ఎజ్రా 5:1-17

  • యూదులు ఆలయ నిర్మాణాన్ని తిరిగి మొదలుపెట్టారు (1-5)

  • దర్యావేషు రాజుకు తత్తెనై ఉత్తరం (6-17)

5  అప్పుడు ప్రవక్తలైన హగ్గయి,+ ఇద్దో+ మనవడైన జెకర్యా+ యూదులకు తోడుగా ఉన్న ఇశ్రాయేలు దేవుని పేరున యూదాలో, యెరూషలేములో ఉన్న యూదులకు ప్రవచించారు.  దాంతో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు,+ యెహోజాదాకు కుమారుడైన యేషూవ+ యెరూషలేములోని దేవుని మందిరాన్ని తిరిగి కట్టడం ప్రారంభించారు.+ దేవుని ప్రవక్తలు వాళ్లతో ఉండి వాళ్లకు సహాయం చేశారు.+  ఆ సమయంలో నది అవతలి ప్రాంతానికి* అధిపతైన తత్తెనై, షెతర్బోజ్నయి, వాళ్ల సహోద్యోగులు వాళ్ల దగ్గరికి వచ్చి, “ఈ మందిరాన్ని కట్టమని, దీని నిర్మాణాన్ని పూర్తిచేయమని ఎవరు మీకు ఆజ్ఞ జారీ చేశారు?” అని అడిగారు.  ఆ తర్వాత వాళ్లు, “ఈ నిర్మాణ పని చేస్తున్న వాళ్ల పేర్లు ఏమిటి?” అని వాళ్లను ​అడిగారు.  కానీ దేవుని దృష్టి యూదుల పెద్దల మీద ఉంది,+ కాబట్టి దర్యావేషు దగ్గరికి ఒక నివేదిక పంపబడి, దానికి సంబంధించిన ​అధికార పత్రం వెనక్కి వచ్చేంతవరకు వాళ్లు ఆ పనిని ​ఆపుజేయించలేదు.  నది అవతలి ప్రాంతానికి అధిపతైన తత్తెనై, షెతర్బోజ్నయి, నది అవతలి ప్రాంతానికి కింది స్థాయి అధిపతులైన వాళ్ల సహోద్యోగులు ​దర్యావేషు రాజుకు పంపిన లేఖ నకలు ఇది;  వాళ్లు అతనికి పంపిన లేఖలో ఇలా రాశారు: “దర్యావేషు రాజుకు: “మీకు క్షేమం కలగాలి!  మేము యూదా సంస్థానంలోని మహాదేవుని మందిరం దగ్గరికి వెళ్లాం. అది పెద్దపెద్ద రాళ్లతో నిర్మించబడుతోంది. గోడల్లో దూలాల్ని అమరుస్తున్నారు. ప్రజలు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. వాళ్లు కష్టపడి పనిచేస్తూ పనిని ముందుకు తీసుకెళ్తున్నారని మీకు తెలియజేస్తున్నాం.  అప్పుడు మేము వాళ్ల పెద్దల్ని, ‘ఈ మందిరాన్ని కట్టమని, దీని నిర్మాణాన్ని పూర్తిచేయమని ఎవరు మీకు ఆజ్ఞ జారీ చేశారు?’ అని అడిగాం.+ 10  మీకు తెలియజేయడానికి మేము వాళ్ల పేర్లను కూడా అడిగాం. నాయకత్వం వహించేవాళ్ల పేర్లను మీకు రాయడానికి అలా అడిగాం. 11  “దానికి వాళ్లు ఇలా జవాబిచ్చారు: ‘మేము భూమ్యాకాశాల దేవుని సేవకులం. చాలా సంవ​త్సరాల క్రితం నిర్మించబడిన మందిరాన్ని మేము తిరిగి కడుతున్నాం. ఒక గొప్ప ఇశ్రాయేలు రాజు దాన్ని కట్టించి పూర్తిచేశాడు.+ 12  అయితే, మా తండ్రులు పరలోక దేవునికి కోపం తెప్పించడం వల్ల+ ఆయన వాళ్లను బబులోను రాజూ కల్దీయుడూ అయిన నెబుకద్నెజరు చేతికి అప్పగించాడు.+ అతను ఈ మందిరాన్ని పడగొట్టి,+ ప్రజల్ని బబులోనుకు బందీలుగా తీసుకెళ్లాడు.+ 13  అయితే, కోరెషు బబులోనుకు రాజైన మొదటి సంవత్సరంలో, దేవుని మందిరాన్ని తిరిగి కట్టమనే ఆజ్ఞను కోరెషు రాజు జారీ చేశాడు.+ 14  అంతేకాదు, నెబుకద్నెజరు యెరూషలేములోని దేవుని ఆలయంలో నుండి తీసుకెళ్లి, బబులోను గుడిలో పెట్టిన వెండిబంగారు పాత్రల్ని కోరెషు రాజు బబులోను గుడిలో నుండి బయటికి తెప్పించాడు.+ అవి కోరెషు అధిపతిగా నియమించిన షేష్బజ్జరు*+ అనే వ్యక్తికి ఇవ్వబడ్డాయి. 15  కోరెషు షేష్బజ్జరుకు ఇలా చెప్పాడు: “ఈ పాత్రలు తీసుకొని వెళ్లి యెరూషలేములోని ఆలయంలో పెట్టు. దేవుని మందిరం అది ఒక​ప్పుడు ఉన్న స్థలంలోనే తిరిగి కట్టబడాలి.”+ 16  తర్వాత షేష్బజ్జరు వచ్చి యెరూషలేము​లోని దేవుని మందిరానికి పునాదులు వేశాడు;+ అప్పటినుండి ఇప్పటివరకు అది నిర్మాణ దశ​లోనే ఉంది, ఇంకా పూర్తికాలేదు.’+ 17  “రాజా, ఇప్పుడు మీ దృష్టికి సరైనదని​పిస్తే, కోరెషు రాజు యెరూషలేములోని దేవుని మందిరాన్ని తిరిగి కట్టమని ఆజ్ఞ జారీ చేశాడో లేదో తెలుసుకోవడానికి అక్కడ బబులోనులోని రాజు ఖజానాలో తనిఖీ చేయించండి;+ తర్వాత ఈ విషయంపై మీ నిర్ణయాన్ని మాకు తిరిగి పంపండి.”

అధస్సూచీలు

ఇది యూఫ్రటీసు నదికి పడమటి వైపున్న ప్రాంతాల్ని సూచిస్తుంది.
ఎజ్రా 2:2; 3:8లో ఉన్న జెరుబ్బాబెలు ఇతనే కావచ్చు.