కీర్తనలు 95:1-11
95 రండి, సంతోషంతో కేకలు వేస్తూ యెహోవాను స్తుతిద్దాం!
విజయోత్సాహంతో కేకలు వేస్తూ, మనల్ని రక్షించే ఆశ్రయదుర్గాన్ని* స్తుతిద్దాం.+
2 కృతజ్ఞతలతో ఆయన సన్నిధికి వద్దాం;+పాటలు పాడుతూ, విజయోత్సాహంతో కేకలు వేస్తూ ఆయన్ని స్తుతిద్దాం.
3 ఎందుకంటే యెహోవా మహాదేవుడు,
దేవుళ్లందరి మీద మహారాజు.+
4 భూమి అగాధ స్థలాలు ఆయన చేతిలో ఉన్నాయి;పర్వత శిఖరాలు ఆయనవే.+
5 ఆయన చేసిన సముద్రం ఆయనదే,+ఆరిన నేలను ఆయన చేతులే తయారుచేశాయి.+
6 రండి, దేవుణ్ణి ఆరాధిద్దాం, ఆయనకు వంగి నమస్కారం చేద్దాం;మనల్ని తయారుచేసిన యెహోవా ముందు మోకరిద్దాం.+
7 ఎందుకంటే ఆయన మన దేవుడు,మనం ఆయన ప్రజలం.మందలోని గొర్రెల్లా ఆయన మనల్ని చూసుకుంటాడు.+
ఈ రోజు మీరు ఆయన స్వరాన్ని వింటే,+
8 మెరీబా* దగ్గర చేసినట్టు,ఎడారిలో మస్సా* రోజున చేసినట్టు+ మీ హృదయాల్ని కఠినపర్చుకోకండి.+
9 అప్పుడు మీ పూర్వీకులు నన్ను పరీక్షించారు;+నేను చేసిన పనుల్ని చూసి కూడా నన్ను సవాలుచేశారు.+
10 నేను 40 సంవత్సరాలు ఆ తరాన్ని అసహ్యించుకున్నాను,
“ఈ ప్రజల హృదయాలు ఎప్పుడూ పక్కదారి పడుతూ ఉంటాయి;వీళ్లు నా మార్గాల్ని తెలుసుకోలేదు” అని నేను అన్నాను.
11 కాబట్టి నేను కోపంతో ఇలా ప్రమాణం చేశాను:
“వీళ్లు నా విశ్రాంతిలోకి ప్రవేశించరు.”+