కీర్తనలు 109:1-31

  • కృంగిపోయిన వ్యక్తి ప్రార్థన

    • ‘అతని స్థానం వేరే వ్యక్తి తీసుకోవాలి’ (8)

    • దేవుడు పేదవాడి కుడిపక్కన నిలబడతాడు (31)

సంగీత నిర్దేశకునికి సూచన. దావీదు కీర్తన. శ్రావ్యగీతం. 109  నేను స్తుతించే దేవా,+ మౌనంగా ఉండిపోకు.  2  దుష్టులు, మోసగాళ్లు నాకు వ్యతిరేకంగా నోరు తెరుస్తున్నారు. తమ నాలుకలతో నా గురించి అబద్ధాలాడుతున్నారు;+  3  ద్వేషపూరిత మాటలతో నన్ను చుట్టుముడుతున్నారు,కారణం లేకుండా నా మీద దాడి చేస్తున్నారు.+  4  నేను చూపిన ప్రేమకు ప్రతిగా నన్ను ఎదిరిస్తున్నారు;+అయినా నేను ప్రార్థిస్తూనే ఉన్నాను.  5  నేను మంచి చేస్తే, నాకు చెడు చేస్తున్నారు;+నేను ప్రేమిస్తే, నన్ను ద్వేషిస్తున్నారు.+  6  అతని మీద ఒక చెడ్డవాడిని నియమించు;అతని కుడిపక్కన ఎదిరించేవాడు* నిలబడాలి.  7  తీర్పు తీర్చినప్పుడు అతను దోషి* అని తేలాలి;అతని ప్రార్థన కూడా పాపంగా ఎంచబడాలి.+  8  అతని రోజులు తక్కువవ్వాలి;+అతని స్థానాన్ని* వేరే వ్యక్తి తీసుకోవాలి.+  9  అతని పిల్లలు* తండ్రిలేనివాళ్లు అవ్వాలి,అతని భార్య విధవరాలు అవ్వాలి. 10  అతని పిల్లలు* పాడుబడ్డ తమ ఇళ్లలో నుండి బయల్దేరిఆహారం కోసం బిచ్చమెత్తుకుంటూ తిరగాలి. 11  అప్పులవాళ్లు* అతనికి ఉన్నదంతా లాక్కోవాలి,అపరిచితులు అతని ఆస్తిపాస్తుల్ని దోచుకోవాలి. 12  ఎవ్వరూ అతని మీద దయ* చూపించకూడదు,తండ్రిలేని అతని పిల్లల మీద ఎవ్వరూ కరుణ చూపించకూడదు. 13  అతని వంశం అంతరించిపోవాలి;+అతని వంశస్థుల పేరు ఒక్క తరంలోనే తుడిచిపెట్టుకుపోవాలి. 14  అతని పూర్వీకుల తప్పును యెహోవా గుర్తుచేసుకోవాలి,+అతని తల్లి పాపం తుడిచేయబడకూడదు. 15  వాళ్లు చేసినదాన్ని యెహోవా ఎప్పటికీ గుర్తుంచుకోవాలి;వాళ్ల జ్ఞాపకాన్ని భూమ్మీద నుండి తుడిచేయాలి.+ 16  ఎందుకంటే అతను దయ* చూపించడం మర్చిపోయాడు,+అణచివేయబడిన వాళ్లను, పేదవాళ్లను, విరిగిన హృదయం గలవాళ్లనుచంపాలని+ వాళ్లను తరుముతూ వచ్చాడు.+ 17  శపించడమంటే అతనికి మహా ఇష్టం, అందుకే అతని మీదికి శాపం వచ్చింది;అతనికి దీవించే మనసు లేదు, అందుకే అతను దీవెన పొందలేదు. 18  శాపాలు వస్త్రంలా అతన్ని కప్పేశాయి. అవి నీళ్లలా అతని శరీరంలోకి,నూనెలా అతని ఎముకల్లోకి పోయబడ్డాయి. 19  అవి అతను చుట్టుకునే బట్టల్లా,అతను ఎప్పుడూ కట్టుకునే దట్టీలా ఉండాలి.+ 20  నన్ను ఎదిరించేవాళ్లకు,నా గురించి చెడుగా మాట్లాడేవాళ్లకు యెహోవా ఇచ్చే జీతం అదే.+ 21  అయితే సర్వోన్నత ప్రభువైన యెహోవా,నీ పేరు కోసం నా తరఫున చర్య తీసుకో.+ నన్ను రక్షించు, ఎందుకంటే నీ విశ్వసనీయ ప్రేమ మంచిది.+ 22  నేను నిస్సహాయుణ్ణి, దీనస్థితిలో ఉన్నాను,+నా హృదయం పొడవబడింది.+ 23  నేను నీడలా మాయమైపోతున్నాను;మిడతలా దులిపేయబడ్డాను. 24  ఉపవాసం వల్ల నా మోకాళ్లు బలహీనపడ్డాయి,నా శరీరం చిక్కిపోయింది, నేను కృశించిపోతున్నాను.* 25  వాళ్లు నన్ను ఎగతాళి చేస్తున్నారు.+ నన్ను చూసి తలలు ఆడిస్తున్నారు.+ 26  యెహోవా, నా దేవా, నాకు సహాయం చేయి;నీ విశ్వసనీయ ప్రేమను బట్టి నన్ను రక్షించు. 27  ఇది నీ చేతి వల్లే జరిగిందని,యెహోవా, నువ్వే ఇది చేశావని వాళ్లకు తెలియాలి. 28  వాళ్లను శపించనివ్వు, కానీ నువ్వు దీవించు. వాళ్లు నా మీదికి లేచినప్పుడు వాళ్లు సిగ్గుపడాలి,అయితే నీ సేవకుడు సంతోషించాలి. 29  నన్ను ఎదిరించేవాళ్లు అవమానంతో కప్పబడాలి;వస్త్రంతో* చుట్టబడినట్టు సిగ్గుతో చుట్టబడాలి.+ 30  నా నోరు ఉత్సాహంగా యెహోవాను స్తుతిస్తుంది;చాలామంది ముందు నేను ఆయన్ని స్తుతిస్తాను.+ 31  ఎందుకంటే ఆయన పేదవాడి కుడిపక్కన నిలబడి,అతన్ని దోషిగా తీర్పుతీర్చేవాళ్ల నుండి అతన్ని కాపాడతాడు.

అధస్సూచీలు

లేదా “నిందించేవాడు.”
లేదా “దుష్టుడు.”
అంటే, పర్యవేక్షకునిగా అతని స్థానాన్ని.
అక్ష., “కుమారులు.”
అక్ష., “కుమారులు.”
లేదా “అక్రమ వడ్డీ వసూలుచేసే వాళ్లు.”
లేదా “విశ్వసనీయ ప్రేమ.”
లేదా “విశ్వసనీయ ప్రేమ.”
అక్ష., “కొవ్వు (నూనె) లేక నా శరీరం బక్కచిక్కింది.”
లేదా “చేతుల్లేని నిలువుటంగీతో.”