జెఫన్యా 1:1-18
1 ఆమోను+ కుమారుడైన యోషీయా+ యూదాను పరిపాలిస్తున్న రోజుల్లో యెహోవా వాక్యం జెఫన్యా* దగ్గరికి వచ్చింది. జెఫన్యా కూషీ కుమారుడు, కూషీ గెదల్యా కుమారుడు, గెదల్యా అమర్యా కుమారుడు, అమర్యా హిజ్కియా కుమారుడు.
2 యెహోవా ఇలా అంటున్నాడు: “నేను భూమ్మీదున్న ప్రతీదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తాను.”+
3 “నేను మనుషుల్ని, జంతువుల్ని తుడిచిపెట్టేస్తాను.
ఆకాశపక్షుల్ని, సముద్ర చేపల్ని తుడిచిపెట్టేస్తాను;+దుష్టుల్ని, వాళ్లతోపాటు పాపపు ఉచ్చుల్ని*+ తుడిచిపెట్టేస్తాను;మనుషులందర్నీ భూమ్మీద ఉండకుండా తుడిచిపెట్టేస్తాను” అని యెహోవా అంటున్నాడు.
4 “నేను యూదాకు వ్యతిరేకంగా,యెరూషలేము నివాసులందరికీ వ్యతిరేకంగా నా చెయ్యి చాపుతాను.ఈ స్థలంలో బయలు ఆనవాళ్లే లేకుండా చేస్తాను.+అన్య దేవుళ్ల పూజారుల పేరుప్రతిష్ఠల్ని, అలాగే యాజకుల్ని తుడిచిపెట్టేస్తాను.+
5 ఇళ్ల పైకప్పుల మీద ఆకాశ సైన్యానికి మొక్కేవాళ్లను,+ఒకవైపు యెహోవాకు మొక్కి, ఆయనకు విశ్వసనీయంగా ఉంటామని ప్రమాణం చేస్తూనే+మరోవైపు మల్కాముకు విశ్వసనీయంగా ఉంటామని ప్రమాణం చేసేవాళ్లను+ తుడిచిపెట్టేస్తాను.
6 యెహోవాను అనుసరించడం మానేసినవాళ్లను,+యెహోవాను వెదకనివాళ్లను, ఆయన దగ్గర విచారణ చేయనివాళ్లను+ తుడిచిపెట్టేస్తాను.”
7 సర్వోన్నత ప్రభువైన యెహోవా ముందు మౌనంగా ఉండండి, ఎందుకంటే యెహోవా రోజు దగ్గర్లో ఉంది.+
యెహోవా ఒక బలిని సిద్ధం చేశాడు; తాను ఆహ్వానించినవాళ్లను ఆయన పవిత్రపర్చాడు.
8 “నేను సిద్ధం చేసిన బలిని అర్పించే రోజున యెహోవానైన నేను యువరాజుల్ని,రాకుమారుల్ని, విదేశీ వస్త్రాలు వేసుకునే వాళ్లందర్నీ లెక్క అడుగుతాను.+
9 ఆ రోజున వేదిక* మీదికి ఎక్కే ప్రతీ ఒక్కర్ని,తమ యజమాని ఇంటిని హింసతో, మోసంతో నింపేవాళ్లను నేను లెక్క అడుగుతాను.”
10 యెహోవా ఇలా అంటున్నాడు: “ఆ రోజున,చేపల ద్వారం+ దగ్గర నుండి కేకలు వినిపిస్తాయి,నగరపు రెండో భాగం+ నుండి ఏడ్పులు,కొండల నుండి పెళపెళ ధ్వని వినిపిస్తాయి.
11 మక్తేషు* నివాసులారా, ప్రలాపించండి,ఎందుకంటే, వర్తకులందరూ నాశనమయ్యారు;వెండిని తూచేవాళ్లంతా నాశనమయ్యారు.
12 ఆ సమయంలో నేను దీపాలు పట్టుకొని యెరూషలేమును జాగ్రత్తగా సోదా చేస్తాను,‘యెహోవా మంచీ చేయడు, చెడూ చేయడు’ అని తమ హృదయంలో అనుకుంటూ+ఉదాసీనంగా ఉన్నవాళ్లను* నేను లెక్క అడుగుతాను.
13 వాళ్ల ఆస్తి కొల్లగొట్టబడుతుంది, వాళ్ల ఇళ్లు ధ్వంసం అవుతాయి.+
వాళ్లు ఇళ్లు కట్టుకుంటారు కానీ వాటిలో నివసించరు;ద్రాక్షతోటలు నాటుకుంటారు కానీ వాటి ద్రాక్షారసం తాగరు.+
14 యెహోవా మహారోజు దగ్గరపడింది!
అది సమీపంగా ఉంది, చాలా వేగంగా దూసుకొస్తోంది!*+
యెహోవా రోజు శబ్దం భయంకరంగా* ఉంటుంది.+
ఆ రోజున యోధులు కేకలు వేస్తారు.+
15 ఆ రోజు ఉగ్రత నిండిన రోజు,+వేదన, దుఃఖం కలిగించే రోజు,+ఉపద్రవం,* నాశనం తెచ్చే రోజు,చీకటి, అంధకారం కమ్ముకునే రోజు,మేఘాలు, గాఢాంధకారం కమ్ముకునే రోజు,+
16 ప్రాకారాలుగల నగరాలకు, మూలల్లో ఉండే ఎత్తైన బురుజులకు వ్యతిరేకంగా+బూర* ధ్వని, యుద్ధ ధ్వని వినిపించే రోజు.+
17 నేను మనుషులకు వేదన కలిగిస్తాను,వాళ్లు గుడ్డివాళ్లలా నడుస్తారు,+ఎందుకంటే వాళ్లు యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశారు.+
వాళ్ల రక్తం ధూళిలా,వాళ్ల పేగులు పేడలా పారేయబడతాయి.+
18 యెహోవా ఉగ్రత రోజున వాళ్ల వెండి గానీ, వాళ్ల బంగారం గానీ వాళ్లను కాపాడలేవు;+ఎందుకంటే ఆయన రోషాగ్ని భూమంతటినీ కాల్చేస్తుంది,+ఆయన భూమ్మీదున్న నివాసులందర్నీ సమూలంగా నాశనం చేస్తాడు, ఆ నాశనం భయంకరంగా ఉంటుంది.”+
అధస్సూచీలు
^ “యెహోవా భద్రం చేశాడు (దాచిపెట్టాడు)” అని అర్థం.
^ లేదా “అడ్డురాళ్లను.” విగ్రహపూజకు సంబంధించిన వస్తువులు, పనులు అని స్పష్టమౌతోంది.
^ లేదా “గడప.” రాజు సింహాసనం ఉన్న వేదిక కావచ్చు.
^ యెరూషలేములోని చేపల ద్వారం దగ్గర ఉన్న భాగం అని తెలుస్తోంది.
^ లేదా “ద్రాక్షతొట్టిలో మడ్డి మీద పేరుకున్న చిక్కని ద్రాక్షారసంలా ఉన్నవాళ్లను.”
^ లేదా “త్వరపడుతోంది!”
^ అక్ష., “చేదుగా.”
^ అక్ష., “తుఫాను.”
^ అక్ష., “కొమ్ము.”