కీర్తనలు 38:1-22

  • పశ్చాత్తాపపడిన వ్యక్తి బాధతో చేసిన ప్రార్థన

    • “బాధలో ఉన్నాను, తీవ్రంగా కృంగిపోయాను” (6)

    • తన కోసం కనిపెట్టుకునే వాళ్ల ప్రార్థన యెహోవా వింటాడు (15)

    • “నా పాపం నన్ను బాధించింది” (18)

జ్ఞాపకార్థంగా ఉండేందుకు,* దావీదు శ్రావ్యగీతం. 38  యెహోవా, నీ కోపంతో నన్ను గద్దించకు,నీ ఆగ్రహంతో నన్ను సరిదిద్దకు.+  2  నీ బాణాలు నాకు లోతుగా గుచ్చుకున్నాయి,నీ చెయ్యి నా మీద భారంగా ఉంది.+  3  నీ కోపం కారణంగా నా శరీరమంతా అనారోగ్యంగా ఉంది. నా పాపం కారణంగా నా ఎముకల్లో ప్రశాంతతే లేదు.+  4  నా తప్పులు నన్ను ముంచెత్తుతున్నాయి;+అవి నేను మోయలేనంత భారంగా తయారయ్యాయి.  5  నా మూర్ఖత కారణంగానా గాయాల నుండి వాసన వస్తోంది, వాటికి చీము పట్టింది.  6  నేను బాధలో ఉన్నాను, తీవ్రంగా కృంగిపోయాను;రోజంతా బాధతో అటూఇటూ తిరుగుతున్నాను.  7  నా లోపల ఒక మంట ఉంది;*నా శరీరమంతా అనారోగ్యంగా ఉంది.+  8  నేను మొద్దుబారిపోయాను, పూర్తిగా నలిగిపోయాను;నా హృదయ వేదనవల్ల గట్టిగా మూల్గుతున్నాను.*  9  యెహోవా, నా కోరికలన్నీ నీ ముందు ఉన్నాయి,నా నిట్టూర్పులు కూడా నీకు మరుగుగా లేవు. 10  నా గుండె వేగంగా కొట్టుకుంటోంది, నా బలం క్షీణించింది,నా కళ్లలో వెలుగు లేకుండా పోయింది.+ 11  నా అనారోగ్యం కారణంగా నా స్నేహితులు, నా సహవాసులు నన్ను దూరం పెడుతున్నారు,బాగా పరిచయం ఉన్నవాళ్లు నాకు దూరంగా నిలబడుతున్నారు. 12  నా ప్రాణం తీయాలని చూసేవాళ్లు ఉచ్చులు పెడుతున్నారు;నాకు హాని చేయాలని ప్రయత్నించేవాళ్లు నా నాశనం గురించి మాట్లాడుకుంటున్నారు;+వాళ్లు రోజంతా కుట్రలు పన్నుతున్నారు. 13  కానీ నేను చెవిటివాడిలా వినకుండా,+మూగవాడిలా నోరు తెరవకుండా ఉన్నాను.+ 14  నేను వినలేని వాడిలా,ఎదురుచెప్పలేని వాడిలా అయ్యాను. 15  ఎందుకంటే, యెహోవా, నేను నీ కోసం కనిపెట్టుకున్నాను,+యెహోవా, నా దేవా, నువ్వు నాకు జవాబిచ్చావు.+ 16  నేను ఇలా అన్నాను: “నా పాదాలు జారితే, వాళ్లు నన్ను చూసి సంతోషించకూడదు,నా మీద తమను తాము హెచ్చించుకోకూడదు.” 17  కాస్తయితే నేను కుప్పకూలిపోయేవాణ్ణి,నా బాధ ఎప్పుడూ నాతోనే ఉండేది.+ 18  నా తప్పు ఒప్పుకున్నాను;+నా పాపం నన్ను బాధించింది.+ 19  కానీ నా శత్రువులు చురుగ్గా,* బలంగా ఉన్నారు,*ఏ కారణం లేకుండా నన్ను ద్వేషించేవాళ్లు ఎక్కువయ్యారు. 20  నేను మంచి చేస్తే, నాకు చెడు చేశారు;నేను మంచిని అనుసరిస్తున్నందుకు వాళ్లు నన్ను ఎదిరిస్తూ వచ్చారు. 21  యెహోవా, నన్ను విడిచిపెట్టకు. దేవా, నాకు దూరంగా ఉండకు.+ 22  నా రక్షకుడివైన యెహోవా,+నాకు సహాయం చేయడానికి త్వరగా రా.

అధస్సూచీలు

లేదా “జ్ఞాపకం చేసేందుకు.”
లేదా “నా నడుమంతా మంటతో నిండిపోయింది.”
లేదా “ఘోషిస్తున్నాను.”
అక్ష., “సజీవంగా.”
లేదా “కారణం లేకుండా నాకు శత్రువులైనవాళ్లు ఎంతోమంది ఉన్నారు” అయ్యుంటుంది.