జెకర్యా 1:1-21

  • యెహోవా దగ్గరికి తిరిగిరమ్మని పిలుపు (1-6)

    • ‘నా దగ్గరికి తిరిగిరండి, నేను మీ దగ్గరికి తిరిగొస్తాను’ (3)

  • 1వ దర్శనం: గొంజి చెట్ల మధ్య గుర్రపురౌతులు (7-17)

    • “యెహోవా మళ్లీ సీయోనును ఓదారుస్తాడు” (17)

  • 2వ దర్శనం: నాలుగు కొమ్ములు, నలుగురు చేతిపనివాళ్లు (18-21)

1  దర్యావేషు పరిపాలనలోని రెండో సంవత్సరం,+ ఎనిమిదో నెలలో యెహోవా వాక్యం ఇద్దో మనవడూ, బెరెక్యా కుమారుడూ అయిన జెకర్యా* ప్రవక్త+ దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది:  “మీ పూర్వీకుల మీద యెహోవాకు విపరీతమైన కోపం వచ్చింది.+  “వాళ్లకు ఇలా చెప్పు: ‘సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు, “ ‘నా దగ్గరికి తిరిగిరండి’ అని సైన్యాలకు అధిపతైన యెహోవా ప్రకటిస్తున్నాడు, ‘అప్పుడు నేను మీ దగ్గరికి తిరిగొస్తాను’+ అని సైన్యాలకు అధిపతైన యెహోవా అంటున్నాడు.” ’  “ ‘మీరు మీ పూర్వీకుల్లా తయారవ్వకండి. అప్పటి ప్రవక్తలు వాళ్లకు, “సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘దయచేసి మీ చెడు మార్గాల్ని, మీ చెడు పనుల్ని విడిచిపెట్టండి’ ”*+ అని ప్రకటించారు.’ “ ‘కానీ వాళ్లు నా మాట వినలేదు, నన్ను పట్టించుకోలేదు’+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.  “ ‘మీ పూర్వీకులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆ ప్రవక్తల సంగతేంటి, వాళ్లింకా బ్రతికే ఉన్నారా?  అయితే నా సేవకులైన ప్రవక్తల ద్వారా నేను ఆజ్ఞాపించిన నా మాటలు, నా శాసనాలు నెరవేరడం మీ పూర్వీకులు చూశారు, కాదంటారా?’+ కాబట్టి వాళ్లు నా దగ్గరికి తిరిగొచ్చి ఇలా అన్నారు: ‘సైన్యాలకు అధిపతైన యెహోవా మన మార్గాల్ని బట్టి, మన పనుల్ని బట్టి మన విషయంలో తాను అనుకున్నట్టే చేశాడు.’ ”+  దర్యావేషు పరిపాలనలోని రెండో సంవత్సరం,+ శెబాటు* అనే 11వ నెల, 24వ రోజున యెహోవా వాక్యం ఇద్దో మనవడూ, బెరెక్యా కుమారుడూ అయిన జెకర్యా ప్రవక్త దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది:  “రాత్రిపూట నేను ఒక దర్శనం చూశాను. అందులో ఒకతను ఎర్రని గుర్రంపై స్వారీ చేస్తున్నాడు, అతను లోయలోని గొంజి చెట్ల మధ్యకు వచ్చి ఆగాడు; అతని వెనక ఎరుపు, గోధుమ, తెలుపు రంగు గుర్రాలు ఉన్నాయి.”  అప్పుడు నేను, “నా ప్రభువా, వీళ్లు ఎవరు?” అని అడిగాను. అందుకు నాతో మాట్లాడుతున్న దేవదూత, “వీళ్లు ఎవరో నేను నీకు చూపిస్తాను” అన్నాడు. 10  అప్పుడు గొంజి చెట్ల మధ్య ఆగిన అతను, “వీళ్లు భూమంతటా సంచరించడానికి యెహోవా పంపించినవాళ్లు” అని అన్నాడు. 11  వాళ్లు గొంజి చెట్ల మధ్య నిల్చున్న యెహోవా దూతతో, “మేము భూమంతటా సంచరించాం, ఇదిగో! భూమంతా ఏ గలిబిలీ లేకుండా ప్రశాంతంగా ఉంది” అని చెప్పారు.+ 12  అప్పుడు యెహోవా దూత, “సైన్యాలకు అధిపతివైన యెహోవా, 70 ఏళ్లపాటు నువ్వు యెరూషలేము మీద, యూదా నగరాల మీద విపరీతమైన కోపం చూపించావు,+ ఇంకెంతకాలం వాటిమీద కరుణ చూపించకుండా ఉంటావు?”+ అని అడిగాడు. 13  నాతో మాట్లాడుతున్న దేవదూతకు యెహోవా దయగల, ఊరటనిచ్చే మాటలతో జవాబిచ్చాడు. 14  అప్పుడు నాతో మాట్లాడుతున్న దేవదూత నాకు ఇలా చెప్పాడు: “నువ్విలా చాటించు, ‘సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: “యెరూషలేము విషయంలో, సీయోను విషయంలో నాకు ఎంతో ప్రేమ, శ్రద్ధ ఉన్నాయి.+ 15  నిశ్చింతగా ఉన్న దేశాల+ మీద నేను తీవ్రమైన కోపంతో ఉన్నాను. ఎందుకంటే, నా ప్రజల మీద నాకున్న కోపం కొంచెమే,+ కానీ ఆ దేశాలు నేను అనుకున్న దానికన్నా ఎక్కువగా వాళ్లను బాధించాయి.” ’+ 16  “కాబట్టి యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘ “నేను కరుణతో యెరూషలేముకు తిరిగొస్తాను.+ అందులో నా మందిరం కట్టబడుతుంది.”+ సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “యెరూషలేము మీద కొలనూలు చాపబడుతుంది.” ’+ 17  “ఇంకొకసారి బిగ్గరగా ఇలా చాటించు: ‘సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు, “నా నగరాలు మళ్లీ నా మంచితనంతో పొంగిపొర్లుతాయి. యెహోవా మళ్లీ సీయోనును ఓదారుస్తాడు,+ మళ్లీ యెరూషలేమును ఎంచుకుంటాడు.” ’ ”+ 18  తర్వాత నేను తల ఎత్తి చూసినప్పుడు నాలుగు కొమ్ములు కనిపించాయి. 19  అప్పుడు నేను నాతో మాట్లాడుతున్న దేవదూతను “ఇవేంటి?” అని అడిగాను. అందుకతను, “ఇవి యూదా,+ ఇశ్రాయేలు,+ యెరూషలేములను+ చెదరగొట్టిన కొమ్ములు” అని చెప్పాడు. 20  తర్వాత యెహోవా నాకు నలుగురు చేతిపనివాళ్లను చూపించాడు. 21  అప్పుడు నేను, “వీళ్లు ఏం చేయడానికి వస్తున్నారు?” అని అడిగాను. అందుకతను ఇలా చెప్పాడు: “ఆ కొమ్ములు, ఎవ్వరూ తల ఎత్తుకోలేనంతగా యూదాను చెదరగొట్టిన కొమ్ములు. ఈ చేతిపనివాళ్లు వాళ్లను భయకంపితుల్ని చేయడానికీ, అలాగే యూదాను చెదరగొట్టడం కోసం దానికి వ్యతిరేకంగా తమ కొమ్ములు ఎత్తిన దేశాల కొమ్ముల్ని పడగొట్టడానికీ వస్తారు.”

అధస్సూచీలు

“యెహోవా గుర్తుచేసుకున్నాడు” అని అర్థం.
లేదా “విడిచి తిరిగిరండి.”
అనుబంధం B15 చూడండి.