ఆదికాండం 47:1-31

  • యాకోబు ఫరోను కలవడం (1-12)

  • యోసేపు తెలివైన నిర్వహణ (13-26)

  • ఇశ్రాయేలు గోషెనులో స్థిరపడడం (27-31)

47  యోసేపు ఫరో దగ్గరికి వెళ్లి, “మా నాన్న, నా సహోదరులు తమ మందల్ని, పశువుల్ని, తమకున్న వాటన్నిటినీ తీసుకొని కనాను దేశం నుండి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు వాళ్లు గోషెను ప్రాంతంలో ఉన్నారు”+ అని చెప్పాడు.+  యోసేపు తనతోపాటు తన సహోదరుల్లో ఐదుగుర్ని తీసుకెళ్లి ఫరో ముందు నిలబెట్టాడు.+  ఫరో వాళ్లను, “మీరు ఏమి పని చేస్తుంటారు?” అని అడిగాడు. అందుకు వాళ్లు, “నీ సేవకులమైన మేము గొర్రెల కాపరులం. మేమే కాదు, మా పూర్వీకులు కూడా ఇదే పని చేసేవాళ్లు” అని చెప్పారు.+  తర్వాత వాళ్లు ఫరోతో ఇలా అన్నారు: “మేము ఇక్కడ పరదేశులుగా ఉండడానికి వచ్చాం.+ ఎందుకంటే కనాను దేశంలో కరువు విపరీతంగా ఉండడంవల్ల+ నీ సేవకులమైన మా మందలకు అక్కడ పచ్చిక లేదు. దయచేసి నీ సేవకులమైన మమ్మల్ని గోషెను ప్రాంతంలో ఉండనివ్వు.”+  అప్పుడు ఫరో యోసేపుతో ఇలా అన్నాడు: “మీ నాన్న, నీ సహోదరులు నీ దగ్గరికి వచ్చారు.  ఐగుప్తు దేశం నీ ముందుంది. మీ నాన్నను, నీ సహోదరుల్ని ఐగుప్తు దేశంలోని అత్యంత శ్రేష్ఠమైన ప్రాంతంలో ఉండనివ్వు.+ వాళ్లను గోషెను ప్రాంతంలో ఉండనివ్వు. నీకు తెలిసి, వాళ్లలో ఎవరైనా సమర్థులు ఉంటే, వాళ్లను నా పశువులకు ముఖ్య కాపరులుగా నియమించు.”  ఆ తర్వాత యోసేపు తన తండ్రి యాకోబును ఫరో ముందుకు తీసుకొచ్చాడు. అప్పుడు యాకోబు ఫరోను దీవించాడు.  ఫరో యాకోబును, “నీ వయసెంత?” అని అడిగాడు.  దానికి యాకోబు ఫరోతో ఇలా అన్నాడు: “నా వయసు 130 ఏళ్లు. నా పూర్వీకులతో పోలిస్తే నా జీవితకాలం చాలా చిన్నది.+ నా జీవితమంతా ఎన్నో కష్టాల మధ్య సాగింది.+ నేను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి సంచరిస్తూ పరదేశిగా బ్రతికాను. నా పూర్వీకులు కూడా పరదేశులుగానే బ్రతికారు.” 10  తర్వాత యాకోబు ఫరోను దీవించి, అతని ముందు నుండి వెళ్లిపోయాడు. 11  ఫరో ఆజ్ఞాపించినట్టే యోసేపు ఐగుప్తు దేశంలోని అత్యంత శ్రేష్ఠమైన ప్రాంతంలో అంటే రామెసేసులో+ కొంత భాగాన్ని తన తండ్రికి, తన సహోదరులకు ఆస్తిగా ఇచ్చి, వాళ్లు అక్కడ నివసించేలా చేశాడు. 12  యోసేపు తన తండ్రికి, తన సహోదరులకు, తన తండ్రి ఇంటివాళ్లందరికీ వాళ్లవాళ్ల కుటుంబ అవసరాల ప్రకారం ఆహారాన్ని సరఫరా చేస్తూ ఉన్నాడు. 13  కరువు విపరీతంగా ఉన్నందువల్ల దేశమంతట్లో ఎక్కడా ఆహారం లేకుండా పోయింది. కరువు వల్ల ఐగుప్తు దేశ పరిస్థితి, కనాను దేశ పరిస్థితి దుర్భరంగా తయారైంది.+ 14  యోసేపు ఐగుప్తు దేశంలో, కనాను దేశంలో ఉన్న డబ్బునంతా అంటే ప్రజలు ధాన్యం కొనడానికి ఇస్తున్న డబ్బునంతా+ సేకరించి, దాన్ని ఫరో ఇంటికి తీసుకొస్తూ ఉన్నాడు. 15  కొంతకాలానికి ఐగుప్తు దేశంలో, కనాను దేశంలో ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది. అప్పుడు ఐగుప్తీయులందరూ యోసేపు దగ్గరికి రావడం మొదలుపెట్టి, “మా డబ్బంతా అయిపోయింది! మాకు ఆహారం ఇవ్వు, లేదంటే మేమంతా నీ కళ్లముందే ఆకలితో చనిపోతాం” అన్నారు. 16  అప్పుడు యోసేపు ఇలా అన్నాడు: “మీ డబ్బు అయిపోతే, మీ పశువుల్ని ఇవ్వండి. మీ పశువులకు మారుగా నేను మీకు ఆహారం ఇస్తాను.” 17  కాబట్టి వాళ్లు యోసేపు దగ్గరికి తమ పశువుల్ని తీసుకురావడం మొదలుపెట్టారు. వాళ్ల గుర్రాల్ని, పశువుల్ని, మందల్ని, గాడిదల్ని తీసుకొని అతను వాళ్లకు ఆహారం ఇస్తూ ఉన్నాడు. అలా ఆ సంవత్సరం అతను వాళ్ల పశువులన్నిటికీ మారుగా ఆహారం ఇచ్చి, వాళ్లను పోషిస్తూ ఉన్నాడు. 18  ఆ సంవత్సరం గడిచాక, తర్వాతి సంవత్సరం ప్రజలు అతని దగ్గరికి వచ్చి ఇలా అనడం మొదలుపెట్టారు: “ప్రభూ, నీ దగ్గర దాచేదేముంది? ఇప్పటికే మేము మా డబ్బును, పశువుల మందల్ని మా ప్రభువుకు ఇచ్చేశాం. ఇప్పుడు మా ప్రభువుకు ఇవ్వడానికి మా శరీరాలు, మా భూములు తప్ప మా దగ్గర ఏమీ మిగల్లేదు. 19  మేమూ, మా భూములూ నీ కళ్లముందు ఎందుకు నశించిపోవాలి? మమ్మల్ని, మా భూముల్ని కొని మాకు ఆహారం ఇవ్వు. మేము ఫరోకు దాసులమౌతాం, మా భూములు ఫరో సొంతమౌతాయి. మేము చనిపోకుండా బ్రతికి ఉండేలా, మా పొలాలు బీడుబారిపోకుండా ఉండేలా మాకు విత్తనాల్ని ఇవ్వు.” 20  అప్పుడు యోసేపు ఐగుప్తీయుల భూములన్నిటినీ ఫరో కోసం కొన్నాడు. ఎందుకంటే కరువు చాలా విపరీతంగా ఉన్నందువల్ల ప్రతీ ఐగుప్తీయుడు తన పొలాన్ని అమ్మేశాడు. అలా భూములన్నీ ఫరో సొంతమయ్యాయి. 21  తర్వాత యోసేపు ఐగుప్తు దేశంలో ఈ చివర నుండి ఆ చివర వరకు ఉన్న ప్రజలందర్నీ నగరాల్లోకి రప్పించాడు.+ 22  పూజారుల భూముల్ని మాత్రం అతను కొనలేదు,+ ఎందుకంటే పూజారులకు ఫరో దగ్గర నుండే సరుకులు వెళ్తూ ఉండేవి, ఫరో ఇచ్చిన సరుకులతోనే వాళ్ల జీవనం సాగేది. అందుకే వాళ్లు తమ భూముల్ని అమ్మలేదు. 23  తర్వాత యోసేపు ప్రజలకు ఇలా చెప్పాడు: “ఇదిగో, ఈ రోజు నేను మిమ్మల్ని, మీ భూముల్ని ఫరో కోసం కొన్నాను. ఇప్పుడు మీకు విత్తనాలు ఇస్తున్నాను, వాటిని మీరు పొలాల్లో విత్తాలి. 24  పంట చేతికి వచ్చినప్పుడు ఐదో వంతును ఫరోకు ఇవ్వండి.+ మిగతా నాలుగు వంతులు మీవే. అవి మళ్లీ పంట పండించడానికి విత్తనాలుగా, అలాగే మీకు, మీ ఇంట్లోవాళ్లకు, మీ పిల్లలకు ఆహారంగా ఉంటాయి.” 25  అందుకు వాళ్లు ఇలా అన్నారు: “నువ్వు మా ప్రాణాల్ని కాపాడావు.+ ప్రభూ, మా మీద నీ దయ చూపించు, మేము ఫరోకు దాసులమౌతాం.”+ 26  అప్పుడు, ఐదో వంతు ఫరోకు చెందుతుందని యోసేపు ఒక చట్టం జారీచేశాడు. అది నేటికీ ఐగుప్తు దేశమంతటా అమల్లో ఉంది. పూజారుల భూములు మాత్రమే ఫరో సొంతం అవ్వలేదు.+ 27  ఇశ్రాయేలు ఇంటివాళ్లు ఐగుప్తు దేశంలోని గోషెను ప్రాంతంలోనే నివసించసాగారు.+ వాళ్లు అక్కడే స్థిరపడి, పిల్లల్ని కని, గొప్ప జనం అయ్యారు.+ 28  యాకోబు ఐగుప్తు దేశానికి వచ్చాక ఇంకా 17 ఏళ్లు బ్రతికాడు. అలా యాకోబు మొత్తం 147 ఏళ్లు బ్రతికాడు.+ 29  ఇశ్రాయేలు చనిపోయే సమయం దగ్గర పడుతుండడంతో,+ అతను తన కుమారుడైన యోసేపును పిలిచి ఇలా అన్నాడు: “ఇప్పుడు నీ దయ నా మీద ఉంటే, దయచేసి నీ చెయ్యి నా తొడ కింద పెట్టి, నా పట్ల విశ్వసనీయ ప్రేమను, నమ్మకత్వాన్ని చూపించు. దయచేసి నన్ను ఐగుప్తులో పాతిపెట్టొద్దు.+ 30  నేను చనిపోయినప్పుడు,* నువ్వు నన్ను ఐగుప్తు నుండి తీసుకెళ్లి నా పూర్వీకుల సమాధిలో పాతిపెట్టాలి.”+ అందుకు యోసేపు, “నువ్వు చెప్పినట్టే చేస్తాను” అన్నాడు. 31  అప్పుడు ఇశ్రాయేలు, “నాకు ఒట్టేయి” అన్నాడు, యోసేపు ఒట్టేశాడు.+ అప్పుడు ఇశ్రాయేలు మంచం తలవైపున వంగి ప్రార్థన చేశాడు.+

అధస్సూచీలు

అక్ష., “నా తండ్రులతో నిద్రించినప్పుడు.”