కీర్తనలు 35:1-28
దావీదు కీర్తన.
35 యెహోవా, నా వ్యతిరేకులతో నా తరఫున వాదించు;+నాతో పోరాడుతున్న వాళ్లతో పోరాడు.+
2 నీ చిన్న డాలును,* పెద్ద డాలును తీసుకొని+నా దగ్గరికి వచ్చి, నాకు సహాయం చేయి.+
3 నన్ను తరుముతున్నవాళ్లను+ ఎదుర్కోవడానికి నీ ఈటెను, గొడ్డలిని పైకెత్తు.
“నేను నీ రక్షణను” అని నాతో చెప్పు.+
4 నా ప్రాణం తీయాలని చూస్తున్నవాళ్లు సిగ్గుపడాలి, అవమానం పొందాలి.+
నన్ను నాశనం చేయాలని కుట్ర పన్నుతున్నవాళ్లు అవమానంతో పారిపోవాలి.
5 వాళ్లు గాలికి ఎగిరే పొట్టులా అవ్వాలి;యెహోవా దూత వాళ్లను తరమాలి.+
6 యెహోవా దూత వాళ్లను తరుముతుండగావాళ్ల దారి చీకటిగా, జారుడుగా తయారవ్వాలి.
7 ఎందుకంటే, ఏ కారణం లేకుండానే నా కోసం రహస్యంగా వల పన్నారు;కారణం లేకుండానే నా కోసం గొయ్యి తవ్వారు.
8 వాళ్ల మీదికి హఠాత్తుగా విపత్తు రావాలి;వాళ్లు రహస్యంగా ఉంచిన వలలో వాళ్లే చిక్కుకోవాలి;వాళ్లు అందులో పడి నాశనమవ్వాలి.+
9 కానీ నా ప్రాణం యెహోవాను బట్టి ఉల్లసిస్తుంది;ఆయన రక్షణ కార్యాల్ని బట్టి నేను ఆనందిస్తాను.
10 నా ఎముకలన్నీ ఇలా అంటాయి:
“యెహోవా, నీలాంటివాళ్లు ఎవరు ఉన్నారు?
నువ్వు బలవంతుల నుండి నిస్సహాయుల్ని,+తమను దోచుకునేవాళ్ల నుండి పేదవాళ్లను, నిస్సహాయుల్ని రక్షిస్తావు.”+
11 క్రూరులైన సాక్షులు ముందుకు వచ్చి,+నాకు అస్సలు తెలియని విషయాల గురించి నన్ను అడుగుతున్నారు.
12 నేను మంచి చేస్తే, నాకు చెడు చేస్తున్నారు,+నేను దిక్కులేనివాణ్ణని నాకు అనిపించేలా చేస్తున్నారు.
13 కానీ నేను, వాళ్లు అనారోగ్యంగా ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకున్నాను;ఉపవాసముండి నన్ను నేను బాధపెట్టుకున్నాను,వాళ్ల కోసం నేను చేసిన ప్రార్థనకు జవాబు రానప్పుడు,
14 నా స్నేహితుని కోసం, సహోదరుని కోసం అన్నట్టు వాళ్ల కోసం దుఃఖిస్తూ నడిచాను;సొంత తల్లి కోసం శోకించేవానిలా బాధతో వంగిపోయాను.
15 కానీ నేను తొట్రిల్లినప్పుడు వాళ్లు ఉల్లసించి, సమకూడారు;మాటు వేసి నన్ను చంపడానికి పోగయ్యారు;వాళ్లు నన్ను ముక్కలుముక్కలుగా చీల్చారు, నిశ్శబ్దంగా ఉండలేదు.
16 భక్తిహీనులు నన్ను* హేళన చేస్తున్నారు,నా మీద పళ్లు కొరుకుతున్నారు.+
17 యెహోవా, నువ్వు ఎంతకాలం ఊరికే చూస్తూ ఉంటావు?+
వాళ్ల దాడుల నుండి నన్ను,కొదమ సింహాల నుండి నా అమూల్యమైన ప్రాణాన్ని* రక్షించు.+
18 అప్పుడు నేను మహా సమాజంలో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను;+జన సమూహాల మధ్య నిన్ను స్తుతిస్తాను.
19 ఏ కారణం లేకుండా నాకు శత్రువులైనవాళ్లను, నన్ను చూసి ఉల్లసించనివ్వకు;ఏ కారణం లేకుండా నన్ను ద్వేషిస్తున్నవాళ్లను,+ చెడు ఉద్దేశంతో తమ కళ్లను గీటనివ్వకు.+
20 ఎందుకంటే, వాళ్లు శాంతికరమైన మాటలు పలకరు,బదులుగా దేశంలోని శాంతిపరుల మీద మోసపూరితంగా కుట్ర పన్నుతారు.+
21 వాళ్లు నన్ను నిందించడానికి పెద్దగా నోళ్లు తెరుస్తూ,“ఆహా! ఆహా! మన కళ్లు దాన్ని చూశాయి” అంటున్నారు.
22 యెహోవా, నువ్వు దాన్ని చూశావు కదా, ఊరుకోకు.+
యెహోవా, నాకు దూరంగా ఉండకు.+
23 యెహోవా, నా దేవా, మేలుకో. లేచి నాకు సహాయం చేయి,నా వ్యాజ్యంలో నా తరఫున వాదించు.
24 యెహోవా, నా దేవా, నీ నీతిని బట్టి నాకు తీర్పు తీర్చు;+వాళ్లను నన్ను చూసి ఉల్లసించనివ్వకు.
25 “ఆహా! మనం కోరుకున్నట్టే జరిగింది” అని వాళ్లు ఎప్పుడూ అనుకోకూడదు.
“మేము అతన్ని మింగేశాం” అని వాళ్లు ఎప్పుడూ అనకూడదు.+
26 నా విపత్తును చూసి ఉల్లసించే వాళ్లందరూసిగ్గుపడి, అవమానాలపాలు అవ్వాలి.
నా మీద తమను తాము హెచ్చించుకునేవాళ్లు సిగ్గుపడాలి, అవమానం పొందాలి.
27 అయితే, నా నీతిని బట్టి సంతోషించేవాళ్లు ఆనందంగా కేకలు వేయాలి;“తన సేవకుడు ప్రశాంతంగా ఉండడం చూసి సంతోషించే యెహోవా+ ఘనపర్చబడాలి” అని వాళ్లు ఎప్పుడూ అనాలి.
28 అప్పుడు నా నాలుక నీ నీతి గురించి మాట్లాడుతుంది,*+రోజంతా నిన్ను స్తుతిస్తుంది.+
అధస్సూచీలు
^ లేదా “కేడెమును.” ఎక్కువగా విలుకాండ్రు దీన్ని తీసుకెళ్లేవాళ్లు.
^ లేదా “ఒక రొట్టె కోసం” అయ్యుంటుంది.
^ అక్ష., “నా ఒకేఒక్క దాన్ని,” అతని ప్రాణాన్ని సూచిస్తుంది.
^ లేదా “ధ్యానిస్తుంది.”