ఆదికాండం 44:1-34

  • బెన్యామీను సంచిలో యోసేపు వెండి గిన్నె (1-17)

  • యూదా బెన్యామీను గురించి ​వేడుకోవడం (18-34)

44  తర్వాత యోసేపు తన ఇంటిమీద అధికారిగా ఉన్న వ్యక్తికి ఇలా ఆజ్ఞాపించాడు: “వాళ్లు మోసుకెళ్లగలిగేంత ఆహారాన్ని వాళ్ల సంచుల్లో నింపు, ఎవరి డబ్బు వాళ్ల సంచిలో పెట్టు.+  అయితే, అందరికన్నా చిన్నవాడి సంచిలో అతని ధాన్యం డబ్బును, అలాగే నా వెండి గిన్నెను పెట్టు.” దాంతో అతను యోసేపు చెప్పినట్టే చేశాడు.  ఉదయం వెలుతురు వచ్చిన తర్వాత వాళ్లను తమ గాడిదలతోపాటు పంపించేశారు.  వాళ్లు నగరం దాటి ఎక్కువ దూరం వెళ్లకముందే, యోసేపు తన ఇంటిమీద అధికారిగా ఉన్న వ్యక్తితో ఇలా అన్నాడు: “లే! త్వరగా వెళ్లి వాళ్లను పట్టుకో! వాళ్లు దొరికాక, వాళ్లతో ఇలా అను: ‘మేము మీకు మంచి చేస్తే మీరు ఎందుకు మాకు చెడు చేశారు?  నా యజమాని తాగడానికి, సరిగ్గా శకునం చూడడానికి ఉపయోగించేది ఈ గిన్నెనే కదా? మీరు చాలా చెడ్డపని చేశారు.’ ”  అప్పుడు ఆ అధికారి వెళ్లి వాళ్లను కలిసి, ఆ మాటలు చెప్పాడు.  కానీ వాళ్లు అతనితో ఇలా అన్నారు: “మా ప్రభువు ఎందుకు అంత మాట అంటున్నాడు? నీ సేవకులమైన మేము అలాంటి పని ఎప్పుడూ చేయం.  మా సంచుల్లో దొరికిన డబ్బునే మేము కనాను దేశం నుండి తిరిగి తీసుకొచ్చాం.+ అలాంటిది, మీ యజమాని ఇంట్లో నుండి వెండిని గానీ బంగారాన్ని గానీ ఎలా దొంగిలిస్తాం?  నీ సేవకులమైన మాలో ఎవరి దగ్గరైనా ఆ గిన్నె దొరికితే అతను చనిపోవాలి, అంతేకాదు మిగిలినవాళ్లం కూడా మా యజమానికి దాసులమౌతాం.” 10  అప్పుడు అతను ఇలా అన్నాడు: “మీరు చెప్పినట్టే కానివ్వండి. అది ఎవరి దగ్గర దొరికితే అతను నాకు దాసుడౌతాడు, మిగతావాళ్లు నిర్దోషులు.” 11  వెంటనే వాళ్లంతా తమ సంచుల్ని కిందికి దింపి, వాటిని విప్పారు. 12  అతను పెద్దవాడి సంచి నుండి మొదలుపెట్టి చిన్నవాడి సంచి వరకు ఒక్కొక్కటి జాగ్రత్తగా వెతికాడు. చివరికి ఆ గిన్నె బెన్యామీను సంచిలో దొరికింది.+ 13  అప్పుడు వాళ్లు తమ బట్టలు చింపుకొని, ప్రతీ ఒక్కరు మళ్లీ తమ సంచిని తమ గాడిద మీదికి ఎక్కించుకొని నగరానికి తిరిగి వచ్చారు. 14  యూదా,+ అతని సహోదరులు యోసేపు ఇంటికి వెళ్లేసరికి, యోసేపు ఇంకా అక్కడే ఉన్నాడు. అప్పుడు వాళ్లు అతని ముందు నేలమీద సాష్టాంగపడ్డారు.+ 15  యోసేపు వాళ్లతో, “మీరు చేసిన పనేంటి? నాలాంటి వ్యక్తి శకునం చూసి జరిగినదంతా తెలుసుకోగలడని+ మీకు తెలీదా?” అన్నాడు. 16  అప్పుడు యూదా ఇలా అన్నాడు: “మేము మా యజమానికి ఏమి చెప్పగలం? ఏమి మాట్లాడగలం? మేము నిర్దోషులమని ఎలా రుజువు చేసుకోగలం? సత్యదేవుడే నీ దాసుల తప్పును+ కనిపెట్టాడు. ఇప్పుడు మేము, అలాగే ఎవరి చేతిలో ఆ గిన్నె దొరికిందో అతను, మా యజమానికి దాసులం.” 17  అయితే యోసేపు ఇలా అన్నాడు: “నేను ఎన్నడూ అలా చేయను! ఎవరి చేతిలో ఆ గిన్నె దొరికిందో అతను మాత్రమే నాకు దాసుడౌతాడు.+ మిగిలినవాళ్లు మనశ్శాంతితో మీ నాన్న దగ్గరికి వెళ్లండి.” 18  అప్పుడు యూదా యోసేపు దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు: “నా యజమానీ, దయచేసి నీ దాసుడు నీతో చెప్పే మాటను వినమని వేడుకుంటున్నాను, నీ దాసుని మీద కోపం తెచ్చుకోకు. నువ్వు ఫరో అంతటివాడివి.+ 19  నా యజమాని తన దాసుల్ని, ‘మీకు నాన్న గానీ తమ్ముడు గానీ ఉన్నాడా?’ అని అడిగాడు. 20  అప్పుడు మేము మా యజమానికి ఇలా చెప్పాం: ‘మాకు వృద్ధుడైన నాన్న, అతని వృద్ధాప్యంలో పుట్టిన ఒక పిల్లవాడు, అంటే మా అందరికన్నా చిన్నవాడైన తమ్ముడు ఉన్నాడు.+ అయితే అతని అన్న చనిపోయాడు.+ కాబట్టి వాళ్లమ్మకు పుట్టినవాళ్లలో మిగిలింది అతనొక్కడే.+ అతనంటే వాళ్ల నాన్నకు చాలా ఇష్టం.’ 21  అప్పుడు నువ్వు నీ దాసులతో, ‘అతన్ని నా దగ్గరికి తీసుకురండి, నేను అతన్ని చూడాలి’ అన్నావు.+ 22  కానీ మేము మా యజమానితో, ‘ఆ పిల్లవాడు వాళ్ల నాన్నను విడిచి రాలేడు. ఒకవేళ అలా విడిచి వస్తే, వాళ్ల నాన్న ఖచ్చితంగా చనిపోతాడు’+ అని చెప్పాం. 23  అప్పుడు నువ్వు నీ దాసులకు, ‘మీ చిన్న తమ్ముడు మీతో వస్తేనే గానీ మీరు మళ్లీ నా ముఖం చూడకూడదు’ అని చెప్పావు.+ 24  “కాబట్టి మేము నీ దాసుడైన మా నాన్న దగ్గరికి వెళ్లి, మా యజమాని అన్న మాటల గురించి అతనికి చెప్పాం. 25  తర్వాత మా నాన్న, ‘మీరు మళ్లీ అక్కడికి వెళ్లి మనకోసం కొంత ఆహారం కొనుక్కురండి’ అన్నాడు.+ 26  కానీ మేము ఇలా అన్నాం: ‘మేము వెళ్లలేం. మా చిన్న తమ్ముడు మాతోపాటు వస్తేనే మేము వెళ్తాం. ఎందుకంటే మాతోపాటు మా చిన్న తమ్ముడు ఉంటేనే గానీ అతని ముఖం చూడలేం.’+ 27  అప్పుడు నీ దాసుడైన మా నాన్న మాతో ఇలా అన్నాడు: ‘నా భార్య నాకు ఇద్దరు కుమారుల్ని కన్నదని+ మీకు బాగా తెలుసు. 28  కానీ వాళ్లలో ఒకడు నన్ను విడిచి వెళ్లాడు, అప్పుడు నేను “ఖచ్చితంగా ఒక క్రూరమృగం అతన్ని ముక్కలుముక్కలు చేసివుంటుంది!” అనుకున్నాను.+ ఇప్పటివరకు నేను అతన్ని చూడలేదు. 29  ఇతన్ని కూడా మీరు నా కళ్లముందు నుండి తీసుకెళ్లారనుకోండి, తర్వాత ఇతనికి ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే, మీరు ఖచ్చితంగా తల నెరసిన నన్ను దుఃఖంతో సమాధిలోకి*+ వెళ్లేలా చేస్తారు.’+ 30  “నీ దాసుడైన మా నాన్న ప్రాణం ఇతని ప్రాణంతో ముడిపడి ఉంది. కాబట్టి ఇప్పుడు మేము ఈ పిల్లవాడు లేకుండా మా నాన్న దగ్గరికి వెళ్తే, 31  పిల్లవాడు లేకపోవడం చూసిన వెంటనే అతను చనిపోతాడు. అప్పుడు నీ దాసులమైన మేము, తల నెరసిన నీ దాసుడైన మా నాన్నను దుఃఖంతో సమాధిలోకి* వెళ్లేలా చేసినవాళ్లమౌతాం. 32  నీ దాసుడినైన నేను, ఆ పిల్లవాడికి ఏమీ కాకుండా చూసే పూచీ నాదని చెప్పి మా నాన్నతో, ‘నేను అతన్ని వెనక్కి తీసుకొచ్చి నీకు అప్పగించకపోతే, ఆ పాపం జీవితాంతం నా మీద ఉంటుంది’ అన్నాను.+ 33  కాబట్టి ఇప్పుడు ఆ పిల్లవాడు తన సహోదరులతో తిరిగెళ్లేలా, దయచేసి, ఆ పిల్లవాడి స్థానంలో నీ దాసుడినైన నన్ను నా యజమానికి దాసునిగా ఉండనివ్వు. 34  ఆ పిల్లవాడు లేకుండా నేను మా నాన్న దగ్గరికి ఎలా వెళ్లగలను? మా నాన్నకు ఏమైనా జరిగితే, అది చూసి నేను తట్టుకోలేను!”

అధస్సూచీలు

లేదా “షియోల్‌లోకి,” అంటే మానవజాతి సాధారణ సమాధిలోకి. పదకోశం చూడండి.
లేదా “షియోల్‌లోకి,” అంటే మానవజాతి సాధారణ సమాధిలోకి. పదకోశం చూడండి.