కీర్తనలు 149:1-9
149 యెహోవాను* స్తుతించండి!*
యెహోవాకు ఒక కొత్త పాట పాడండి;+విశ్వసనీయుల సమాజంలో ఆయన్ని స్తుతించండి.+
2 ఇశ్రాయేలు తన మహాగొప్ప రూపకర్తను+ బట్టి సంతోషించాలి;సీయోను ప్రజలు తమ రాజును బట్టి ఆనందించాలి.
3 వాళ్లు నాట్యం చేస్తూ ఆయన పేరును స్తుతించాలి,+కంజీరతో,* వీణతో* ఆయన్ని స్తుతిస్తూ పాటలు పాడాలి.*+
4 ఎందుకంటే యెహోవా తన ప్రజల్ని బట్టి సంతోషిస్తాడు,+
సాత్వికుల్ని రక్షణతో అలంకరిస్తాడు.+
5 విశ్వసనీయులు తమ మహిమను బట్టి సంతోషించాలి;వాళ్లు తమ పరుపుల మీద సంతోషంతో కేకలు వేయాలి.+
6 వాళ్ల పెదాల మీద దేవుని స్తుతి పాటలు ఉండాలి,వాళ్ల చేతిలో రెండంచుల ఖడ్గం ఉండాలి;
7 దేశాల మీద ప్రతీకారం చేయడానికి,దేశదేశాల ప్రజల మీద శిక్ష అమలుచేయడానికి,
8 గొలుసులతో వాళ్ల రాజుల్ని,ఇనుప సంకెళ్లతో వాళ్ల ప్రముఖుల్ని బంధించడానికి,
9 వాళ్లకు వ్యతిరేకంగా రాయబడిన తీర్పు అమలుచేయడానికి+ అది వాళ్ల చేతిలో ఉండాలి.
ఈ ఘనత ఆయన విశ్వసనీయులందరికీ చెందుతుంది.
యెహోవాను* స్తుతించండి!*
అధస్సూచీలు
^ అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
^ లేదా “హల్లెలూయా!”
^ అంటే, గిలకల తప్పెట.
^ లేదా “సంగీతం వాయించాలి.”
^ ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
^ అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
^ లేదా “హల్లెలూయా!”