ఆదికాండం 43:1-34

  • యోసేపు సహోదరులు రెండోసారి ఐగుప్తుకు వెళ్లడం; బెన్యామీనుతో (1-14)

  • యోసేపు మళ్లీ తన సహోదరుల్ని ​కలవడం (15-23)

  • యోసేపు తన సహోదరులతో విందు ​ఆరగించడం (24-34)

43  కనాను దేశంలో కరువు విపరీతంగా ఉంది.+ 2  ఐగుప్తు నుండి వాళ్లు తెచ్చిన ధాన్యం+ అయిపోయిన తర్వాత వాళ్ల నాన్న, “మీరు మళ్లీ వెళ్లి, మన కోసం కొంత ఆహారం కొనుక్కురండి” అని వాళ్లతో అన్నాడు. 3  అప్పుడు యూదా ఇలా అన్నాడు: “ఆ వ్యక్తి, ‘మీ తమ్ముణ్ణి మీతోపాటు తీసుకొస్తేనే గానీ మీరు మళ్లీ నా ముఖం చూడొద్దు’ అని మమ్మల్ని గట్టిగా హెచ్చరించాడు.+ 4  నువ్వు మా తమ్ముణ్ణి మాతో పంపిస్తే, మేము వెళ్లి ఆహారం కొనుక్కొస్తాం. 5  కానీ నువ్వు అతన్ని మాతో పంపించకపోతే, మేము వెళ్లం. ఎందుకంటే, ‘మీ తమ్ముణ్ణి మీతోపాటు తీసుకొస్తేనే గానీ మీరు మళ్లీ నా ముఖం చూడొద్దు’ అని ఆ వ్యక్తి మాతో అన్నాడు.”+ 6  అప్పుడు ఇశ్రాయేలు,+ “మీకు ఇంకో తమ్ముడు ఉన్నాడని అతనికి  చెప్పి, మీరెందుకు నామీదికి ఈ కష్టం తీసుకొచ్చారు?” అని వాళ్లను అడిగాడు. 7  అందుకు వాళ్లు ఇలా అన్నారు: “అతను ‘మీ నాన్న ఇంకా బ్రతికున్నాడా? మీకు ఇంకో తమ్ముడు ఉన్నాడా?’ అని మన గురించి, మన బంధువుల గురించి గుచ్చిగుచ్చి అడిగాడు. దాంతో మేము ఉన్నదున్నట్టుగా చెప్పేశాం.+ కానీ అతను, ‘మీ తమ్ముణ్ణి ఇక్కడికి తీసుకురండి’ అని అంటాడని మాకేం తెలుసు?”+ 8  తర్వాత యూదా తన తండ్రి ఇశ్రాయేలును ఇలా వేడుకున్నాడు: “ఈ పిల్లవాణ్ణి నాతో పంపించు.+ నువ్వు, మేము, మా పిల్లలు+ చనిపోకుండా బ్రతికుండేలా+ మమ్మల్ని అక్కడికి వెళ్లనివ్వు. 9  అతనికి ఏమీ కాకుండా చూసుకునే పూచీ నాది.+ నువ్వు నన్ను బాధ్యునిగా ఎంచవచ్చు. నేను అతన్ని వెనక్కి తీసుకొచ్చి నీకు అప్పగించకపోతే, ఆ పాపం జీవితాంతం నా మీద ఉంటుంది. 10  ఇలా ఆలస్యం చేయకపోయుంటే, ఇప్పటికి మేము రెండుసార్లు అక్కడికి వెళ్లి, తిరిగొచ్చేవాళ్లం.” 11  అందుకు వాళ్ల నాన్న ఇశ్రాయేలు వాళ్లతో ఇలా అన్నాడు: “అలాగైతే, మీరు ఈ దేశంలో దొరికే శ్రేష్ఠమైన పదార్థాల్ని అంటే కొంచెం సాంబ్రాణిని,+ కొంచెం తేనెను, సువాసనగల జిగురును, గుగ్గిలం బెరడును,+ పిస్తా కాయల్ని, బాదం కాయల్ని మీ గోనెసంచుల్లో వేసుకొని అతనికి బహుమానంగా+ తీసుకెళ్లండి. 12  ఈసారి రెండింతల డబ్బు తీసుకెళ్లండి; మీ సంచుల్లో తిరిగి పెట్టిన డబ్బును కూడా తీసుకెళ్లండి.+ బహుశా వాళ్లు పొరపాటున ఆ డబ్బును పెట్టివుంటారు. 13  మీ తమ్ముణ్ణి తీసుకొని, అతని దగ్గరికి వెళ్లండి. 14  మీ ఇంకో సహోదరుణ్ణి, అలాగే బెన్యామీనును అతను మీకు తిరిగి అప్పగించేలా సర్వశక్తిగల దేవుడు అతనికి మీ మీద జాలి పుట్టించాలి. ఇక నా విషయమంటారా, నేను కుమారుల్ని పోగొట్టుకొని బాధపడాల్సి వస్తే బాధపడతాను!”+ 15  కాబట్టి వాళ్లు ఆ బహుమానాన్ని, రెండింతల డబ్బును, బెన్యామీనును తీసుకొని బయల్దేరారు. వాళ్లు ఐగుప్తుకు వెళ్లి, మళ్లీ యోసేపు ముందు నిలబడ్డారు.+ 16  బెన్యామీను వాళ్లతోపాటు ఉండడం చూసిన వెంటనే యోసేపు తన ఇంటిమీద అధికారిగా ఉన్న వ్యక్తితో, “వీళ్లను ఇంటికి తీసుకెళ్లి, జంతువుల్ని వధించి, భోజనం తయారుచేయి. మధ్యాహ్నం వీళ్లు నాతో కలిసి భోజనం చేస్తారు” అన్నాడు. 17  అతను వెంటనే వెళ్లి యోసేపు చెప్పినట్టు చేశాడు,+ వాళ్లను యోసేపు ఇంటికి తీసుకెళ్లాడు. 18  వాళ్లను యోసేపు ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు వాళ్లు భయపడిపోయి, ఇలా అనుకోవడం మొదలుపెట్టారు: “పోయినసారి మన సంచుల్లో తిరిగి పెట్టిన డబ్బు గురించే మనల్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు వాళ్లు మనమీద దాడి చేసి, మనల్ని బానిసలుగా చేసుకుంటారు, మన గాడిదల్ని లాక్కుంటారు!”+ 19  వాళ్లు యోసేపు ఇంటిమీద అధికారిగా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లి, ఇంటి గుమ్మం దగ్గర అతనితో మాట్లాడారు. 20  వాళ్లు ఇలా అన్నారు: “ప్రభూ! చిన్న మనవి. మేము ఇంతకుముందు ఆహారం కొనుక్కోవడానికి వచ్చాం.+ 21  కానీ మేము తిరిగెళ్లేటప్పుడు దారిలో ఒకచోట విడిది కోసం ఆగి, మా సంచులు విప్పినప్పుడు, మా డబ్బంతా మా సంచుల్లోనే ఉంది.+ మేము దాన్ని తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నాం. 22  ఇప్పుడు మేము ఆహారం కొనడానికి ఎక్కువ డబ్బు తీసుకొచ్చాం. అప్పుడు మా సంచుల్లో డబ్బు ఎవరు పెట్టారో మాకు తెలీదు.”+ 23  దానికి అతను, “ఫర్వాలేదు, భయపడకండి. మీ దేవుడు, మీ తండ్రి ఆరాధించిన దేవుడు మీ సంచుల్లో ఆ డబ్బు పెట్టాడు. మీ డబ్బు నాకు ముట్టింది” అన్నాడు. తర్వాత అతను షిమ్యోనును వాళ్ల దగ్గరికి తీసుకొచ్చాడు.+ 24  ఆ తర్వాత అతను వాళ్లను యోసేపు ఇంట్లోకి తీసుకొచ్చి, కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చాడు, వాళ్ల గాడిదలకు మేత వేశాడు. 25  యోసేపు మధ్యాహ్నం అక్కడికి వచ్చి తమతో కలిసి భోజనం చేస్తాడని వాళ్లు విన్నారు,+ కాబట్టి అతని కోసం బహుమానాన్ని+ సిద్ధం చేశారు. 26  యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వాళ్లు తమ బహుమానాన్ని అతని దగ్గరికి తీసుకెళ్లి, అతని ముందు నేలకు వంగి సాష్టాంగ నమస్కారం చేశారు.+ 27  తర్వాత అతను వాళ్ల బాగోగులు తెలుసుకొని, “మీరు చెప్పిన వృద్ధుడైన మీ నాన్న ఎలా ఉన్నాడు? అతను ఇంకా బ్రతికేవున్నాడా?”+ అని అడిగాడు. 28  అందుకు వాళ్లు, “మీ సేవకుడైన మా నాన్న బాగున్నాడు, అతను ఇంకా బ్రతికేవున్నాడు” అని చెప్పి, వంగి సాష్టాంగ నమస్కారం చేశారు.+ 29  యోసేపు తల ఎత్తి తన తమ్ముణ్ణి అంటే తన తల్లికి పుట్టిన బెన్యామీనును+ చూసినప్పుడు, “మీరు చెప్పిన మీ చిన్న తమ్ముడు ఇతడేనా?”+ అని అడిగి, “నా కుమారుడా, దేవుడు నీమీద అనుగ్రహం చూపించాలి” అన్నాడు. 30  యోసేపు తన తమ్ముణ్ణి చూసినప్పుడు భావోద్వేగాన్ని అణుచుకోలేక త్వరత్వరగా బయటికి వెళ్లి, ఏడ్వడానికి ఒక చోటు కోసం వెదికాడు. అతను ఒంటరిగా ఒక గదిలోకి వెళ్లి చాలా ఏడ్చాడు.+ 31  తర్వాత అతను తన భావోద్వేగాల్ని అణుచుకొని, ముఖం కడుక్కొని బయటికి వచ్చి, “భోజనం వడ్డించండి” అన్నాడు. 32  అప్పుడు సేవకులు యోసేపుకు, వాళ్లకు, అతనితో ఉన్న ఐగుప్తీయులకు వేర్వేరుగా వడ్డించారు. ఎందుకంటే ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరు, అది వాళ్ల దృష్టిలో అసహ్యకరమైన విషయం.+ 33  ఆ సహోదరుల్ని* యోసేపు ముందు వరుసగా కూర్చోబెట్టారు; జ్యేష్ఠత్వపు హక్కున్న పెద్దవాడితో+ మొదలుపెట్టి చిన్నవాడి వరకు అందర్నీ వయసుల వారీగా కూర్చోబెట్టారు. అప్పుడు వాళ్లు ఆశ్చర్యంతో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉన్నారు. 34  అతను తన బల్లమీద ఉన్న ఆహారాన్ని భాగాలుగా చేసి వాళ్ల బల్ల మీదికి పంపిస్తూ ఉన్నాడు. కానీ బెన్యామీను వంతు వచ్చినప్పుడు మిగతావాళ్లందరి కన్నా ఐదు రెట్లు ఎక్కువ పంపించాడు.+ అలా వాళ్లు యోసేపుతో కలిసి తృప్తిగా తిన్నారు, తాగారు.

అధస్సూచీలు

అక్ష., “వాళ్లను.”