జెకర్యా 6:1-15

  • 8వ దర్శనం: నాలుగు రథాలు (1-8)

  • మొలక అనే పేరున్న వ్యక్తి రాజు, యాజకుడు అవుతాడు (9-15)

6  తర్వాత నేను మళ్లీ తల ఎత్తి చూశాను, అప్పుడు రెండు పర్వతాల మధ్య నుండి నాలుగు రథాలు రావడం కనిపించింది, ఆ పర్వతాలు రాగివి.  మొదటి రథానికి ఎర్రని గుర్రాలు, రెండో రథానికి నల్లని గుర్రాలు+ ఉన్నాయి.  మూడో రథానికి తెల్లని గుర్రాలు ఉన్నాయి; నాలుగో రథానికి మచ్చలు ఉన్న గుర్రాలు, పొడలు ఉన్న గుర్రాలు+ ఉన్నాయి.  అప్పుడు నేను, “నా ప్రభువా, ఇవి ఏమిటి?” అని నాతో మాట్లాడుతున్న దేవదూతను అడిగాను.  ఆ దేవదూత ఇలా చెప్పాడు: “ఇవి నాలుగు పరలోక సైన్యాలు.+ ఇవి సర్వలోక ప్రభువు సన్నిధిలో కనబడి, ఆ తర్వాత అక్కడి నుండి బయటికి వెళ్తున్నాయి.+  నల్లని గుర్రాలున్న రథం ఉత్తర దేశానికి వెళ్తోంది;+ తెల్లనివి సముద్రాన్ని దాటి వెళ్తున్నాయి; మచ్చలు ఉన్నవి దక్షిణ దేశానికి వెళ్తున్నాయి.  పొడలు ఉన్నవి భూమంతటా సంచరించాలని ఉత్సాహంగా ఉన్నాయి.” తర్వాత అతను, “వెళ్లండి, భూమంతటా సంచరించండి” అన్నాడు. అప్పుడవి భూమంతటా సంచరించడం మొదలుపెట్టాయి.  అప్పుడతను నన్ను పిలిచి, “చూడు, ఉత్తర దేశానికి వెళ్తున్నవి, ఉత్తర దేశం పట్ల యెహోవాకున్న కోపాన్ని తగ్గించాయి” అని చెప్పాడు.  యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: 10  “చెరలో ఉన్న ప్రజల దగ్గర నుండి హెల్దయి, టోబీయా, యెదాయా తెచ్చినవి తీసుకో; నువ్వు ఆ రోజు, బబులోను నుండి వచ్చిన ఈ ప్రజలతో కలిసి జెఫన్యా కుమారుడైన యోషీయా ఇంటికి వెళ్లాలి. 11  నువ్వు వెండిని, బంగారాన్ని తీసుకొని ఒక కిరీటం* చేసి దాన్ని యెహోజాదాకు కుమారుడూ, ప్రధానయాజకుడూ అయిన యెహోషువ+ తలమీద పెట్టి, 12  అతనికి ఇలా చెప్పు:“ ‘సైన్యాలకు అధిపతైన యెహోవా చెప్పేదేమిటంటే, “ఇదిగో, మొలక అనే పేరున్న వ్యక్తి ఇతనే.+ ఇతను తన సొంత స్థలం నుండి మొలకెత్తుతాడు, ఇతను యెహోవా ఆలయాన్ని కడతాడు.+ 13  యెహోవా ఆలయాన్ని కట్టేది ఇతనే, రాజ్యాధికారాన్ని పొందేది ఇతనే. ఇతను తన సింహాసనంపై కూర్చుని పరిపాలిస్తాడు, అంతేకాదు సింహాసనం మీద ఉంటూనే యాజకుడిగా కూడా సేవచేస్తాడు,+ ఆ రెండు బాధ్యతల* మధ్య మంచి సమన్వయం ఉంటుంది. 14  ఆ కిరీటం* యెహోవా ఆలయంలో హేలెముకు, టోబీయాకు, యెదాయాకు,+ జెఫన్యా కుమారుడైన హేనుకు జ్ఞాపకార్థంగా* ఉంటుంది. 15  సుదూరాల్లో ఉన్నవాళ్లు వచ్చి, యెహోవా ఆలయాన్ని కట్టడంలో పాల్గొంటారు.” అప్పుడు, సైన్యాలకు అధిపతైన యెహోవాయే నన్ను పంపాడని మీరు తెలుసుకుంటారు. మీరు మీ దేవుడైన యెహోవా స్వరాన్ని వింటేనే అది జరుగుతుంది.’ ”

అధస్సూచీలు

లేదా “గొప్ప కిరీటం.”
లేదా “పాత్రల.”
లేదా “గొప్ప కిరీటం.”
లేదా “జ్ఞాపికగా.”