కీర్తనలు 77:1-20

  • కష్టకాలంలో చేసిన ప్రార్థన

    • దేవుని కార్యాల్ని ధ్యానించడం (11, 12)

    • ‘దేవా, నీ అంత గొప్పవాళ్లు ఎవరు?’ (13)

సంగీత నిర్దేశకునికి సూచన; యెదూతూను* అనే రాగంలో పాడాలి. ఆసాపు+ కీర్తన. శ్రావ్యగీతం. 77  నేను బిగ్గరగా దేవునికి మొరపెడతాను;నేను దేవునికి మొరపెడతాను, ఆయన నా మొర వింటాడు.+   కష్టకాలంలో నేను యెహోవాను వెదుకుతాను.+ రాత్రంతా నా చేతులు ఆయన వైపే చాపి ఉంచుతాను. నా ప్రాణం ఓదార్పు పొందలేకపోతోంది.   దేవుణ్ణి గుర్తుచేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుస్తున్నాను;+నా మనసు బాధగా ఉంది, నా బలం క్షీణిస్తోంది.+ (సెలా)   నువ్వు నా కళ్లను మూతపడనివ్వట్లేదు;నేను కలవరపడుతున్నాను, మాట్లాడలేకపోతున్నాను.   నా ఆలోచనలు వెనకటి రోజుల వైపు,పాత సంవత్సరాల వైపు మళ్లుతున్నాయి.+   రాత్రివేళ నేను నా పాటను* గుర్తుచేసుకుంటాను;+నా హృదయంలో ధ్యానిస్తాను;+శ్రద్ధగా పరిశోధిస్తాను.   యెహోవా మమ్మల్ని శాశ్వతంగా వదిలేస్తాడా?+ ఇంకెప్పుడూ మామీద తన అనుగ్రహం చూపించడా?+   ఆయన విశ్వసనీయ ప్రేమ చూపించడం శాశ్వతంగా ఆపేశాడా? ఆయన వాగ్దాన నెరవేర్పును ఏ ఒక్క తరమూ చూడదా?   దేవుడు దయ చూపించడం మర్చిపోయాడా?+కోపంతో కరుణ చూపించడం ఆపేశాడా? (సెలా) 10  “సర్వోన్నతుడు మాకు సహాయం చేయడం మానేశాడన్న ఆలోచనే నన్ను తొలిచేస్తుంది” అని నేను అంటూ ఉండాలా?+ 11  నేను యెహోవా* పనుల్ని గుర్తుచేసుకుంటాను;చాలాకాలం క్రితం నువ్వు చేసిన ఆశ్చర్యకార్యాల్ని గుర్తుచేసుకుంటాను. 12  నీ పనులన్నిటినీ ధ్యానిస్తాను,నీ కార్యాల గురించి లోతుగా ఆలోచిస్తాను.+ 13  దేవా, నీ మార్గాలు పవిత్రమైనవి. దేవా, నీ అంత గొప్ప దేవుడు ఎవరు?+ 14  నువ్వు సత్యదేవుడివి, ఆశ్చర్యకార్యాలు చేస్తావు.+ దేశదేశాల ప్రజల మధ్య నువ్వు నీ బలాన్ని చూపించావు.+ 15  నీ శక్తితో* నీ ప్రజలైనయాకోబు కుమారుల్ని, యోసేపు కుమారుల్ని రక్షించావు.*+ (సెలా) 16  దేవా, జలాలు నిన్ను చూశాయి;నీళ్లు నిన్ను చూసి వణికిపోయాయి.+ అగాధ జలాలు అల్లకల్లోలంగా తయారయ్యాయి. 17  మేఘాలు వర్షించాయి. మేఘాలతో నిండిన ఆకాశం ఉరిమింది,బాణాల్లాంటి నీ మెరుపులు అంతటా మెరిశాయి.+ 18  నీ ఉరుముల శబ్దం+ రథ చక్రాల శబ్దంలా ఉంది;నీ మెరుపులు లోకానికి వెలుగిచ్చాయి;భూమి వణికింది, కంపించింది.+ 19  నీ దారి సముద్రంలో నుండి వెళ్లింది,+నీ మార్గం అనేక జలాల్లో నుండి వెళ్లింది;కానీ నీ అడుగుల జాడలు ఎక్కడా కనిపించలేదు. 20  మోషే, అహరోనుల సంరక్షణలో*+ నువ్వునీ ప్రజల్ని ఒక మందలా నడిపించావు.+

అధస్సూచీలు

పదకోశం చూడండి.
లేదా “తంతివాద్య సంగీతాన్ని.”
అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
అక్ష., “బాహువుతో.”
అక్ష., “విడిపించావు.”
అక్ష., “చేత.”