాలని+ అలా జరుగుతుంది; ​ఎందుకంటే అది నియమిత కాలంలో ​జరుగుతుంది. 36  “రాజు* తనకు ఇష్టమొచ్చినట్టు ప్రవ​ర్తిస్తాడు; అతను తనను తాను గొప్ప చేసు​కుంటూ, ప్రతీ దేవుని మీద తనను తాను హెచ్చించుకుంటాడు; దేవాది దేవుణ్ణి+ దూషిస్తాడు. ఆగ్రహ కాలం ముగిసేవరకు అతను విజయం సాధిస్తూ ఉంటాడు; ఎందుకంటే ఏదైతే నిర్ణయించబడిందో అది తప్పకుండా జరగాలి. 37  అతను తన తండ్రుల దేవుణ్ణి గౌరవించడు; అతను స్త్రీల కోరిక మీద గానీ, వేరే ఏ దేవుని మీద గానీ గౌరవం చూపించడు. అతను ప్రతీ ఒక్కరి మీద తనను తాను హెచ్చించుకుంటాడు. 38  బదులుగా* అతను కోటల దేవుణ్ణి మహిమపరు​స్తాడు; అతను వెండిబంగారాలతో, రత్నాలతో, అమూల్యమైన* ​వస్తువులతో తన తండ్రులకు తెలియని ఒక దేవుణ్ణి ​మహిమపరుస్తాడు. 39  అతను ఒక విదేశీ దేవుని సహాయంతో అత్యంత పటిష్ఠమైన దుర్గాల మీద చర్య తీసుకుంటాడు. తనకు గుర్తింపు ఇచ్చిన* వాళ్లను అతను ఎంతో ఘన​పర్చి, వాళ్లు చాలామంది మీద పరి​పాలిం​చేలా చేస్తాడు; అతను డబ్బుకు భూమిని పంచి ఇస్తాడు. 40  “అంత్యకాలంలో దక్షిణ రాజు అతనితో పోరాటం చేస్తాడు; ఉత్తర రాజు రథాలతో, గుర్రపు​రౌతులతో, ఎన్నో ఓడలతో అతని మీదికి ​దూసుకొస్తాడు; అతను దేశాల్లోకి ప్రవేశించి ​వరదలా ఊడ్చుకొని వెళ్తాడు. 41  అతను సుందరమైన దేశంలోకి*+ కూడా ప్రవేశిస్తాడు, చాలా దేశాలు పడిపోతాయి. అయితే అతని చేతిలో నుండి ఎదోము, మోయాబు దేశాలు, అమ్మోనీయుల్లో ప్రధాన భాగం తప్పించుకుంటాయి. 42  అతను దేశాలకు వ్యతిరేకంగా తన శక్తిని ​ఉపయోగిస్తూ ఉంటాడు; ఐగుప్తు దేశం విష​యానికొస్తే, అది తప్పించుకోదు. 43  దాచబడిన బంగారం, వెండి ఖజానాలు, ఐగుప్తు అమూల్యమైన* వస్తువులన్నీ అతని అధీనంలో ఉంటాయి. లిబియావాళ్లు, ఇతియోపీయులు అతన్ని అనుసరిస్తారు.* 44  “అయితే తూర్పు నుండి, ఉత్తరం నుండి వచ్చిన నివేదికలు అతనికి ఆందోళన కలిగిస్తాయి; అప్పుడు అతను చాలామందిని నిర్మూలించడానికి, నాశనం చేయడానికి విపరీతమైన కోపంతో బయల్దేరతాడు. 45  అతను మహా సముద్రానికి, సుందరమైన*+ పవిత్ర పర్వతానికి మధ్య తన రాజవైభవం గల డేరాల్ని వేసుకుంటాడు; అయితే అతను నాశనం చేయబడతాడు, అతన్ని రక్షించేవాళ్లెవ్వరూ ఉండరు.

అధస్సూచీలు

అంటే, మిఖాయేలును.
లేదా “విస్తారమైన ప్రాంతం మీద.”
బహుశా ఉత్తర రాజును సూచిస్తుండవచ్చు.
బహుశా దక్షిణ రాజును సూచిస్తుండవచ్చు.
లేదా “లోహపు.”
లేదా “కోరదగిన.”
బహుశా ఉత్తర రాజును సూచిస్తుండవచ్చు.
అక్ష., “అతను.”
బహుశా, దక్షిణ రాజును సూచిస్తుండవచ్చు.
లేదా “ఆభరణ దేశంలో.”
లేదా “పనులు చేయించేవాణ్ణి.”
లేదా “హెచ్చరిక చేయకుండా” అయ్యుంటుంది.
లేదా “హెచ్చరిక చేయకుండా” అయ్యుంటుంది.
అక్ష., “తన హృదయాన్ని.”
బహుశా ఉత్తర రాజును సూచిస్తుండవచ్చు.
లేదా “దూషణలు.”
లేదా “లోతైన అవగాహన.”
లేదా “లోతైన అవగాహన.”
బహుశా ఉత్తర రాజును సూచిస్తుండవచ్చు.
లేదా “అతని స్థానంలో.”
లేదా “కోరదగిన.”
లేదా “అతను ఎవరినైతే గుర్తిస్తాడో” అయ్యుంటుంది.
లేదా “ఆభరణ దేశంలోకి.”
లేదా “కోరదగిన.”
లేదా “అతని పాదాల దగ్గర ఉంటారు.”
లేదా “ఆభరణ.”