ఆదికాండం 40:1-23
40 ఈ విషయాలు జరిగాక, ఐగుప్తు రాజు దగ్గర పనిచేసే ప్రధాన పానదాయకుడు,*+ ప్రధాన వంటవాడు* తమ ప్రభువైన ఐగుప్తు రాజుకు వ్యతిరేకంగా పాపం చేశారు.
2 కాబట్టి ఫరోకు తన ఇద్దరు ఉద్యోగుల మీద అంటే ప్రధాన పానదాయకుడి మీద, ప్రధాన వంటవాడి మీద చాలా కోపమొచ్చింది.+
3 దాంతో ఫరో వాళ్లను రాజ సంరక్షకుల అధిపతి+ కింద ఉన్న చెరసాలలో వేయించాడు. యోసేపు ఖైదీగా ఉన్నది కూడా అక్కడే.+
4 వాళ్లతో ఉంటూ వాళ్లను చూసుకునే పనిని రాజ సంరక్షకుల అధిపతి యోసేపుకు అప్పగించాడు.+ వాళ్లు కొంతకాలం* పాటు చెరసాలలోనే ఉన్నారు.
5 చెరసాలలో ఉన్నప్పుడు ఒకరోజు రాత్రి ఐగుప్తు రాజు పానదాయకుడికి, వంటవాడికి ఒక్కో కల వచ్చింది. ఆ రెండు కలలకు వేర్వేరు అర్థాలు ఉన్నాయి.
6 ఉదయం, యోసేపు లోపలికి వచ్చి వాళ్లను చూసినప్పుడు వాళ్లిద్దరి ముఖాలు దిగాలుగా కనిపించాయి.
7 కాబట్టి యోసేపు వాళ్లను, “ఈ రోజు మీ ముఖాలు ఎందుకు దిగాలుగా ఉన్నాయి?” అని అడిగాడు.
8 దానికి వాళ్లు, “మా ఇద్దరికీ ఒక్కో కల వచ్చింది, కానీ వాటి అర్థం చెప్పేవాళ్లెవరూ మా దగ్గర లేరు” అన్నారు. అందుకు యోసేపు, “కలల అర్థం చెప్పగలిగేది దేవుడే కదా?+ దయచేసి ఆ కలలు ఏంటో నాకు చెప్పండి” అన్నాడు.
9 కాబట్టి ప్రధాన పానదాయకుడు యోసేపుకు తన కల గురించి చెప్తూ ఇలా అన్నాడు: “నా కలలో నా ఎదుట ఒక ద్రాక్షచెట్టు ఉంది.
10 ఆ ద్రాక్షచెట్టుకు మూడు తీగలు ఉన్నాయి. వాటికి మొగ్గలు వచ్చి పూలు పూశాయి; వాటి గెలలు పండాయి.
11 అప్పుడు ఫరో గిన్నె నా చేతిలో ఉంది. నేను ఆ ద్రాక్షలు తీసుకొని ఫరో గిన్నెలో పిండి, దాన్ని ఫరో చేతికి అందించాను.”
12 అప్పుడు యోసేపు అతనికి ఇలా చెప్పాడు: “దాని అర్థం ఇదే: ఆ మూడు తీగలు మూడు రోజులు.
13 ఇప్పటినుండి మూడు రోజుల్లో ఫరో నిన్ను విడుదల చేసి,* మళ్లీ నీ ఉద్యోగం నీకు ఇస్తాడు.+ నువ్వు ఇంతకుముందు అతని పానదాయకుడిగా ఉన్నప్పుడు చేసినట్టే, ఫరో గిన్నెను అతని చేతికి అందిస్తావు.+
14 అయితే, నీ పరిస్థితి మెరుగైనప్పుడు నన్ను గుర్తుచేసుకో. దయచేసి నా మీద విశ్వసనీయ ప్రేమ చూపించి, ఫరోకు నా గురించి చెప్పి, నేను ఇక్కడి నుండి బయటికి వచ్చేలా చేయి.
15 నిజానికి నన్ను హెబ్రీయుల దేశం నుండి అపహరించి తీసుకొచ్చారు.+ నన్ను చెరసాలలో* వేసేంత తప్పేమీ నేను ఇక్కడ చేయలేదు.”+
16 ఆ పానదాయకుడి కలకు యోసేపు చెప్పిన అర్థం బాగుందని గమనించి, ప్రధాన వంటవాడు యోసేపుతో ఇలా అన్నాడు: “నాకు కూడా ఒక కల వచ్చింది. ఆ కలలో, తెల్లని రొట్టెలున్న మూడు గంపలు నా తలమీద ఉన్నాయి.
17 అన్నిటికన్నా పైనున్న గంపలో ఫరో కోసం చేసిన అన్నిరకాల పిండి వంటలు ఉన్నాయి, పక్షులు వచ్చి వాటిని తింటున్నాయి.”
18 అప్పుడు యోసేపు ఇలా అన్నాడు: “దాని అర్థం ఇదే: ఆ మూడు గంపలు మూడు రోజులు.
19 ఇప్పటినుండి మూడు రోజుల్లో ఫరో నీ తల నరికించి, నిన్ను కొయ్యకు వేలాడదీయిస్తాడు, పక్షులు వచ్చి నీ మాంసాన్ని తింటాయి.”+
20 మూడో రోజు ఫరో పుట్టినరోజు.+ ఆ రోజు అతను తన సేవకులందరికీ విందు ఏర్పాటుచేశాడు. అప్పుడు తన సేవకుల సమక్షంలో ఫరో ఆ ప్రధాన పానదాయకుణ్ణి, ప్రధాన వంటవాణ్ణి చెరసాల నుండి బయటికి రప్పించాడు.*
21 తర్వాత ప్రధాన పానదాయకుడికి అతని ఉద్యోగాన్ని తిరిగిచ్చాడు. కాబట్టి అతను ఎప్పటిలాగే ఫరో చేతికి గిన్నెను అందించాడు.
22 కానీ, యోసేపు వివరించినట్టే,+ ప్రధాన వంటవాణ్ణి కొయ్యకు వేలాడదీయించాడు.
23 అయితే ప్రధాన పానదాయకుడు యోసేపు సంగతి మర్చిపోయాడు.+
అధస్సూచీలు
^ లేదా “పానీయాలు అందించేవాడు.”
^ ఇతను రొట్టెలు, పిండివంటలు చేసేవాడు.
^ అక్ష., “కొన్ని రోజుల.”
^ అక్ష., “నీ తలను పైకెత్తి.”
^ అక్ష., “బావిలో; గుంటలో.”
^ అక్ష., “తల పైకెత్తాడు.”