కీర్తనలు 86:1-17

  • యెహోవా లాంటి దేవుడు లేడు

    • యెహోవా క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు (5)

    • దేశాలన్నీ యెహోవాకు వంగి నమస్కారం చేస్తాయి (9)

    • “నీ మార్గాన్ని నాకు బోధించు” (11)

    • “నాకు ఏక హృదయం దయచేయి” (11)

దావీదు ప్రార్థన. 86  యెహోవా, నేను కష్టాల్లో ఉన్నాను, దీనస్థితిలో ఉన్నాను,నా ప్రార్థన విను,* నాకు జవాబివ్వు.+   నేను విశ్వసనీయంగా ఉన్నాను, నా ప్రాణం కాపాడు, నిన్ను నమ్ముకున్న నీ సేవకుణ్ణి రక్షించు,నువ్వే నా దేవుడివి.+   యెహోవా, నా మీద దయ చూపించు,రోజంతా నీకే నేను మొరపెట్టుకుంటున్నాను.   నీ సేవకుణ్ణి సంతోషపెట్టు,ఎందుకంటే యెహోవా, నీ వైపే నేను తిరుగుతున్నాను.   యెహోవా, నువ్వు మంచివాడివి,+ క్షమించడానికి సిద్ధంగా ఉంటావు;+నీకు మొరపెట్టే వాళ్లందరి మీద అపారమైన విశ్వసనీయ ప్రేమ చూపిస్తావు.   యెహోవా, నా ప్రార్థన విను;సహాయం కోసం నేను చేస్తున్న విన్నపాలు ఆలకించు.   కష్టకాలంలో నేను నీకు ప్రార్థిస్తాను,+నువ్వు నాకు జవాబిస్తావు.   యెహోవా, దేవుళ్లలో నీలాంటి దేవుడు ఎవ్వరూ లేరు,+నీ పనులు సాటిలేనివి.+   యెహోవా, నువ్వు చేసిన దేశాలన్నీ వచ్చినీ ముందు వంగి నమస్కారం చేస్తాయి,+ నీ పేరును మహిమపరుస్తాయి.+ 10  ఎందుకంటే నువ్వు గొప్పవాడివి, అద్భుతమైన పనులు చేస్తావు;+నువ్వు మాత్రమే దేవుడివి.+ 11  యెహోవా, నీ మార్గాన్ని నాకు బోధించు.+ నేను నీ సత్యంలో నడుస్తాను.+ నీ పేరుకు భయపడేలా నాకు ఏక హృదయం* దయచేయి.+ 12  యెహోవా, నా దేవా, నా నిండు హృదయంతో నిన్ను స్తుతిస్తున్నాను,+నీ పేరును నిరంతరం మహిమపరుస్తాను. 13  ఎందుకంటే, నా మీద నీకున్న విశ్వసనీయ ప్రేమ గొప్పది,సమాధి* లోతుల్లో నుండి నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు.+ 14  దేవా, అహంకారులు నా మీదికి లేస్తున్నారు;+క్రూరుల గుంపు నా ప్రాణం తీయాలని చూస్తోంది,నువ్వంటే వాళ్లకు లెక్కేలేదు.*+ 15  కానీ యెహోవా, నువ్వు కరుణ, కనికరం* గల దేవుడివి,ఓర్పు,* అపారమైన విశ్వసనీయ ప్రేమ, నమ్మకత్వం గల* దేవుడివి.+ 16  నా వైపు తిరిగి, నా మీద దయ చూపించు.+ నీ సేవకునికి నీ బలాన్ని ఇవ్వు,+నీ దాసురాలి కుమారుణ్ణి కాపాడు. 17  నీ మంచితనానికి సూచన* నాకు చూపించు.అప్పుడు, నన్ను ద్వేషించేవాళ్లు దాన్ని చూసి సిగ్గుపడతారు. యెహోవా, నాకు సహాయం చేసేది, నన్ను ఓదార్చేది నువ్వే.

అధస్సూచీలు

లేదా “కిందికి వంగి, విను.”
లేదా “అవిభాగిత హృదయం.”
లేదా “షియోల్‌,” అంటే మానవజాతి సాధారణ సమాధి. పదకోశం చూడండి.
లేదా “వాళ్లు నిన్ను తమ ముందు ఉంచుకోలేదు.”
లేదా “దయ.”
లేదా “కోప్పడే విషయంలో నిదానించేవాడివి.”
లేదా “సత్యవంతుడివైన.”
లేదా “రుజువు.”